పద్యం-హృద్యం

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం ప్రశ్న:
సంసార సుఖంబులబ్బు సన్యాసికిలన్
(శ్రీ చిరువోలు విజయ నరసింహా రావు గారు పంపిన సమస్య)
ఇంతకు ముందు యిచ్చిన ప్రశ్న:
యుద్ధము చేయకుండగనె యోధునిగా వెలుగొందె నిద్ధరిన్
(“నిద్ధరన్” అని ఉంటే బాగుండేది అని శ్రీ M.V.S. రంగనాధం గారు సూచించారు)

ఈ ప్రశ్నకు పూరణలు మాకు అందిన క్రమములో యిలా వున్నాయి.

ఎం.వి.యస్. రంగనాధం, హైదరాబాద్
(1) ఉ.
యుద్ధమె జీవితమ్ము, గెలు పోటము లుండును, పోరు సాగగన్
బుద్ధిని జాఱ్చ లోపలను పొంచిన దుష్ట విరోధివర్గమున్,
బద్ధము జేయ సంతతము, పాయక నెవ్వడు నిల్చె, నాతడే,
యుద్ధము చేయకుండగనె, యోధునిగా వెలుగొందె నిద్ధరిన్.
(2) ఉ.
యుద్ధము నందు పారినను, యోరిమితో నిజ జీవనంబునన్
పద్ధతిగా యుధిష్ఠిరుడు వర్తన జేసెను, యక్షు ప్రశ్నలన్
బుద్ధిని దీటుగా నిలిపి, పూర్ణముగా బదులిచ్చె, యుక్తితో
యుద్ధము చేయకుండగనె, యోధునిగా వెలుగొందె నిద్ధరిన్.
(3) ఉ.
బుద్ధుడు గాంధి యాదిగ ప్రబుద్ధులు చూపిన బాట బద్ధమై,
వృద్ధిని గోరి జీవన గవేషణ సత్యము నందు నిల్పుచున్,
సిద్ధ మెవండొ, స్వీయ క్రమశిక్షణలో యనుయాయి వారికిన్,
యుద్ధము చేయకుండగనె, యోధునిగా వెలుగొందె నిద్ధరిన్.
మద్దాలి స్వాతి, రెడ్వుడ్ సిటీ, కాలిఫోర్నియా
ఉ.
యుద్ధము గాదె ఎన్నికలు; ఓటరులన్ యుసిగొల్పి, ఓట్ల సం
బద్ధము గాక, కోరినటువంటి దెసన్ బడయన్, ప్రణాళికల్
సిద్ధము జేసి, నేతను విజేతగ నిల్పెడి కార్యకర్త, తా
యుద్ధము చేయకుండగనె, యోధునిగా వెలుగొందె నిద్ధరిన్
చిరువోలు విజయ నరసింహా రావు, రాజమహేంద్రవరము
(1) ఉ.
యుద్ధములెన్ని వచ్చినను నియుక్త వినూత్న పరిష్కృతార్ధియై
బద్ధవిరోధులెంతయున బద్ధ ప్రచారము చేయుచున్న తా
సిద్ధుడనంగ భవ్యుడు నజేయుడు మోడిజీ ధృతిన్
యుద్ధము చేయకుండగనె, యోధునిగా వెలుగొందె నిద్ధరన్
(2) ఉ.
బుద్ధియు సౌర్య ధైర్యముల పోల్చిన యాయుధ శస్త్ర సంపదన్
బద్ధులు కారె సైనికులు పన్నుగ పోరగ శత్రుసేనతో
శుద్ధప్రశాంత మౌనముల, శోషణ బెట్టుచు వైరివీరులన్
యుద్ధము చేయకుండగనె, యోధునిగా వెలుగొందె నిద్ధరన్
(3) ఉ.
కృద్ధుల నాంగ్లపాలకుల కీడ్పడఁ జేయగ గాంధి నేతయై
సిద్ధ ప్రశాంత హింసలను చేసెను పోరును హక్కు లందగా
బుద్ధుని శాంతిదూతయయి బోధల భారత సంస్కృతీ ప్రభన్
యుద్ధము చేయకుండగనె, యోధునిగా వెలుగొందె నిద్ధరన్
చిరువోలు  సత్య ప్రసూన, న్యూ  ఢిల్లీ
(1) ఉ.
బుద్ధి మతాంవరిష్టులకు పోరుట చంపుట నచ్చదెప్పుడున్
బద్ధులు నీతి సూత్రముల, ప్రాజ్ఞతఁగల్గి చరించుచుందురే
సిద్ధము కాల్చరా యనుచు, సేననెదిర్చిన టంగుటూరి యే
యుద్ధము చేయకుండగనె, యోధునిగా వెలుగొందె నిద్ధరన్
(2) ఉ.
బుద్ధులు చెప్పు నేతలకు పుణ్యము పాపము చింత గల్గునే
సిద్ధము యుద్ధచర్యలకు చేటగు స్పర్ధను క్రౌర్య వృత్తిచే
యుద్ధనిషిద్ధ భావముల నొప్పుగ సత్ఫలమందు సాత్వికున్
యుద్ధము చేయకుండగనె, యోధునిగా వెలుగొందె నిద్ధరన్
వారణాసి సూర్యకుమారి, మచిలీపట్నం
ఉ.
బుద్ధికి సత్పథంబె యగు ముఖ్యమటంచు తలంచుచున్నిలన్
శ్రద్దగ సంచరించుచును చక్కగ బాధ్యతలన్ని దీర్చు సం
సిద్ధత కార్యభారమును జీవిత పోరున తానుగెల్వగన్
యుద్ధము చేయకుండగనె యోధునిగా వెలుగొందు నిద్దరిన్
నాగిని (కలం పేరు), హైదరాబాదు
వృద్ధుల బల్కులన్ విడచి పెట్టుట క్షేమక రమ్ముగా దనెన్
బుద్ధిగ శాంతిగో రుటయె మోదము పంచును! పూరుషా ళికిన్
సిద్ధుడు స్వీకరిం చెనట శ్రేయము జేసెడి మంచి వాక్కులన్
యుద్ధము చేయకుండగనె యోధునిగా వెలుగొందె నిద్ధరిన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked