వీక్షణం

వీక్షణం సాహితీ గవాక్షం- సప్తమ వార్షికోత్సవం

మాధవపెద్ది ఫణి రాధాకుమారి

సెప్టెంబరు 8, 2019 న కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ లో స్వాగత్ హోటల్ లో ఉదయం 10 గం.నుండి సాయంత్రం 5 గం. వరకు వీక్షణం- సాహితీ గవాక్షం సప్తమ వార్షికోత్సవం ఆహూతుల ఆనందోత్సాహల నడుమ అత్యంత రసవత్తరంగా జరిగింది. వీక్షణం నిర్వాహకురాలు డా||కె.గీత మాట్లాడుతూ ఏడు సంవత్సరాలుగా నెల నెలా క్రమం తప్పకుండా కొనసాగుతున్న వీక్షణం సాహిత్య కార్యక్రమాలకు సహకారం అందజేస్తున్న స్థానిక సాహిత్య కారుల్ని, అభిమానుల్ని వేనోళ్ల కొనియాడారు. ఈ సందర్భంగా వీక్షణం తనతో బాటూ అందరికీ అందజేస్తున్న సాహిత్య స్ఫూర్తి వల్లే ఇదంతా సాధ్యపడుతున్నదని అన్నారు.
ఈ సభలో ఉదయం సెషన్ కు శ్రీ పొద్దుటూరి ఎల్లారెడ్డి అధ్యక్షత వహిస్తూ కరుణశ్రీ గారి పద్యంతో ప్రారంభించారు. తర్వాత శ్రీ విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం నుంచి పద్యాలనాలపించి అందరినీ ముగ్ధుల్ని చేశారు. ముందుగా శ్రీ చుక్కా శ్రీనివాస్ “ఖదీర్ బాబు కథల గురించి మాట్లాడుతూ పప్పుజాన్ కథలు, దర్గామిట్ట కథలు, పోలేరమ్మ బండ కథల నుండి అనేక అంశాల్ని వివరిస్తూ ఆసక్తిదాయకమైన ప్రసంగం చేశారు. తర్వాత శ్రీ పిల్లలమర్రి కృష్ణ కుమార్ “వేదాలు అపౌరుషేయాలా” అన్న అంశమ్మీద, శ్రీ కల్లూరి సత్య రామ ప్రసాద్ “హృద్యమైన తరి- పద్యమే సరి” , శ్రీ శ్రీ చరణ్ పాలడుగు “ఉపమా కాళిదాసస్య” అన్న అంశాల మీద ఉపన్యసించారు.
భోజన విరామానంతరం జరిగిన వీక్షణం రెండవ సెషన్ కు శ్రీమతి మంజుల జొన్నలగడ్డ అధ్యక్షత వహించారు.
వీక్షణం వార్షిక సాహితీ సంచికల ఆవిష్కరణలో సంచికను అందంగా పొందుపరిచి, రూపుదిద్దిన శ్రీమతి కాంతి కిరణ్ తో బాటూ సంచికకు సంపాదకత్వం వహించిన శ్రీ కిరణ్ ప్రభ, డా||కె.గీత, నిర్వాహకులు శ్రీ లెనిన్లు గార్లు పాల్గొన్నారు.
తర్వాత తెలుగురచయిత డాట్ ఆర్గ్ నిర్వాహకులు డా|| కె.గీత, శ్రీ సుభాష్ పెద్దు మాట్లాడుతూ ప్రతిరోజూ ఒక రచయితకు ఒక పేజీ చొప్పున తెలుగు రచయితలందరికీ అంతర్జాల భాండాగారాన్ని నిర్మిస్తున్న తెలుగు రచయిత వెబ్ సైటుకు తగిన వివరాలు తెలియజేయడం, ఆర్ధిక సాయం చేయడం ద్వారా సహాయ సహకారాలు అందించాలని అందరికీ సభా ముఖంగా విజ్ఞప్తి చేశారు.
ఆ తర్వాత జరిగిన “కథ- స్వరూప స్వభావాలు” చర్చా కార్యక్రమాన్ని శ్రీ తాటిపామల మృత్యుంజయుడు నిర్వహించారు. ఇందులో ప్రముఖ విమర్శకులు, వ్యాసకర్త శ్రీ ఎ.కె.ప్రభాకర్, ప్రముఖ కథా రచయిత శ్రీ శ్రీధర పాల్గొన్నారు. ఇందులో కథాశైలి, వస్తువు అన్న అంశాల మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది.
తరవాత డా|| తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం, శ్రీ సుబ్రహ్మణ్యం గార్లు రచించిన “జగమంత కుటుంబం” కథా సంకలనం, “శ్రీ శంకరాచార్య” పుస్తకాల ఆవిష్కరణ జరిగింది.
ఆ తర్వాత జరిగిన కవిసమ్మేళనంలో 18 మంది కవులు పాల్గొని కవిత్వపు విందుని అందజేసారు. ఈ కవి సమ్మేళనాన్ని శ్రీ రావు తల్లాప్రగడ నిర్వహించారు. ఇందులో శ్రీ తెన్నేటి మారుతి పాటతో ప్రారంభించారు. శ్రీమతి సుమలత మాజేటి స్వీయ పద్యాల్ని, శ్రీ సాయికృష్ణ ప్రార్ధనా శ్లోకాల్ని వినిపించగా, డా||కె,గీత వీక్షణం నిర్వాహకత్వాన్ని గురించి రాసిన “వ్యక్తి- శక్తి” అనే కవితను చదివి వినిపించారు.
తర్వాత శ్రీ పుల్లెల శ్యామసుందర్ ఆవకాయ మీద హాస్య పద్యం వినిపించారు. శ్రీ పొద్దుటూరి ఎల్లారెడ్డి గారు కాశ్మీర్ పద్యాల్ని, శ్రీ కల్లూరి సత్య రామ ప్రసాద్ కరుణాత్మక పద్యాన్ని, శ్రీ నాగ సాయిబాబా గ్రీన్ కార్డు అనే హాస్య ప్రధాన గేయాన్ని, శ్రీ రావు తల్లాప్రగడ ప్రేమ గురించిన గజల్ ని, శ్రీ సుభాష్ పూదోట నీలిమ అనువాద కవితలు, అభిరామ్ కవితల్ని, శ్రీ వనపర్తి సత్యన్నారాయణ శ్రీ ఉమర్ అలీషా గారి పద్యాల్ని, శ్రీ కిరణ్ ప్రభ గారి కవితల్ని, శ్రీ నార్లశెట్టి రవి హరిశ్చంద్ర పద్యాల్ని శ్రీ అనిల్ కుమార్ కాసేవార్ నిర్భయ చట్టాన్ని గురించిన కవితని, శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ చంద్రయాన్ గురించిన కవితని, శ్రీ లెనిన్ పునర్జన్మ కవితని, శ్రీమతి శారద వాన కవితని, శ్రీ రూపారాణి అమ్మ గురించిన పద్యాన్ని, శ్రీమతి ఫణి రాధాకుమారి వీక్షణాన్ని గురించి తమ తొలి కవితను వినిపించారు. అత్యంత విభిన్నమైన కవితలతో కూడిన కవి సమ్మేళనాన్ని సభలోని వారందరినీ అలరించింది.
చివరగా శ్రీమతి శారద కాశీవఝల నిర్వహించిన క్విజ్ అందరినీ అలరించింది.
ఈ సభకు విచ్చేసి, దిగ్విజయం చేసిన స్థానిక ప్రముఖులు, ఇండియా నుంచి విచ్చేసిన వక్తలు, సాహిత్యాభిమానులకు కృతజ్ఞతలతో వీక్షణం నిర్వాహకురాలు డా||కె.గీత వందన సమర్పణ చేసి సభను ముగించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked