సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

– టేకుమళ్ళ వెంకటప్పయ్య

ముగ్ధ నాయిక గురించి అన్నమయ్య చెప్పిన చక్కని కీర్తన గురించి తెలుసుకుందాం. ముగ్ధ అనగా ఉదయించుచున్న యౌవనముగలది. పండ్రెండేండ్ల వయసుగల యువతి అని నిఘంటువులు చెప్తున్నాయి. రామరాజ భూషణుడు తన కావ్యాలంకార సంగ్రహం లో ఇలా నిర్వచించాడు.

కీర్తన:

శా. ఆలాపంబున కుత్తరంబొసగ దాయాసంబునంగాని, తా

నాలోకింపదు; పాటలాధరమరందాస్వాద సమ్మర్ధ ముం

దాళంజాలదు; కౌగిలీయదు, తనూ తాపంబు చల్లాఱగా

నేలజ్జావతి ; త ద్రతంబు దయితాభీష్టంబు గాకుండునే?

అనగా అప్పుడే ఉదయించుచున్న యౌవనము గల స్త్రీకి బిడియము మొదలైనవి సహజంగానే ఉంటాయని చెప్పాడు. మనం భక్తి విషయానికి వస్తే… అన్నమయ్య ప్రతి పదమూ భక్తి రసస్ఫోరకమే అన్న విషయం తెలుస్తుంది. ఆది శంకరుల వారు వివేకచూడామణిలో “మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి” అంటాడు. అన్నమయ్య తను సర్వం సహార్పణ గావించి సృష్టించిన అనంత సాహిత్య నిధిని ఎన్ని వందల సంవత్సరాలైనా మనలను నిత్య నూతనంగా అలరిస్తూనే ఉంటాయి.
ముగ్ధ అయిన నాయిక నాయకునితో పలికే పలుకులు అన్నమయ్య బహు చిత్రంగా అభివర్ణిస్తాడు ఈ కీర్తనలో. సిగ్గులొలుకుతూ ముద్దు ముచ్చటలాడుతూ అమ్మ “చిత్తమెరుగక లోలో సిగ్గుతోడ నున్నదాన” అంటూ శ్రీనివాసునితో పలికే పలుకులు మనమూ విందాం.

కీర్తన:

పల్లవి: చిత్తమెఱగక లోలో సిగ్గుతోడ నున్నదాన
హత్తినాకు నన్నిటికీ నప్పణియ్యవయ్యా.
చ.1. సందడించి నీతోను సరసములాడగాను
అందరిలో మందెమేళ మనవుగదా
చెందిన వూడిగాలు నీకు జెలరేగి సేయగాను
యెందుకో లాచీనని యెంచవు గదా ||చిత్త||
చ.2. గుట్టుతోడ నేపొద్దు కొలువులు సేయగాను
అట్టె వలపించవచ్చె ననవు గదా
చుట్టి చుట్టి నీతోను సుద్దులెల్లా జెప్పగాను
బట్టబయ లీతలని భావించవు గదా ||చిత్త||
చ.3. సరుస గూచుండి మోవిచవులు నిన్నడుగగా
అరుదంది ఆసకత్తె ననవు గదా
ఇరవై నన్ను శ్రీవేంకటేశ ఇట్టెకూడితివి
వొరసితే చన్నులకు నొడ్డించుకోవుగదా ||చిత్త||

(రాగం: దేశాక్షి; శృం.సం.సం 28; రాగి రేకు 1815; కీ.సం.83)

విశ్లేషణ: ఈ కీర్తనలో శ్రీవేంకటేశ్వరుడు నాయకుడు, నాయిక ముగ్ధ నాయకుని గూర్చి మాట్లాడుతూ “స్వామీ మీ మనసు తెలియదు నాకు లోపల చాలా సిగ్గుగా ఉన్నదాన్ని. నేను మీ దరిజేరి చనువుతో ఏమైనా అన్నా, తెలీని కృత్యాలు చేసినా, నన్ను అన్యదా భావించవు గదా…నలుగురిలో నన్ను అపహాస్యంపాలు చేయవుగదా” అని అమాయకంగా ముగ్ధ స్వామిని ప్రశ్నించడం ఈ కీర్తనలోని విశేషం. ముగ్ధ నాయికలకు అంతా బిడియమే! అన్నీ అనుమానాలే! అని నిరూపిస్తూ అన్నమయ్య రాసిన చక్కని శృంగార సంకీర్తన.

పల్లవి: చిత్తమెఱగక లోలో సిగ్గుతోడ నున్నదాన
హత్తినాకు నన్నిటికీ నప్పణియ్యవయ్యా

నాయిక ముగ్ధ అమాయకురాలు. స్వామీ మీ మనసులో ఏముందో తెలీదు. నాకు మాత్రం లోపల లోపల చాలా సిగ్గు వేస్తోంది. నా విషయం కాస్తా పట్టించుకుని నాకు నీ సేవలకు, అనుమతినియ్యవయ్యా! అని అడగలేక అడగలేక మొహమాటంతో అడుగుతూ ప్రాధేయపడుతోంది.

చ.1. సందడించి నీతోను సరసములాడగాను
అందరిలో మందెమేళ మనవుగదా
చెందిన వూడిగాలు నీకు జెలరేగి సేయగాను
యెందుకో లాచీనని యెంచవు గదా

స్వామీ! తొందరపడి నీతో సరసమాడినట్లైతే, నలుగురిలో నన్ను పరిహాసం చేయవు కదా! నీకు సేవ చేయాలన్న ఆతురతతో చేసిన పనులన్నిటినీ భారంగా ఎంచవు కదా!

చ.2. గుట్టుతోడ నేపొద్దు కొలువులు సేయగాను
అట్టె వలపించవచ్చె ననవు గదా
చుట్టి చుట్టి నీతోను సుద్దులెల్లా జెప్పగాను
బట్టబయ లీతలని భావించవు గదా

స్వామీ! నీ సేవ చేసి తరిద్దామని నేను ప్రతిరోజూ చేసే కొలువును నిన్ను మోహింప జేయడానికి మాత్రమే వస్తున్నట్లు భావించవు కదా! నీ చుట్టూ తిరుగుతూ ఏవో నాలుగు మంచి మాటలు సరదాగా చెప్పడానికి యత్నిస్తే ఏమిటీ మాటలని ఎగతాళిగా మాట్లాడవు కదా!

చ.3. సరుస గూచుండి మోవిచవులు నిన్నడుగగా
అరుదంది ఆసకత్తె ననవు గదా
ఇరవై నన్ను శ్రీవేంకటేశ ఇట్టెకూడితివి
వొరసితే చన్నులకు నొడ్డించుకోవుగదా

స్వామీ! నీ వద్ద కూర్చున్న ఏకాంత సమయంలో నీతో తీయని అనుభూతులు కోరితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆశకత్తెను అనే ముద్ర వేయవు కదా! ఓ శ్రీవేంకటేశ్వరా! నెలకొని నాపై ప్రేమాతిశయం చూపిస్తూ ఉన్నావు, ఒక వేళ నీ కౌగిలి సుఖం కోరితే తప్పించుకొని పారిపోరు కదా! చెప్పండి! అని చమత్కరిస్తోంది అలమేలుమంగ.

ముఖ్యమైన అర్ధాలు:

చిత్తము= మనసు;

హత్తి= అంటుకొని, పట్టించుకొని;

అప్పణి= అనుమతి;

సందడించి= తొందరపడి, అతిశయించి;

మందెమేళ= చనువుతో ఆడు పరిహాసము;

వూడిగము= సేవ; లాచు= పొందు,

లాచి= భారము;

పొద్దుకొలువు = దినదినముచేసేసేవలు;

సుద్దులు= మంచిమాటలు;

అరుదంది= ఆశ్చర్యపడి;

ఇరవై= నెలకొని;

వొరసితే= రాచుకున్నట్లైతే;

ఒడ్డించు= తప్పుకొను.

విశేషాలు:

అన్నమయ్య కొన్ని అరుదైన మాటలు, అంటే ఇప్పట్లో వాడుకలో లేని కొన్ని జాతీయాలు ఇందులో వాడినట్టు తోస్తున్నది. “అందరిలో మందెమేళ మనుట”, “బట్టబయలీతలు” మొదలైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked