ధారావాహికలు

రావణాసురిడి జననం

-అక్కిరాజు రామాపతి రావు

అట్లా ఆమెకు మొదట దశగ్రీవుడు జన్మించాడు. ఆ తరువాత కుంభకర్ణుడు పుట్టాడు. వాళ్ళిద్దరూ చిన్నతనంలోనే పరమభయంకర క్రూరకృత్యాలు చేస్తూ మునివాటికలను వెరపు కలిగిస్తూ వచ్చారు. ఋషులను పీడించసాగారు. వీళ్ళిద్దరి తరువాత పుట్టిన విభీషణుడు మాత్రం సాధువర్తనుడై, ధర్మతత్పరుడై, వేదనిరతుడై, జితేంద్రియుడై పెరుగసాగాడు.
ఇట్లా కాలం గడుస్తుండగా ఒక రోజున వైశ్రావణుడు (కుబేరుడు) పుష్పకవిమానం ఎక్కి తండ్రిని చూడడానికి వచ్చాడు. అప్పుడు కైకసి దశగ్రీవుడితో ‘చూడు, నీ సోదరుడు, ఎంత మహావైభవంతో, దివ్యతేజస్సుతో విలసుల్లుతున్నాడో! నీవు కూడా అంతటి వాడివి కావాలి. అతన్ని మించిపోవాలి’ అని ప్రేరణ చేసింది. అప్పుడు దశగ్రీవుడు ‘అమ్మా చూడు! ఆ ధనదుడి కన్నా బలవంతుణ్ణి అవుతాను, ధనవంతుణ్ణి అవుతాను. లోకాలన్నిటినీ జయిస్తాను. వాడి లోకపాలకత్వం ఒక లెక్కా? బహులోకపాలకుణ్ణి అవుతాను’ అని తల్లికి ప్రియం కలిగించాడు.
రావణాసురుడూ, సోదరులూ తపస్సు చేయటం కోసం
వెంటనే రావణాసురుడు గోకర్ణం వెళ్ళాడు. తాను ఒక్కడే కాక తన తమ్ములను కుంభకర్ణుణ్ణి, విభీషణుణ్ణి కూడా వెంట తీసుకొని వెళ్ళాడు. అక్కడ వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి గూర్చి ఇదివరలో ఎవరూ కనీ వినీ ఎరుగని ఘోరాతిఘోరమైన తపస్సు చేశారు. వేల సంవత్సరాలు నిరాహారులై, పంచాగ్నిమధ్యంలో, జడివానల్లో, శీతర్తువుల్లో కుత్తుకబంటి నీటిలో భయంకరమైన తపస్సు చేశారు. దశగ్రీవుడూ, కుంభకర్ణుడున్నూ, విభీషణుడు మాత్రం వేదధర్మనియతుడై కొన్ని వేల సంవత్సరాలు వేదపురుషుణ్ణి ధ్యానిస్తూ, కొన్ని వేల సంవత్సారాలు ఒంటికాలిపై సూర్యుణ్ణి చూస్తూనూ తపస్సు సాగించాడు.
దశగ్రీవుడి తపస్సు అయితే మహాభయంకరంగా, విపరీతమైన పట్టుదలతో సాగింది. అతడు ప్రతి వెయ్యి సంవత్సరాలకు తన ఒక తల ఖండించుకొని అగ్నిలో వేల్చి పరమఘోరతపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై దశగ్రీవుడు కోరిన వరాలన్నీ ఇచ్చాడు. దశవదనుడు దేవగంధర్వ, యక్ష, రాక్షస సురగారు డోరగ సిద్ధి సాధ్య చారణులలో ఎవరివల్లా తనకు మరణం లేకుండా వరం వేడుకున్నాడు. ‘మానవులంటే నాకు లెక్కలేదు. వాళ్ళు నా కంటికి కీటకాల వంటివారు’ అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు రావణుణ్ణి మెచ్చి అతడు తపోగ్నిలో హోమం చేసిన తలలన్నీ మళ్ళీ వచ్చేట్లు చేశాడు. లోకంలో దశగ్రీవుడిగా విఖ్యాతి పొందాల్సి ఉంది కాబట్టి ఆ తలలన్నీ మళ్ళీ ఇచ్చాడు బ్రహ్మదేవుడు. కామగమనం, కామరూపం కూడా ప్రసాదించాడు.
విభీషణుడి తపస్సు
ఆ తరువాత విభీషణుడి దగ్గరకు వచ్చి బ్రహ్మదేవుడు సాదరంగా అతడి తపస్సుకు మెచ్చానన్నాడు. సృష్టికర్తే తన తపస్సుకు మెచ్చి తన దగ్గరకు వచ్చి వరాలిస్తానని చెప్పినందుకు విభీషణుడు పొంగిపోయినాడు. ఆయనతో ‘పూజ్యుడివైన ఓ బ్రహ్మదేవా! నే నెటువంటి కష్టాలపాలైనా నా బుద్ధి ధర్మమార్గాన్ని విడవకుండా ధర్మమందే స్థిరంగా ఉండుగాక. నేను బ్రహ్మాస్త్రోపదేశం పొందక పోయినా నాకు ఆ అస్త్రం స్ఫురించుగాక. అన్ని ఆశ్రమాలలోను నా బుద్ధి చెదరక ధర్మంలోనే నిల్చేట్లు, నేను ధర్మం అతిక్రమించనట్లు అనుగ్రహించు. నే నీ వరాన్నే ఉత్తమోత్తమమని భావిస్తున్నాను. ఏమంటే నిరంతరము ధర్మాభిరతులైన వారికి లభించనిది ఏదీ ఉండదు కదా” అని బ్రహ్మను వరమడిగాడు విభీషణుడు.
బ్రహ్మదేవుడు చాలా సంతోషించి ‘నీవు రాక్షసకులంలో పుట్టవలసిన వాడివికావు. నీకు అమరత్వం ప్రసాదిస్తున్నాను’ అని అనుగ్రహించాడు. ఇక తరువాత కుంభకర్ణుడికి వరాలు ఇవ్వటానికి పూనుకోగా దేవగణం భయపడిపోయి, బ్రహ్మ దగ్గరకు వచ్చి ఆ మహాభయంకర కాయుడికి, క్రూరాతి క్రూరుడిగా వరాలు బ్రహ్మదేవుడు ఇస్తే లోకమంతా తల్లకిందులై పోతుందనీ, దేవతలంటూ ఎవరూ ఉండరనీ, ఈ కుంభకర్ణుడు ఇప్పటికే నందనవనంలో ప్రవేశించి ఏడుగురు అచ్చరకాంతలను, పదిమంది ఇంద్రుడి వనపాలకులను చంపి తినివేశాడనీ ఎట్లానైనా లోకోపద్రవకరమైన వరాలు వీడికి ప్రసాదించవద్దుఅనీ చతుర్ముఖుణ్ణి వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతిని పిలిచి వాడికి మతిభ్రంశం కలిగేట్లు చేయవలసినదని ఆమెకు చెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కుంభకర్ణుణ్ణి వరాలు కోరుకోవలసిందని అడగ్గా మతిమాలి ఆ కుంభకర్ణుడు దీర్ఘకాలం తనకు నిద్ర ప్రసాదించవలసిందని కోరుకున్నాడు. వాడి మాటకు దేవతలందరూ సంతోషించారు. ఆ తరువాత కుంభకర్ణుడు తాను కోరిన వరానికి నివ్వెరపోయి చాలా చాలా చింతించాడు. కాని బ్రహ్మవరం ఎవరూ తప్పించలేరని సమాధానపడ్డాడు.

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked