కథా భారతి

విష్ణు మనోగతం

-సముద్రాల హరిక్రిష్ణ

ఎందుకురా, కాని వరాలు ఇస్తారు, నువ్వూ, ఆ శివుడూనూ!!

భూమ్మీద ఏ రాక్షసుడో తపస్సు చేయటం ఆలస్యం,
ఇద్దరూ వాలిపోతారు, ఉన్న పళాన, వరాల సంచి వేసుకొని!!

సరే, వెళ్తే వెళ్లారు! కాస్త ముందూ వెనకా ఆలోచించుకో
నక్కరలేదు, ఆ సంచి విప్పేముందు! వాళ్లకేం పోయింది,
ఇచ్చేవాడుంటే, ఏదైనా అడిగేస్తారు.

ఆ హిరణ్య కశిపుడి కథ ఏమిట్రా, విరించీ, ఏమాలోచించి సరే నన్నావురా, వాడు అడిగిన
అన్నింటికీ!! నువ్వు పుట్టించిన అయిదింట్లో దేనితో, దేనిలో కూడా చావకుండా, ఎటూ
గాని వరం వాడడగటం, నువ్వు తధాస్తు అనటం! బాగుంది నాయనా, చాలా బాగుంది!

ప్రహ్లాదుడు, పసి కూన నన్ని బాధల పడనిచ్చింది ఎందుకనుకున్నావ్?! ఆ వ్యవధిలో,
ఆలోచించి, ఆలోచించి బుర్ర వేడెక్కిపోయిందంటే నమ్ము, నువ్వు ఇచ్చిన వరాన్ని దాటి,
ఆ దైత్యుణ్ణి ఎట్లా అంతం చెయ్యాలా అని ఆలోచిస్తూ!! పాపం పసివాడు నలిగిపోయాడురా,
ఈ లోపల!

చివరకు ఎప్పుడో మధు కైటభులను చంపిన వైనం గుర్తు రాబట్టి, ఏదో పని పూర్తి
కానిచ్చాను, భూమ్మీద, ఆకాశం మీద కాని నా ఊరువుల మీద పెట్టి వాణ్ణి చీల్చి!

కాస్త ఆలస్యం అయింది ,మన్నించరా అని అడిగాను అనుకో, ఆ అబ్బాయిని చివర్లో!! ఏ
జాతి అయితే ఏమిట్రా, సద్బుద్ధి,సద్భక్తి ఉంటే చాలదూ!!

కానీ ఏమి వరమిచ్చావురా తండ్రీ, నీది తెలివో, గిలివో ఇప్పటికీ అర్థం కాదు నాకు!!

****

నువ్వు సరే, ఆ శివుడికీ ఇదేం పద్ధతి రా, ఒళ్ళు మైమరచి, ఇచ్చేయటం వరాలు. భస్మం
రాసుకుని
తిరిగేవాడికి, భస్మం చేసే వాడన్నట్టు, వాడెవడో భస్మాసురుట్ట! ఎంత గగ్గోలు
అయింది వాడి విషయం లో!!

మహానుభావుడు వరం ఇచ్చిందే తడవు, నీ నెత్తిన చేయి పెట్టీ పరీక్షిస్తా నంటాడుట
వాడు! ఎక్కడికి పోతాయి, రాక్షస బుధ్దులూ!! ఈ విభూతి అయ్యవారు, దౌడో దౌడు,
చెట్టూ పుట్టా పట్టుకొని, వెనకాలే వాడు, చేయి చాపి, ఆగు ఆగు అంటూ!!

మా చెల్లాయి పరుగు పరుగున, జయ విజయులను తోసుకుంటూ వచ్చి మరీ దుఃఖ పడుతూ అంతా
చెప్పుకోటంతో,అవతారం మార్చి, మోహినిగా
మారి, భంగిమలు గట్రా పెట్టీ, పెట్టించీ, వాడి చేత్తో
వాణ్ణే బూడిద కుప్పగా మార్చేశాననుకో!!

ఇక బాణాసురుడి విషయంలో, ఏమైందీ, ఎలా విడిపించిందీ,నీకు బాగా తెలిసిందే, నువ్వూ
పాత్ర
ధారివే గా ఆ నాటకం లో!! చిన్న నిడివి గల యక్ష
గాన ప్రదర్శనే చేయాల్సి వచ్చింది అందరమూనూ,
శివయ్య గార్ని తప్పించటానికి!

ఎక్కడినుంచో అయితే చెప్పేదేముంది, రాక్షసుడి కడుపు లోంచి!!

****

ఇంకా ఏదో విష్ణుమూర్తి చెప్ప బోతుంటె, బ్రహ్మగారు ధైర్యం చేసి, “ఇంకేమీ
అట్లాంటివి జరిగే ప్రమాదం లేదులే నాన్నా, ఇప్పుడు అంతటి రాక్షసులూ లేరు, ఆ
స్థాయి తపస్సులు లేవు” అన్నారు.

విష్ణువు అది విని ఏమీ అనలేదు!!

ఆయనకు బాగా తెలుసు, ఇప్పుడు ఎట్లాంటి రాక్షసులు
భూమ్మీద తిరుగుతున్నారో, కటిక్కిన మాయమై పోయారు!!

ఈ కొత్త రాక్షసులను ఎప్పుడు, ఎట్లా పరిమార్చి, సామాన్యులను రక్షిస్తారో!

ముందు ముందు తెలుస్తుందిగా, తొందరెందుకు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked