వీక్షణం

వీక్షణం సాహితీ గవాక్షం-105 వ సమావేశం

వరూధిని

వీక్షణం-105 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా ఆసక్తిదాయకంగా మే 9, 2021 న జరిగింది.

ఈ సమావేశంలో శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీమతి గునుపూడి అపర్ణ గార్ల కథా పఠనం, కవిసమ్మేళనం జరిగింది.

కథాపఠనంలో ముందుగా శ్రీధర్ రెడ్డి గారు “మాతృప్రేమ” కథను చదివి వినిపించారు.
“పండు పండు ముసలమ్మ! గింత ఫాస్టు రోడ్డు మీద కారు నడుపుకుంట పోతాందా?”, “వేడిగాలి ఏమంత పెద్దగ లేదు గని, ఎండ మాత్రం సుర్రుమంటాంది” వంటి సంభాషణలతో తెలంగాణా యాసలో రాసిన డయాస్పోరా కథ మాతృప్రేమ. ప్రపంచంలో ఎక్కడైనా తల్లి హృదయం ఒక్కటే అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ రాసిన చక్కని కథ. పాత్రలు సహజ సంభాషణలతో కళ్ళ ముందు కదలాడినట్లు ఉండడం ఈ కథలో విశేషం.

తర్వాత అపర్ణ గారి కథ “సంకర్షణ” పెళ్ళికి స్వస్తి పలికి, సింగిల్ పేరెంట్ గా కోరుకుని మరీ మారుతున్న యువత గురించిన ఆలోచింపచేసే విలక్షణమైన డయాస్పోరా కథ. కథలో ఆద్యంతం రెండు సంస్కృతుల మధ్య సంఘర్షణని స్పష్టం చేస్తూ ఇప్పటి తరాన్ని వారి ఇష్టాలకు వదిలివేయక తప్పదనే ముగింపుతో కథకి బలాన్ని చేకూర్చారు రచయిత్రి.

ఈ కథలో తల్లి మానసిక వేదనని తెలతెల్లం చేస్తూ
“కొడుకులిద్దరూ పెరిగిపెద్దవాళ్లయి పెళ్లిళ్లు చేసుకుంటే కోడళ్ళు వస్తారుకదా అని ఎదురుచూస్తే, వీళ్ళకి పెళ్లీడు రావడం, అది మెల్లిగా దాటిపోవడం కూడా జరుగుతోంది. అది జరిగే ఆశ ఇప్పట్లో కనిపించడం లేదు. భర్తతో చెబుతే వాళ్లకి నచ్చినవాళ్ళని వాళ్ళే చూసుకుంటాం అన్నారుకదా, వాళ్ళమానాన వాళ్ళని ఉండనీక మనం అందులో వేలు పెడితే ఏదైనా బెడిసికొట్టిందంటే మళ్ళీ మనమే బాధపడాలి అంటూ కొట్టి పారేస్తారు. కానీ పిల్లలు పెద్దవాళ్ళయ్యారంటే మనమూ అయ్యేముగా. ఇంకా ఎన్నాళ్ళు వేచి ఉండాలి? ఇదే ఇండియాలో అయితే ఈ పాటికి పిల్లలిద్దరికీ పెళ్ళిలై పిల్లలు కూడా పుట్టి ఉందురు. ఇక్కడ అమెరికాలో పిల్లల్తో పెళ్లి విషయం మాట్లాడడమే తప్పు.” అని

కొడుకు నిర్ణయం వెనక ఆలోచనారాహిత్యాన్ని ప్రశ్నించే తల్లి మాటల్ని
“ఒక బాధ్యత గల వ్యక్తిగా తండ్రినవుతానని నిర్ణయించడానికి తగ్గ తాహతు శక్తి నీకు ఉన్నాయని మాకు తెలుసు. నీ నిర్ణయానికి అడ్డుపడే వాళ్ళం కాదని నీకు తెలుసు. కానీ శరత్, పిల్లలంటే నీ మనసులో ఇంత లేశభావం ఉన్నందుకు నాకెంతో సిగ్గుగా ఉంది. కనీసం పుట్టే పిల్లల పరంగా కొంచెమైనా ఆలోచించేవా? ఆ అమ్మాయో అబ్బాయో ఊహ తెలిసేక నాకు తల్లిని చూపించమంటే ఏమిటి నీ జవాబు? వారికి సంఘంలో ఎటువంటి గుర్తింపు ఉంటుంది. తోటి పిల్లలతో ఎటువంటి మాటలు ఎదుర్కోవాలి? వారు పడే క్షోభ, సంఘర్షణ, పూర్తిగా తల్లితండ్రులతో పెరిగిన నీకు అర్థం అవుతుందా?” అని

తమలోతాము సర్దిచెప్పుకుంటూ భర్త భార్యతో “మనమేమీ తప్పు చేయలేదు. వాడూ ఏమీ తప్పు చేయలేదు. వాడు చేస్తానన్న పని దుర్మార్గం కాదు. కానీ వాడు ఎంచుకున్న మార్గం మనకి తోచదు, ఈ జన్మకి అర్థం కాదు. చూడు, భారతంలో బలరాముడు పుట్టుక ఒక విచిత్రం. దేవకీ వసుదేవుల శిశుకణాన్ని దేవకీ గర్భంలోంచి ఆకర్షించి బయటికి తీసి రోహిణి గర్భంలో పెడితే ఆవిడ తానే కన్నతల్లిననుకుని పెంచి పెద్ద చేసింది. ఆ తర్వాత గాని నిజం బయట పడలేదు. అందుకే అతనికి మరో పేరు సంకర్షణ. తెలిసింతర్వాత ఎవరూ అదొక పెద్ద విషయంగా భావించలేదు. ఎలా చేశారన్న ప్రశ్నలనవసరం. క్రమేణా అటువంటి పద్ధతులు పూర్తిగా తగ్గిపోయేయి. అందుకని మనకి ఇది వింతగా అనిపిస్తోంది.” అన్న

బలమైన సంభాషణలు చదువరులను ఆలోచింపజేస్తాయి.

యాదృచ్ఛికమే అయినా ఈ రెండు కథలు మేనెలలో మాతృదినోత్సవం, జూన్ నెలలో పితృదినోత్సవాలకు సరిగ్గా అమరినట్లు ఉండడం విశేషం.

ఆ తర్వాత కవి సమ్మేళనం లో డా|| కె.గీత “యుద్ధసమయం” కవితను, శ్రీమతి ఉదయలక్ష్మి “అవనీమాతకు అక్షరమాల” కవితను, శ్రీ శ్రీధర్ రెడ్డి “బిచ్చగాడు” అనే కవితను చదివి వినిపించారు.

ఆద్యంతం ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో ఆసక్తి కలిగిన స్థానిక ప్రముఖులు పాల్గొని సభను జయప్రదం చేశారు.

వీక్షణం-105 వ సమావేశాన్ని “వీక్షణం” యూట్యూబు ఛానలులో ఇక్కడ చూడవచ్చు. https://youtu.be/40zNJK1mQIQ

————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked