సారస్వతం

రండి! కాళన్నను ఆవాహన చేసుకుందాం!!

 – సంగిశెట్టి శ్రీనివాస్‍

 

1937లో 23 యేండ్ల వయసులో నిజామాబాద్‍ ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్నది మొదలు 2002లో చనిపోయే వరకూ మొత్తం ఆరున్నర దశాబ్దాల పాటు నిరంతరం ప్రజాక్షేత్రంలో న్యాయం వైపు, పీడితుల వైపు నిలబడ్డ గొంతుక, ధిక్కార పతాక కాళోజి నారాయణరావు. చిన్నా, పెద్దా తేడా లేకుండా తెలుగు ప్రజలందరి గుండెల్లో కాళన్నగా నిలిచిపోయిండు. ఆర్యసమాజీయుడిగా, ఉద్యమకారుడిగా, హక్కుల కార్యకర్తగా, నిజాం ఫ్యూడల్‍ పాలనపై నిరసన తెలిపి జైలుకెళ్ళిన ప్రజాస్వామ్యవాదిగా, కవిగా, కథకుడిగా, అనువాదకుడిగా, పేదల అడ్వకేట్‍గా, ఎమ్మెల్సీగా ఎప్పటికప్పుడు తన, పర అనే తేడా లేకుండా తప్పెవరు చేసిన తిప్పి కొట్టిండు. తోటి వారి బాధను తన బాధగా పలవరించిండు. కన్నీళ్ళ పర్యంతమయ్యిండు. మొత్తం తెలుగువారి ఇంటి మనిషిగా, తెలంగాణ ప్రజలకు ఆత్మీయుడిగా, ఆత్మగా బతికిన కాళోజి నారాయణరావు శతజయంతి సందర్భమిది. అనితర సాధ్యమైన ఆయన ఆచరణను ఆవాహన చేసుకోవాల్సిన తరుణమిది. కాళన్న కృషిని పునరావలోకనం చేసుకొని ఆయన కలలుగన్న హెచ్చు తగ్గులు లేని సమాజం కోసం కొట్లాడాలి. అందుకు ఆయన రచనలే ప్రధాన వనరు, స్ఫూర్తి.

ఈ 103వ జయంతి సందర్భంగా కాళోజికి ఇచ్చే నిజమైన నివాళి ఆయన రచనలన్నింటిని సమగ్ర సంపుటాలుగా తీసుకురావడమే! ఇప్పటికే దాదాపు ఆయన మొత్తం కవిత్వం అచ్చయ్యింది. కథలు, నా భారతదేశ యాత్ర, ఇదీ నాగొడవ తదితర రచనలు కూడా అచ్చయ్యాయి. అయితే ఇందులో కొన్ని ఇప్పుడు అలభ్యం. ముఖ్యంగా ఇదీ నాగొడవ పేరిట ముద్రితమయిన కాళోజి స్వీయ చరిత్ర అందుబాటులో లేదు.

ఆంధప్రాంతానికి చెందిన గురజాడ అప్పారావు, వీరేశలింగం, శ్రీశ్రీ, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, కొడవటిగంటి కుటుంబరావు, జాషువా తదితరుల రచనలన్నింటినీ వివిధ సంఘాల వారు సమగ్రంగా అచ్చేశారు. తెలుగు ప్రజలందరికీ ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో కాళోజి సమగ్ర రచనల సంపుటాలు వెలువడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అందరం నినదించాం. కాళోజి నిత్యం సత్యం వైపు, న్యాయం వైపు నిలబడ్డాడు. 1953లో తెలంగాణ రచయితల సంఘం స్థాపనలో దాశరథి, సి.నారాయణరెడ్డిలతో పాటుగా కీలక పాత్ర పోషించిండు. తర్వాత ఆ సంఘానికి అధ్యక్షత కూడా వహించాడు. అదే కాళోజి 1956లో ఆంధపద్రేశ్‍ అవతరణ వల్ల మేలు జరుగుతుందని ఆశించిండు. అది భ్రమ అన్ని అందరికన్నా ముందు తెలుసుకుండు.  కలిసుండడం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని తెలుసుకొని నిరసన గళం వినిపించిండు. నిజానికి 1969 ఉద్యమ సందర్భంగా మొత్తం తెలంగాణ కవిసమాజం ఎంత కవిత్వాన్ని సృష్టించిందో ఒక్క కాళోజీ దానికి రెండింతల కవిత్వాన్ని రాసిండు.

 

‘‘కుప్ప కావలి ఉండి కట్టలు

తప్పదీస్తివి ముద్దెరేస్తివి

సాటివాడు చేరదీస్తే

నోటినిండా మన్ను గొడ్తివి’’ అని సీమాంధ్ర ఆధిపత్యవాదుల దోపిడీని నిలదీసిండు.

‘‘అన్యాయాన్నెదిరిస్తే

నా గొడవకు సంతృప్తి

అన్యాయం అంతరిస్తే

నా గొడవకు ముక్తి ప్రాప్తి

అన్యాయాన్నెదిరించినోడు

నాకు ఆరాధ్యుడు’’ అని తన పంథాని తేల్చి చెప్పిండు. ఇప్పటికీ కాళోజి రాసిన కవిత్వమంతా ఒక్కదగ్గరికి రాలేదు. నేను, మిత్రుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి నేను వెలువరించిన ‘1969-73 తెలంగాణ ఉద్యమ కవిత్వం’ పుస్తకంలో అరుదైన అలభ్య ‘ఉద్యమం ఆగబోదు’ అనే కవితను వెలుగులోకి తేవడం జరిగింది.

‘‘కోటి న్నర మేటి ప్రజల

గొంతొక్కటి, గొడవొక్కటి

తెలంగాణ వెలసి నిలచి

ఫలించాలె భారతాన

భారతమాతాకీ జై

తెలంగాణ జిందాబాద్‍’’ అని ఈ కవిత ముగుస్తుంది.  ఇది 1969 నవంబర్‍ తొమ్మిది నాటి ‘తెలుగు గడ్డ’ పత్రికలో అచ్చయింది. ఇదే కాలంలో ఆయన వరంగల్లు నుంచి వెలువడ్డ ‘జనధర్మ’ పత్రికలో కూడా చాలా కవితలు అచ్చేశాడు. అలాగే 1945-49 మధ్య కాలంలో ‘కాకతీయ’ పత్రికలో అనంతర కాలంలో ‘విశ్వజ్యోతి’ పత్రికలో కాళోజి కవితలు అచ్చయ్యాయి. ఈ పత్రిక ప్రతులన్నీ లభ్యమయితే గానీ ఆయన రచనలు పూర్తిగా వెలుగులోకి రావు. కాళోజి ఫౌండేషన్‍ వాళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఆయన బతికున్న కాలంలోనే వెలువరించిన ‘కాళోజి నా గొడవ’ దాదాపు సమగ్రమైన కవితల సంపుటి. ఇందులో చేరని మరో కవిత ‘వ్యాకరణాల సర్పపరీరంభం’ కవిత ఇటీవల నాకు దొరికింది. ఆ కవితను ఇదే వ్యాసంతో పాటు వెలువరించడమైంది. కాళన్న కేవలం తెలుగులోనే కాకుండా తన అన్న రామేశ్వరరావు మాదిరిగా ‘ఉర్దూ’లో కూడా కవిత్వాన్ని వెలువరించాడు. అవన్నీ ఆనాటి ఉర్దూ పత్రికల్లోనే ఉండిపోయాయి. అలాంటి అరుదైన ఉర్దూ కవితలు కూడా సమగ్ర కవిత్వంలో చోటు చేసుకున్నట్లయితే గానీ దానికి సమగ్రత రాదు. ‘భాగి’ అనే కలం పేరుతో కాళోజి రాసిన ‘ఉర్దూ’ కవితలపై ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించినట్లయితే తప్పకుండా దొరుకుతాయి.

బహుభాషా కోవిదుడైన ప్రధాని పి.వి.నరసింహారావు మొదలు సామాన్య తెలంగాణ ఉద్యమ కార్యకర్త వరకూ అందరితో కలిసి నడిచిన కాళన్న ఆలోచనలు, ఆచరణల ప్రభావం తన తర్వాతి తరంపై బలంగా ఉంది. కాళన్న నా గొడవతో స్ఫూర్తి పొంది వట్టికోట ఆళ్వారుస్వామి ‘రామప్ప రభస’ పేరిట వ్యంగ్య రచనలు చేసిండు. అలాగే ఉద్యమ కార్యాచరణలో కాళోజి పంథాను చివరికంటూ కొనసాగించిన స్వార్థత్యాగి జయశంకర్‍ సార్‍. వరంగల్లు మిత్రిమండలి నిర్వహణలోనే కాదు ప్రజాశత్రువుగా వ్యవహరించే రాజ్యంతో రాజీలేని పోరాటం చేస్తున్న వరవరరావుకు, కాళన్నగత ప్రాణిగా బతుకుతున్న నాట్యకళ ప్రభాకర్‍ మొదలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1989లోనే తెలంగాణ స్టూడెంట్‍ ఫ్రంట్‍ స్థాపించిన మా వంటి వారికి స్ఫూర్తి కూడా కాళోజియే! తరాలకు తరాలకే స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన కాళన్న శతజయంతిని సంవత్సరం పొడుగూతా సభలు, సదస్సుల ద్వారా ప్రభుత్వమే నిర్వహించాలి.

కవిత్వంతో పాటుగా ఇప్పటివరకూ అముద్రితంగా ఉన్న అంజలి (ఎన్‍.సి.ఫడ్కే గ్రంథానికి అనువాదం), ఖలీల్‍ జిబ్రాన్‍ కవితలు, భారతీయ సంస్క•తి (సానె గురూజీ మరాఠీ గ్రంథానికి అనువాదం) కూడా వెలుగులోకి రావాలి. అలాగే వివిధ కవుల, రచయితల పుస్తకాలకు రాసిన ముందుమాటలు కూడా అచ్చులోకి రావాల్సిన అవసరముంది. కాళోజి బతికున్న కాలంలో హక్కుల సభల్లో, తెలంగాణ సభల్లో అనేక ఉపన్యాసలిచ్చారు. వాటిని కూడా టాన్క్స్రయిబ్‍ చేయించాలి. కాళన్న మీద డాక్యుమెంటరీ తీసిన ప్రేమ్‍రాజ్‍ లాంటి వాళ్ళ సహాయాన్ని ఈ కార్యక్రమానికి ఉపయోగించుకోవచ్చు.

కాళోజి నారాయణరావు తన మిత్రుడు మంథనికి చెందిన వెంకటరాజన్న అవధాని, వెల్దుర్తి మాణిక్యరావులతో కలిసి హైదరాబాద్‍లో 1935లోనే ‘వైతాళిక సమితి’ని ఏర్పాటు చేసిండు. ఈ సమితి తరపున కరపత్రాలు, వ్యాసాలు, కథలు అనేకం చాలా సార్లు పేర్లు లేకుండా గోలకొండ పత్రికలో ప్రచురించారు. వైతాళిక సమితి కార్యకలాపాలు, అది హైదరాబాద్‍ లోని తెలుగు సమాజంలో తీసుకొచ్చిన చైతన్యం గూర్చి, చేసిన రచనల్ని కూడా రికార్డు చేయాల్సిన అవసరముంది.

బైరన్‍ని అనువదిస్తూ కాళన్న అన్నట్లుగా ‘ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక’. అలాంటి కాళన్న మీద జాతీయ సదస్సు నిర్వహించి గంటా జలంధర్‍ రెడ్డి కొన్ని కొత్త విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. అలా వెలుగులోకి వచ్చిన విషయాల్ని పరిగణనలోకి తీసుకొని కాళోజి రాసిన ప్రతి అక్షరం ముక్కను గ్రంథస్తం చేసి రాబోయే తరాల వారికి కానుకగా ఇవ్వాల్సిన అవసరముంది.

కన్నులు చెమ్మగిల్లగా ఆత్మ తడితో ఆలోచించి, తాను నమ్మిన సిద్ధాంతాన్ని వజ్ర కఠోర దీక్షతో ఆచరించిన నిత్య చైతన్య పతాక కాళన్న. ఆయన జయంతిని ‘తెలంగాణ భాషా దినోత్సవంగా’ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయన స్ఫూర్తిని ఆవాహన చేసుకుందాం!

 

– సంగిశెట్టి శ్రీనివాస్‍

                                                                                                                sangishettysrinivas@gmail.com

                                                                                              ఫోన్‍. 9849220321

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked