వీక్షణం

వీక్షణం సాహితీ గవాక్షం- 75

వజ్రోత్సవ సమావేశం

-ఆర్. దమయంతి

కాలిఫోర్నియా బే ఏరియాలో నెలకొన్నవీక్షణం సాహితీ సంస్థ 75 మాసాలను పూర్తి చేసుకున్న శుభ తరుణాన వజ్రోత్సవ వేడుకలనుఎంతో ఘనంగా జరుపుకుంది.

మిల్ పిటాస్ లో నివసిస్తున్నరచయిత శ్రీ అనిల్ ఎస్ రాయల్ గారి స్వగృహం లో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.

ఆ నాటి సభలో పాల్గొన్న వారిలో తెలుగు సాహిత్యంలో ఘనాపాటీలు గా కీర్తింపబడుతున్నవారు, వేద పండితులు, విశ్వవిద్యాలయాల ఆచార్యులు, ప్రసిద్ధ కవులు, రచయితలు, విశేష విశ్లేషకులు,మధుర గాయనీ గాయకులు పాల్గొని , తమ తమ ప్రతిభాపాటవాలతోసభికులను రంజింప చేసారు.

సభని ప్రారంభిస్తూ, డా. గంగిశెట్టిలక్ష్మీ నారాయణ వీక్షణం వారి సాహితీ సేవలనుకొని యాడారు. ఆనాటి ప్రధానోపన్యాసకులు, కేంద్రసాహిత్య అకడెమీ అవార్డ్ గ్రహీతలు అయిన శ్రీ సదాశివ మూర్తి గారిని గారిని వేదిక మీదకి సాదరం గా ఆహ్వానించారు. శ్రీ సదాశివ మూర్తి గారు – రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ ఆచార్యులు. భాషా ప్రవీణులు. వేద శాస్త్రాల నించి ఆధునిక వచన కవిత్వం వరకుఏ అంశం గురించి అయినా అలవోకగా విశ్లేషించి వివరించగల ప్రతిభా మూర్తి. గొప్ప వక్త. సంస్కృతం తో బాటు ఆంగ్ల, తెలుగు సాహిత్య విశ్లేషణలో అనుభవజ్ఞులు.

వీరిని సాహిత్య శాస్త్రాచార్యులుగా అభివర్ణించారు.

శ్రీ సదాశివ మూర్తి గారు ఆధునికవచన కవిత్వం గురించి మాట్లాడుతూ, వచన కవిత్వం మూలాలు వేదాలలో దొరుకుతాయని ఉదాహరణలతో పేర్కొన్నారు.

పాద వ్యవస్థ లేని వచనం లో శబ్దసౌందర్యం చోటు చేసుకుని వినసొంపుగా వుంటుందని , నిజానికి ఆ ఆనందాన్ని కలిగించే శబ్దంపేరే చందస్సు అని పేర్కొన్నారు. ఓం – ఏక పాద చందస్సు అనీ, నాట్య శాస్త్రం లో చందస్సు2 రకాలు అనీ, పాద నియమం లేనిది అనిబధ్ధ చందస్సు అనీ – వివరించారు.

పద్యం, గద్యం, ప్రోజ్, రూపకాలు,నాటకాలు – ఈ ప్రక్రియలు సమస్తం వాంగ్మయ కావ్యంగా అభివర్ణిస్తూ, గద్యమూ చందస్సే అని అన్నారు. వృత్తగ్రంధి వచనాన్ని గద్యం గా పేర్కొనవచ్చన్నారు.చూర్ణ గద్యం గురించి వివరిస్తూ, వ్యావహారిక భాషలొ కవిత్వ ప్రక్రియ పశ్చిమ సాహిత్యంనించి దిగుమతి అయిందన్నారు. వేదాలు, ఇతిహాసాలు, కావ్య కాలం అనంతరం, జాన పద సాహితీ కళావైభవ కాలాన్ని వర్ణిస్తూ పదకవిత పితామహుడు అన్నమయ్య రాసిన పలు కీర్తనలలొని పదాల సౌరభాలనివెదజల్లారు.

జయదేవుని గీతగోవిందం విశిష్టతని వర్ణిస్తూ – సామానుయునికి సైతం అర్ధమయ్యేలాచక్కని కథని వినిపించారు.

తల్లి యశోదని అడుగుతాడట, బాలకృష్ణుడు. పాలు కావాలి అమ్మా అని. అప్పటికే బొజ్జ నిండి వుంది. ఇంకా తాగితే పసి వానికేమైనాఅవుతుందని తల్లి భయపడి, వొద్దంటుంది. ‘ఎందుకు వొద్దూ?’ అని మారు ప్రశ్నిస్తాడు పిల్లడు. పగలైపోనీ, చీకటయ్యాక ఇస్తాననిదాటేస్తుంది. అప్పుడా అల్లరి, కళ్ళు మూసుకుని, చీటైపోయింది, పాలివ్వమంటాడు.

వాని తెలివికి యశోద ఎంతగా మురిసిపోతుందనీ!?

సంస్కృతం లో ఈ వర్ణన అత్యంతద్భుతంగా, ఛందో బద్ధం గా వుంది, చెవులకు శబ్ద సౌందర్యాన్నిఅందిస్తూ, మనసుకి మనోల్లాసాన్ని కలిగిస్తూ భక్తి పార్వశ్యంలో ముంచి తేల్చుతుందని ఎంతో హృద్యం గా ప్రసంగించారు.

పద్యాన్ని సరళ సంభాషణ గా నిర్వచించారు.వేదాలలోని అష్టపాత్ ని గద్యం గా పరిగణించవచ్చన్నారు.

తిత్రీయం గురించి విపులీకరిస్తూ,సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ని ఉదహరించారు.

అపూర్వమైన గురు శిష్యుల అనుబంధాన్నివివరిస్తూ..మూడు రకాలు గురువులుంటారని, పూర్వ కాల గురువులు శిష్యులని తనయులుగా భావించేవావరనీ,అందుకు విశ్వామిత్ర వశిష్టులే మనకు ప్రత్యక్ష సాక్ష్యులన్నారు. ఆనాటి గురువులు ‘ శిష్య విత్తాపహరులు ‘కారన్న మాటలకు
సభలోని వారందరూ కరతాళ ధ్వనులతో తమ హర్షాన్ని తెలిపారు. విద్య కర్తవ్యాన్నీ, ధర్మాన్ని బొధించేదిగా వుండాలని, బహుజన హితమైన బోధనలవల్ల సమాజం లో శాంతి సమన్వయాలు నెలకొంటాయంటూ సత్యతత్వాన్నీ వినిపించారు.

పద్యాన్ని వ్యాకరణా వ్యాయమంతో రాసి మెప్పించవచ్చు కానీ గద్యం అలా కాదు, రాసి మెప్పించగలిగినప్పుడే గద్యం గ్లామర్నిలుస్తుందన్నారు.

వచన కవిత్వానికి మూలాలు – వర్ణన,ప్రభావ పరిమితి, స్థల పరిమితి, కాల పరిమితి, మమతా సామర్ధ్య పరిమితి గా విపులీకరించారు.

కవిత్వం ఆశయసిధ్ధి లక్షణాన్నికలిగి వుండటం వల్ల, కవి క్రాంతి దర్శి అవుతాడని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

శ్లోకం, పద్యం, గద్యం, కవిత్వం,వచనం ఏదైనా రసపూర్ణమై, తంత్రీ లయాకృతమై ధ్వనించాలన్నారు. వాల్మీకి నించి, నేటి ఆధునికకవుల వరకు వారి వారి రచనలలో ప్రవహించే పదాల పరుగుల వేగాన్ని ఒడిసి పట్టుకుని మచ్చుకకి కొన్ని పాదాలను గానించి వినిపించారు.

‘పడవ నడపవోయ్..పూల పడవ నడపఓయి..చిట్టిన తెర చాపనెత్తి గట్టిగా చుక్కాని బట్టి …’ అంటూ పద్యం గాను, కవితగానూ చదివీ, ఆ పిమ్మట అదే పాట గా పాడి పద ధ్వనులపట్టుని తేనె పట్టుగా పట్టి వీనుల విందు చేశారు.

కవిత్వం లో లయ ప్రాధాన్యత గురించివివరిస్తూ, మహా కవి ‘శ్రీ శ్రీ’ రగడలు, దేవులపల్లి లేత పదాలు, వింజమూరి సాహిత్య సొగసుల్నువఋనించారు.

అమెరికా లో నిర్వహిస్తున్నసాహితీ సభలు ఇండియాలో కంటే మిన్నగా, ఉన్నతం గా సాగుతున్నాయనీ, వీక్షణం వజ్రోత్సవ సభలోతన దీర్ఘ ప్రసంగాన్ని వినిపించే అవకాశం కలగడం ఒక అదృష్టం గా భావిస్తున్నట్టు చెప్పారు.

ఈ మహావకాశాన్ని కలగ చేసిన డా.కె.గీతా మాధవి గారికి తన ధన్యవాదాలు తెలియచేస్తూ,తమ పుస్తక కావ్యాన్ని గీత గారికి అందచేసారు.

అనంతరం శ్రీ ఎ.కె.ప్రభాకర్ గారి ప్రసంగం ఆరంభమైంది.

వీరు ప్రముఖ రచయిత, విశ్లేషకులు,సంస్కృత తెలుగు భాషా కోవిదులు. ప్రభాకర్ తన గురించి చెబుతూ.

తెలుగు మాండలీక కథా సాహిత్యపరిశోధనా క్రమంలో తెలంగాణా కథ తనని అమితం గా ఆకట్టుకుందనీ, ఆవేదన తో బాటు తన అన్వేషణాకొన సాగిందంటూ తన ప్రసంగాన్ని ఆరంభించారు ప్రభాకర్. కథా సాహిత్యం తో ఉద్యమం విజృభించిందా?ఉద్యమ సెగలలోంచి ఉద్యమ కథ పుట్టిందా? ఈ సత్య శోధనలొ తాను తెలుసుకున్న నిజాలను కొన్నిట్నివివరించారు. వారి మాటలని సభికులు ఎంతో నిశ్శబ్దంగా, ఆసక్తి కరం గా ఆలకించారు.

ఉద్యమాల కథలు అనేక ముఖాలు గావిస్తరించిందంటూ, వాటి స్వరూపాలను వివరించారు. సంస్కరణోద్యమం, వ్యావహారిక భాషోద్యమం,స్వాతంత్రోద్యమం, అస్థిత్వోద్యమాల గురించి పుట్టుపూర్వోత్తరాల గురించీ క్షుణ్ణం గావివరించారు.

ప్రజల్లారా మీరెటు వైపు? అంటూఅడిగిన ఒకే ఒక్క ప్రశ్న – విప్లవాత్మకమైన రాజకీయ పరిణామాలకు దారితీసిందని చెబుతూ,70 ల నాటి విరసం ఉద్భవం, ప్రభావం, నక్సల్ బరీ, విద్యార్ధుల ఉద్రేకం, దోపిడీవ్యవస్థ పై తిరుగుబాటు చేసిన విధానం గురించికళ్లక్కట్టినట్టు వివరించారు. ఈ ఉద్యమ ప్రచారం లో ప్రధాన పాత్ర పోషించినది ఉద్యమ సాహిత్యమనిపేర్కొన్నారు. కథ, కవిత్వం, పదం, జానపద గీతం, నాట్య దృశ్యా రచనం అంతా కూడా ఒక ప్రచారకళా రూపమని అభిప్రాయపడ్డారు.

ఆది భట్ల కైలాసం, భూషణం మాస్టార్రికథలను – ఉద్యమ సాహిత్యానికి ఉదాహరణలన్నారు.స్వాతంత్రోద్యమం తో అంతమవ్వాల్సిన బానిసత్వం, బడుగు వర్గాల అణచివేత, రాజకీయ చెదరంగం ప్రజలకి అవగాహనకొచ్చేసరికి 20 ఏళ్ళు పట్టిందన్నారు.

1967 లో రగిలిన విప్లవోద్యమంఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం గా చూపారు. శ్రీకాకుళంనించి పుట్టిన ఉద్యమం అక్కడ ఎందుకు తగ్గు ముఖంపట్టిందో, అది తెలంగాణా దిశగా ఎలా ప్రవహిస్తూ వచ్చిందో, ఆ ఉద్యమ విజృంభన ఎలా దద్దరిల్లిందో, ఉద్యమ సాహిత్యం ద్వారా ఎలా విజయాన్ని సాధించిందోఅంశాల వారీగా విశ్లేషించారు. చివరిమెట్టున విప్లవోద్యమం అనేక ఉద్యమాలు గా మారి ప్రధాన కేంద్ర బిందువు నిండి విడివడి, అనేకానేక ఉద్యమ వర్గాలుగా చీలిన మాట వాస్తవమన్నారు.

కొ.కు, కారా మాస్టార్ల కథ, నవలా సాహిత్యాలు, శ్రీ శ్రీ కవిత్వంలో చోటు చేసుకున్న పరిణామాలు,70 ల తర్వాత సాహిత్యం గీతాలలో ప్రాణం పోసుకుని పరుగిడిన వైనాలు, పాటలోనే కథా సాహిత్యాన్నిగుప్పించి, ప్రజలను చైతన్యవంతులుగా చేసిన శివసాగర్, 1972 నాటి జననాట్యమండలి, 74 రాడికల్స్టూడెంట్ యూనియన్, గ్రామలకు తరలండి, ప్రచారం చేయండంటూ పిలుపునిచ్చిన జయప్రకాశ్ నారాయణనాయకత్వం గురించి..ఇంకా అనేకానేక ఆసక్తికరమైన అంశాల గురించి ఉద్యమ సాహిత్య విశిష్టత గురించీప్రసంగించారు.

తన ఉద్యమ కథా సాహిత్య పరిశోధనలకోసం పలు ప్రాంతాలు పర్యటించి. పరిశోధించి తెలుసుకున్న సత్యాల గురించి చెబుతూ, 1940 లో తెలంగాణలో రైతుఉద్యమ ఉద్రిక్తత పరిస్థితుల గురించి ప్రస్తావించారు. గ్రంధాలయోద్యమం పుట్టుకనీ, దానిప్రాశస్త్యాన్ని పేర్కొన్నారు. అటు పిమ్మట భూస్వామ్య వ్యతిరేకోద్యమం- వెట్టిచాకిరీనిర్మూలన కి ఎంత గా దోహద పడిందీ చెబుతూ, అందుకు ప్రధాన నాయక పాత్ర పోషించిన దొడ్డి కొమరయ్య సేవలను కొనియాడారు.

రాజ్యాధికారం కోసం చేసే ఉద్యమాలనుప్రస్తావిస్తూ.. ఎం.వి.తిరుపతయ్య రాసిన న్యాయం కథని ఉటంకించారు.

ఉద్యమ సాహిత్యానికి చెరలు,రాజకీయ అధికారుల ఆటంకాలు, అవరోధాలు, ఆనకట్టలు, రచయితల అరెస్టులూ, చెరసాల పాలు చేసిపెట్టిన హింసలు భరించక తప్పలేదంటూ తన ఆవేదనని వ్యక్తపరిచారు.

‘న్యూవేవ్ ‘సంకలనం గురించివివరిస్తూ తాడిగిరి పోతరాజు ని అధికారులు టార్గెట్చేసిన మాట నిజమన్నారు.

ఎర్ర బుట్ట కవి నించి పతంజలిభావోద్రేకాలనీ, – రైతు ఉద్యమం నించి కార్మికోద్యమం, పని వేతనం, శ్రమ దోపిడీ కి వ్యతిరేకంగాజరిగిన పోరాటాలు, విప్లవాలు, సాధించిన విజయాలను వివరిస్తూ అందుకు కృషి సలిపిన రచయితలు- తుమ్మేటి రఘోత్తమరెడ్డి, అల్లం రాజయ్య, సత్యం,-
విప్లవ సాహితీ వేత్తలను పేర్లను పేర్కొంటూమరి ఒక ఆసక్తి కరమైన విషయాన్ని చెప్పారు.
అప్పట్లో దరిదాపు వెయ్యిమంది మేధావుల సమూహంప్రత్యమ్నాయ ప్రభుత్వాన్ని నడిపేదని న్యాయ పొరాటం చేసేదని అందుకు ఉద్యమ సాహిత్యమే ఒకపదునైన ఆయుధమని తెలియ చేపారు.

గిరిజనుల దోపిడి ఉద్యమం లోభాగం గా పుట్టిన సాహిత్యం గురించి చెబుతూ ‘ఇప్పుడు కాగితం చూసి ప్రజలు భయపడుతున్నారు నేను చెమట నించీ రక్తమ్నించీ పుట్టిన భాషనే మాట్లాడతాను..’అంటూ నిర్భయం గా ప్రకటించిన అల్లం రాజయ్య మాటలని, సాహిత్యోద్యమం లో తెలుగు అక్షరం పోషించిన అద్భుత అసామాన్య పాత్రనీ కొనియాడారు.

అసమానత్వం రాజ్యమేలుతున్నంతకాలమూ ఉద్యమాలు పుడుతూనే వుంటాయని, ఉద్యమ సాహిత్యం ఉద్భవిస్తూనే వుంటుందంటూ..ప్రసంగముగింపు వాక్యాన్ని పలికారు.

తనకీ అవకాశాన్ని కలిగించినవీక్షణం సాహితీ సంస్థకీ, వ్యవస్థాపకురాలికిప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రభాకర్ గారి ఉపన్యాసం ఆద్యంతమూ ఆసక్తికరం గా సాగింది. ఆ నాటి చారిత్రాత్మక విప్లవ సన్నివేశాలు, సంఘటనలు, విషాదాలుచోటు చేసుకున్న కారణం కావొచ్చు, సభికులు కదలకుండా నిశ్శబ్దం గా శ్రద్ధ గా ఆలకించారు.రెట్టించిన ఉత్సహాంతో కరతాళ ధ్వనుల ద్వారా తమ హర్షాన్ని తెలియచేసారు.

అనంతరం –

సభ కి విరామం ఇస్తూ అందరూ టీ,స్నాక్స్, సేవించారు. కారం, తీపి, పులుపు,ఫ్రూట్స్, టీ సేవిస్తూ కూడా సాహిత్యమమకార సంగతులే మాట్లాడుకున్నాం.

తాము రాసిన లేటెస్ట్ రచనల గురించో,చదివిన పుస్తకం గురించో పర్యటించిన ప్రదేశాల విశేషాల గురించో..గుంపులు గుంపులు గా ఎవరిటాపిక్ వారిదే అన్నట్టు..వింటున్న నాకు, నిజమైన తెలుగు వారి పండగ అంటే ఇది కదా అనిపించింది.

బ్రేక్ అనంతరం, ఎప్పట్లానేకిరణ్ ప్రభ గారి క్విజ్ కార్యక్రమం ఆరంభమైంది.

ఆప్షనల్ ఆన్సర్స్ కాబట్టి నేనూ ఉత్సాహం గా పాల్గొంటుంటాను. ప్రశ్నవేసి, ఆప్షన్స్ చదివాక వెంటనే జవాబు చెప్పకూడదు. జవాబు తెలిసిన వారు చేయెత్తి ఊరుకోవాలి. క్విజ్ మాస్టర్ శ్రీ మృత్యంజయుడు తమ చాయిస్ ప్రకారం ఎవర్నిజవాబు చెప్పమని అడిగితే వారే ఆన్సర్ చెప్పాలి. ఈ రూల్ ని నేనెప్పుడూ పొరబడిఅధిగమిస్తూన్నే వుంటా. 🙂

ఈ నెల క్విజ్ లో కూడా సరికొత్తవిషయాలను చొప్పించి, ప్రశ్నలు తయారు చేసారు కిరణ్ ప్రభ గారు .

విజేతలకు పుస్తకాల బహుమతులుంటాయి.నేనూ కొన్నిట్ని గెలుచుకున్నాను.

క్విజ్ కార్యక్రమానంతరం పాలపర్తివారు కమ్మని తెలుగు పద్యాన్ని వినిపించారు.

టెక్సాస్ నించి విచ్చేసిన రచయితశ్రీ ఇస్మాయిల్ పెనుగొండ క్లుప్తంగా మాట్లాడుతూ శుభాకాంక్షలనందచేసారు.

అనిల్ కాసావర్ ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటూ చక్కని కవితని చదివి వినిపించారు.

జి.వి.హరనాథ రావు గారు – తెలుగురాష్ట్రాల ముఖ్య మంత్రుల మీద హాస్య వ్యంగ్య బాణాలు విసురుతూ చదివిన కవిత సభికులను ప్రశంసలతోబాటు హాస్య చురకలనూ అందుకున్నాయి.

కార్యక్రమం లో భాగం గా ‘ సిరికోన ‘ వాట్సప్ గ్రూప్వారు అక్టోబర్ మాసాన సభ్యులతో కలిసి పంచుకున్న సాహిత్యం నించి ఉత్తమ రచనల ను ఏర్చి కూర్చి ఒక మాగజైన్ గా పబ్లిష్ చేసారు. సిరికోనప్రధమ సంచిక ని ఆవిష్కరిస్తూ, తమ పత్రిక ఆ నాటి ప్రతిష్టాత్మకమైన భారతి పత్రిక స్థాయిలో పాఠకులకు ఉత్తమ రచనలను అందచేయాలనేదే తమ ఆశయం గా పేర్కొన్నారు – ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ .సిరికోన ని నెల నెలా ఒక మాగజైన్గా వెలువరించడంలో తమ వంతు కృషి తాము చేస్తున్నామన్నారు- ఆడ్మిన్ మెంబర్స్ శ్రీ వేణు, శ్రీ చరణ్ ప్రసంగాలనంతరం డా.గీత గారి కవితా గానం, పలువురిపెద్దల వందనాభినందనల అభివందనలాతో..ఆనాటి వజ్రోత్సవ వేడుక మళ్ళీ వచ్చేనెలమొదలయ్యే నెల నెలా సాహితీ సందడి కోసం విరామాన్ని ప్రకటిస్తూ అక్కడితో ఆగింది. ఎందరో మహానుభావులు అందరకీ వందనములు.

***స్వస్తి.***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked