కథా భారతి

మోడర్న్ జ్యోతిషం

-ఆర్ శర్మ దంతుర్తి

ఇన్ కం టేక్స్ డిపార్ట్ మెంట్ లోంచి రిటైరైపోయిన సుబ్బారావుకు మూడు నెలలు గడిచేసరికి ఇంట్లో కూర్చోవడం బోరు కొట్టినప్పుడు, ఇన్నేళ్లలో ఇన్ కం టేక్స్ డిపార్ట్ మెంట్ లో ఉండే పవర్, డబ్బూ, అందులో వచ్చే అదనపు పరపతీ వగైరాల వచ్చిన మనస్తత్వం తో ప్రజల్ని ఎలా దోచుకోవాలా అని ఎదురు చూస్తూంటే అప్పుడొచ్చిందో బ్రిలియంట్ ఐడియా. ఓ వారం బాగా ఆలోచించేడు ఏం చేయాలో. లెక్క చూసుకుంటే ఓ యాభై అరవై వేలు పెట్టి బిజినెస్ పెడితే రోజుకు రెండు, మూడు వేలు లాగవచ్చు – అతి సులభంగా. మహా అయితే మొదటి ఆరు నెలల్లో పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి. అయితే ఈ ఆఫీసుకి ముందు ఒక అందమైన రిసెప్షనిస్టూ, తనకో ప్రైవేట్ రూమూ, అన్ని రూముల్లోనూ వీడియో కెమెరాలూ, అసలు సిసలు బిజినెస్ జరిగడానికి పూజామందిరం అనబడే ఓ మెయిన్ రూమూ, అందులో రకరకాల దేవుళ్ళ ఫోటోలూ ఇవన్నీ చూడ్డానికీ, ఓ ఫోను కీ మిగతా అల్లాటప్పా చిల్లర ఖర్చులకి అంతా కలిప్ మొత్తం డబ్భై వేలు పై చిలుకు అయింది. అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ అవడం ఏ బిజినెస్ కైనా సర్వ సాథారణం కనక ఏమీ ఢోకా లేదు. బిజినెస్ మొదలైపోయింది.

ఈ బిజినెస్ పెట్టేముందు సుబ్బాగారు చేసిన మరో పని నవగ్రహ సంచారం, ఏ గ్రహం ఏ లగ్నానికి యోగిస్తుందో, హాని చేస్తుందో అనేవి తెలుసుకోవడం, అందర్నీ భయపెట్టే ఏలినాటి శనీ, కుజ దోషం లాంటివి తెలుసుకోవడం, పంచాంగం చూసి ముహుర్తాలు మంచివా కాదా, ఏ నక్షత్రంలో ఏ పని చేయవచ్చు వగైరాలు నేర్చుకోవడం. ఓ రెండు మూడూ హై టెక్ లాప్ టాపులూ వగైరా సమకూర్చుని, స్టైల్ కోసం ముందు గదిలో ఒక అందమైన అమ్మాయి – ఫోన్ అన్సర్ చేయడానికీ ఎవరైనా వస్తే ఆహ్వానించడానికీను. లోపల తనకో పసందైన ఆఫీసు. మరో రూములో నిలువెత్తు అమ్మవారి విగ్రహం, ఆ విగ్రహం ముందు తాను కూర్చుంటే వెనకభాగం మాత్రం కనిపించేలా అమర్చిన సిసి టివి, అన్నీను. మరో గదిలో ఆ సిసిటివి కెమెరాలో కనిపించేది చూడ్డానికి వచ్చినవాళ్ల బంధువులు కూర్చోడానికి ఏర్పాటు. మంచి నీట్ గా ఒక మోడర్న్ స్టైల్ బాత్రూం. మంచినీళ్ళకో ఫిల్టర్ ఉన్న డిస్పెన్సరు. పుష్పక విమానం వంటి హైద్రాబాద్ లో గర్భిణులకేమీ కొదువలేదు కనక అలా ఓ చిన్న ఆఫీసు తెరిచాడు సుబ్బారావు.

ఇదయ్యాక హైద్రాబాదు ఈ చివర్నుంచి ఆ చివరి వరకూ ఓ దండోరా వేయబడింది. దండోరా పబ్లిక్ గా వేస్తే జైల్లో పెడతారు కనక ప్రైవేట్ గానే. అంటే తెలుసున్నవాళ్ల దగ్గిరా, ఈమైల్ మీదా అవీను. ఇదీ దాని సారాంశం. ఫలానా సుబ్బా గారు మీ పుట్టబోయే బిడ్డ ఆడా, మొగా ఏది కావాలిస్తే అదే జరుగుతుంది. ఏ స్కేన్ లూ అవసరం లేదు. ఆయన ఉథ్థండ జ్యోతిష్యుడు. కన్సల్టేషన్ వెయ్యి రూపాయలు మాత్రమే. ఒకే ఒక అపాయింట్ మెంట్. రెండో సారి వచ్చే పనే లేదు. పురుడు అయ్యాక సుబ్బా గారు చెప్పినది తప్పు అయితే డబ్బులు వాపస్ ఇస్తారు! ఒకటే షరతు – గర్భం వచ్చిందని తెలిసాక వేవిళ్ళు మొదలైన వారంలోపుల మాత్రమే జ్యోతిషం చెప్తారు. అంటే గర్భం వచ్చిన తర్వాత వేవిళ్ళు తగ్గి అమ్మాయికి ఆకలి పుట్టి కొంచెం ఒళ్ళు చేసాక వస్తే చెప్పరు. అప్పటికి కాలం గడిచిపోయినట్టే. దయచేసి గమనించండి, అటువంటి వారు వచ్చినా సుబ్బాగారు వాళ్లని కలుసుకోరు. వీటి కింద మరోసారి హెచ్చరిక – ఈ జ్యోతిషం, సుబ్బాగారిచ్చే స్పిరిట్యువల్ ట్రీట్ మెంటూ గర్భం వచ్చిన మొదటి నెలా రెండు నెలల లోపే పనిచేస్తుంది. వేవిళ్ళు ఉన్న రోజుల్లో “మా-త్ర-మే.” వేవిళ్ళు ఉన్న భార్యతో మొగుడూ, మరొక పెద్దమనిషి తోడుగా రావాల్సి ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యం గా గుర్తుంచుకోవాల్సినది – సుబ్బాగారు రోజుకి నలుగుర్ని మాత్రమే చూస్తారు – అదీ పొద్దున్నే ఆరు నుంచి ఎనిమిదిలోగా. అపాయింట్ మెంట్లు ఉన్నై, త్వరపడండి. ఆఫీసు వారంలో ఏడురోజులూ పనిచేస్తుంది. అలా ఒకరికి పంపిన మెసేజ్ ప్రపంచం అంతా నిముషంలో జేరిపోయేలాగా వాట్స్ ఆప్, ఇంటర్నెట్ లతో సుబ్బాగారి ఫోను ఆగకుండా మోగడం మొదలైంది. రోజుకి నాలుగువేలు ఆదాయం. రెండువేలు ఖర్చులకి పోయినా సుబ్బాగారికి నెలకి ఆదాయం అరవైవేలు నికరంగా. అద్భుతంగా ఉంది కదా వ్యాపారం?

సుబ్బాగారి టెక్నిక్ ఏమిటీ విషయంలో? వచ్చినవాళ్ళు మొదటగా అపాయింట్ కి గంట ముందు రావాలి. వచ్చినవాళ్లకి ఆఫీసులో ఏం జరుగుతుందో చూపిస్తారు. మొదటగా పూజగదిలోకి అందరూ వెళ్ళి అన్నీ చూసుకోవచ్చు. కెమెరా ఎక్కడ అమర్చబడిందీ, అక్కడ్నుంచి బయటకి ఏం కనబడుతుందీ అన్నీను. కెమెరాలో వీడియో మాత్రమే కనిపిస్తుంది. అందులో సుబ్బాగారి వీపు మాత్రం కనిపిస్తుంది. ఆడియో ఏమీ వినిపించదు. వేవిళ్ళు వచ్చిన భార్య, భర్తనీ, కూడా వచ్చినవారినీ బయట వదిలేసి ఒక్కత్తీ లోపలకి వెళ్ళాలి సుబ్బాగారితో. ఆ వెళ్లడం, లోపల సుబ్బాగారికి దూరంగా కూర్చోవడం అన్నీ వీడియోలో కనిపిస్తాయి. సుబ్బాగారు ఏవో అమ్మవారి మంత్రాలు చదువుతారు. ఆయన చిన్న పూజ చేసాక అమ్మాయి అమ్మవారి కుంకుమ ఆవిడ చేత్తోనే తీసుకుని నుదిటిమీద పెట్టుకున్నాక, ఆయన వేవిళ్ళు ఉన్న – కొంచెం దూరంలో తన పక్కనే కూర్చున్న అమ్మాయిని అడుగుతారు ఏదో. వాళ్ల మొహం కనిపించదు కనకా, వాళ్ళు మాట్లాడేది వినిపించదు కనకా బయటవాళ్లకేమీ తెలియదు ఏం మాట్లాడుకుంటున్నారో. ఎటువంటి పరిస్థితుల్లోనూ సుబ్బాగారు తన పక్కన కూర్చున్న గర్భవతి అయిన అమ్మాయిని ముట్టుకోవడం కానీ మరోటి కానీ చేయరు. ఆయన గర్భిణీ మాట్లాడుతుంటే ఒక చిన్న పుస్తకంలో ఈ అమ్మాయి పేరూ, ఏ తారీఖున తన దగ్గిరకి వచ్చిందీ, తాను మొగ/ఆడ బిడ్డ ఏది కావాలని అడిగిందో, మొదలైన రాసుకుంటారు. పురుడు అయ్యాక తేడా వస్తే చూపించడానికి. ఆ పుస్తకం పురుడు అయ్యేక ఎవరైనా వచ్చి చూడవచ్చు, చూపిస్తారు కూడా. పూజ గదిలో కూర్చున్న ఇద్దరి నడుమునా దాదాపు నాలుగడుగుల దూరం ఉంటుంది. ఏ మందూ, మాకూ వేయరు, ఇవ్వరు. ఆయన ఆఫీసులో మంచినీళ్ళు కూడా తాగక్కర్లేదు గర్భిణీ స్త్రీలు. అంతా అమ్మవారి మహిమతోనే జరుగుతుంది. అయితే బయట కూర్చుని వీడియో చూసేవారికి కావాలిస్తే కాఫీ, టీ లు ఉచితం. టివి మీద వీడియోలో కనిపించేది మీ సెల్ ఫోన్ తో రికార్డ్ చేసుకుందామనుకుంటే ఏమీ అభ్యంతరం లేదు. సుబ్బాగారు చదివే అమ్మవారి మంత్రాలు ఎవరికీ చెప్పరు, వినకూడదు. అందువల్ల ఆడియో లో ఏమీ వినిపించదు. అనుమానించడానికి ఆస్కారమే లేదు ఎందుకంటే అంతా వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది కదా బయటకి? సుబ్బా గారు విభూది రేఖల్తో మొహంమీద బ్రహ్మ వర్ఛస్సు తో పంచె కట్టుకుని పూజ చేసినంత సేపూ ఆ పూజ గది తలుపులు వేసి ఉంటాయి. తాళంలేదు, వేయరు కూడా, కానీ రూల్ ఏమిటంటే సుబ్బాగారు, వేవిళ్ళు ఉన్న అమ్మాయి తప్ప మరొకరు ఎవరూ లోపలకి రాకూడదు. పదిహేను నిముషాల్లో మొత్తం పని అయిపోతుంది.

మొదటి రోజులలో బిజినెస్ పుంజుకోలేదు కానీ ఆరునెలల్లో సుబ్బాగారి బిజినెస్ మూడు గర్భిణీలు, ఆరు మొగ, ఆడ – మీక్కావాల్సిన – పిల్లలుగా వృథ్థి చెందడం మొదలైంది. మగ పిల్లాడు కావాలంటే మగ పిల్లాడే పుడుతున్నాడు. ఆడపిల్లకావాలంటే ఆడపిల్లే పుడుతోంది. నూరు శాతం విజయం. ఓ ఏడాది గడిచేసరికి ఒకట్రెండు కేసులు వెనక్కి రావడం మొదలైంది కూడా – సుబ్బాగారు మొగ అని చెప్తే ఆడపిల్ల పుట్టిందిట. డబ్బులు వాపస్ ఇస్తారా అని అడగడానికి వచ్చారు. కేసు వివరాల ప్రకారం – అమ్మాయి వేవిళ్ళ సమయంలో వచ్చినప్పుడు పూజ గదిలోకి వెళ్ళాక బాగా నీరసంగా ఉంది. మంచినీళ్ళు కూడా తాగే స్థితిలో లేదు. వికారం చంపుతుంటే పూజగదిలోకి వెళ్ళి అక్కడే కూర్చుంది. ఈ లోపున సుబ్బాగారు వచ్చి ఆవిడ పక్కనే కూర్చుని అమ్మవారికి మినీ పూజ చేసారు. తల కూడా తిప్పకుండా ఏదో అడిగారు అమ్మాయిని, ఆవిడేదో చెప్పిందో లేదో కానీ కుడి చేయి ఎత్తి నోటి దగ్గిర పెట్టుకోవడం తెలుస్తోంది బయట కూర్చుని వీడియో చూసే వారికి ఆవిడ డోకు రాకుండా నోటికి చేయి అడ్డం పెట్టుకుందని ఆవిడ బయటకి వచ్చాక చెప్పడం బట్టి తెలుస్తోంది. ఆ తర్వాత మరో నిముషంలో ఆవిడ లేచి బయటకి వచ్చి బాత్రూంలోకి వెళ్ళారు. తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ రావడం ఇప్పుడే, పురుడు అయ్యాక. ఆవిడ చెప్పడం ప్రకారం, పూజగదిలో ఆవిడ “మొగ పిల్లాడు కావాలి. లేకపోతే మొగుడు చంపేస్తాడు.” అని చెప్పింది. కానీ ఆడపిల్ల పుట్టింది. సుబ్బా గారి ఆఫీసులో పొద్దున్న ఇటువంటి విషయాలు చూడరు. పొద్దున్నంతా వేవిళ్ళ అమ్మాయిల విషయాలు చూస్తారు. మధ్యాహ్నం ఏదైనా తేడా లొస్తే డబ్బుల వాపస్ విషయం చూసేది.

ఈ పార్టీ వచ్చేసరికి సుబ్బాగారు తన ఆఫీసులో కూర్చుని కాయితాలు చూసుకుంటున్నారు మధ్యాహ్నం. “ఇదిగో ఇదీ సమస్య, మొగపిల్లాడు కావాలని వచ్చాం.ఆడపిల్ల పుట్టింది. డబ్బులు వాపస్ ఇవ్వాలి” అని మొగుడు అడిగాడు.
“నా పుస్తకంలో మీ వివరాలు చూద్దాం, మీ వివరాలు ఇవ్వండి, పేరు, డేటాఫ్ బర్త్ అవీ, ఎప్పుడొచ్చారు?” సుబ్బా అడిగేడు.
మొగుడు తమకిచ్చిన అపాయింట్ మెంట్ కార్డ్ తీసి చూపించేడు, ఫలానా తేదీ, పేరు, ఎప్పుడొచ్చారు ఎట్సెట్రా.
తన పుస్తకం తీసి ఇవన్నీ వెదికి చిరునవ్వి నవ్వి చూపించాడు సుబ్బా, “ఇదిగో, మీరు వచ్చినప్పుడు మీకేం కావాలో అమ్మవారి ముందు మీ నోటితోనే అడిగినది ఇక్కడ రాసి పెట్టాను, అమ్మాయి అంటే ఇష్టం, కానీ మా ఆయన అబ్బాయి కావాలంటున్నాడు. ఒకసారి పాప పుడితే ఆయనే ఊరుకుంటాడు. అమ్మాయే కావాలి. చూసారు కదా ఇదీ మీ ఆవిడ చెప్పినది పూజ గదిలో.”
మొగుడు వాళ్ళావిడకేసి చూసాడు, కోపంగా. ఆవిడ మొహంలో ఆశ్చర్యం – “అబ్బే, నేను అలా అనలేదే. అసలు నేను మాట్లాడినది…..” ఏదో చెప్పబోయిందావిడ.
“ఓ సారి ఆ పుస్తకం చూడొచ్చా?” అడిగేడు వచ్చినావిడ మొగుడు.
“తప్పకుండా,” సుబ్బా తనచేతిలో పుస్తకం ఆయన చేతికిచ్చి చెప్పేడు.

ఆయన మొదటి పేజీనుండీ చూడ్డం మొదలుపెట్టాడు. మొదటి పేజీలో “శ్రీ గురుభ్యోం నమః, రెండో పేజీలో అమ్మవారి ఫోటో, మిగతా పేజీనుంచి పేజీ కో పేషెంట్ పేరు, జన్మదినం, గోత్రం, నక్షత్రం వగైరాలు. కిందన వచ్చిన రోజు, దాదాపు ఏ నెలలో ప్రసవం అవ్వొచ్చు అనేవి. అన్నింటి కన్నా కిందన “ఏ బిడ్డ కావాలనుకుంటున్నారు?” అనేచోట సుబ్బాగారి స్వంత దస్తూరీతో రాసినదే ఉంది. అలా ఒక్కో పేజీ తిప్పాక, తమ పేజీలో చూసాడు మొగుడు. సుబ్బా ఇంతకుముందు చెప్పినదే ఉంది, “అమ్మాయి అంటే ఇష్టం, కానీ మొగుడు అబ్బాయి కావాలంటున్నాడు. ఒకసారి పాప పుడితే ఆయనే ఊరుకుంటాడు. అమ్మాయే కావాలి.”
సుబ్బాగారు చెప్పినది అక్షరాలా నిజం. తనకేం కావాలో అడిగినదే పుట్టింది. సుబ్బాగారికి పుస్తకం ఇచ్చేసి లేచారు మొగుడూ పెళ్ళాలిరిద్దరూ ఇంక వెళ్లడానికి. భార్య మొహం పాలిపోయి ఉంది. వాళ్ళు వెళ్ళబోతూంటే సుబ్బా ఇద్దరికీ కాఫీలు తెప్పించి వాళ్ళు అవి తాగుతుంటే, చిన్నపాటి లెక్చర్ దంచాడు, “ఆడపిల్ల అయితే ఏమైంది? పాప బాగా సహాయం చేస్తుంది ఇంట్లో, అయినా అమ్మాయి పుడితే మహాలక్ష్మి పుట్టిందనుకోవాలి. ఈ రోజుల్లో ఆడపిల్లైనా మొగవాడైనా ఒకటే. ఏమీ తేడా చూపించకూడదు, వగైరా.” వాళ్ళు వెళ్ళిపోయాక పుస్తకం లోపల పెట్టేసి నవ్వుకున్నాడు సుబ్బా, వాళ్ళు ఇంటికి వెళ్ళేదారిలో ఒకరి మీద ఒకరు ఏం అరుచుకుంటారో ఊహిస్తూ.

బయటకొచ్చిన మొగుడు ఆవిణ్ణి అడిగేడు, “అమ్మాయి కావాలని అడగడం ఏవిటి బుథ్థి లేదా?”
“నేను అడిగినది అబ్బాయి కావాలనే. ఎక్కడ తప్పు జరిగిందో మరి.”
“ఆయన చూపించాడు కదా పుస్తకంలో నువ్వు ఏం అడిగావో? ఇంకా అబద్దాలెందుకు?”
“వేవిళ్ల సమయంలో ఏం చెప్పానో పోనీయండి. అమ్మాయ్ అయితే ఏమైంది?”
ఒకరి మీద ఒకరు అలా అరుచుకున్నాక ఇద్దరూ నోర్లు మూసుకున్నారు.

మర్నాడు మళ్ళీ ఇలాంటి కేసే సుబ్బా దగ్గిరకి వెనక్కొచ్చింది. ఒక్కోసారి వింతల్లో వింత జరుగుతుందనడానికి సాక్ష్యం అన్నట్టూ ఈ సారి వచ్చినవాళ్ళు ఇండియాలో పుట్టినవాళ్లైనా సరే, అమ్మాయి కావాలని అడిగారుట. ఇలా అడగడం వింతే అయినా మరింత వింత ఏమిటంటే వాళ్లకి అబ్బాయి పుట్టేడు.
సుబ్బా మళ్ళీ వచ్చినవాళ్లకి పుస్తకం తెరిచి చూపించేడు. ఈ బిడ్డ కావాలనుకుంటున్నారనే చోట “మగ బిడ్డ” అని రాసి ఉంది. వచ్చినవాళ్ళు నోర్లు వెళ్లబెట్టారు. వచ్చినావిడ చెప్పింది, “ఇది తప్పు, నేను అడిగినది ఆడపిల్ల అని.”
సుబ్బా చెప్పాడు, “అమ్మా మీరు అమ్మవారి దగ్గిర చెప్పిన మాట ఇక్కడ రాసాను. ఇప్పుడలా అబద్ధాలు ఆడకండి. అయినా మొగపిల్లాడు అయితే ఏమైంది?”
ఈ లోపుల కాఫీలు వచ్చాయి. అవి తాగుతుంటే, మొగుడు ఈ సారి వాళ్ళావిడని సమర్థిస్తూ చెప్పేడు సుబ్బాతోటి, “అలా అంటారేమిటండి, మా ఆవిడ అబద్ధం ఆడే టైప్ కాదు. అయినా మాకు ఇప్పటికే ఒకబ్బాయి ఉన్నాడు. మరోసారి అబ్బాయి పుట్టాలని అడగడానికి మాకేం పని?”
కూల్ సుబ్బా చెప్పాడు, “నేను ఒకసారి పూజగదిలో రాసాక మళ్ళీ దాన్ని ముట్టుకోను మీరు వచ్చి అడిగితే తప్ప, అమ్మవారి శ్రీవిద్యా ఉపాసకుణ్ణి నేను. నాకు అబద్ధం ఆడవల్సిన పనేముంది? మీరు చెప్పినదే నేను రాస్తాను. అది చూపిస్తే నేను అబథ్థం అడుతున్నానని అంటున్నారా?”
“ఛ, ఛ, మీరు అబథ్థం ఆడుతున్నారని అనలేదండి. నేను అమ్మాయి కావాలనే అడిగినట్టు గుర్తు.” ఆవిడ చెప్పింది.
“అమ్మా వేవిళ్ల సమయంలో మీరేం మాట్లాడారో మీకు సరిగ్గా గుర్తుందా? నేను తప్పెందుకు రాస్తాను, అదీ అమ్మవారి సమక్షంలో? మీరే చెప్పండి.”
మొగుడూ పెళ్ళాలిద్దరూ వాగ్యుద్ధం కాసేపు కొనసాగించి లేచారు. ఏవుంది మాట్లాడ్డానికి పుస్తకంలో ఇలా తాము అడిగినదే రాసి ఉంటే? వాళ్ళు వెళ్ళాక మరోసారి సుబ్బా చిరునవ్వు నవ్వుకున్నాడు.

రోజులు నడుస్తున్నాయి. సుబ్బాగారి ఖ్యాతి రోజురోజుకీ పెరుగుతోంది. అయితే పక్కవాడు బాగుపడుతుంటే మనకి కుదరదు కనకా, ఇండియాలో స్కేన్ లు చేయడం, ముందే ఎవరు పుడతారో చెప్పడం న్యాయ విరుథ్థం కనకా ఓ మంచి రోజు చూసి ఓ లాయర్ గారు కేసు పారేసారు కోర్టులో. కోర్టులో మొదటి రోజున జడ్జ్ గారు అడిగేరు సుబ్బాని ఏం సమాథానం చెప్తారో. సుబ్బాగారు “నాట్ గిల్టీ.” అని వ్రాకృచ్చారు.

కేసు ఫలానా రోజుకి వాయిదా పడింది. ఈ లోపుల కేసుమీద ఏమీ ఆథారాల్లేవు కనక సుబ్బాగారి ఆఫీసు యథా తథంగా కొనసాగుతోంది. ఇండియాలో కోర్ట్ కేసు తెమలాలంటే ఎంత కాలం పడుతుంది? వెనకటికి ఎవరో రాజకీయనాయకుడు ప్రసంగం మొదలు పెట్టాట్ట. ఓ రెండు గంటలు పోయాక ఏదో తట్టినట్టుంది, ఎక్కువ మాట్లాడుతున్నానా, టైం ఎంతైంది అని అడిగాట్ట. కూర్చుని వింటున్న వాళ్లలో ముందు వరసలో ఉన్న పెద్దమనిషి లేచి చెప్పేట్ట, “టైమ్ సంగతి మీకెందుకు, వెనకనే కేలండర్ ఉంది తారీఖు మారిందేమో చూసుకోండి” అని. ఈ ఇండియా కోర్ట్ కేసులూ అంతే కదా? ఏళ్ళూ పూళ్ళూ పట్టడం సర్వసాధారణం.
అలా మరో ఎనిమిదేళ్ళు గడిచి సుబ్బాగారికి డబ్భై ఏళ్ళొచ్చేసరికి కేసు చివరకొచ్చింది. అక్కడకొచ్చిన సాక్ష్యుల్లో ఎవరేం చెప్పినా సుబ్బాగారి పుస్తకంలో రాసినట్టూ వాళ్లెందుకలా అడిగారో ఎవరూ చెప్పలేకపోయేరు. పుస్తకంలో ఏదో మాజిక్ ఉందేమో, తానొకటి రాస్తే మరోకటి ఉందేమో, అందులో ఏవైనా కెమికల్స్ కలిపారేమో అనీ, అసలు రాసిన పుస్తకం ఒకటీ, అందరికీ చూపించే పుస్తకం మరోటీ అనీ అనుమానించారు కానీ, ఎవరెన్ని పరీక్షలు చేసినా ఏమీ తేలలేదు. సుబ్బాగారు ఎవరినీ చేయి పట్టుకోలేదు – దీనికి వీడియోలే సాక్ష్యాథారం. ఎప్పుడూ ఎవరితోనో అసభ్యంగా ప్రవర్తించలేదు. పూజా మహిమో మరొకటో గానీ ఆయన చెప్పినది జరుగుతోంది. స్కేన్ లు తీయించలేదు, మీకే బిడ్డ కావాలి అని మాత్రమే అడుగుతున్నాడుట పూజగదిలో వంటరిగా ఉన్నప్పుడు.
అంతా విన్నాక ఏ నేరం చేసినట్టూ లేదు. మరి ఈయన్ని జైల్లో పెట్టించడం ఎలా? అయితే జడ్జ్ గారు అడిగేరు, “అయ్యా సుబ్బాగారూ, మీరు వీడియో చూపిస్తున్నారు బయటకి. మీరడిగేది మామూలు ప్రశ్న ‘మీకే బిడ్డ కావాలి’ అనేదే అయితే ఆడియో కూడా ఎందుకు ప్రసారం చేయరు బయటకి?”
“నేను అమ్మవారి ముందు చదివే మంత్రం ఎవరికీ వినపడడానికి లేదు గర్భిణీలకి తప్ప. అది నాకు అమ్మవారు పెట్టిన ఆంక్ష. అది అథిగమిస్తే నేను షాపు కట్టేయాలండి. అందుకే” చెప్పేడు సుబ్బా.
కేసు వదల్లేదు అయినా సుబ్బాని. ప్రత్యర్ధుల లాయర్లు లా పాయింట్లు పీకి పీకి, కేసుని పదిహేనేళ్ళు లాగారు. ఈ లోపున సుబ్బా నలభై, యాభై లక్షలు సంపాదించాడు ఈ బిజినెస్సులో. జడ్జ్ గారు లాయర్ల కబుర్లు వినీ వినీ బోరుకొట్టి మొత్తానికి అడిగేడు ప్రత్యర్థి లాయర్ని, తనకేం కావాలో.
“సుబ్బా గారు జైల్ కి వెళ్ళాలి,” లాయర్ ఉవాచ.
“ఏం నేరం మీద?” జడ్జ్ అడిగేడు.
“పుట్టేపిల్లలు ఎవరో ముందే చెప్పడం అన్యాయం. అది చట్ట విరుథ్థం.”

ఈ లోపుల సుబ్బా లాయర్ అందుకుని చెప్పాడు, “యువరానర్, సుబ్బాగారెప్పుడూ పుట్టే పిల్ల ఎవరో చెప్పలేదు. మీకేం కావాలి అని అడిగి, అలా అడిగినట్టూ పిల్లో పిల్లాడో పుట్టడానికి అమ్మవారి ముందు పూజ చేసేవాడంతే.” కొంతమంది ఆడపిల్ల కావాలని అడిగారు కూడా. అలాగే వాళ్ళకి ఆడపిల్లలు పుట్టారు. ఎక్కడా ఎవరినీ అభ్యంతరం పెట్టినట్టుకానీ, అసభ్యంగా ప్రవర్తించినట్టు కానీ లేదు. ఏ మందూ, మాకూ ఇవ్వలేదు, నుదిటిమీద పెట్టుకోమని ఇచ్చే సింథూరం తప్ప. కొంతమంది హిందువులు కానివారు వచ్చేరు సుబ్బాగారి దగ్గిరకి. వాళ్లలో కుంకుమ పెట్టుకోను అనేవారుంటే వాళ్ళనెవర్నీ బలవంతం చేయలేదు. అమ్మవారి దగ్గిర అన్ని మతాలు ఒక్కటే. ఇన్నేళ్ళు సుబ్బాగారిని ఏడిపించి వీళ్ళు బావుకున్నదేమీ లేదు ఉత్తినే ఆయనని బయటకి లాగి ఏడిపించడం తప్ప. ఈ కేస్ వెంఠనే కొట్టేయాలి ఇప్పటికే ఎన్ని పరీక్షలు చేసారో? చాలా ఆలస్యం అయింది, ఇంక చాలించండి.”
మరో ఏడాది గిరికీలు కొట్టాక మొత్తానికో జడ్జ్ మెంట్ వచ్చింది – సుబ్బాగారు చేసిన నేరం ఏమీ లేదు. అందువల్ల ఆయన జైలుకెళ్ళే ప్రసక్తి లేదు. అయితే ఇలా ఎవరు పుడతారో పుట్టాలని అనుకుంటున్నారో అంటూ అమ్మవారి ముందు అడగవచ్చా కూడదా అనేది ఏ న్యాయశాస్త్రం లోనూ లేదు. కానీ ఇలా చెప్పడం వల్ల కొంతమందికి (ఈ కొంతమందెవరో జడ్జ్ గారు సరిగ్గా చెప్పలేకపోయేరనేది వేరే విషయం) నచ్చలేదు. అదో ఫైన్ లైను. ఇందువల్ల చెప్పేదేమంటే, సుబ్బాగారు ఆఫీసు కట్టేయాలి అంతే.
దీనికి సుబ్బాగారు సంతోషంగా ఒప్పుకున్నారు. అసలే ఆయనకి డబ్బై ఏళ్ళొచ్చాయి. జర్మనీ లో ఉంటున్న కొడుకూ కోడలూ ఇంక తమ దగ్గిరకి వచ్చేయమని అడుగుతున్నారు. సుబ్బాగారి వాళ్ళావిడక్కూడా ఇండియా వదిలి జర్మనీ వెళ్ళిపోవాలని ఉంది. సుబ్బాగారి కోర్ట్ కేసు వల్ల వచ్చిన తంటా మూలాన, రోజూ అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు. జర్మనీ పోతే అక్కడే మనవలని చూసుకుంటూ హాయిగా ఉండొచ్చు.

సుబ్బాగారి ఆఫీసు తతంగం అలా ముగిసింది. ఆయన ఓ లక్ష రూపాయలు బీదల అన్నదానానికి విరాళం ఇచ్చేసి మిగతా డబ్బులు బేంక్ లో దాచుకుని, ఇల్లు తెలుసున్న వాళ్లకి అద్దెకిచ్చేసి, వాళ్ళావిడా, ఆవిడ వంటిమీద నగల్తో జర్మనీ వెళ్ళిపోయేడు. వెళ్ళేముందు సుబ్బాగారి స్వంత లాయరే అడిగాడు అసలు ఇదంతా అంత కరక్ట్ గా ఎలా చెప్పగలిగాడో సుబ్బా, అంతమంది గర్భిణీలకి.

సుబ్బా కోర్టులో చెప్పినదే ఆయనకీ చెప్పేడు, “అది అమ్మవారి అనుగ్రహం. నేనెవరికీ చెప్పకూడదు. సారీ.”
జర్మనీ వెళ్ళిపోయాక అన్నీ సర్దుకున్నై సుబ్బాగారికి. రోజూ సాయంత్రం వాతావరణం బాగున్నప్పుడు సుబ్బా, వాళ్ళావిడా నడుస్తారు రోడ్డుమీద. కొడుకూ కోడలూ పొద్దున్నే ఉద్యోగాలకి వెళ్తే సాయంత్రం వచ్చేసరికి అన్నీ వండి సిథ్థంగా ఉంచుతుంది అత్తగారు. అందువల్ల ఆవిడంటే కోడలికి అంతులేని ప్రేమ. ఇంట్లో పనిచేయడానికో పిల్లని పెట్టుకున్నా వంటపని ఈవిడ చేస్తుంటే అందులో ఉండే సుఖం వేరు కదా? కొడుక్కి తండ్రి అంటే మరింత ప్రేమ, ఆయన బేంకులో దాచిన లక్షల నగదు వల్లైతేనేం, మరోటి అయితేనేం.
అయితే ఎవరికీ తెలియని చిదంబర రహస్యం ఇంతకాలం అసలు సుబ్బా పిల్లలెలా పుడతారో అంత కరక్ట్ గా ఎలా చెప్పగలిగాడు? అది ఎవరికీ తెలియలేదు. ఎవరైనా అడిగితే సుబ్బా చెప్పిందే చెప్పాడు – అమ్మవారి అనుగ్రహం.

సుబ్బా కొడుక్కి మాత్రం సందేహం ఉండిపోయింది. తన తండ్రి ఎప్పుడూ, ఎవరి దగ్గిరా మంత్రం కానీ దీక్ష కానీ తీసుకోలేదు. అమ్మవారంటే అసలే నమ్మకం లేదు. ఎలా చెప్పగలిగేడిదంతా? అడిగితే అమ్మవారి అనుగ్రహం అంటాడేవిటి? ఇలా కొట్టుమిట్టాడుతుంటే ఓ రోజు సుబ్బాకి వంట్లో సుస్తీ చేసింది. హాస్పిటల్లో జేర్పించారు. డాక్టర్లు చెప్పడం ప్రకారం మరో నాల్రోజులు బతుకుతాడు. ఎనభై దగ్గిర్లోకి వచ్చాడు కదా?

ఆ రోజుల్లో కొడుకూ కోడలూ భార్యా దగ్గిరుండి చూసుకున్నప్పుడు ఇంక ఈ సందేహం ఇప్పుడు తీరకపోతే మరెప్పుడూ తీరదు కనక కొడుకు అడిగేడు మరోసారి, ఈ అమ్మవారి అనుగ్రహం ఏవిటో?

తానింక ఎలాగా పోతాడని తెలిసిన సుబ్బా చిరునవ్వుతో చెప్పాడు ఈసారి, “అమ్మవారి అనుగ్రహం ఏమీ లేదురా, నేను సరదాకి జనాలమీద ఆడిన నాటకం అది.”
“ఎలా?” కొడుకూ, కోడలూ భార్యా అశ్చర్యపోతూ అడిగేరు ఒకే కంఠంతో.
“ఎవరైనా వచ్చినప్పుడు మీకేబిడ్డ కావాలి అని అడిగితే వాళ్ళు అబ్బాయి అన్నారనుకో, అమ్మాయి అని పుస్తకంలో రాసేవాణ్ణి. అలాగే అమ్మాయి కావాలంటే అబ్బాయి అని రాసేవాణ్ణి. వచ్చినవాళ్లని బట్టి ఆ రాయడం కొంత మసాలా పదాల్తో రాసేవాణ్ణి.”
“మసాలా పదాలంటే?” భార్య అడిగింది.
“మా ఆయన మొగ పిల్లాడు కావాలంటున్నాడు, కానీ నాకు అమ్మాయే కావాలని ఉంది; అమ్మాయి కావాలని ఉంది కానీ అమ్మాయి పుడితే నన్నూ పిల్లనీ చంపేస్తాడు అందువల్ల అబ్బాయే కావాలి, అని రాయడం.”
“మరి చెప్పినది తప్పు అయితే వెనక్కొచ్చి అడగలేదా ఎవరూ?”
“అబ్బాయ్ కావాలని అడిగారనుకో, నేను పుస్తకంలో అమ్మాయి అని రాసేవాణ్ణి కదా. అబ్బాయే పుడితే మనదగ్గిరకి వెనక్కి రానేరారు. అమ్మాయి పుడితే వస్తారు అడగడానికి. కానీ పుస్తకం చూపించి అందులో మీరు అమ్మాయే కావాలన్నారు ఆ రోజునే అమ్మవారి ముందు కూర్చుని రాసాను, చూసుకోండి అని చూపించడమే.”
“అదేమిటి, వాళ్ళు మీరు చెప్పేది అబథ్థం అంటే?”

“అమ్మా మీరు వేవిళ్ల సమయంలో ఏమన్నారో మీకు గుర్తు లేదేమో. అసలే వికారంతో ఉండి ఉంటారు. అయినా ఇలా తారుమారు అయితే ఏవిటి నష్టం. పుట్టిన బిడ్డని చూసుకుంటూ హాయిగా ఉండండి, అని చెప్పేవాణ్ణి. వచ్చిన వాళ్ళకి కాఫీ టీలు ఇప్పించి సకల మర్యాదలూ చేసినప్పుడు వాళ్ళకి నోరు పెగిలేది కాదురా అబ్బాయ్” అంతటి అనారోగ్యంలోనూ నవ్వుతూ చెప్పేడు సుబ్బా.
భార్య నవ్వుతూ అంది, “అందుకేనా వచ్చే గర్భిణీ స్త్రీలు వేవిళ్ల సమయంలో మాత్రమే రావాలని చెప్పినది?”
అవునంటూ తల ఊపాడు సుబ్బా. చుట్టూ ఉన్న ముగ్గురూ పగలబడి నవ్వుతుంటే ఆ రోజు రాత్రి సంతోషంగా సుబ్బా తనువు చాలించేడు.
ఆ పై వారాంతంలో సుబ్బా అంత్యక్రియలు ఏర్పాటయ్యేయి. ఎంతో మంది స్నేహితుల మథ్య సుబ్బా కొడుకూ కోడలూ, భార్యా నవ్వుతూ అన్నీ సక్రమంగా నిర్వహించారు. ఏ సమయంలో చూసినా సుబ్బా కొడుకు నవ్వుతూనే ఉన్నాడు. పరామర్శకొచ్చిన స్నేహితులకి మాత్రం సుబ్బా కుటుంబం – ఇంటి పెద్ద పోయినా – ఇంత సంతోషంగా ఎలా ఉన్నారో అనేది అర్ధం కాలేదు.
చివరికో స్నేహితుడు థైర్యం చేసి అడిగేశాడు సుబ్బా కొడుకుని, “తండ్రి పోయినా నీకేం శోకం ఉన్నట్టు లేదే?”
“ఎవరైనా ఆప్తులు పోయినప్పుడు శోకం ఉండకూడదుట, అలా శోకిస్తే, వారికి ముందుకెళ్ళే మరో జీవితానికి ఆటంకం కలుగుతుందని మా నాన్నే అనేవాడు. అందుకే.” అసలు రహస్యం దాచి సుబ్బా కొడుకు వేదాంతం గుమ్మరించేడు.

(ఎప్పుడో చందమామలో చదివిన కథ గుర్తొచ్చాక ఇది రాసాను)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked