ధారావాహికలు

శ్రీ రామ సంగ్రహం

రాక్షసులు దేవలోకంపై దండెత్టటం

-అక్కిరాజు రామాపతి రావు

రాక్షసులకప్పుడు అనేక దుర్నిమిత్తాలు, దుశ్శకునాలు ఎదురైనా వాళ్ళు జంకలేదు. ముగ్గురు అన్నదమ్ములు అశేష రాక్షససేనతో పోయి దేవతలతో తలపడ్డారు. ఈ విషయం విష్ణుమూర్తికి మొర పెట్టుకోవటానికి దేవతలు, దూతలను పంపారు. శ్రీమహావిష్ణువు యుద్ధసన్నద్ధుడైనాడు. సుపర్ణు ఆయనను విక్రమోత్సాహంతో తనపై అధిష్టింప చేసుకున్నాడు. రాక్షసులకూ, విష్ణుమూర్తికీ మహా భయంకరమైన యుద్ధం జరిగింది. కొండమీద పెనువర్షం కురుస్తున్నట్లుగా మహావిష్ణువుపై రాక్షసులు బాణవర్షం కురిపించారు. అయినా విష్ణుమూర్తి ఏమీ చలించలేదు. ఆయన కూడా వజ్రసమానమైన బాణాలను రాక్షసులపై ప్రయోగించాడు. తన పాంచజన్యాన్ని పూరించి రాక్షసులపై విజృంచాడు. ఆ శంఖ ధ్వనికే గుండెలు పగిలి చాలామంది రాక్షసులు హతులైనారు. ఇట్లా వేల సంఖ్యలో రాక్షసులు యుద్ధంలో నిహతులైనారు.
రాక్షస సంహారం
శ్రీమావిష్ణువు ఆ రాక్షసులను శరభమృగం సింహాలనువలెను, సింహం ఏనుగులను వలెను తరిమివేయగా ఆ రాక్షసులు లంకకు పారిపోయారు. కానీ బీరంతో, క్రోధంతో విష్ణుమూర్తిని మాలి ఎదిరించాడు. అప్పుడు వాడి ధాటికి గరుడుడు కూడా సంచలించాడు. గిర్రున వెనక్కు తిరిగాడు గరుత్మంతుడు. దాంతో మహావిష్ణువుకు ఆగ్రహం కలిగింది. అట్లా పెడదిరిగి కూర్చుండే మాలిపై చక్రాయుధాన్ని ప్రయోగించాడు. దాంతో మాలి తల నేలకూలింది. అది చూసి మాల్యవంతుడు, సుమాలి తమ బలగాలతో

బతుకుజీవుడా అంటూ పారిపోయినారు. అయినా విష్ణుమూర్తి హతశేషులైన రాక్షసులను సంహరించటానికి వెంబడించి వాళ్ళను వదలలేదు. అప్పుడు మాల్యవంతుడు ‘పరుగెత్తి పారిపోయే శత్రువులపై అస్త్రప్రహారంతో వెంబడించటం ప్రతాపమా?’ అని విష్ణుమూర్తిని ఎత్తిపొడిచాడు, నిష్ఠూరా లాడాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు ‘శరణువేడి ఆశ్రయించిన వాళ్ళను రక్షించడం నా కర్తవ్యం కదా! అందువల్ల మిమ్ములనందరినీ పరిమార్చక తప్పదు’ అన్నాడు. దాంతో మాల్యవంతుడు, సుమాలి రోషంతో శ్రీమహావిష్ణువుతో ఘోరమైన పోరుకు తలపడ్డారు. విష్ణుమూర్తిపై శక్త్యాయుధాన్ని ప్రయోగించినా, శూలంతో ఎదురు నిలిచి పోరాడినా శ్రీమహావిష్ణువు బెదరలేదు. గరుత్మంతుడు తన పెనురెక్కలు విసిరి పెనుగాలి సృష్టించి రాక్షసులను సంక్షోభపెట్టాడు. దానితో అన్నదమ్ములిద్దరూ తమ బలగాలతో కాలిగి బుద్ధి చెప్పి లంకలో ప్రవేశించి దాక్కున్నారు’ అని అగస్త్యమహర్షి శ్రీరాముడికి, రావణుడి పూర్వవంశ్యులను గూర్చి చెపుతూ “రావణుడికన్నా వాళ్ళు మించినవాళ్ళు క్రూరపరాక్రములు. ఇటువంటి రాక్షసులను శీహరి ఒక్కడే వధించగలడు” అని కూడా చెప్పాడు. ‘నీవు సాక్షాత్తు పరంధాముడివి. కాబట్టే రావణాదులను సంహరించగలిగావు’ అని తెలియజేశాడు మహర్షి.

ఇక ఆ తరువాత కథ ఇట్లా చెప్పాడాయన. ‘విష్ణుమూర్తికి భయపడి ఇక లంక మాట తలపెట్టకుండా పాతాళానికి సపుత్ర, మిత్ర, భాందవంగా సుమాలి పలాయనమైనాడు. ఇట్లా లంకలో ఎవరూ లేకపోవటం చూసి కుబేరుడక్కడ తన నివాసాన్ని ఏర్పరచుకొన్నాడు. చాలాకాలం గడిచిన తర్వాత సుమాలి అందగత్తెయైన తన కూతురితో మళ్ళీ మర్త్యలోకానికి వచ్చి అక్కడక్కడ తిరుగుతూ వరాన్వేషణకు పూనుకున్నాడు. ఒక రోజున సుమాలి పుష్పకంలో విహరిస్తున్న కుబేరుణ్ణి చూశాడు. కుబేరుడప్పుడు తన తండ్రిని (విశ్వవసుణ్ణి) చూడటానికి వెళ్తున్నాడు. ఆ కుబేరుణ్ణి అట్లా చూసేప్పటికి సుమాలికి తమ భంగపాటు అంతా గుర్తు వచ్చి విచారం కలిగింది. అదీకాక రసాతలంలో ఉంటే తన కూతురైన ఈ అందాలకుప్పకు వివాహం చేసే దెట్లా? అని కూడా బాధపడ్డాడు. కూతురితో ఇట్లా అన్నాడు. ‘అమ్మా! పరమ సౌందర్యవతివి కాబట్టి నీవు అంగీకరిస్తావో లేదో అని నిన్ను తనకిమ్మని అడగటానికి నా దగ్గర కెవరూ రావటం లేదు. చూడు-ఈ కుబేరుడి వైభవం. నీకెప్పుడు పెండ్లై ఆ కుబేరుణ్ణి కూడా ధిక్కరించగల మనవడు నాకు పుడతాడా! అని ఉత్కంఠగా ఉంది నాకు. ఐశ్వర్యంలో, బాహుబలంలో, పరాక్రమంలో కుబేరుణ్ణి మించే కొడుకులు నీకు పుట్టాలి. ఆడపిల్ల పెండ్లి కోసం తండ్రి ఎంత పరితపిస్తాడో నీకు తెలియదు. పులస్త్యబ్రహ్మ వంశం చాలా గొప్ప వంశం. ఆ వంశంలో పుట్టాడు కాబట్టే

కుబేరుడికా దివ్యతేజస్సు, మహావైభవం, లోకపాలకత్వం లభించాయి. కాబట్టి నీవు కూడా పులస్త్యబ్రహ్మ కుమారుడైన విశ్రవసు మహర్షిని ఆశ్రయించు. ఆయన్ను వరించు’ అని బోధించాడు సుమాలి.

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked