ధారావాహికలు

రామాయణ సంగ్రహం

-డా. అక్కిరాజు రామాపతిరావు

నందీశ్వరుడి శాపం

నందీశ్వరుడు రావణుణ్ణి ‘నా రూపాన్ని చూసి వెటకారం చేశావు కదా! నా వంటి వక్రరూపులైన కపులు నీ లంకపై దండు వెడలి నిన్ను సర్వనాశనం చేస్తారు’ అని దశగ్రీవుణ్ణి శపించాడు. ‘నిన్ను ఒకే ముష్టిఘాతంతో చంపివేయగలను కాని, చచ్చిన వాణ్ణి చంపటమెందుకని ఉపేక్షిసున్నాను. ఇప్పటికే నీవు చచ్చినవాడి కింద లెక్క’ అని క్రోధతామ్రాక్షుడై నంది రావణుణ్ణి నిరసించాడు.

పార్వతీదేవి భయం పోగొట్టటానికి పరమశివుడు తాము కూచున్న గద్దె కిందికి తన పాదం చాచి కొండను తన కాలిబొటన వేలితో అదిమాడు. కొండ కింద రావణుడి శరీరం నలిగిపోయింది. తన భుజాలను, చేతులను దశకంఠుడు కొండ కింద నుంచి

ఇవతలకు తీసుకోలేకపోయినాడు. కెవ్వుకెవ్వున కేకలు వేస్తూ కుయ్యో, మొర్రో అని ఆక్రందించాడు రావణుడు. అంగలార్చాడు. పదినోళ్ళతో మిన్నూమన్నూ ఏకమైపోయేట్లూ, ప్రచండపయోధరం గర్జించినట్లూ, ప్రళయకాలపు మబ్బులు ఉరుమురిమినట్లూ రోదించాడు. సముద్రాలు హోరుమన్నట్లు ఆక్రోశించాడు. అప్పటినుంచే దశగ్రీవుడికి రావణుడనే పేరు వచ్చింది. పుట్టినప్పుడు పెట్టిన పేరు కంటే రావణుడనే పేరే ఆ రాక్షసుడికి మరింత విఖ్యాతమైంది. అప్పుడా రావణుడి మంత్రులు ‘శంకరుడు దయామయుడు. కాబట్టి ఆయన్ను స్తుతించవలసిందని రావణుడికి సూచించారు. వెంటనే రావణుడు ఎంతో భక్తిప్రపత్తులతో, విధేయతతో ధూర్జటిని పరిపరివిధాల స్తుతించాడు. కరుణించమని మొత్తుకున్నాడు. జాలి చూప వలసిందని వేడుకున్నాడు. అప్పుడు శంకరుడు కరుణాస్వాంతుడై రావణుణ్ణి కటాక్షించాడు. బంధవిముక్తుణ్ణి చేశాడు. ఆ విధంగా రావణుడు బతికి పోయినాడు. కాని దుష్టబుద్ధి మానలేదు. తర్వాత శివుణ్ణి రావణుడు ప్రార్థించాడు. ‘మహాదేవా! యుద్ధంలో నన్నెవరూ జయించ లేకుండా నాకొక శస్త్రాన్ని ప్రసాదించవలసింది’ అని ఆయన్ను వేడుకున్నాడు. అప్పుడు శంకరుడు రావణుడి కొక దివ్యఖడ్గాన్ని అనుగ్రహించాడు. ‘దీన్ని భక్తిప్రపత్తులతో నన్ను చూసినట్లే చూడు. ఏమాత్రం అవజ్ఞ చూపినా ఇది మళ్ళీ నాదగ్గరకు చేరుతుంది’ అని చెప్పాడు. ఇక రావణుడి అతిశయానికీ, అహంకారానికి హద్దులు లేకుండా పోయినాయి. రాజలోకాన్నంతా జయిస్తూ పోయినాడు.

వేదవతి కథ

ఒకరోజు రావణుడు భూలోకంలో సంచరిస్తూ హిమగిరి ప్రాంతానికి చేరాడు. అక్కడ ఒక పర్ణశాలలో జటావలయమే కిరీటంగా, జింకచర్మమే పరిధానంగా ధరించి తపస్సు చేసుకుంటున్న ఒక సౌందర్యరాశియైన యోవనవతిని చూశాడు. దుష్టుడు కాబట్టి వెంటనే కామమోహితుడైనాడు. ‘ఇంత అపురూపమైన యౌవనమూ, ఈ వయసు, ఈ అందచందాలు ఏమిటి? ఈ తపస్సు ఏమిటి?’ అని కావరంతో ఆమెను అడిగాడు.
అప్పుడామె రావణుడికి విధివిధానంగా అర్ఘ్యపాద్యాదులర్పించి ‘నా తండ్రి బ్రహ్మర్షి. ఆయన పేరు కుశధ్వజుడు. ఆయన బృహస్పతి తనయుడు. నిరతవేదాధ్యయనపరుడు. అందువల్ల నాకు ‘వేదవతి’ అని పేరుపెట్టుకున్నాడు. ఎందరో దేవతలు నన్ను తమకిమ్మని కోరినా ఆయన ఇవ్వలేదు. విష్ణువు తన అల్లుడు కావాలన్నది ఆయన కోరిక. ఇది ఇట్లా ఉండగా దంభుడు అనే రాక్షసుడు నన్ను కోరి వచ్చి మా తండ్రిని దారుణంగా చంపివేశాడు. మా అమ్మ సహగమనం చేసింది. నా తండ్రి కోరిక సఫలం కావాలని నేను

తపస్సు చేస్తున్నాను’ అని వేదవతి చెప్పింది. విష్ణువు మాట వచ్చేసరికి రావణుడికి వెర్రెత్తింది. ‘ఓ సునయనా! విష్ణువు నాకే పాటి సాటి వస్తాడు? నన్ను వరించు. నేను రాక్షస చక్రవర్తిని. అతులితమైన భోగభాగ్యాల ననుభవిస్తావు’ అని ఆమె కొప్పుపై చేయి వేశాడా దుష్టుడు. అప్పుడామె తన చేతినే కత్తిగా చేసి తన కేశపాశాన్ని వాడు పట్టుకొన్న మేర ఖండించింది. ‘నిన్ను సర్వనాశనం చేస్తాను’ అని అగ్నికుండం సృష్టించి అందులో ప్రవేశించి ఆహుతి అయిపొయింది. రావణుడు నిర్విన్నుడై అక్కడ నుంచి వెళ్ళిపొయినాడు.
‘ఈమె కృతయుగంలో దేవతాస్వరూపిణి. వేదవతిగా తపస్సు చేసింది. త్రేతాయుగంలో జనకుడికి నాగలిచాలులో దొరికి సీతాదేవిగా ప్రఖ్యాతి పొందింది. జనకుడింట పెరిగి జానకిగా నిన్ను చేపట్టింది. రఘురామా! ఆ విధంగా ఆమె రావణవధకు కారకురాలైంది’ అని అగస్త్యుడు ఆ పూర్వకథను చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked