ధారావాహికలు

రామాయణ సంగ్రహం

యముడితో రావణుడి యుద్ధం

ఇక అప్పుడు యముడు స్వయంగా రావణుడితో యుద్ధం చేశాడు. మృత్యుపాశం, కాలదండం ధరించి రావణుడిపైకి వచ్చాడు. ఇట్లా ఏడు రోజులు రాత్రింబవళ్ళు యముడికీ, రావణుడికీ జగద్భయంకరమైన యుద్ధం జరిగింది. ఎవరూ వెనక్కు తగ్గటం లేదు. అప్పుడు దేవతలు భయపడి బ్రహ్మదేవుడితో అక్కడకు చేరుకున్నారు. మృత్యుదేవత వీణ్ణి కబళిస్తానని ముందుకు రాగా, యముడు వారించి వీణ్ణి నా కాలదండంతో హతమారుస్తానన్నాడు. ఇంతలో బ్రహ్మ అక్కడకు వచ్చి యముడితో ‘నా వరాలు వ్యర్థమైపోతాయి. వీణ్ణి ఇట్లా చంపవద్దు’ అని జోక్యం చేసుకున్నాడు. అప్పుడు యముడు అసహనంతో అంతర్థానమైనాడు. ‘నేనే జయించాన’ని రావణుడు లోకం దద్దరిల్లే గర్జనలు చేస్తూ పుష్పకం ఎక్కి తన నివాసానికి వెళ్ళాడు.
ఆ తరువాత రావణుడు పాతాళలోకం పైకి దండెత్తాడు. భోగవతి దాని రాజధాని. రావణుడు అక్కడకు చేరాడు. వాసుకిని వశపరచుకొన్నాడు. అక్కడ నుంచి నివాతకవచులనే క్రూరరాక్షసులు ఎవరికీ కనపడకుండా నివాసముంటున్న మణిమయ పట్టణం వచ్చి నివాతకవచుల్ని తనతో యుద్ధానికి ఆహ్వానించాడు. ఇట్లా ఒక సంవత్సరకాలం వాళ్ళతో యుద్ధం చేశాడు రావణుడు. ఆ యుద్ధం ఏ పక్షానా విజయం సిద్ధింప చేసేట్లుగా లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి వాళ్ళకు సంధి కుదిర్చాడు. ‘వీడు ఎవ్వడివల్లా చావడు. కాబట్టి సంధి కుదుర్చుకోండి’ అని హితబోధ చేశాడు. అక్కడ రావణుడు ఒక సంవత్సరకాలం సకల భోగాలు అనుభవించాడు.
అక్కడ నుంచి కాలకేయులు నివసిస్తున్న ‘అశ్మ’ నగరంపై నివాతకవచులను తోడు చేసుకొని దండెత్తిపోయినాడు రావణుడు. ఘోరయుద్ధం చేసి కాలకేయుల్ని పరిమార్చాడు. ఈ యుద్ధంలో కాలకేయుల పక్షాన పోరాడుతున్న తన బావమరిది అయిన విద్యుజ్జ్విహుణ్ణి (శూర్పణఖ భర్త) కూడా తన కత్తికి ఎరచేశాడు రావణుడు.

వరుణుడితో యుద్ధం

ఆ తరువాత వరుణుడి పట్టణంపైకి దండెత్తాడు రావణుడు. ఆ నగరం తెల్లటి మబ్బుకాంతితో ఉంది. అందులోకి రావణుడు ప్రవేశించగానే సురభి (కామధేనువు) కన్పించింది. సురభి కార్చిన పాలతోనే పాలసముద్రం ఏర్పడింది. అందులోంచే చంద్రుడు పుట్టాడు. అక్కడ నుంచి వెళ్లి వరుణుడి భవనాన్ని చూశాడు రావణుడు. యుద్ధదుందుభి మోగించాడు. అప్పుడు వరుణపుత్రులు వచ్చి రావణుడిపై కవిశారు. వాళ్ళు మహాపరాక్రమవంతులు. రావణుడు పుష్పకారూఢుడై యుద్ధం చేయడం చూసి వాళ్ళు పుష్పకం పైకి లంఘించి రాక్షసులను దునుమాడారు. రావణుడి మంత్రులు వరుణ సైన్యాన్ని క్షోభపెట్టారు. అప్పుడు మహోదరుడు (రావణుడి మంత్రులలో ఒకడు) వరుణ నందనులతో పోరు సలిపి వాళ్ళను గదాదండంతో ప్రహరించాడు. వాళ్ళు మహోదరుడి ముందు నిలువలేక గుహలలోకి పోయి దాక్కున్నారు. ఇంతలో వరుణుడి మంత్రి ప్రహాసుడు అక్కడకు వచ్చి ‘వరుణుడు నగరంలో లేడు. గాంధర్వగానం వినటానికి సత్యలోకానికి పోయినాడు. వరుణ తనయులందరినీ పారిపోయేట్లు చేశావు కదా! నీవు జయించినట్లే’నని రావణుడితో చెప్పగా, వికటాట్టహాసంతో జయజయధ్వానాల మధ్య రావణుడు అక్కడ నుండి కదిలాడు.
ఈ విధంగా రావణుడు మదోన్మత్తుడై వరుణ నగరం నుంచి తన నగరం పోతూ ఎక్కడెక్కడ సుందరులైన దేవదానవ కన్యలున్నారో వాళ్ళందరినీ చెరపట్టి లంకకు తీసుకొని పోయినాడు. గంధర్వ, ఋషుల కన్యలను కూడా వాడు చెరపట్టాడు. వాళ్ళందరి రోదన ధ్వనులతో, కన్నీటి కాల్వలతో ఆ పుష్పకం నిండిపోయింది. వాళ్ళ శాపవాక్కులతో నిస్తేజుడై పోయినాడు రావణుడు. లంకలో రావణుడు ప్రవేశించగానే రావణుడి చెల్లెలు శూర్పణఖ వచ్చి పరిపరి విధాలా శోకించింది. అన్నే తన చెల్లెలిని అనాథను చేశాడని నిష్టురోక్తులాడింది. అప్పుడు రావణుడు చెల్లెలిని ఓదార్చి ‘లోకవిజేతను కావాలన్న ఆవేశంతో పొరపాటున నీ భర్తను చంపి ఉండవచ్చు. విచారించకు, నీకు ఎటువంటి కొరతా కలగనీయను. ఇప్పుడు నీవు దండకారణ్యానికి వెళ్ళు. అక్కడ మన పినతల్లి కొడుకు ఖరుడున్నాడు. నిన్ను కంటికి రెప్పలా రక్షిస్తాడు. దూషణుడు కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళు నిన్ను మన్ననగా చూసుకుంటారు’ అని శూర్పణఖను దండకారణ్యానికి పంపివేశాడు రావణుడు. ఖరుణ్ణి పిలిపించి శూర్పణఖను అప్పగించి నిర్విచారంగా ఉంటున్న రావణుడు ఒక రోజున లంక పడమటి సింహద్వారం సమీపంలో ఉన్న ‘నిఖుంభిల’ అనే చైతన్యవనానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రజిత్తు, మహేశ్వర మనే యజ్ఞాన్ని అప్పుడే ముగించాడు. ఈ యజ్ఞం వల్ల మాయారథం, మాయాశరచాపాలు, అదృశ్యుడై యుద్ధం చేసే శక్తులు సంపాదించాడని విని మేఘనాదుణ్ణి కౌగించుకొని సంతోషించాడు రావణుడు. అయితే బహుదేవతాకమైన యజ్ఞాలు ఎందుకు? బ్రహ్మను గూర్చి తపస్సు చేయక’ అని రావణుడి కొడుకు పట్ల కొంత అసంతృప్తి కలిగింది. ఆ తర్వాత కుమారుడు

మేఘనాదుడితో, తమ్ముడు విభీషణుడితో కలిసి వెళ్లి తాను చెరపట్టి తెచ్చిన కాంతలను చూపాడు రావణుడు విభీషణుడు వాళ్ళను చూసి కటకట పడ్డాడు. ‘అన్నా! ఎంత పనిచేశావు!’ అని వేదన చెందాడు రావణుడి దుష్కృత్యాల్ని తలచుకుని. ‘చూశావా? పాపఫలం ఊరకే పోదు! నీవు లంకలో లేని విషయం తెలిసి మధురాక్షసుడు మన చెల్లెలు కుంభీనసను అపహరించుకొని వెళ్ళాడు’ అని విచారంగా చెప్పాడు రావణుడికి. ‘మేఘనాథుడు యజ్ఞదీక్షలో ఉన్నాడు. నేను జలస్తంభనతో తపస్సు చేసుకుంటున్నాను. కుంభకర్ణుడేమో నిద్రలో ఉన్నాడు. అందువల్ల వాడిని ఎదిరించే వాళ్ళే లేకపోయినారు’ అని చెప్పాడు విభీషణుడు. రావణాసురుడు మహోదగ్రుడైనాడు. మధుపురంపై దండయాత్రకు బయలుదేరాడు. కుంభకర్ణుణ్ణి నిద్రలేపి తనతో తీసుకొని పోయినాడు. మేఘనాథుడు తండ్రి వెంట ఉన్నాడు. విభీషణుడు లంకాపురం రక్షణ కోసం ఉండిపొయినాడు లంకలో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked