ధారావాహికలు

రావణుడి శివాపచారం

అప్పుడు రావణుడు కుబేరుడి దివ్యభవన సింహద్వారం దగ్గరకు చొచ్చుకొని పోయినాడు. అక్కడ ద్వారపాలకుడుగా ఉన్న సూర్యభానుడు రావణుణ్ణి తీవ్రంగా ఎదిరించాడు. దాపులో ఉన్న ఒక స్తంభాన్ని పెకలించి దానితో దశకంఠుణ్ణి మోదాడు. అయతే బ్రహ్మ వర ప్రభావం వల్ల రావణుడు చావలేదు. కాని రక్తం కక్కాడు. దానితో ఒళ్ళు తెలియని కోపావేశంతో ఆ స్తంబాన్నే చేతపట్టి సూర్యభానుణ్ణి మోది వైరిని విగతజీవుణ్ణి చేశాడు. దీనితో యక్షుల బలం కకావికలమై పోయింది.కొందరు కుప్పకూలి పోయినారు. కొందరు గుహలలో దూరి ప్రాణాలు రక్షించుకున్నారు. కొందరు నిశ్చేష్ట్రులైనారు. వాళ్లకు కాలు చేతులాడలేదు. అప్పుడు కుబేరుడు, మణిభద్రుడనే యక్ష ప్రముఖున్ని చూసి ‘పాపాత్ముడైన, క్రూరపరాక్రముడైన రావణుణ్ణి వధించి యక్షులను రక్షించే భారం నీదే’నని ఆనతిచ్చాడు. అప్పుడు మణిభద్రుడు నాలుగువేల మంది యక్షవీరులతో బయలుదేరి రణభూమికి వచ్చాడు. యక్షులకు, రాక్షసులకూ పోరు ఘోరంగా జరిగింది. రాక్షసులు మాయా యుద్ధ విశారదులు. యక్షులు యుద్ధనీతిని పాటించేవారు. ఆ సంకులసమరం చూసి ఆకాశచారులు ఆశ్చర్యచికితులైనారు. ప్రహస్తుడు, మహోదరుడు వీరవిక్రమంతో విజృంభించి యక్షులను ఊచకోత కోశారు.
తర్వాత ధూమ్రాక్షుడికీ, మణిభద్రుడికీ యుద్ధమారంభమైంది. ఒకరు ముసలంతో, మరొకరు గదతో పోరాడారు. మణిభద్రుడి గదాప్రహారానికి ధూమ్రాక్షుడు నిబ్బరించుకోలేక కుప్పకూలాడు. అది చూసి రావణుడు ఆగ్రహావేశంతో మణిభద్రుడిపై పడబోతుండగా

మూడు శక్తులు ప్రయోగించి మణిభద్రుడు, దశగ్రీవుణ్ణి నిలువరించాడు. దశకంఠుడు పట్టరాని కోపంతో పెనుగదతో మణిభద్రుణ్ణి మోదాడు. దానితో మణిభద్రుడి కిరీటం పక్కకు వొరిగిపోయింది. అందువల్ల అప్పటి నుంచి అతడికి ‘పార్ష్యమౌళి’ అనే పేరు వచ్చింది. మణిభద్రుడు వెనకంజ వేయవలసి వచ్చింది. ఇక కుబేరుడు యుద్ధరంగాన నిలువక తప్పిందికాదు. తన ఆధీనంలోని శంఖ, పద్మ మహానిధుల అధిదేవతలైన యక్షవీరులతోనూ, శుక్ర, ప్రోష్ఠపదులు అనే మంత్రులతోనూ వచ్చి కుబేరుడు, రావణుణ్ణి ఎదుర్కొన్నాడు.
అప్పడు కుబేరుడు, తమ్ముడైన రావణుణ్ణి మందలిస్తూ ఎన్నో నిష్టూరోక్తులు, నిరసన వాక్యాలు పలికి, హెచ్చరికలు చేసి అతణ్ణి యుద్ధవిముఖుణ్ణి చేయటానికి ప్రయత్నించాడు.
రావణుడిని తపస్సు వంటి పుణ్యకర్మలు చెయ్యమన్నాడు.
అధ్రువే హి శరీరే యో న కరోతి తపో ర్జనమ్,
స పశ్చాత్తప్యతే మూఢో మృతో దృష్ట్యా త్మనో గతిమ్ (ఉత్తర. 15-22)

‘ఈ శరీరం శాశ్వతం కాదు. ఇది ఉన్నంతలోనే తపస్సు చేయాలి. అలా చేయని మూఢుడు మరణించిన తర్వాత తనకు పట్టిన దుర్దశను చూసుకొని పశ్చాతాపం పొందుతాడు.’ అని హెచ్చరించాడు. అప్పుడు కుబేరుణ్ణి, రావణుడి మంత్రులు ప్రహాస్తుడు మొదలైన వాళ్ళు ఎదుర్కొన్నారు. కాని కుబేరుడి గదాప్రహారాల ముందు నిలువలేక పలాయితులైనారు.
అప్పుడిక అన్నదమ్ముల మధ్య యుద్ధం మొదలైంది. ఇద్దరూ గదలతో మోదుకున్నారు. ప్రచండ గదాఘాతంతో కుబేరుడు, రావణుణ్ణి నొవ్వచేసినా రావణుడు నొవ్వలేదు, చలించలేదు. అప్పుడిక అనేక మాయలు ప్రయోగించాడు దశకంఠుడు తన సోదరుడిపై. పులిలాగా, పెద్దకొండలాగా, సముద్రం గర్జిస్తూ ముంచి వేస్తున్నట్లూ, పందిలాగా ఘర్ఘిరిస్తూ మీదపడుతున్నట్లూ, పెద్దచెట్టు వచ్చి మీద పడుతున్నట్లూ ఎన్నో మాయలు ప్రయోగించి బలమైన గదాప్రహారంతో కుబేరుణ్ణి మూర్ఛపోయేట్లు చేశాడు. అప్పుడు త్వరితగతిని పద్మ, శంఖనిధి అధిదేవతలు కుబేరుణ్ణి ఎత్తుకొని నందనవనం చేర్చి ఉపచారాలు చేసి ఆయనకు స్మ్రుతి కలిగించారు.

పుష్పకవిమానాన్ని కైవశం చేసుకొని రావణుడు అక్కడ నుంచి కదిలాడు. పరమానందంతో విర్రవీగాడు. అట్టహాసంగా పుష్పకవిమానంలో ఎక్కి కుమారస్వామి జన్మస్థానమైన శరవణానికి దారితీశాడు. కైలాసం నుంచి వస్తుండగా పుష్పకం ఒక చోట హఠాత్తుగా ఆగిపోయింది. రావణుడు ఎంతో విస్మితుడైనాడు. విభ్రమం చెందాడు. అప్పుడు ప్రహస్తుడు “ఇది ఒక కుబేరుడికి మాత్రమే వశవర్తి అయి ఉంటుందేమో! ఏదైనా మంత్రం ఉంటుందేమో ఇది ఎక్కి సంచరించటానికి” అని అనుమానం వెలిబుచ్చాడు. ఇంతలో అక్కడికి ఒక వింత వ్యక్తి వచ్చాడు. విమానంలో ఉన్న వాళ్ళను ఉద్దేశించి ‘ఇది శంకరుడి క్రీడాపర్వతం. దీనిపై శివుడు, ఉమాదేవితో విహరిస్తుంటాడు. దీనిని ఎవరూ సమీపించకూడదు. అట్లా దీనిని దాటి పోవాలనుకుంటే వాళ్ళు విచేతనులవుతారు’ అని ఆ వింత వ్యక్తి చెప్పాడు. ఆ వింత వ్యక్తి తల బోడితల. చెవులు నిక్కబొడుచుకుని ఉన్నవి. కురుచరూపం. బలిష్టమైన మూపులు. ఈ మాటలు విని దశకంఠుడు కోపంతో రగిలిపోయాడు. ‘ఎవడా శంకరుడు? ఏమిటా క్రీడ?’ అని క్రుద్ధుడై విమానంలోని ఆసనం నుంచి బయటకు వచ్చాడు. బయట ఉన్న నంది మూతిని సాగదీశాడు. నందీశ్వరుడి రూపాన్ని వెటకారం చేశాడు. ఆయన్ను వేళాకోళం చేశాడు. “ఓహో! కొండ మీద శంకరుడు దేవితో విహరిస్తాడంటున్నావు కదూ! ఆ కొండనే ఊపివేసి ఆ శంకరుణ్ణి భయభ్రాంతుణ్ణి చేస్తాను చూడు” అంటూ తన భుజాన్ని తాటించి కొండను ఊగిపోయేట్లు చేశాడు. అప్పుడు మహాదేవుడి అర్థాంగి భయపడిపోయి శివున్ని గట్టిగా ఆలింగనం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked