'అహం'పోయే వరకు అంపశయ్య తప్పదు

కొద్దో గొప్పో దేవుడి పట్ల ఆసక్తి, రక్తి, భక్తి కలగగానే తమకేవో ప్రయోజనాలు కలుగుతున్నట్లు, తమ ఇంట్లో ఏవో మహిమలు జరుగుతున్నట్లు,తాము ఏది అంటే అది అయిపోతున్నట్లు ప్రక్కవాళ్ళతోను (వీలయితే) పత్రికల వారితోను చెప్పేసి ప్రచారం చేసుకోవటం మొదలుపెట్టేస్తారు.కానీ దైవానుగ్రహం మనమీద ప్రసరించడం ఎంత కష్టమో భాగవతంలో 'భీష్మస్తుతి 'లో ఏ పద్యం చదివినా అర్థం అవుతుంది.

కుప్పించి యెగసిన గుండలంబుల కాంతి
    గగనభాగం లెల్ల గప్పికొనక
ఉరికిన నోర్వక నుదరంబులో నున్న
    జగముల వ్రేగున జగతి కదల
చక్రంబు దోతెంచి చనుదెంచు రయమున
    బైనున్న పచ్చని పటము జార
నమ్మితి నాలావు నగుబాటు సేయక
    మన్నింపుమని క్రీడి మరల దిగువ

కరికి లంఘించు సింగంబు కరణి మెరసి
"నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు
విడువు మర్జున" యనుచు మద్విశిఖ వృష్టి
దెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు

ఈ పద్యంలో ఎంతలోతైన భావం ఉందో, ఎన్ని తాత్విక విశేషాలున్నాయో పరిశీలిస్తే మతిపోతుంది.

శ్రీకృష్ణుడు రథం నొగలు మీంచి కుప్పించి క్రిందకి దూకాడట.అప్పుడు ఆయన కుండలాల కాంతి ఆకాశమంతా కమ్మేసిందట.ఇది కేవలం కవితామయమైన అతిశయోక్తి కాదు.సాక్షాత్తు లలితాదేవి శ్రీమహావిష్ణువు యొక్క స్త్రీ రూపమే పార్వతీదేవి.పార్వతీదేవి యొక్క పుంరూపమే విష్ణువు.ఇందుకు ప్రమాణం లలితాసహస్రనామాలే.'నారాయణీ నాదరూపా నామరూప వివర్జితా' అనే నామాల్లో 'నారాయణీ' అనేపేరు ఈ ఏకత్వాన్నే సూచిస్తుంది.అంతే కాకుండా 'గోప్త్రీ గోవిందరూపిణీ' అని కూడా వుంది."గోవిందుడు" అనే పేరు దశావతారాల్లో ఒక్క శ్రీకృష్ణునికే వాడారు.అందువల్ల లలితాదేవియే శ్రీకృష్ణుడు.శ్రీకృష్ణుడే లలితాదేవి.ఆ జగన్మోహన సౌందర్యానికి కారణం ఈ సౌందర్యలహరియే.

లలితాదేవి కుండలాలెలా ఉంటాయో సహస్రనామాల్లో స్పష్టంగానే ఉంది.'తాటంక యుగళీభూత తపనోడుప మండలా' అని అమ్మవారి కుండలాల్ని వర్ణించారు.తపన మండలం అంటే సూర్య మండలం ఉడుప మండలం అంటే చంద్ర మండలం. సూర్యచంద్రుల కాంతి ఆకాశాన్ని కప్పివేయడం మనం అహర్నిశలూ చూస్తున్నదే.శ్రీకృష్ణుడు ఆ ఆదిపరాశక్తి యొక్క పుమ్రూపమే కాబట్టి ఆయన కుండలాల కాంతి కూడా గగనభారమంతా కప్పి వేసిందని కవి అంతర్దృష్టితో చమత్కరించాడు.ఇదీ ఇందులోని తాత్వికత.

అదలావుంచితే రెండవ పాదంలో 'ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా అని వర్ణించటంలో మరో విశేషం ఉంది.క్రిందికి ఒక్కసారిగా దూకేసరికి, పరమాత్మ గర్భలో ఉన్న లోకాలు కదిలిపోయాయట.ఆ బరువుకి, ఆ కుదుపుకి బయటి లోకం కూడా కదిలిపోతున్నట్లుందట.అంటాఎ బయట వున్న లోకం పోను మిగిలిన పదమూడే లోపల ఉన్నాయా? ఈ అభిప్రాయం నవ్వు తెప్పించినా - బయటి లోకం ఏమిటి? లోపలి లోకాలేమిటి? అన్ని లోకాలు గర్భలో ఇమడ్చుకొన్న పరమాత్మ మళ్ళీ ఒక రూపం ధరించి ఉపాధిగతుడై తన లోపల ఉన్న లోకలో తానే సంచరిస్తూ బయట ప్రత్యేకంగా సంచరిస్తున్నట్లు కనిపించటం ఏమిటి? - ఇవన్నీ సందేహాలే. ఈ సందేహాలు పోయి అద్వైత స్థితిని అవగాహన చేసుకుంటే తప్ప మోక్షం రాదు.మోక్షాన్ని పొందకుండా మామూలుగా చనిపోవడం, మరో జన్మ ఎత్తటం భీష్మునికే ఇష్టం లేదు.అందుకే చక్రాయుధుడు ఎత్తిన చక్రాన్ని వెనక్కి తీసేసుకున్నాడు.

ఇది కూడా అలా ఉంచితే చివర ఎత్తుగీతిలో అసలు రహస్యం దాగి ఉంది."మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు" అంటున్నాడు భీష్ముడు. అంటే 'నా బాణం దెబ్బలకు తట్టుకోలేక ఆయుధం పట్టాడని ' అర్థం.దీనికంటె కొంచెం ముందు పద్యంలో కూడా 'అని నా శస్ర్తాహతింజాల నొచ్చియు ' అనే అంటాడు.అంటే ఇన్నేళ్ళు బ్రహ్మచర్యం పాటించినా, ఇంతగా ధర్మ నిర్వహణ చేసినా, ఇంత నిస్వార్థంగా బ్రతికినా ఇంకా ఈ గాంగేయునికి 'నేను,నాది, నా ప్రతిభ, నా శక్తి ' అనే భావాలు పోలేదు.ఎంతటి వారికైనా ఈ 'నేను ' పోతే తప్ప అసలు 'నేను ' ఏమిటో తెలియదు.పైగా ఆ సఖలిత బ్రహ్మచారి ఆయుధం పట్టింది ఈ ఆజన్మ బ్రహ్మచారి దెబ్బలకి తాళలేక కాదు.కేవలం 'కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తాననే ' భీష్ముని ప్రతిజ్ఞ నెరవేర్చటం కోసం మాత్రమే ఆయన ఆయుధం పట్టాడు.సైంధవుణ్ణి చంపుతాననే అర్జునుని ప్రతిజ్ఞ నెరవేర్చటం కోసం మరోసారి చక్రం అడ్డువేశాడు.మొత్తం మీద భక్తుల శపధం నెరవేరడం కోసం తన శపధాన్ని సైతం వదిలిపెట్టేశాడు.భకులంటే ఆయనకు అంత ప్రేమ.'కౌంతేయా! ప్రతి జానీహి నమే భక్తః ప్రణశ్యతి ' అని భగవద్గీతలో తానన్న మాట ప్రకారం భక్తుల ప్రతిజ్ఞలను నెగ్గిచ్చి తానే ఓడిపోయి భగవంతునిది "తల్లిప్రేమ" అని నిరూపించాడు.

అటువంటి పరమాత్మ దర్శనం కావాలన్నా, మనలో ఆత్మ రూపంలో ఉన్న 'ఆయన ' సాక్షాత్కరించాలన్నా మనలో ఉన్న కృత్రిమమైన 'నేను, నాది ' తొలగిపోవాలి. అంతవరకు భీష్మునికైనా అంపశయ్య, ఆవేదనా తప్పదు.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)