ఈ మాసం సిలికానాంధ్ర

ప్రథమ స్నాతకోత్సవం

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం

రెండు సంవత్సరాల క్రితం స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పాటయి భారతీయ కళలు, భాషలలో మాస్టర్స్, డిప్లమా, సర్టిఫెకెట్ స్థాయి కోర్సులను అందిస్తోన్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. తొలి బ్యాచ్‌లో చేరి కోర్సు పూర్తి చేసిన 31 మంది విద్యార్థులకు సిలికానాంధ్ర విశ్వ విద్యాలయ అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, విశ్వ విద్యాలయ పాలకవర్గ చైర్మన్ శ్రీ లకిరెడ్డి హనిమిరెడ్డి చేతుల మీదుగా ఈ స్నాతకోత్సవంలో పట్టాలను అందించారు. కాంప్ బెల్ హెరిటేజ్ థియేటర్‌లో జరిగిన ఈ కార్యక్రమం ప్రారంభంలో నిర్వహించిన శోభాయాత్ర చూపరులను ఎంతో ఆకట్టుకుంది. విశ్వవిద్యాలయం ప్రొవొస్ట్ రాజు చమర్తి ముందు నడవగా పాలక వర్గ సభ్యులు అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, చైర్మన్ డా.హనిమిరెడ్డి లక్కిరెడ్డి, డా.పప్పు వేణుగోపాల రావు, నీరజ్ భాటియా, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ దీనబాబు కొండుభట్ల, చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్ దిలీప్ కొండిపర్తి, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రసాద్ కైపా, పట్టభద్రులు కాబోతున్న విద్యార్థులు స్నాతకోత్సవ దుస్తులతో కవాతుగా వేదిక వద్దకు వచ్చారు. ఫొటోల కోసం క్లిక్ చేయండి.

సిలికానాంధ్ర అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల 2001లో సిలికానాంధ్ర ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు సాధించిన విజయాలను గుర్తు చేస్తూ రాబోయే రోజులలో విశ్వవిద్యాలయ లక్ష్యం, ప్రణాళిక, కార్యకలాపాలను వివరిస్తూ స్వాగతోపన్యాసం చేశారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ త్రైమాసిక పత్రిక ‘శాస్త్ర’ను పాలక మండలి సభ్యులు, అకాడమిక్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ డా.పప్పు వేణుగోపాల రావు ఆవిష్కరించారు. శనివారం జరిగిన స్నాతకోత్సవ సంబరాల్లో విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రదర్శనలిచ్చారు. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కర్ణాటక సంగీత ఆచార్యులు డా.శ్రీరాం పరశురాం నిర్వహించిన హిందుస్థాని-కర్ణాటక సంగీత జుగల్‌బంది కచేరీకి ప్రేక్షకులు తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి భారతదేశం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన అధ్యాపక బృందం డా. శ్రీరం పరశురాం, డా.మాలా స్వామి, డా.రమాదేవి, డా.సుమిత్ర వేలూరి, డా.యశోద ఠాకూర్, డా.అనుపమ కైలాష్ తదితరులను విశ్వవిద్యాలయ పాలకవర్గం ప్రత్యేకంగా సన్మానించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked