కాళిదాసు రఘువంశం - రెండవ భాగం
మొదటి భాగానికై ఈ లంకెను అనుసరించండి
అజుడికి భోజుడు సకల మర్యాదలు చేసి విడిది ఏర్పాటు చేసాడు. మరునాడు స్వయంవర మండపానికి వెళ్ళాడు. అక్కడ అనేకమంది రాజులు ఆశీనులై ఉన్నారు. విదర్భరాజు ఉన్నతాసనం చూపగా అజుడు దానిని అలంకరించాడు.
ఇందుమతీ దేవి మేనాలో స్వయంవరానికి వచ్చింది. అందమంతా రాసిపోసి ఆమెను సృష్టించాడు బ్రహ్మ. రాకుమారులంతా వళ్ళంతా కళ్ళు చేసుకుని ఆమెను చూచారు. వివిధ రాకుమారుల వంశాలగురించి, చరిత్రలగురించి సునంద అనే ద్వారపాలికురాలికి బాగా తెలుసు. మంచి వాక్చాతుర్యంగల ఆమె ఒకొక్కరిగురించి ఇందుమతికి తెలియజేస్తూఉంది.
మగధ రాజు పరంతపుడు, అంగదేశాధీశుడు, అవంతి రాజు త్వష్పం, అనూపదేశాధీశుడు ప్రతీపుడు, శూరసేన దేశాధిపుడైన సుషేణుడు, కళింగరాజైన హేమంతుడు, దేవరాసముడైన నాగపురాధీశుడు - ఇలా అందరినీ పరిచయం చేస్తూ అజమహారాజు దగ్గరకు వచ్చింది. అజుని చూచిన ఇందుమతి మొహంలో భావాన్ని గ్రహించిన సునంద 'రాకుమారీ! ఇక్ష్వాకు కులంలో కకుత్సరాజు పుట్టాడు. ఉత్తరకోసల రాజులకు కకుత్సరాజులనే పేరు. ఆ కకుత్సరాజు వృషభ రూపంధరించిన ఇంద్రునిపై కూర్చుని రాక్షసులను సంహరించాడు. ఇంద్రుడు కకుత్సరాజును తన ప్రక్కన అర్ధ సింహాసనంపై కూర్చోబెట్టి గౌరవించాడు. అలాంటి కకుత్సరాజవంశంలో కులదీపకుడూ, కీర్తిశాలి అయిన దిలీపుడు పుట్టాడు. తొంభైతొమ్మిది అశ్వమేధయాగాలు చేసి, ఇంద్రుని కోరికపై నూఱవ యాగం మానివేసాడు. ఆ దిలీపమహారాజు కుమారుడు రఘుమహారాజు. ఆయన విశ్వజిత్తు అనే గొప్ప యాగం చేసి చివరకు మట్టిపాత్ర మాత్రమే మిగుల్చుకుని పద్నాలుగు లోకాలలోనూ కీర్తి పొందాడు. ఆ రఘుమహారాజుకు ఇంద్రుడికి జయంతుడు కలిగినట్లుగా ఈ అజమహారాజు కలిగాడు. ఇతడు నీకు సరిసమానుడు. మీ ఇద్దరి సంయోగం బంగారంలో పొదిగిన రత్నంలా రాజిల్లుతుంది' అని యుక్తిగా చెప్పగానే, ఇందుమతి చేతిలోగల పూలమాలను అజమహారాజు మెడలో వేసింది. అన్నివిధాల తగిన ఆ వధూవరులను చూచి పురజనులంతా సంతోషించారు.
విదర్భరాజు తన సోదరి ఇందుమతికి అజుడుకి మహావైభవంగా పెండ్లి జరిపించాడు. రాజులందరినీ యధోచితంగా గౌరవించాడు. పైకి సంతోషం వ్యక్తం చేస్తూ విదర్భరాజుకు కానుకలు సమర్పించి వెళ్ళిపోయారు. అయితే ఆ రాజులు ఇందుమతీ దేవిని అపహరించుకు పోవాలని ముందే కుట్రపన్ని ఉన్నారు. వాళ్ళంతా ఒక రహస్య సంకేత స్థలంలో అజమహారాజు ఇందుమతితో ఎప్పుడు వస్తాడా అని కాచుకుని ఉన్నారు.
విదర్భరాజు పెండ్లికుమార్తెకు ధనద్రవ్యాలు అరణంగా ఇచ్చి వధూవరులను అయోధ్యకు సాగనంపుతూ మర్యాదకోసం తానుకూడా కొంత దూరం వారిని అనుసరించాడు. మూడురోజుల ప్రయాణం తరువాత అజునివద్ద శెలవు తీసుకుని వెనుకకు మరలాడు. ఆసమయం కనిపెట్టి తక్కిన రాజులు, ఇందుమతితో వెడుతున్న అజమహారాజును అడ్డగించారు. అప్పుడు గొప్ప యుద్ధం జరిగింది. ఇరువైపులవారూ ఒకరినొకరు తీసిపోకుండా అంతలో గెలుపు మరల అంతలో ఓటమి అన్నట్లు జరుగుతూ ఉంది. చివరకు అజుడు పూర్వం ప్రియంవదుడనే గంధర్వునివలన తాను పొందిన గాంధర్వాన్ని ప్రయోగించాడు. వెంటనే శత్రుసేనలన్నీ ఎక్కడివక్కడ స్థభించిపోయాయి. అజుడు నెత్తురుతో తడిసిన బాణాలతో శత్రువుల జండాలపై 'రఘుమహారాజు కుమారుడు మీ కీర్తిని మాత్రం హరించాడు. కాని మీ ప్రాణాలను సంహరించలేదు' అని వ్రాసి, ఇందిమతితో తిరిగి ప్రయాణం సాగించాడు.
సాటిలేని కన్యారత్నంతోనూ, విజయలక్ష్మితోను మరలి వచ్చిన కుమారుని రఘుమహారాజు అభినందించి ఆలింగనం చేసుకున్నాడు. ఆ నూతన వధూవరులు తనకు నమస్కరించగా వారిని ఆశీర్వదించాడు. రాజ్యభారం కుమారునికి అప్పగించి అరణ్యాలకు బయలు దేరాడు. అజమహారాజు తండ్రిపాదాలపై పడి తనను వదలి వెళ్ళవద్దని ప్రార్ధించాడు. ఇందుకు ముసలిరాజు సన్యాసాశ్రమం స్వీకరించి పట్టణం వెలుపల ఉంటూ తన కుమారుడు, కోడలు చేసే ఉపచారాలను స్వీకరించాడు.
ధర్మ చింతనకై రఘువు ధర్భాసం అధిష్టించగా, ప్రజాపాలనకై అజుడు ధర్మసింహాసనం అధిష్టించాడు. కుమారుని కోరికపై కొన్ని సంవత్సరాలు గడపిన రఘుమహారాజు బ్రహ్మ ఙ్ఞాని అయి సర్వం బ్రహ్మ మయంగా చూచాడు. చివరగా యోగసమాధిలో పరమాత్మయందు ఐక్యమైనాడు.
ఇందుమతీదేవి ఒక కుమార రత్నాన్ని ప్రసవించింది. పెద్దలు అతనికి దశరథుడని పేరు పెట్టారు. ఒకరోజు అజమహారాజు ఇందుమతీదేవితో నగర వెలుపల ఉన్న ఉద్యానవనంలో విహరిస్తునాడు. అప్పుడు ఆకాశ మార్గాన వెడుతున్న నారద ముని వీణనుంచి జారిన దివ్య పుష్పం ఇందుమతీదేవి స్థనాగ్రములపై పడింది. వెంటనే ఆమె ప్రాణాలుకోల్పోయి నేలవాలిపోతూ తనతో పాటు తన భర్తనుకూడా నేల కూల్చింది.
పరిజనుల ఉపచారాలకు కొంతసేపటికి అజమహారాజుకు తెలివి వచ్చింది. అచేతనంగా పడివున్న తన ప్రియురాలను చేతులతో లేవనెత్తి ఒడిలో ఉంచుకుని ఎన్నోవిధాల తలచుకుని ఎంతగానో దుఃఖించాడు. పదిరోజుల తరువాత భార్యకు అంత్యకర్మలు విధిగా నిర్వర్తించి మహారాజు దుఃఖముతో నగరములోకి వచ్చాడు. వశిష్ఠ మహర్షి యాగ దీక్షలో ఉన్నాడు. ధ్యానంలో ఆయన మహారాజుకు సంభవించిన ఆపద గ్రహించి తన శిష్యునితో ఒక సందేశం పంపాడు.
'మహారాజా! పూజనీయులైన వశిష్ఠులవారికి మీకు సంభవించిన ఆపద తెలుసు. వారు యఙ్ఞదీక్షలో ఉన్నందున రాలేక నన్ను పంపారు. పూర్వం తృణ బిందువు అనే మహర్షి తపస్సుకి దేవేంద్రుడు భయపడి భగ్నం చేయమని హరిణి అనే ఒక అప్సరసను పంపాడు. ఆమె మహర్షి తపస్సు భగ్నం చేయడాని ప్రయత్నించగా 'ఓసీ! మానవ స్త్రీవై జన్మించు' అని శపించాడు. ఆమె క్షమించమని కోరగా, మహాముని దయతలచి 'దివ్యపుష్పం చూచేవరకూ నీవు భూలోకంలో ఉంటావు' అని శాపవిముక్తి ప్రసాదించాడు. ఆ హరిణే భూలోకంలో ఇందుమతిగా జన్మించి నీ పట్టపురాణి అయింది. నారద మహర్షి వీణనుంచి దివ్యపుష్పం పడగా ఆమె మరణించింది. అఙ్ఞానిలా దుఃఖించక, ఙ్ఞానిలా పరిపాలన చేయమని వశిష్ఠులవారి సందేశం' అని చెప్పి వెళ్ళిపోయాడు.
పసివాడైన దశరథునిలో ఇందుమతిని చూస్తూ కాలంగడపసాగాడు. ఎనిమిది సంవత్సరాలు గడిచాయి. కుమారుడు దశరథుడికి ఉపనయనం చేసి తన మంత్రులకు అప్పగించి మనోవ్యాధితో ప్రాయోపవేశం చేయాలనుకుని దేహత్యాగం చేసాడు అజమహారాజు.
అజమహారాజు తరువాత సింహాసనం ఎక్కిన దశరథుడు ప్రజలను రంజకంగా రాజ్యపాలన చేసాడు. మగధ, కోసల, కేకయ రాజ కుమార్తెలు ఆయనను పతిగా పొందారు.
ఒక రోజు దశరథుడు తమసా నదీ తీరానికి వేటకు వెళ్ళాడు. అప్పుడానదిలో ఒక చోట ఎవరో కడవతో నీరు ముంచుతున్నట్లు 'బుడ బుడ' మనే శబ్ధం వినిపించింది. అయితే అది ఏనుగు నీరు తాగుతున్న చప్పుడని అనుకున్నాడు. దశరథుడు శబ్ధభేది అనే బాణం ప్రయోగించాడు. అంతలోనే 'హా తండ్రీ!' అనే ఆర్తనాదం వినిపించింది. వెళ్ళి చూడగా బాణం దెబ్బకు బాధపడుతున్న ముని కుమారుడు కనిపించాడు. అతనిని చేతులమీద ఎత్తుకుని, ముని తలిదండ్రుల దగ్గరకి తీసుకువెళ్ళి జరిగిన పొరపాటు చెప్పాడు. ముని దంపతులు దుఃఖించారు. తమ కళ్ళముందు ప్రాణాలను కోల్పోయిన పుత్రుని చూస్తూ 'ఓయీ రాజా! నావలనే నీవుకూడ వృద్ధాప్యంలో పుత్రశోకంతో మరణించుగాక' అని శపించాడు. కుమారునితో పాటు మునిదంపతులు అగ్నిప్రవేశం చేసారు. దశరథుడు చింతిస్తూ నగరానికి వెళ్ళిపోయాడు. శాపం సంగతి తనలోనే దాచుకున్నాడు.
దశరథమహారాజు మహావైభవంగా దాదాపు పదివేల సంవత్సరాలు అయోధ్యా పట్టణాన్ని పాలించాడు. అయినా ఆయనకు సంతానం కలగలేదు. ఋష్యశృంగుడు మొదలైన మహర్షులతో పుత్రకామేష్ఠి అనే యఙ్ఞం చేసాడు. అగ్నినుండి ఒక దివ్యపురుషుడు ప్రత్యక్షమై పాయసం పాత్ర ప్రసాదించాడు. దశరథుడు కౌసల్యకు, కైకకు చెరిసగం పంచి ఇచ్చాడు. భర్త అబిమతం తెలిసిన కౌసల్యా కైకలు తమ భాగాలలో చెరిసగం తీసి సుమిత్రకు ఇచ్చారు. వాళ్ళు పాయసం తిని కౌసల్య రాముడిని, కైక భరతుడిని, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులను కన్నారు. నలుగురు బాలకులు శుక్లపక్ష చంద్రులవలె వర్ధిల్లుతూ తండ్రికి నయనానందం చేస్తూ వచ్చారు.
ఒకసారి విశ్వామిత్ర మహర్షి దశరథుని దగ్గరకు వచ్చి తన యఙ్ఞానికి రాక్షసులు ఆటంకం కలిగిస్తున్నారని బాల రామ లక్ష్మణుని తన వెంట పంపమని అడిగాడు. మహర్షి మాట కాదనలేక పంపడానికి అంగీకరించాడు దశరథుడు. త్రోవలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల, అతిబల అనే విద్యలు బోధించాడు.
రాముడు తాటకి కొడుకులు మారీచ, సుబాహులను సంహరించగా యఙ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. ఆ సమయంలో మిథిలాపతి అయిన జనకుడు ఒక యఙ్ఞం తలపెట్టి విశ్వామిత్రుడికి ఆహ్వానం పంపాడు. విశ్వామిత్రుడు తనతో పాటు రామలక్ష్మణులను కూడా మిథిలకు తీసుకు వెళ్ళాడు. దారిలో శ్రీరాముని పాదధూళి తగిలి అహల్యకు శాపవిమోచనం కలిగింది.
జనక మహారాజు యాగం పూర్తి అయిన తరువాత విశ్వామిత్రుడు శివధనుస్సును చూడాలని రామచంద్రుడు ఉత్సాహ పడుతున్నాడని ఆయనకు చెఫ్ఫాడు. సభాముఖంగా శ్రీరాముడు శివధనుస్సు విరిచాడు. తరువాత జనకుడు తన కుమార్తెను కోడలుగా స్వీకరించి తమ వంశాన్ని పావనం చేయమని పురోహితుని ద్వారా దశరథునికి కబురు పంపాడు.
సీతారాముల కళ్యాణం మహా వైభవంగా జరిగింది. సీత చెల్లెలు ఊర్మిళకు లక్ష్మణునితో పెళ్ళి అయింది. జనకుని సోదరుడు కుశధ్వజుని కుమార్తెలు మాళవిక, శ్రుతకీర్తులను భరత శత్రుఘ్నులు పరిణయమాడారు. అయోధ్యకు తిరిగి వస్తూ దారిలో పరశురాముని గర్వాన్ని అణచాడు రాముడు.
దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. కైక అడ్డుపడి భరతుడికి పట్టాభిషేకం, రాముడికి అరణ్యవాసం రెండువరాలు కోరింది. రాముడు తండ్రి మాటపై అరణ్యాలకు వెళ్ళాడు సీతాలక్ష్మణులతో. రాముని ఎడబాటు సహించలేక దశరథుడు మరణించాడు. మేనమామ ఊరిలో ఉన్న భరతుడు అయోధ్యకు వచ్చి విషయం తెలుసుకుని, అడవికి వెళ్ళి, రాముని కలసుకొని, రామ పాదుకలు తెచ్చి, సింహాసనంపై ఉంచి, నిమిత్త మాత్రం రాజ్యపాలన చేయసాగాడు నందిగ్రామంలో ఉంటూ.
రాముడు సీతా లక్ష్మణులతో చిత్రకూటం విడిచి దక్షిణ అడవులలో సంచారం సాగించాడు. దారిలో అత్రి మహామునిని, అగస్య మహర్షిని కలసుకున్నాడు. అగస్యుని ఆదేసానుసారం పంచవటిలో నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడ ఉంటూ ఉండగా రావణుని చెల్లెలు శూర్పణఖ వచ్చి రాముని వరించమని కోరింది. రాముడు లక్ష్మణుని వద్దకు పంపాడు. లక్ష్మణుడు నిరాకరించి ఆమె ముక్కూ చెవులూ కోసి పంపాడు.
లంకేశ్వరుడు తన చెల్లెలికి జరిగిన అవమానం విని, మారీచుని మాయలేడి రూపంలో పంచవటికి పంపాడు. సమయం కనిపెట్టి రావణుడు సీతను దొంగలించుకు పోయాడు. రామలక్ష్మణులు జానకిని వెదుకుతూ బయలు దేరారు. జటాయువు సీతను రావణుడు అపహరించుకు పోయాడని చెప్పి ప్రాణాలు విడిచాడు.
కబంధుడనే రాక్షసుడు రామలక్ష్మణులను ఎదిరించి, వారిచేతులలో చనిపోయి, శాపవిముక్తుడైనాడు. అతను చెప్పిన ప్రకారం వానరరాజు సుగ్రీవుని కలసుకొని అతనితో స్నేహం చేసారు రామలక్ష్మణులు. సుగ్రీవుడి అన్న వాలిని చంపి వానర రాజ్యాన్ని కట్టబెట్టాడు రాముడు. సుగ్రీవుడు అందుకు కృతఙ్ఞతగా తన వానర సైన్యాన్ని నాలుగు దిక్కులకు పంపి సీత ఎక్కడ ఉన్నదీ వెదికించాడు. హనుమంతుడు సీత జాడ తెలుసుకుని వచ్చాడు. రామభద్రుడు అంతులేని వానర సైన్యంతో రావణునిపై దండెత్తాడు. రావణుని సంహరించాడు రాఘవుడు. అగ్నిప్రవేశం చేయడం ద్వారా తన పాతివ్రత్యాన్ని లోకానికి ప్రకటించిన సీతాదేవిని స్వీకరించాడు.
రాముడు తన తండ్రి ఆనతి ప్రకారం అరణ్యవాసం ముగించి మరల తన రాజ్యాన్ని పొంది ధర్మంగా ప్రజలను పరిపాలించాడు. సీతాదేవి గర్భవతి అయింది. రాముడు సీతను నీకు ఏమి కోరిక ఉన్నదో కోరుకో తీరుస్తాను అన్నాడు. గంగాతీరంలోని తపోవనాలను చూడాలని ఉందంది సీత. భద్రుడనే చారుడు చెప్పిన విషయాలు విన్న తరువాత లక్ష్మణుని పిలచి 'మీ వదిన గర్భవతి. ఇప్పుడామె తపోవనాలను చూడాలని కుతూహల పడుతోంది. తీసుకువెళ్ళి వాల్మీకి ఆశ్రమంవద్ద విడచిరా' అని అఙ్ఞాపించాడు. అన్నమాట అమలుజరిపాడు.
లక్ష్మణుడు వదలి వెళ్ళిన సీతను వాల్మీకి మహర్షి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. యమునా తీరంలోని మహర్షులు రాముడి వద్దకు వచ్చి లవణుడనే రాక్షసుడు బాధిస్తున్నాడని మొరపెట్టుకున్నారు. రాముడు శత్రుఘ్నుని పిలచి లవణాసురుని చంపమని పంపాడు. శత్రుఘ్నుడు వెళుతూ దారిమధ్యలో వాల్మీకి ఆశ్రమంలో తన వదిన సీత ఇద్దరు మగపిల్లలను కన్నదని విని సంతోషించాడు. లవణాసురుని పట్టణమైన మధూపఘ్నం చేరుకుని లవణాసురునితో తలపడి అతన్ని సంహరించాడు. తరువాత ఆ యమునా తీరంలో మధుర అనే సుందర నగరం నిర్మించాడు.
అక్కడ ఆశ్రమంలో సీతాదేవి పుత్రులకు వాల్మీకి మహర్షి యధావిధిగా జాతకర్మాది సంస్కారాలు నిర్వర్తించాడు. వారికు కుశుడు, లవుడు అని పేర్లు పెట్టాడు. ఇక్కడ సీత ప్రసవించిన సమయంలోనే అక్కడ భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు కూడా వారివారి భార్యలందు ఇద్దరేసి పుత్రులను పొందారు. శత్రుఘ్నుని కుమాళ్ళు శత్రుఘాతి, సుబాహువు. శత్రుఘాతికి మధురానగరాన్ని అప్పగించాడు శత్రుఘ్నుడు.
ఒకరోజు రాఘవుడు నిండు సభలో ఉండగా ఒక బ్రాహ్మణుడు చేతుల్లో ఒక చనిపోయిన బాలకుని తీసుకు వచ్చాడు. అధర్మం జరిగి, అకాల మృత్యువుకు కారణమైనవారిని శిక్షించాలనుకున్న రాఘవుడు వెంటనే పుష్పకవిమానంపై బయలు దేరాడు. అప్పుడు ఆకాశవాణి 'రామచంద్రా! నీ ప్రజలలో ఒకడు అపచారం చేసాడు. అతన్ని శిక్షించు' అని పలికింది. ఒక చోట ఒకడు ఘోరంగా తపస్సు చేస్తునాడు. ఆ వ్యక్తిని విషయం అడిగి తెలుసుకోగా, తాను శంభూకుడనే ఒక శూద్రుడననీ, స్వర్గప్రాప్తికై ఇలా చేస్తున్నానని చెప్పాడు. శూద్రుడు తపస్సుకు పనికిరాడు కాబట్టి బ్రాహ్మణ కుమారుని అకాల మరణానికి అదే కారణమని రాముడు కత్తితో శంభూకుని కంఠం నరికాడు. రాఘవుని చేతిలో తపస్సువల్ల సాధ్యంకాని పరమపదం లభించింది. బ్రాహ్మణకుమారుడు మరల జీవించాడు.
రామభద్రుడు అశ్వమేధయాగం చేయాలనుకున్నాడు. సీతాదేవి బంగారు ప్రతిమను తన ప్రక్కన ఉంచుకుని యఙ్ఞదీక్ష చేసాడు. యాగం నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. వాల్మీకి మహర్షి ఆదేశానుసారం కుశలవులు అయోధ్యకు వచ్చారు. మహర్షి రచించిన రామాయణ కథను గానం చేసారు. వాల్మీకి మహర్షి రచించాడని తెలుయగానే రాముడు తన తమ్ములను వెంటబెట్టుకొని వాల్మీకి మహర్షి దగ్గరకు వెళ్ళి నమస్కరించి, తన రాజ్యం మొత్తం ఆ మహర్షికి ధార పోశాడు. మహర్షి 'రాఘవా! ఈ పిల్లలు సీతాదేవి పిల్లలు. వీరిని, జానకిని పరిగ్రహించు' అని పలికాడు. జానకి మరొకసారి తన శీలాన్ని ప్రజల సమక్షాన ఋజువు పరచుకోవలసి ఉంది. అలా చేస్తే పిల్లలతో కూడా ఆమెను స్వీకరిస్తానని చెప్పాడు.
అప్పుడు జానకి ప్రజలందరూ చూస్తూ ఉండగా 'తల్లి పృధ్వీ! నేను మనోవాక్కాయ కర్మలలో భర్తను తప్ప ఇంకొక పురుష సంపర్కం లేని పతివ్రతనైతే తక్షణం నన్ను నీలో చేర్చుకో' అని పలికింది. భూదేవి సాక్షాత్కరించింది. సీతను భూదేవి తనతో తీసుకు వెళ్ళింది. అయోధ్యావాసులు హాహాకారాలు చేసారు.
రామచంద్రుడు యధావిధిగా అశ్వమేధయాగాన్ని పూర్తి చేసాడు. సీతపై తనకు గల ప్రేమానురాగాలను కుమాళ్ళపై మళ్ళించుకున్నాడు. రాముడు యధాజిత్తు విన్నపం మన్నించి సింధురాజ్యాన్ని భరతుడికి అప్పగించాడు. భరతుడు తక్షుడు, పుష్పకుడు అనే ఇద్దరు కుమారుల పేర రెండు పట్టణాలు నిర్మించి, యుక్తవయస్కులైన తన కుమాళ్ళకు రాజ్యాభిషేకం చేసి, తాను మరల రామచంద్రుని సన్నిధికి వచ్చాడు. అలాగే లక్ష్మణుడు తనకుమారులగు అంగద, చంద్రకేతులకు కారాపదదేశం అప్పగించాడు.
కౌసల్య, కైక, సుమిత్రలు మరణించగా రాముడు తమ్ములతో కలసి తల్లులకు ఉత్తర క్రియలు జరిపించాడు. ఒకరోజు యమధర్మరాజు ముని వేషంలో 'మహారాజా! నేను నీతో ఒంటరిగా మాట్లాడవలసిన పని ఉండి వచ్చాను. మనం మాట్లాడుకునే మధ్యలో ఎవరూ రాకూడదు. వస్తే వాడిని నీవు పోగొట్టుకో వలసి వస్తుంది' అని చెప్పాడు. లోపట వాళ్ళిద్దరూ మట్లాడుకుంటూ ఉండగా దూర్వాస మహర్షి వచ్చి రాముని చూడాలి అని అన్నాడు. లక్ష్మణుడు అన్నగారు ఏకాంతంలో ఉన్నారని, నిరీక్షించమని మహర్షిని వేడుకున్నాడు. దూర్వాసుడు సమ్మతించలేదు. రహస్యమందిరానికి వెళ్ళి, దూర్వాస మహర్షి వచ్చారని రాముడికి చెప్పి సరాసరి సరయూ నదీజలాలలో ప్రవేశించాడు. యోగం పట్టి దేహత్యాగం చేసాడు.
లక్ష్మణుని మరణ వార్త విన్నాడు రాఘవుడు. తన కుమారులు - కుశుని కుశావతీ నగరానికి, లవుని శరావతీ నగరానికి పట్టభిషక్తులను చేసి, తరువాత భరత, శత్రుఘ్నులతో అయోధ్యవదలి, ఉత్తరదిక్కుగా వెళ్ళాడు. ఆ విధంగా రావణాది రాక్షసులను సంహరించి, దేవతల పని నెరవేర్చి స్వర్గధామం చేరుకున్నాడు.
కుశుడు, లవుడు మొదలగు రఘువీరులు ఎనిమిదిమంది తమ తండ్రులకు సమానులై రాజ్యపాలన చేస్తునారు. ఒకరోజు అర్ధరాత్రి కుశుని శయన మందిరంలో అయోధ్యా నగరదేవత ప్రత్యక్షమై 'నీ తండ్రి రామచంద్రమూర్తివలె నీవు తిరిగి నీ వంశీకుల రాజధాని నగరమైన నన్ను చేరవలసింది' అని కోరింది. తరువత కుశమహారాజు కుశావతీ పట్టణాన్ని బ్రాహ్మణులకు ధారపోసి, అయోధ్యా పట్టణానికి వచ్చాడు.
ఒకరోజు కుశమహారాజు కాంతలతో కూడి సరయూనదిలో జలక్రీడలాడుతుండగా మహారాజు చేతినుండి చైత్రాభరణం జారి నీళ్ళలో పడింది. పూర్వం రామచంద్రుడికి అగస్య మహర్షి ఇచ్చిన ఆ ఆభరణాన్ని రాజ్యంతో పాటు కుశునకు ఇచ్చాడు. ఒడ్డుకు వచ్చిన తరువాత దివ్యాభరణం చేతికి లేకపోవటం గమనించాడు. నీళ్ళలో సంచరించే నేర్పరులతో వెదికించాడు. దొరకలేదు.
ఆ నదీ జలాలలో అడుగున కుముదుడనే నాగరాజు సంచరిస్తున్నాడు. బహుశా అతడే ఆభరణం అపహరించాడేమోనని గరుడాస్త్రాన్ని విల్లులో సంధించాడు. నాగరాజు కుముదుడు తన సోదరి కుముద్వతితో నది నుండి బయటకు వచ్చాడు. కుశుడు తన గరుడాస్త్రాన్ని ఉపసంహరించాడు. 'ప్రభూ! ఈమె నా చెల్లెలు. నీ ఆభరణం ఈమెకు చిక్కింది. ఇదిగో నగ. నిన్ను సేవించాలని కుతూహల పడుతున్న నా చెల్లెలను పరిగ్రహించండి' అన్నాడు.
కుశమహారాజుకు కుమద్వతికి వైభవంగా పెళ్ళి జరిగింది. కన్యతో పాటు అనేక కానుకలు సమర్పించాడు కుముదుడు. కొంతకాలానికి కుశమహారాజుకి కుముద్వతియందు అతిథి అనే కుమారుడు పుట్టాడు. విద్యలన్నీ నేర్చి యుక్త వయస్సు రాగానే పెళ్ళి చేసాడు.
దుర్జయుడనేవాడు ఇంద్రుని బాధిస్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు కుశమహారాజు సహాయం అర్ధించాడు. తన వంశాచారాన్ని పాటించి, కుశుడు ఇంద్రుడికి తోడ్పడి దుర్జయుడితో భయంకరమైన యుద్ధంచేసి సంహరించాడు. తానుకూడా వీరమరణం పొందాడు. కుముద్వతికూడా భర్తతో సహగమనం చేసింది.
ఇక్కడ మంత్రులు అతిథిని రాజ్యాభిషక్తుని చేసారు. కొన్నాళ్ళకు అశ్వమేధయాగం చేసి రాజాధిరాజు అయినాడు. అతిథికి నిషదరాజకుమార్తెయందు నిషదుడు జన్మించాడు. చాలాకాలం రాజభోగాలు అనుభవించిన తరువాత రాజ్యభారం కుమారునిపై ఉంచి తాను స్వర్గ లోకం చేరుకున్నాడు.
నిషధుడు కూడా తండ్రి, తాత, ముత్తాతలవలెనే పరాక్రమశాలి, ధర్మఙ్ఞుడై ఈ పుడమిని పాలించాడు. అతనికి నవినాక్షుడు జన్మించాడు. తండ్రి తరువాత రాజ్యానికి వచ్చాడు. అతని కీర్తి ఆకాశం వరకూ వ్యాపించింది. నివినాక్షుడికి నభుడు జన్మించాడు. నభరాజుకు పుండరీకుడు, పుండరీకునికి క్షామధన్యుడు, క్షామధన్యునికి దేవనీకుడు జన్మించారు. దేవనీకుని కుమారుడు అహీనగుడు. అహీనగుని సుతుడు పారియాత్రుడు. అతని కుమారుడు శీలుడు. శీలుడి కుమారుడు ఉన్నాభుడు. ఉన్నాభుని పుత్రుడు వజ్రనాభుడు. అతని సుతుడు శంఖణుడు. శంఖణుని కుమారుడు వ్యుషితాస్యుడు. అతని పుత్రుడు విశ్వసహుడు. అతని పుత్రుడు హిరణ్యనాభుడు. హిరణ్యనాభునికి కౌసల్యుడు. కౌసల్యుని సుతుడు బ్రహ్మిష్ఠుడు. అతని కుమారుడు పుత్రుడు. పుత్రమహరాజుకు పుష్యుడు. అతనికొడుకు ధ్రువసంధి. ధ్రువసంధికి సుదర్శనుడు. సుదర్శనుడికి అగ్నివర్ణుడు.
అగ్నివర్ణుడికి సంతానం లేదు. అసంఖ్యాకంగా స్త్రీలతో కూడి ఉన్నప్పటికి పుత్రప్రాప్తికి నోచుకోలేదు. ఆ దారుణ బాధ ఆ రాజు ప్రాణాలనే హరించి వేసింది. అమాత్యులంతా ఆలోచించారు. అప్పటికి రాజభార్యలలో ఒకామె గర్భవతిగా ఉన్నట్టు తెలుసుకొని ఆరాణికే రాజ్యం అప్పగించారు. అగ్నివర్ణమహారాజు ధర్మపత్ని ప్రజల అభీష్టానుసారం రాజ్యపాలన బాధ్యత స్వీకరించింది. మంత్రులు, రజోద్యోగుల అండదండలతో భర్త విడిచిపెట్టి పోయిన కోసల రాజ్యాన్ని పాలిస్తూ వచ్చింది.





























