తెలుగు తల్లి
సేకరణ:నిహారిణి
1975 సం||లో ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభలు హైద్రాబాదులో జరిగినవి. భారతదేశంలో భరతమాత ఎలాగో మన తెలుగుదేశానికి తెలుగుతల్లి ఉండాలని ఆనాటి ముఖ్యమంత్రి శ్రీవెంగళరావుగారి ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయించించినది. తెలుగుతల్లి చిత్రాన్ని ఆనాటి కమిటీలోని సభ్యులైన మంత్రివర్యులు శ్రీ మాడలి కృష్ణారావుగారు, దేవులపల్లి రామానుజ రావుగారు, దాశరధిగారు, డా||సి. నారాయణ రెడ్డిగారు, బిరుదు రామరాజు మరియు ఇతర ప్రముఖులు శ్రీ కొండపల్లి శేషగిరి రావుగారే సమర్ధంగా చిత్రించగలరని నిర్ణయించి వారికి అప్పగించారు.
శేషగిరి రావుగారు ఆ వర్ణ చిత్రాన్ని వేయడానికి ముందు ఆనాటి కవులు, పండితులు, సాహితీవేత్తలతో చర్చించి సలహాలు తీసుకొని తెలుగుతల్లి రూపు ఎలావుండాలోఅని ఈ క్రింద తెలియపరిచిన నోట్సును సమగ్రంగా వ్రాసుకొని చిత్రించారు.
ఈ నోట్సును ఎందుకు పొందుపరుస్తున్నామంటే అతను ఒక చిత్రాన్ని వేసే ముందు ఎంత విషయసేకరణ చేస్తారో తెలియపరచడానికి మాత్రమే.
తెలుగుతల్లి తరతరాల తెలుగుజాతికి జాతీయ చిహ్నరూపముగా ఉండి మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సంధర్భంగా అనేక పండితులు, చిత్రకారుల మనోభావాలలో నుండి, కల్పనారూపంలో వెలువడిన ఒకానొక ఊహాచిత్రం.
తెలుగుతల్లి రూపంలో ఉండవలిసిన కొన్ని మౌలిక లక్షణాలు
1. ఆకృతిలో (FORM)
2. విషయములో (CONTENT)
3. గుణసముదాయములో(CHARACTER)
ఆకృతి:- భౌగోళికంగా తెలుగు దేశం - చారిత్రక చిహ్నాలు, ఇతర రాష్ట్రాలకు లేని ప్రత్యేకతలు, నదులు, పశుపక్ష్యాదులు, వాస్తువు, వేషభాషలు, వర్ణాలు, అలంకారాలు, పంటలు, ధాన్యం, పూలు, పండ్లు వగైరా.
విషయ విజ్ఞానం:- భాష, లిపి, కవిత్వం, కావ్యాలు, మహాకవులు, వేదాంతములు, మతములు- జైన, బుద్ధ, లింగాయత, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత ప్రాబల్యములు, వాటి చిహ్నములు, ప్రాచీన యుగము నుండి నేటికీ అనూచానముగా సాగుచున్న, మిగిలియున్న, నశించిన వాని చిహ్నాలు.
గుణ సముదాయం:- స్త్రీ రూపంతో కూడినది. 1. స్త్రీ రూపమే ఎందుకు ఉండాలి:- దీనికి జవాబుగా - మాతృత్వం ప్రేమకు చిహ్నం-శక్తి స్వరూపం-తన తనయులందు గుణదోషములు రెండింటినీ సమానముగా రూపొందించి, పెంపు చేసే గుణములుగలదు కనుకనే తల్లి రూపము తగినదిగాయుండును. 2. తల్లి లక్షణములలో- ఉన్నత కుచములు, పూర్ణత్వముకలిగి నిండుగా ఉండవలయును. సౌష్టవమైన (ఫృఓఫోఋటీఓణాటే) అంగాంగములు, దేహము, విశాల నేత్రములు, ప్రసన్న వదనము, నవరసభరితములైన అంగములు-ముఖమందు-కన్నులు+పెదవులయందు తృప్తి, ప్రసన్నత, దయాగుణములు ఉండి, సమభంగిమలొనుండవలయును. నడుము అతిసన్నముగానుండకూడదు. పొట్టపై త్రివళులు ఉండీఉండనట్లు, పొత్తికడుపు మరీ ఉబ్బుగాలేకుండన్నట్లుండవలయును.
కటిక్రింద భాగము పోనుపోను విశాలమై పిరుదులనుండి తగ్గుముఖము పట్టవలయును. తొడలు అరటిబొదలవలెనుండి చీరచేకప్పబడియుండును. మోకాళ్ళు, కాళ్ళ మడమలవరకు చీరెయుండవలెను. స్థనవల్కలమైనను, రవికెయైనను ఉండవచ్చును. చీరకొంగు ఒకటి అర్ధస్థనముపైనుండి ఉరారక భాగము మోకాలుపైనుండి, రెండుకొంగులు (భోఋడేఋ డేశీఘ్ణ్) రెండు నదులుగా గోదావరి, కృష్ణా నదులను తలపింపచేయవలయును. బార్డరు డిజైనులో చేపలు (జలచరములు) నామమాత్రముగా సూచింపబడవలయును.
3. శిరస్సు, వేణీ మండలము:- కేవలం కోలముఖంగానూ, పూర్తిగా గుండ్రంగానూ కాక-మధ్యస్త అండాకారముగానుండి, పెదవులు దొండపండువర్ణముకలిగి ఉండవలయును. విశాలవదనముగలిగి తలపై నాగఫణి రూపంలో కిరీటము, నాగఫణిపై కోహినూరు వజ్రము (ఇది తెలుగు వారి చారిత్రక సంపద కనుక)ఉండవలయును. తెలుగువారిది నాగజాతి కనుక నాగఫణిసంపన్న యోగ్యమైనది. తలనుండి నల్లని జడ త్రాచుపామువలె మోకలివరకు వేళ్ళాడుచు, వాని నడుమ అనేక బంగారు అలంకారములు, కుచ్చులుండవలయును. ఇది కూచిపూడి భాగవతులచే ప్రత్యేకముగా సత్యభామ వేషంలో ఉవయోగించుట ఆచారమైయున్నది. ఇది ఆంధ్రుల ప్రత్యేకాలంకరణం. మెడలో ముత్యాల హారాలు, మల్లెపూదండలు-కాటుకకండ్లు, ముక్కు బలాకి, కర్ణకుండములు, దానిలోనున్న ఎఱ్ఱని వజ్రములను దానిమ్మగింజలుగా భావించి కొరకుటకుద్యమించుచున్న చిలుక, భుజముపైన ఉండుటయుక్తము. చిలుక పలుకు మాధుర్యము తెలుగు పలుకు మాధుర్యానికి శృంగారమునకు చిహ్నముగానుండును.నొసట కుంకుమ, సూర్యచంద్రాదులను తలపింపచేయు రెండుబంగారు బిళ్ళలు, నాగకిరీటమునకునిరువైపులా ఉండవలెను.
ఈ పై వర్ణనయే తెలుగుతల్లి చిత్రాన్ని గావించిన శేషగిరిరావు పాండిత్యపటిమకు కూడా నిరూపితమైనది. ఆనాటి తెలుగువారి నౌకాయానప్రావీణ్యత, అమరావతి శిల్ప సంపద, విఙ్ఞానభాండాగారంగా, దేశానికి ధాన్యాగారంగా అలరారుతున్న తెలుగు నేలని ప్రతిబింబిస్తున్న పూర్ణకుంభం ఈ చిత్రంలో ప్రాణంపోసుకున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభలలో శేషగిరిరావు చిత్రించిన తెలుగుతల్లి బొమ్మనే మొమెంటోలుగా వరంగల్ జిల్లా పెంబర్తి గ్రామంలో ఇత్తడి విగ్రహాలు తయారుచేసే కళాకారులతో విగ్రహాలు తయారు చేయించి రాష్ట్రప్రభుత్వం తరఫున సన్మానితులకు బహూకరించారు. ఈ చిత్రం ద్వారా వచ్చిన పాపులారిటీని ఓర్వలేక విమర్శలు చేసి, వేరొకరితో తెలుగుతల్లి చిత్రం వేయించారు. అప్పటి రాష్ట్ర అసెంబ్లీలో ఈ విషయంపై చాలా చర్చలు జరిగాయి. తల్లిని తల్లిగా చూడలేని కొందరి విమర్శల కారణంగా ఈ చిత్రాన్ని అధికారికంగా మార్చేసారు. ఇప్పుడున్న తెలుగు తల్లిపై కూడా బక్కచిక్కిఉందనీ అంగసౌష్టవంలేదని కూడా విమర్శలు వచ్చాయి.
ప్రస్ఫుటమైన నిదర్శనముతో శేషగిరిరావు చిత్రించిన చక్కని తెలుగుతల్లిని అధికారికంగా తొలగించారని తెలిసి వారేకాక ఎంతోమంది కళాకారులు, అభిమానులు, మనస్థాపానికి గురయ్యారు. ఈ అద్భుతమైన చిత్రం ఇప్పటికీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలములోని గోడౌన్లో పెట్టారు. ఈ చిత్రం కొంత భాగం చిధ్రమైనది. కనీసం ఈ వర్ణచిత్రాన్ని మ్యూజియములోకూడా పెట్టలేదని తెలిసి కళాభిమానులు ఆవేదన వ్యక్తంచేశారు.





























