ధారావాహికలు

విశ్వామిత్ర 2015 – నవల ( 22 వ భాగము )

-ఎస్ ఎస్ వి రమణారావు

విశాఖపట్టణం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్,వచ్చీపోయే ప్రయాణీకులతో రద్దీగానే ఉంది.ఎయిర్ ట్రావెలర్స్, ఇండియా మొత్తంలో ఏపిలోనే అధికంగా ఉన్నారని వచ్చిన న్యూస్ సర్వే నిజమే అని ధృవీకరిస్తున్నాట్టున్నారు జనం. సమయం ఉదయం పదకొండు గంటలైంది. ఎయిర్ పోర్ట్ కారిడార్ ని ఆనుకుని ఉన్న ఇన్నర్ రోడ్ ఒకటుంది.విఐపి కార్లు, అంటే ముఖ్యంగా గవర్నమెంట్ కారులు మాత్రమే అక్కడ పార్క్ చేసుకునే అవకాశం ఉంది.ఆరోడ్డులోకి పొలీస్ రక్షక్ వేన్ లు నాలుగు, ఫ్యాక్షనిష్ట్ సినిమాల్లో సుమోల్లాగా దూసుకు వచ్చాయి.అందులోంచి చక చక క్రమబద్ధమైన బూట్ల చప్పుడుతో దిగారు పోలీసులు.సరిగ్గా ఏడు నిమిషాల్లోఎయిర్ పోర్ట్ అంతా సరౌండ్ చేసేశారు.అన్నివేన్ లకి ముందున్న కారులోంచి ఫ్యాక్షన్ లీడర్ లాగా దిగాడు జగదీష్.అతడి మొహం వెలిగిపోతోంది.అందుకు కారణం ఉంది.అమెరికానుంచి వయా ఢిల్లీనుంచి వస్తున్న విశ్వామిత్రని అరెస్ట్ చేసి దారిలోనే కాల్చి చంపేయమని అతనికి ఆర్డర్స్ వచ్చాయి.ఎవరూ అనుమానించరు కూడా.విశ్వామిత్ర రౌడి అని పోలీస్ రికార్డ్స్ లో ఉంది.విశ్వామిత్రని తప్పించడానికి అతని గ్రూప్ వాళ్ళు ప్రయత్నించారనీ, ఆకాల్పుల్లో విశ్వామిత్ర అతని అనుచరులూ మరణించారనీ కథకూడా రెడీ చేశాడు.అనుచరులకింద క్రితంరోజే అరెస్ట్ చేసిన S&D డైరెక్టర్స్ ముగ్గురిని కూడా ఎయిర్పోర్ట్ కి తీసుకు వచ్చాడు. విశ్వామిత్ర మీద ఎప్పటినుంచో ఉన్న కసి,ద్వేషం,ఈరోజు తీరబోతోందన్న భావన,సంతోషం అతని మొహంలో స్పష్టంగా కనబడుతోంది. విశ్వామిత్ర హోమ్ మినిష్టర్ గ్రూప్ లో చేరినప్పటినుంచి అతని స్థాయి రెండుకి పడిపోయింది. ఒక రౌడీ తనతో కాంపిటిషన్ కి రావడం,వాడిని కాపాడడమే తన జీవితం అయిపోయింది.,అయినా సరే వాడు తనకి ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదు.‘స్టేషన్ లో ఎంత పొగరుగా కూర్చునేవాడు ఎదవ’ పళ్ళు పటపట కొరుక్కున్నాడు.

విశ్వామిత్ర ఫ్లైట్ లోంచి దిగాడు. దిగీ దిగగానే సెల్ ఆన్ చేశాడు. వెంటనే అతనికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ‘బయట పోలీస్ వేన్లు రెడీగా ఉన్నాయని.జగదీష్ కూడా వచ్చాడని’. విశ్వామిత్ర మొహంలో చిరునవ్వు మెరిసింది. ‘రక్తపాతం లేకుండా సమస్య పరిష్కరించబడాలని ధర్మరాజు ఆశించాడు. కాని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు లాంటి వ్యక్తులున్నంత వరకూ,యుద్ధమూ తప్పదు, రక్తపాతమూ తప్పదు’ విశ్వామిత్ర మనసులో ఆలోచనలు శరవేగంగా పరుగెడుతున్నాయి ‘వీడు వచ్చాడంటే అభిషేక్ ను కేసునుంచి తప్పించి వీడికి ఛార్జ్ ఇచ్చుంటారు.అంటే ఇక దారి కురుక్షేత్రం వైపేనా?’ దీర్ఘాలోచనలో మునిగిపోయిన విశ్వామిత్రకి సడన్ గా “నమస్కారం సార్”అన్న పిలుపు వినబడింది.
వెంటనే కళ్ళు పైకెత్తి చూశాడు విశ్వామిత్ర. అయిదడుగుల అయిదంగుళాల పొడుగు, బక్కపలచని శరీరం, లాల్చీ, తెలుగు పంచి కట్టు, రీసెంట్ గా చనిపోయిన కమెడియన్ ఎమ్మెస్ నారాయణ గుర్తుకు వస్తాడు ఎవరికైనా. అతన్ని చూడగానే విశ్వామిత్ర మొహంలో చిరునవ్వు ఉదయించింది.”గుర్తుపట్టారా? నాపేరు నారాయణ తెలుగు మాస్టార్ని”విశ్వామిత్ర తల ఊపాడు.
నారాయణ మొహం ఆనందంతో వెలిగిపోయింది”మీరు పెట్టిన బిక్షే సార్ ఇదంతా. ఈడబ్బు, ఫ్లైట్ లలో తిరగడాలు అదికాదు, కావాలంటే బస్సుల్లో వెళతాను,ట్రెయిన్ లలో తిరుగుతాను. నా మొహంలో వెలిగే ఈ ఆనందానికి కారణం మీరే సార్”అన్నాడు నారాయణ ఊగిపోతూ.

విశ్వామిత్రకి అర్థం కాలేదు.కళ్ళు చిట్లించి ప్రశ్నార్థకంగా చూశాడు. నారాయణ అదేమీ గమనించే స్థితిలో లేడు. మాట్లాడుతూనే ఉన్నాడు”అబ్బ ఏం క్లాస్ సార్ అది! ఆ క్లాసు దెబ్బతో నాజీవితమే మారిపోయింది. ఒక సాధారణ తెలుగు టిచర్ గా నిక్కుతూ, నీల్గుతూ జీవితం గడిపే నేను మీదెబ్బకి స్టేట్ లెవల్లో ఒక పెద్ద పెర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ ని అయిపోయాను. తెలుగు రాష్ట్రాల్లో నాపేరు తెలియని వాళ్ళుండరు. ఇంగ్లీష్, హిందీ కొంచెం ఇంప్రూవ్ చేస్తే నేషనల్ లెవల్ ట్రైనర్ ని అయిపోతాను. ఇప్పుడు రాజమండ్రిలో ఒక టివి ఛానెల్ లైవ్ షో కోసం రాజమండ్రి వెళుతున్నాను. ఈ స్టేటస్ వచ్చాక, ఎన్నోసార్లు మిమ్మల్ని కలుద్దామని ప్రయత్నించాను. మీరు దొరకలేదు. ఇన్నాళ్ళకి దొరికారు. నాజన్మ ధన్యమయింది”
ఆ మాటలన్నీ విన్న విశ్వామిత్ర మొహంలో చటుక్కున ఒక అలోచన వచ్చింది”మీరు నాకొక సహాయం చేయాలి” అన్నాడు నారాయణతో. వెంటనే నారాయణ మొహంలో షాక్ కనబడింది. అది చూసిన విశ్వామిత్ర ‘ఇంతసేపూ ఇంత, అంత మీరే నాదైవం అని పొగిడాడు.సహాయం అనేసరికి షాక్ అయాడేంటి? మాటలే తప్ప చేతలేమీ లేవేమో?’

“ఎంత మాటన్నారు సార్” నారాయణ కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి “చెప్పండి ఏంకావాలో?” ఉద్వేగంగా అన్నాడు నారాయణ.
విశ్వామిత్రకి నమ్మకం కుదిరింది.నారాయణ భుజం మీద చెయ్యివేసి ఏం చెయ్యాలో చెప్పాడు.
నారాయణ వెంటనే ఫోన్ బయటకు తీసి డయల్ చేశాడు”ప్రోగ్రామ్ డైరెక్టర్ గారేనా, నేనే నారాయణని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం అనుకున్న ప్రోగ్రామ్ లో మార్పు వచ్చింది”విషయం చెప్పాడు

అవతల రెస్పాన్స్ బాగానే వచ్చింది”ఇక్కడ మా లోకల్ బాస్ కి,  ఓనర్ గారికి కూడా చెప్పాల్సొస్తుంది సార్. విశ్వామిత్ర, నగరంలో జరిగిన బ్లాస్ట్ లు. నిన్నే ఆ కేసుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యారు. నేషనల్ ఛానెల్స్ లోకూడా వచ్చింది. ఇది కరెంట్ అండ్ రన్నింగ్ టాపిక్. ఒప్పుకుంటారనే అనుకుంటున్నాను”

“వెంటనే చెప్పండి. ఈ రెండు పాయింట్ లు చెప్పండి. ఒకటి, మనం అనుకున్న ప్రోగ్రాం కంటే ఇది చాలా మంచిది అంతేకాక ఇది టెలికాస్ట్ చేస్తే ఆంధ్రదేశం మొత్తం, సబ్ టైటిల్స్ వేస్తే దేశం మొత్తం, ఇదే షో చూస్తారని చెప్పండి. రెండవది, ఈహెల్ప్ గనక మీరు చేస్తే నేను మీఛానెల్ వాళ్ళకి ఒక ఏడాది పాటు, కాదు కాదు రెండేళ్ళపాటు ఫ్రీగా నాప్రోగ్రామ్స్ ఇస్తాను. అంతేకాదు మీఛానెల్ వాళ్ళు ఎప్పుడు ఎంత షార్ట్ టైమ్ లో ప్రోగ్రామ్ స్లాట్స్ అడిగినా వెంటనే ఇస్తాను. మీఛానెల్ ఎంప్లాయీస్ పిల్లలకి పెర్సనల్ గా ఉచితంగా ట్రైనింగ్ ఇస్తాను”
“ఓకె సార్. నాకర్థమైంది.విషయం మాట్లాడి నేను వెంటనే మీకు కాల్ చేస్తాను”
“థాంక్యూ. కృతజ్ఞతలు”

నారాయణ మళ్ళీ కొన్ని నంబర్లు డయల్ చేశాడు. చాలామందితో కొంచెం కొంచెం సేపు మాట్లాడాడు. తరవాత విశ్వామిత్రతో చెప్పాడు”నేనిక్కడ కొన్ని కాలేజీల్లో, ఇండస్ట్రీల్లో టాక్స్ ఇచ్చాను. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ తో మాట్లాడాను. ఆ స్టూడెంట్స్ ని బస్సుల్లో రమ్మన్నాను. ఎంత ఎక్కువమంది జనం ఉంటే అంత మంచిదికదా. లైవ్ షో ఉంది టివిలో కనబడతారు అని చెప్పాను. పంపిస్తానన్నాడు”
“ఇంప్రెసివ్. చాలా మార్పు వచ్చింది మీలో”అన్నాడు విశ్వామిత్ర
” అంతా మీ చలవే”

“మీరు అలా అనుకోవడం నాకు ఇవాళ ఉపయోగించింది.”నవ్వాడు విశ్వామిత్ర”టివి ప్రోగ్రామ్ ఇంకా ఫిక్స్ కాలేదుగా ?”
నారాయణ ఫోన్ మ్రోగింది”సక్సెస్ సార్.వేన్ ఈజ్ ఆన్ ద వే”చెప్పాడు రాజమండ్రి ప్రోగ్రామ్ డైరెక్టర్.
నారాయణ మొహంలో నవ్వు ఉదయించింది”సక్సెస్ సార్. యు ఆర్ హాట్ సార్.నాకు ఖచ్చితంగా తెలుసు ఒప్పుకుంటాడని. మీరు నాపక్కనే ఉండండి”
తల అడ్డంగా ఊపాడు విశ్వామిత్ర. ఆశ్చర్యంగా చూశాడు నారాయణ”మరి ఎక్కడుంటారు?”
“కెమెరాతో.లోపలికి రాగానే కెమెరామేన్ కి చెప్పండి.ఇంకొక విషయం లైవ్ షో వద్దు”
ఎవరికంటా పడకుండా ఎయిర్పోర్ట్ దాటిపోయారిద్దరూ. జగదీష్ కి బయట ఎంతసేపు వెయిట్ చేసినా విశ్వామిత్ర ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి లోపలకు వచ్చి ఐడి చూపించి అన్ని ఫ్లైట్స్ పాసెంజర్ లిస్ట్ లు చూశాడు. విశ్వామిత్ర వచ్చినట్టు స్పష్టమైంది. ‘కంప్లీట్ సరౌండ్ చేశానే,మరి ఎలా తప్పించుకున్నాడు?’నిర్విణ్ణుడై బుర్ర పనిచేయక తల పట్టుకున్నాడు జగదీష్.

విశాఖపట్టణం కళాభారతి.సుసర్ల శంకరశాస్త్రి గారిచే స్థాపించబడి,మరి ఎందరో మహనీయుల కృషి ఫలితంగా ఇరవై అయిదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంలో రినౌన్డ్ సింగర్ మిత్రా వి ఫ్రమ్ USA అన్నమాచార్య కీర్తనలు పాడే ప్రోగ్రాం అది.విశ్వామిత్రతో పాటు రినౌన్డ్ ఛైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా మధ్యలో పాడే కార్యక్రమం అది. గవర్నర్ రామ నరసింహన్ ముఖ్య అతిధి.డెప్యూటీ సిఎం కిరణ్ రెడ్డి గెస్ట్ ఆఫ్ ఆనర్.ప్రోగ్రామ్ ఈస్ స్పాన్సర్డ్ బై S&D Industries.అదే సమయంలో టివి లో నారాయణతో ప్రోగ్రాం వస్తోంది. ఆ ఛానెల్ వాళ్ళు బ్లాస్ట్ లని ప్రస్తావించకపోయినా, సాయంత్రం ప్రోగ్రాం మీరు మిస్ అవకండి అని ఊదరకొట్టడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలామందే ఆ ఛానెల్ ముందు కూర్చున్నారు.నారాయణ మాట్లాడడం ప్రారంభించాడు.
“ప్రజలకు నమస్కారం.వ్యక్తిత్వవికాస నిపుణుడిగా నేను మీకందరికీ పరిచయమే. ఆంధ్రదేశంలో చాలామందికి నేను వ్యక్తిత్వ వికాసం లో నేను శిక్షణ నిచ్చాను.నేను శిక్షణనిచ్చిన వారిలో అన్ని వయసులవాళ్ళూ ఉన్నారు.అందులో యువకులే ఎక్కువమంది.పెద్దలకు కూడా అవసరం ఉన్నప్పటికీ వారు ముందుకు రాకపోవడం వల్ల అంటే తమకు అవసరం లేదని వాళ్ళు అనుకోవడం వల్ల,అవసరం అని తెలియక పోవడం వల్ల వారిలో నేను ఎక్కువమందికి నేను శిక్షణ ఇవ్వలేదు.పిల్లలకు శిక్షణ ఇవ్వడం కంటే పెద్దలకు శిక్షణ ఇవ్వడం కష్టం.ఈ విషయానికి సంబధించి నేను మీకొక ఆసక్తికరమైన విషయం చెబుతాను.ఇండీయా యంగ్ టీం తో ఫస్ట్ టి-20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు,ఒక విలేకరి “యంగ్ అండ్ ఇనెక్స్ పీరిఎన్స్డ్ టీమ్ తో వరల్డ్ కప్ గెలవడం కష్టం కదా?”అని అడిగినప్పుడు ఇండియన్ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోని అన్నాడు’ఒక విధంగా చెప్పాలంటే అనుభవం ఉన్న ఆటగాళ్ళకంటే అనుభవం లేని యువ ఆటగాళ్ళతో ఆడడమే సులభం. ఎందుకంటే యువ ఆటగాళ్ళని ఉత్తేజపరచడం సులభం’ అని.బెస్ట్ ఐడియా ఏమిటీ అంటే కాంబినేషన్ ఆఫ్ యూత్ అండ్ ఎక్స్పీరియెన్స్. సరే,ఇప్పుడు నేను మీకు మరింత ఆసక్తికరమైన,అద్భుతమైన విషయం ఒకటి చెప్పబోతున్నాను. యంగ్ పీపుల్ కి వ్యక్తిత్వవికాస శిక్షణ ఇచ్చే నేను ఒక యువకుడి ద్వారానే ప్రభావితుడనై ,ఒక సాధారణ తెలుగు టీచర్ నుంచి ఒక స్టేట్ లెవల్ పెర్స్ నాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ గా మారానంటే మీరు నమ్ముతారా? ఈవిషయం మీతో పంచుకోవాలని నేను ఎప్పటినించో ఆరాటపడుతున్నాను,ఇన్నాళ్ళకి ఆ అవకాశం దొరికింది. ఇప్పుడు నేను మీకా యువకుడ్ని పరిచయం కూడా చెయ్యబోతున్నాను. ప్లీజ్ వెల్కమ్ విశ్వామిత్ర మై ఇన్స్ పైరర్,మై పెర్స్ నాలిటీ డెవలపర్”వెంటనే అంతా చప్పట్లు కొట్టారు…

ఇంట్లో ఉన్న జగదీష్ సెల్ ఫోన్ మ్రోగింది.”సార్ టివి చూడండి సార్”అవతలనుంచి ఫోన్ లో రాజు. రాజు గొంతులోని ఎక్సైట్మెంట్ ని గుర్తించిన జగదీష్ వెంటనే టివి ఆన్ చేశాడు
టివిలో కనబడుతున్న విశ్వామిత్రని చూడగానే అతని మొహంలో రంగులు మారాయి.కళ్ళు ఎర్రబడ్డాయి.

నారాయణ మాట్లాడుతున్నాడు,టివి లో ‘ఆరోజు నేను కాలేజీ స్టాఫ్ రూమ్ లో కూర్చుని టీ తాగుతున్నాను.పక్కనే ఇంకా ఇద్దరు టీచర్ లు ఉన్నారు.ఏవో కబుర్లు చెప్పుకుంటున్నాం. అప్పుడు సడన్ గా మారూమ్ లోకి ఇదిగో ఇక్కడ కూర్చున్న ఈ యువకుడే దూసుకు వచ్చాడు.వస్తూనే “తెలుగు టీచర్ ఎవరు ఇక్కడ?” అడిగాడు. అతను అడిగే తీరు నాకు చాలా ఆశ్చర్యాన్ని, భయాన్ని కూడా కలగచేసింది. మనిషి చూస్తే రౌడీలా ఉన్నాడు.అతని మొహంలో కోపం కనబడుతోంది.ఇక్కడ స్టూడియోలో సూటూ బూటూ వేసుకుని నవ్వుతూ కూర్చున్నట్టు ఆరోజు ఇలా లేడు ఇతను’నవ్వాడు నారాయణ. విశ్వామిత్ర కూడా నవ్వాడు.స్టూడియోలో ఉన్న,మిగతా అందరి మొహాల్లో కూడా నవ్వులు కనిపించాయి.
‘కోపంగా ఉన్న ఇతన్ని చూసి నాతోపాటు టీ తాగుతున్న మిగతా టీచర్ లు కూడా ఆశ్చర్యపోయారు. కుర్రవాడు పొరపాటేమైనా పడుతున్నాడేమో అని “ఎవరు కావాలి నీకు?”అడిగాను
“చెప్పానుగా, తెలుగు టిచర్”
“ఎందుకు?”
“నువ్వేనా తెలుగు టీచర్?”షార్ప్ గా అడిగాడతను
“అవును”నాకతని చురుకుతనం చూస్తే ముచ్చటేసింది.కొద్దిగా భయంకూడా తగ్గింది
“మరి క్లాసులో పాఠం చెప్పకుండా ఇక్కడేం చేస్తున్నావ్?”

నేనదిరిపోయాను. కాలేజీ ప్రిన్సిపాల్ కూడా అంత దూకుడుగా నన్నెప్పుడూ అడగలేదు.నాకు కొంచెం కోపంకూడా వచ్చింది. కాని విషయం ఏమిటో తెలుసుకుందామని
“తెలుగుక్లాస్ ఎవరు వింటారోయ్? ఫిజిక్స్, మేథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ అవి చదువుకుంటే వాళ్ళకి కాంపిటేటివ్ ఎక్జామ్స్ కి పనికొస్తుంది, ఐఐటి, ఎన్ ఐటి, బిట్స్, ఎ మ్సెట్. ఇంగ్లీష్ నేర్చుకుంటే కమ్యూనికేషన్ ఎబిలిటీస్ పెరుగుతాయ్. తెలుగు ఎవడికి కావాలి బాబు? నేను క్లాసుకి వెళ్ళినా వెళ్ళక పోయినా పిల్లలూ పట్టించుకోరు, ప్రిన్సిపాలూ పట్టించుకోడు”అన్నాను
“ఏ లెసన్ చెపుతున్నావ్?”
“మిత్రలాభం”

అంతే! ఇతను నన్ను వెంటనే చెయి పట్టుకుని లాక్కు వెళ్ళాడు.చెయి పట్టుకు లాక్కు వెళ్ళాడో, కాలర్ పట్టుకు తీసుకువెళ్ళాడో నాకు సరిగ్గా గుర్తులేదు’ మళ్ళీ నవ్వాడు నారాయణ.విశ్వామిత్ర కూడా చిరునవ్వులు చిందించాడు.
‘అలా ఇద్దరం క్లాస్ రూమ్ లోకి వెళ్ళాం. నన్ను క్లాసురూమ్ లో మొదటి బెంచిలో కుదేసాడు. అప్పుడు తను పాఠం చెప్పడం మొదలుపెట్టాడు.మొదటి బెంచీలో కూర్చున్న నేను వినడం ప్రారంభించాను. ఆపాఠమే, ఆ వినడమే నాజీవితాన్ని మార్చేసింది. ఇక్కడనుంచి నేను చెప్పడమెందుకు? ఆక్లాసు చెప్పిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు.అతని నోటిద్వారానే వినండి’.

విశ్వామిత్ర మైకు అందుకుని లేచి నిలబడ్డాడు. స్టూడియోలో చుట్టూ కూర్చున్నవారందరివైపు ఒకసారి చూశాడు.”ఆకథ మిత్రలాభంలో మొదటి కథ.నాకు బాగా నచ్చిన కథ.” ఒకసారి గొంతు సవరించుకుని మాట్లాడడం ప్రారంభించాడు.నాకు బట్టీ వచ్చిన కథ.నచ్చినదీ,బట్టీకూడా వచ్చినదీ కాబట్టి బాగానే చెప్పుంటాను. కానీ దానివల్ల ఎవరు ఎంత ప్రభావితమయ్యారు అన్నది వినేవాళ్ళ తెలితేటల మీద,వారి శక్తి సామర్థ్యాలమీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి గొప్పతనమంతా కథది,మీ ట్రైనర్ గారిది.”వెంటనే నారాయణతో సహా పిల్లలందరూ చప్పట్లు కొట్టారు.”ఇక కథ గురించి.తెలుగు రాష్ట్రాల్లో ఈకథ తెలియని వాళ్ళుండరు.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు,భారతదేశంలోనే ఈకథ తెలియనివాళ్ళుండరు.కానీ ఈకథ తెలుగులో చదివితేనే దాని అందం మీకు గోచరిస్తుంది.కాబట్టి తెలుగు రానివాళ్ళు తెలుగు నేర్చుకుని చదివితే చాలా బావుంటుంది.సరే ఇక కథలోకి వస్తాను”విశ్వామిత్ర,అక్కడున్న స్క్రీన్ వైపు వేలు చూపించాడు. వెంటనే స్క్రీన్ మీద ఒక పెయింటింగ్ కనబడింది.పావురాల గుంపు వల పైకెత్తుకుని ఎగిరిపోతుంటే,క్రింద బోయవాడు నిస్సహాయంగా చూస్తున్న చిత్రం అది.”ఈ పెయింటింగ్ చూడగానే మీకందరకూ తెలిసే ఉంటుంది . నేనే కథ చెప్పబోతున్నానో. నాకీ కథ బట్టీ వచ్చు అని చెప్పానుగా. కాబట్టి ఒరిజినల్ లో ఎలా ఉందో అలాగే చెప్తాను.”ఒక క్షణం ఆగి మళ్ళీ గొంతు సవరించుకుని చెప్పడం మొదలుపెట్టాడు

‘..వాడా వృక్షమునకు సమీపమందు నూకలు చల్లి,వలపన్ని పోయి చేరువ పొదలో దాగి పొంచి చూచుచుండెను.అనంతరము చిత్రగ్రీవుడను కపోతరాజు నింగిని సంచరించుచు నేలమీద నూకలు చూచి,తనతోడి కపోతములతో నిట్లనియె:”ఈ నిర్జనవనమందు నూకలు రా నిమిత్తమేమి?”జనులెక్కువగా ఉండేచోట అంటే రెసిడెన్షియల్ కాలనీలనమాట,అక్కడ నూకలు ఆరబెడతారు, బియ్యం ఆరబెడతారు అన్నీ ఉంటాయి’.
మధ్యలో నారాయణ కలగజేసుకున్నాడు నవ్వుతూ”విశ్వామిత్రా ,ఈ స్టూడెంట్స్ కి అది తెలియకపోవచ్చు.అన్నీ డిపార్ట్మెంట్ స్టోర్ లో రెడీమేడ్ వి కొనుక్కోవడమేగా”అందరూ నవ్వారు.

విశ్వామిత్ర కూడా నవ్వి మళ్ళీ ఆరంభించాడు”ఈ నిర్జనవనమందు నూకలు రా నిమిత్తమేమి?మనమీ నూకలకాసపడరాదు.”నాకీకథలో కనబడేదేమిటంటే ‘డెసిషన్ మేకింగ్’. నేలమీద నూకలు కనబడుతున్నాయి. కిందకు వాలి తింటే ఆకలి తీరుతుంది.కాని అది ఒక ఎర అయితే ప్రాణమే పోతుంది.ఏ నిర్ణయం తీసుకోవాలి? చిత్రగ్రీవుడు ఇంకా ఇలా అంటాడు”తొల్లి యొక తెరువరి కంకణమునకాశపడి పులిచేత దగులుకొని మృతి చెందెను.మీకా కథ చెప్పెద వినుండు!”అంటూ పులి-కంకణము-బాటసారి కథ చెపుతుంది.ఆకథకూడా మీకందరికీ తెలిసినదే,పులిచేతిలోని కంకణానికి ఆశపడి ,ఆ పులిచేతిలో భక్షింపబడిన బాటసారి కథ. ఆకథ చెప్పి చిత్రగ్రీవుడిలా అంటాడు ‘కాబట్టి సర్వవిధముల విచారింపని పని చేయరాదు. చక్కగా విచారించి చేసిన పనికి హాని యెప్పటికి రాదు.’”ఎంత అద్భుతమైన వాక్యం!Its the bottom line of any decision making theory.పావురాలన్నీ ఆమాటలు విన్నాయి. అప్పుడు ఆగుంపులో ఒక కపోతవృద్ధము నవ్వి ఇలా అంటుంది:‘ఆ! ఇవి యేటిమాటలు?ఒక యిక్కట్టు వచ్చినప్పుడు వృద్ధుని మాట వినవలసినది. వినుండు స్థానా స్థానములు వివేకింపక సర్వత్ర యిట్టి విచారము పెట్టుకోరాదు. కొరమాలిన శంకలు తెచ్చుకుని భోజనము మానుకోవచ్చునా?మానుకొని యేలాగున బ్రదుకవచ్చును? ఈర్ష్యాళువు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుడు, నిత్యశంకితుడు, పరభాగ్యోపజీవియు ననువా రారుగురు దుఃఖభాగులని నీతికోవిదులు చెప్పుదురు.’
ఒక క్షణం ఆగి మళ్ళీ ప్రారంభించాడు విశ్వామిత్ర”మళ్ళీ పావురాలన్నింటికీ సందేహం వచ్చింది.ఒకటి for గా, ఇంకొకటి against గా. Again, its a typical problem of decision making. మొత్తానికి కపోతాలన్నీ నేలమీద వాలాయి. వలలో చిక్కుకున్నాయి. అనంతరము పావురములన్ని వలలో దగులుకొని కపోతవృద్ధమును జూచి ‘నీవు వృద్ధుడవు-తెలిసినవాడవని భ్రాంతిపడి నీ మాటలను విని యీ విపత్తు తెచ్చుకొంటిమి. ఎవ్వడు బుద్ధిమంతుడో వాడు వృద్ధుడు గాని, యేండ్లు మీరిన వాడా వృద్ధుడు?’

ఇంకొక అద్భుతమైన వాక్యం!.అన్ని పావురాలకి ఇప్పుడు చిత్రగ్రీవుడే కరట్టని,కపోతవృద్ధం రాంగ్ అని తెలిసింది.కాని చిత్రగ్రీవుడు తనకు వచ్చిన సపోర్ట్ చూసి పొంగిపోలేదు.వాళ్ళందరితో కలిసి కపోతవృద్ధాన్ని నిందించలేదు.ఇక్కడ అతను తన లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తాడు.అటువంటి పరిస్థితుల్లో నాయకుడనేవాడెలా ప్రవర్తించాలో మనకు చెపుతాడు.ఇందాకటి డైలాగ్ మళ్ళీ చెప్పుకుందాం” అనంతరము పావురములన్ని వలలో దగులుకొని కపోతవృద్ధమును జూచి ‘నీవు వృద్ధుడవు-తెలిసినవాడవని భ్రాంతిపడి నీ మాటలను విని యీ విపత్తు తెచ్చుకొంటిమి.ఎవ్వడు బుద్ధిమంతుడో వాడు వృద్ధుడు గాని,యేండ్లు మీరిన వాడా వృద్ధుడు?’ అని కపోతములు నిందింపగా విని చిత్రగ్రీవుడిట్లనియె:”ఇది యీతని దోషము గాదు.ఆపదలు రాగలప్పుడు మంచి సహితము చెడు గగుచున్నది.మన కాలము మంచిది గాదు.ఊరక యేల యీతని నిందించెదరు?ఈతడు తనకు తోచినది చెప్పినాడు.అప్పుడు మనబుద్ధి యేమయ్యె?”

A superb statement from a leader!అదే కథలో చిన్నయసూరి,రచయిత ఇలా అంటాడు ‘గొప్పశాస్త్రములు చదివి మిక్కిలి వినికి గలిగి పరుల సంశయములను వారింప నేర్పు గలవారు సహితము లోభమువల్ల వివేకము పోగొట్టుకొని క్లేశపడియెదరు.ఆహా!లోభమెంత చెడుగుణము!అన్ని యిడుములకు లోభము కారణము.’
విశ్వామిత్ర ఒక ఫ్లోలో మాట్లాడుతున్నాడు”అప్పుడు మనబుద్ధి యేమయ్యె? ఆపద వచ్చినప్పుడు తప్పించుకొను సాధనము విచారింపవలె గాని,యీ మాటలవల్ల ఫలమేమి?విపత్కాలమందు విస్మయము కాపురుష లక్షణము.”Another terrific statement from a leader!
“కాబట్టి యిప్పుడు ధైర్యము తెచ్చుకొని ప్రతీకారము చింతింపుడు.ఇప్పటికి నా కొకటి తోచుచున్నది.మీరందరు పరాకు లేక వినుండు.ఒక్కసారిగా మనమందరము వలయెత్తుకుని యెగిరిపోవుదము.మన మల్పులము-మన కీ కార్యము సాధ్యమగునాయని విచారింపబనిలేదు.సంఘీభవించి యెంతటి కార్యమైన సాధింపవచ్చును.గడ్డిపరకలు సహితము వెంటిగా నేర్పడి మదపుటేనుగును బంధించుచున్నవి.మీరు విచారింపుడు.దీనికంటె మంచి సాధనము మీ బుద్ధికి దగిలెనా యది చేయుదము!”

“What a speech!An Extraordinary one!!.ఇండియాలో,ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచదేశాల్లో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో,టాప్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూస్ లో one of the greatest speeches of a leader అన్న పాఠ్యాంశం కింద ఈ స్పీచ్ ని చేర్చాలి.”విశ్వామిత్ర గొంతు నిశ్శబ్దంగా ఉన్న ఆస్టూడియోలో అద్భుతంగా వినబడింది
అప్పుడు ఆమాటలు విని” ’మీరు చెప్పినదే సరి.ఇంతకంటే మంచి సాధనము లే ’దని చెప్పి పావురములన్ని విచిత్రముగా గగనమార్గమున కెగిరెను’.
విశ్వామిత్ర కథ ముగించాడు.నారాయణ,విద్యార్థుల,టివి స్టాఫ్ చప్పట్లతో స్టూడియో దద్దరిల్లిపోయింది.

ప్రోగ్రాం మొత్తం చూసిన జగదీష్ కి బుర్ర తిరిగిపోయింది.‘వీడేంటి?రౌడీ వెధవ, పెద్ద పండితుడిలా మాట్లాడుతున్నాడేంటి?.వీడికిప్పుడు ఫాన్స్ తయారయిపోయుంటారు.వీడ్ని గొడవ రేగకుండా చంపడం ఎలా?’ రాత్రంతా జగదీష్ కి ‘విశ్వామిత్రని ఎలా చంపాలా’ అన్న ఆలోచనల తోటి నిద్ర రాలేదు. షో చూసిన రాజుకి ఫ్యాక్టరీలో విశ్వామిత్ర మీద పుట్టిన అభిమానం రెండింతలు మూడింతలై ఓవర్ నైట్ విశ్వామిత్ర ఫాన్ అయిపోయేలా చేసింది.

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked