శీర్షికలు

పుస్తక పరిచయం

భోగరాజు వెంకట సత్యనారాయణమూర్తి
పుస్తకం పేరు : కదంబవన కుసుమాలు
రచయిత్రి పేరు : శ్రీ శేష కళ్యాణి గుండమరాజు.

ఒక వర్ధమాన రచయిత్రి స్వానుభవాలు, సమాజములో జరిగిన, జరుగుతున్న సంఘటనలను కథా వస్తువులుగా చేసి తనదయిన శైలిలో పరిష్కారాలను సూచించిన చిన్న చిన్న కథల సమాహారమే ఈ కథల సంపుటి. వివిధ పత్రికలలో ప్రచురితమైన 18 కథలను ఒక పుస్తక రూపంలో ప్రచురించి ఆసక్తి కల పాఠకులకు ఒకేచోట అందించాలన్న ప్రయత్నమే ఈ పుస్తకం. ఈ పుస్తకంలోని కథలలో ఇతివృత్తాలు రచయిత్రికి సమకాలీన సామజిక సమస్యలపైన ఉన్న అవగాహనకు దర్పణంగా నిలుస్తాయి. అంతేకాక కొన్ని కథలలో అంతర్లీనముగా గోచరమయ్యే ఆధ్యాత్మికత రచయిత్రికి దైవం పట్ల, పురాణేతిహాసాల పట్ల గల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

‘గడ్డి పోచ’ కథకు వాల్మీకి కృత రామాయణం సుందరకాండలో రావణ సీతా సంవాదంలో, మహాసాధ్వి సీతాదేవి దుష్టుడైన రావణునితో సంభాషించడానికి మాధ్యమంగా ఉపయోగపడిన గడ్డి పరక కథా వస్తువు అయింది. పై పై మెరుగుల బాహ్య సౌందర్యం కన్నా ఉన్నంతలో పొరుగువారికి సాయపడే అంతః సౌందర్యమే మిన్న అని తెలుసుకుని తదనుగుణంగా జీవితాన్ని మలచుకున్న యువతి కథే ‘అందమైన మనసు’. ‘నేటి బాలలే రేపటి పౌరులు’ . మంచి సమాజం కావాలనుకునే వాళ్ళు తమ వంతు బాధ్యతగా బాలలను తీర్చిదిద్దాలని తెలియచెప్పే ‘చైతన్య కుసుమాకరం’, నానాటికి విస్తరిస్తున్న సాంకేతికత మనుషుల మధ్య సహజమైన సంబంధబాంధవ్యాలను, ప్రేమానురాగాలను ఎలా దూరం చేస్తుందో వివరించే ‘ఈ తరం’, నేటి సమాజంలో అతివలపై జరిగే అత్యాచార ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఒక మార్గాన్ని సూచించే ‘రక్షణ కవచం’ కథలు సమకాలీన సమస్యలకు సమాధానాలను అన్వేషింప చేస్తాయి. కర్తవ్య నిర్వహణలో మహిళలు తమ కార్యాలయాలలో ఎదుర్కొనే సున్నితమైన సమస్యలు, వేధింపులు ఏ విధంగా ఉంటాయో, వాటిని ఎదుర్కొనటానికి పెద్దల సలహాలు ఏ విధంగా ఉపకరిస్తాయో చెప్పే కథ ‘తల్లి దీవెన’. ‘మనిషికి కర్తవ్య పాలనే స్వధర్మం’. తండ్రిగా, భర్తగా, కొడుకుగా, ఏ వ్యక్తియైతే తన బాధ్యత నెరవేరుస్తాడో అతడు భగవంతుడు చూపిన సన్మార్గంలో నడచినవాడు అవుతాడు అన్న మహోన్నత సత్యాన్ని తెలియచెప్పే ‘సన్మార్గం’ కథ ఎందరికో మార్గనిర్దేశనం.

గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే తనలో నిద్రాణమై ఉన్న రచనాశక్తిని మేలుకొలిపి, గత రెండు సంవత్సరాలలో వివిధ ఇతివృత్తాలతో హృద్యంగా కథలను మలచి, తన తొలి పుస్తకాన్ని ప్రచురించిన రచయిత్రి శ్రీమతి కళ్యాణికి అభినందనలు!

ఈ పుస్తకం, www.Kobo.com మరియు www.Pothi.com వెబ్-సైట్ లలో E-Book ఫార్మటులోనూ, https://books.acchamgatelugu.com వెబ్-సైట్ లో ప్రింట్-బుక్ గానూ లభ్యమవుతున్నది.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked