వీక్షణం

వీక్షణం 98

వీక్షణం-98 సాహితీ సమావేశం

-వరూధిని వీక్షణం-98 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా అక్టోబరు 18, 2020 న జరిగింది. ఈ సమావేశంలో శ్రీ సుభాష్ పెద్దు గారు “వరవీణ- సరస్వతీ స్వరూపం” అనే అంశం మీద ప్రధాన ప్రసంగం చేశారు.
“వరవీణా మృదుపాణి” అన్న పురందర దాసు కీర్తనని ప్రస్తావిస్తూ ముందుగా “వరవీణ అంటే ప్రస్తుతకాలంలో అందుబాటులో ఉన్న ఏ వీణ?” అనే విషయం మీద సోదాహారణంగా ఉపన్యాసం ప్రారంభించారు. వివిధ దేశాల్లో ఉన్న వీణలు, సరస్వతి స్వరూపాలను చిత్రాలతో బాటూ పరిశోధనాత్మకంగా శోధించి చక్కటి వివరణని ఇచ్చేరు.
ప్రాచీన కాలంలోని సరస్వతి స్వరూపాల్ని గుర్తు పట్టడానికి చేతిలో పుస్తకం, జపమాల, నెమలి లేదా హంస వాహనాలు ప్రత్యేక గుర్తులన్నారు. హళేబీడులోని జక్కన చెక్కినదిగా ప్రసిద్ధి గాంచిన సరస్వతి ప్రశాంత రూపానికి, ఆయనే చెక్కిన రుద్ర కాళికావతారానికి తేడాలు స్పష్టం చేసేరు. రవివర్మ చిత్రించిన సరస్వతి ముఖ కవళికలు, చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ లో చిత్రించిన రంగులు, విశేషాలు…. ” అంటూ అత్యంత ఆసక్తిదాయకమైన ప్రసంగాన్ని చేసేరు.
శ్రీ సుభాష్ పెద్దు గారి “వరవీణ- సరస్వతీ స్వరూపం” ప్రసంగాన్ని “వీక్షణం” యూట్యూబు ఛానలులో ఇక్కడ చూడవచ్చు. https://youtu.be/zqfEkKAx_Y8

తరువాత చాలా ఆసక్తిదాయకంగా జరిగిన చర్చా ప్రారంభంలో సుభాష్ గారి ప్రసంగంలో ప్రస్తావించిన “యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా” అన్న అగస్త్యుని సరస్వతీ ప్రార్థనని డా|| కె. గీత పాడి వినిపించారు. చర్చలో కిరణ్ ప్రభ, అపర్ణ గునుపూడి, ఉదయలక్ష్మి , లెనిన్, ఇక్బాల్ గార్లు పాల్గొన్నారు.
ఆ తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో శ్రీధర్ రెడ్డి గారు “వరద” అనే కవితను , దాలిరాజుగారు “బాలూగారి హరివిల్లులు” కవితని చదవగా, డా. కె.గీత “ఓయమ్మ గంగమ్మ దయసూడవమ్మో” అంటూ స్వీయ జానపద గీతాన్ని ఆలపించారు.
కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ అందరికీ ఉత్సాహాన్ని రేకెత్తించింది.
ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో స్థానిక ప్రముఖులు అనేకులు పాల్గొని సభను జయప్రదం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked