ఎంతగా చేతులు సాచి ఆహ్వానించినా
మనకంటూ కావల్సింది
కాస్తంత ఉనికి, కొన్ని అడుగుల నేల
జీవితాన అన్వేషణ మొదలై
తాల్చిన ఆకారాలు
ఈసృష్టిలోని ఆలోచనాలోచనాలు
కలగలిపిన నదిలో ఇసుక వంపులవలె
మలుపు తిరుగుతోంది మానవజీవితం.
ప్రతినిముషం గమ్యం చేరాలనే తపనతో
హఠాత్తుగా వీచిన ఈదురుగాలికి తట్టుకుని
శాంతించిన సముద్రంలా వుంది మనిషి హృదయం
చీకటికి తెలియదు సూర్య్ని ప్రకాశం
రాతి గుహలకూ పక్షిగూళ్ళకూ తెలియదు ఆకాశ వైశాల్యం
మనిషి పుట్టుకకు తెలియదు ....జీవిత పరమార్థం
ప్రపంచపు నీలి నీడలలో
కక్షల కొండచిలువల ఆంతర్యం
పట్టపగలే పచ్చిమాంసంతో కడుపునింపుకుంటున్న ఆనందం
నెత్తుటితో స్నానించి కూర్చున్న కొమ్మనే తెగనరుక్కుంటున్న వైనం
ఆధునిక వేదికపై అత్యాశ తోడురాగా
నడివీధిలో చేస్తున్న రాక్షస నృత్యం
ఒకవైపు నిలువ నీడలేని పేదరికం
మరోవైపు బూఱుగుదూదిపై చలికాచుకుంటున్న దాంభీకం
అమాయకులను అంతమొందిస్తున్న అమానుషం
వర్తమాన శిరస్సుతో భవిష్యత్తుతో పనిలేక
పాతాళంలో కూరులుపోతున్న పాతక పరిపాలనం
పుట్టిన ప్రతి బిడ్డకు రంగును, రుచిని గూర్చిన
పరిచయం చేయాల్సిన అవసరం
వెరసిన చీలిన జీవితాల నుండి వెలువడుతున్న అస్పష్టపు
ఆక్రందనల రహస్యం...?
కష్టంలో గుండె రాయి అవుతుంది
ఆనందంలో మట్టి ముద్ద అవుతుంది.వెన్న అవుతుంది
ఇపుడు మనం బ్యాంకులో దాచాల్సిన ధనం కాదు
కాస్తంత మనశ్శాంతి..మరికొంత విశ్రాంతి
బతుకు రైలు దారిలో వాలుతున్న మృత్యువు రెక్కలు
పైశాచిక వస్త్రాలచే కప్పబడి
వెలుగుల చివరలను వెనక్కి నెడుతూ రేపటి రోజుకు
కొత్తముఖాల్ని అతికించేందుకు ప్రయత్నిస్తున్న ఉషోదయాన
సమయాన్ని సాగదీసి జీవన సాగరాన్ని ఈదుతున్న
నాగరిక భావకులు నేటి మానవులు....
సముద్రలో ఎంత కదలిక వున్నా ముందుకు తప్ప వెనక్కిపోదు
మనిషిలో ఎంత ఆవేశమున్నా, వినాశమే కానీ విజ్ఞత వుండదు
ప్రమాదానికి రాత్రే అక్కర్లేదు....హింసకు చీకటితో పని లేదు
పట్టపగలు నడిరోడ్డులో పారే రక్తపుటేరుల్ని చూస్తూ
భరతమాత గజగజలాడుతోంది
వృద్ధాప్యంతో వీధిలైట్ల వెలుతురుతో
పసితనపు మనస్థత్వాలతో
అకాలపు మరణం పొందిన అనాధ బాలుడిలా
ఎంతమాత్రం కదలని గుండె గడియారాన్ని చేతిలో పట్టుకుని
కాలం బాగుపడుతుందేమోనని ఎదురుచూడటం
మానవత్వం నడచి వస్తుందని ఆశించడం
చేతిలోకి అందిన నీరు లాంటిదే..
మానవత్వం కోసం తపించే అక్షరాంజలి లాంటిదే...
మానవ ఇతిహాసంలో కనపడని హాసం లాంటిదే...





























