ఉగాది గురించి ఎంత తెలుసు
మలసానిల విలోల దళసా సవ రసాల ఫలసాదర శుకాల వన విశాల
మలినీగరు దనీక మలినీకృత ధునీ కమలినీ సుఖిత కోక కుల వధూక
మతికాంత సలతాంత లతికాంత రనితాంత రతికాంత రణతాంత సుతనుకాంత
తే.గీ.// మకృత కామోద కురవకా వికుల వకుల
ముకుల సకల వనాంత ప్రమోద చలిత
కలిత కలకంఠ కులకంఠ కాకలీ వి
భాసురము వొల్చు మధుమాస వాసరంబు
ఉగాది గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఏదో కొత్త బట్టలు వేసుకుని, ఉగాది పచ్చడి తిని, ఆ రోజు ఏం చేస్తే ఆ సంవత్సరం అంతా అదే జరుగుతుందనే కొన్ని మూఢ నమ్మకాలను మాత్రం గుర్తుపెట్టుకుంటాము. కానీ ఉగాది ప్రాశస్త్యం గురించి చాలామందికి పెద్దగా తెలియకపోవచ్చు. తెలుసుకోవడానికి సాధ్యమైనంత వరకు ఇప్పుడు ప్రయత్నిచి చూద్దాం.
ఉగాది నాటితో వసంత ఋతువు మొదలవుతుంది. ఈ వసంత ఋతువును తలుచుకుంటే పైన చెప్పిన రామరాజభూషణుడి పద్యమే ఎవరికైనా గుర్తువస్తుంది. ఈ పద్యం పాడనవసరం లేదు, అది అర్థం అవ్వకపోయినా, అది చదివితే చాలు అందులో వున్న అద్వితీయమైన rhythm, ధ్వని మన మనసుకి సంగీతంలా వినిపిస్తుంది. ఇలా వసంతాగమనాన్ని ఆయన అతి మధురంగా, అనితరసాధ్యమైన వర్ణలతో ఉపమానాలతో, యమకాలతో, ప్రాసలతో, ఒక మహోత్తరమైన భావసౌందర్యంతో వసంతఋతువును సైతం మరిపించగలిగేలా చెప్పాడు.
ఉగాది నాడు నాడు అంటే ఛైత్ర శుద్ధ పాఢ్యమి నాడు బ్రహ్మ తన సృష్టిని ప్రారంభించాడట. అందుకే దీనిని యుగాది అని వ్యవహరించేవారు. కాలాంతరంలో ఆ మాటే ఉగాదిగా రూపాంతరం చెంది ఒక పండుగగా మారిందని అందరి విశ్వాసం. ఈ రోజుతో ప్రకృతి ఒక కొత్త రూపాన్ని సంతరించుకొని మళ్ళీ చిగురించి కొత్త కొత్త అందాలతో అలరిస్తుంది. శ్రీరామ నవమి సందర్భంగా జరిగే నవరాత్రులను కలుపుని వసంత నవరాత్రులుగా ఈ నాటి నుంచే మనం జరుపుకుంటాము.
ఖగోళ శాస్త్రం - ఉగాది
వెర్నాల్ ఈక్వినాక్స్ (రాత్రి, పగలు సమకాలంగా వుండే రోజు) తర్వాత వచ్చే పాడ్యమి నాడు ఉగాది వస్తుంది. ఈ సంవత్సరం ఈక్వినాక్స్ మార్చి 19వ తారీకున జరిగింది అందుకని ఉగాది ఏప్రిల్ 6వ తారీకునాడు వస్తుంది(పశ్చిమ అమెరికా కాలమాన ప్రకారం). ప్రముఖ భారతీయ ఖగోళగణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట కూడా ఉగాదినాటి సూర్యోదయంతో క్రొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని నిర్ధారించాడట.
ఇంకొక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఉగాది పండుగ సనాతన (హైందవ) సాంప్రదాయ పంచాగాలను అనుసరించి నిర్ధారించబడుతుంది. మన పంచాంగమాన ప్రకారం ఇప్పుడు శాలివాహన శకం నడుస్తోంది. ఆంగ్లేయ కాలమానం (గ్రిగోరియన్ కాలెండర్)ప్రకారం ఈ శాలివాహన శకం 78 AD తో మొదలయ్యింది. అంటే ఆంగ్లేయుల క్రీస్తు శకము మన శాలివాహన శకము దాదాపు ఇంచుమించు ఒకేసారి మొదలయ్యాయి. కలియుగం క్రీస్తుపూర్వం ఫిబ్రవరి 18, 3102 నాడు అంటే 5110 ఏళ్ళ క్రితం మొదలయ్యింది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణావతారం ముగియగానె కలియుగారంభం ఉగాదితో మొదలయ్యింది. శాలివాహన శకమానం ప్రకారం 1930వ ఉగాది క్రీస్తుశకం 2008వ సంవత్సరంలో వస్తుంది.
సనాతన సాంప్రదాయ సిద్ధాంతాల ప్రకారం కాలచక్రగమనానుసారంగా సృష్టి జరుగుతునేవుంటుంది మళ్ళీ నశిస్తునేవుంటుంది. కృత, త్రేత, ద్వాపర కలియుగాలు కలుపుకుని ఒక మహాయుగం అవుతుందని మన పురాణాలలో ప్రకటించబడింది. ఈ లెక్క ప్రకారం కృత యుగంలో 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగాంలో 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగంలో 8,64,000 సంవత్సరాలు, అలాగే కలియుగంలో 4,32,000 సంవత్సరాలు ఉంటాయి. అంటే 43,20,000 సంవత్సరాలకు (కలియుగ కాలానికి 10 రెట్లు) ఒక మహా యుగం పూర్తి అవుతుంది. ఇలాంటి ప్రమాణంగల చతుర్యుగాలు (లేక మహాయుగాలు) 2000 జరిగితే ఒక కల్పం అవుతుంది. అలాగే 71 మహయుగాలు గడిస్తే ఒక ఒక్క మన్వంతరం అవుతుంది. ఒక్కొక్క మన్వంతరాన్ని ఒక్కొక్క మనువు పరిపాలిస్తుంటాడు. ఇలా 14 మన్వంతరాలు జరిగితే బ్రహ్మదేవునికి ఒక్క రోజుతో సమానం. ఇప్పుడు జరిగేది ఏడవ మన్వంతరం (వైవత్సవ మన్వంతరం). ఈ మన్వంతరంలో 28వ మహాయుగంలో కలియుగంలో ప్రధమపాదంలో మనం ఉన్నామిప్పుడు.
ఈ మనువులు ఎవరు అంటూ మనుస్మృతిలో మొదటి ఏడుగురు మనువుల పేర్లు ఇలా ప్రస్తావింప బడ్డాయి.
శ్లో:// స్వారోచిష శోత్తమశ్చ తామసో రైవత స్తధా|
చాక్షుషశ్చ మహాతేజా వివస్వత్సుత ఏవ చ||
అర్థం: ఆ ఏడుగురు మనువులెవరంటే అని స్వాయంభువ మనువు చెబుతున్నాడు... (తాను కాకుండా)...... స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, గొప్ప తేజోశాలి ఐన వైవస్వతుడు.
వీరుకాక సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, రుద్రసావర్ణి, ధర్మసావర్ణి, రౌచ్యుడు, భౌమ్యులతో కలిపితే మొత్తం 14 మంది మనువులవుతారు అని పురాణలు ప్రమాణంగా అందిస్తున్నాయి. ఈ 14 మన్వంతరాలు జరిగిన తర్వాత బ్రహ్మకి రాత్రి అవుతుంది. అప్పుడు ఆయన తన సృష్టిని ఆపేసి నిద్రలోకి జారుకుంటాడు. ఆ నిద్ర మరోక 14 మన్వంతరాల కాలంపాటు సాగుతుంది. దీనితో అంటే 28 మన్వంతరాల కాలంతో (లేక 2000 మహయుగాల కాలంతో) బ్రహ్మకు ఒక రోజు పూర్తవుతుంది. ఈ బ్రహ్మ రోజును ఒక కల్పం అంటారు (8,640,000,000 సంవత్సరాలు). మరునాడు కొత్త కల్పంతో మళ్ళీ సృస్టిని మొదలుపెడతాడు. ఇలా 100 కల్పాల కాలం ఆ బ్రహ్మకూ ఆతడి విశ్వసృష్టికీ ఆయుర్ధాయంగా వుంటుంది. ఈ ఆయుర్దాయాన్ని ఒక పర అంటారు. ఇప్పుడు నడిచేటి కల్పం ఒక పరలోని ద్వితీయార్థానికి మొదటిభాగంలో ఉన్నది. అంటే మన బ్రహ్మకు ఇప్పుడు దాదాపు 50 ఏళ్ళ వయస్సు వుంటుంది.
ఈ బ్రహ్మ నిద్రపోయే కాలాలను ఇప్పటి భాషలో మన Ice Age అని అనుకోవచ్చునేమో. global warming ఒక స్థాయిని దాటితే ice age వస్తుందని ప్రస్తుతం అందరు శాస్త్రవేత్తలూ నమ్మేటి విషయమే. ఆంటే సనాతన ధర్మ ప్రకారం కూడా ఈ ice ageలు రావడం, తరువాత మళ్ళీ ప్రాణ సృష్టి జరగడం, ఆ తరువాత మొదటి యుగంలో అంతా జలమయం అయివుండటం, (మత్స్యావతారం, కూర్మావతారం మొదలైన కథలు చూస్తే ఇలాంటి రోజులు భూమి పైన జరిగేవని తెలుస్తుంది), ఆ తరువాత సమస్త జంతుజాలాలు పుట్టడం ( వరహావతారం, నరసిమ్హావతారం లాంటి కథలలో జంతువులే ప్రముఖ నాయకులుగా వ్యవహరించాయి), ఆ తరువాత మానవోత్పత్తి జరగడం (మిగితా అవతారాలలో యుగ పురుషులంతా మానవులే), చివరికి కలియుగంతో ప్రళయం సంభవించి అంతా నశించడం. మళ్ళీ సృష్టి మొదలవ్వడం. కాకపోతే ఈ ice age ప్రతి కలియుగాంతంలోనూ వసుందా బ్రహ్మ నిద్రా సమయంలో వస్తుందా అనే విషయం ఆసక్తికరమైన అంశంగా మిగిలిపోతుంది. పరిశోధిద్దాము.
యుగాది గురించి మాట్లాడుకుంటూ మనుస్మృతిలోనికి జారాం. ఇక్కడ మరొక శ్లోకం పరిశీలిద్దాం.
అర్ధేన నారీ తస్యాం స విరాజ మ సృజత్ప్రభుః ||
తాత్పర్యం: బ్రహ్మ తన దేహాన్ని రెండుగా విభజించుకొని, ఒక భాగం చేత పురుషుడుగా, మరో భాగంచేత స్త్రీగా అయ్యాడు. అప్పుడా పురుషుడు ఆ స్త్రీయందు సంగమించి విరాట్ ను సృజించాడు. మనుసృష్టికి మూలయోగం-- స్త్రీ పురుష సంయోగోద్భవ జనితమైనదే మన ఈ సృష్టి.
ఆలాగే బృహదారణ్యక ఉపనిషత్తులో (మొదటి అధ్యాయంలో నాల్గవ బ్రాహ్మణ్యంలో 3వ శ్లొకం) కూడా ఇలాంటి ప్రస్తావనే వచ్చింది
స హైతావానాస యధా స్త్రీపుమాగ్ంసౌసంపరిష్వక్తౌ స ఇమ మే వాత్మానం దేధాపాతయయత్తతః పతిశ్చ పత్నీ చాభవతాం తస్మాదిదమర్థబృగలమివ స్వ ఇతి హ స్మాహా యాజ్ఞ వల్క్యస్తస్మాదయమాకాశః స్త్రియా పూర్యత ఏవ తాగ్ం సమభవత్తతో మనుష్యా అజాయ్ంత||
తాత్పర్యము: అతడు ఒక్కడే ఉన్నాడు కనుక రమించ లేకపోయినాడు. అందుకని రెండవది అభిలషించి ఆలింగనములోనున్న స్త్రీపురుషులంత అయినాడు. తన దేహమును రెండుగా విభజించినాడు. అట్లా తొలి పతీపత్నులు ఏర్పడినారు. ఈట్లా పురుషుని రిక్తతను స్త్రీ పూరించినది. ఆ విధముగా జనులు పుట్టినారు. "తతో మనుష్యా అజాయత".
బైబిలు ఖురానులలో స్త్రీని పురుషుడి పక్కటెముకనుంచి తీయబడిందని చెప్పబడిందట. సనాతన ధర్మ ప్రకారం స్త్రీ పురుషులు ఒక ఆలింగనంగా అవతరించారు. ఈ రెండు సిద్ధాంతాలనీ పరిగణలోకి తీసుకొని పరిశీలించి చూస్తే క్రైస్తవ సంప్రదాయంలోని ఆడాము అవ్వలు సనాతన సాంప్రదాయపు సిద్దాంతాలతో ఏకీభవిస్తాయి. కాకపోతే వీరు ఎప్పుడు పుట్టారో చెప్పడం కష్టమైన పని. సనాతన సాంప్రదాయం ప్రకారం ఈ నాటి బ్రహ్మ ఎప్పుడు పుట్టాడొ చెప్పగలం కాబట్టి మన బేరీజులు వేసుకుంటే దాదాపు కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం భూమి/లేక మన ప్రకృతి పుట్టివుండవచ్చునని అంచనా వేసుకోవచ్చు. యుగాదిని కనిపెట్టగలమేమోకానీ మనుషులను బ్రహ్మ ఎప్పుడు పుట్టించాడొ చెప్పడం మాత్రం ఒక క్లిష్టసమస్యగానే మిగిలిపోతుంది.
ఏది ఏమైనా మానవ జాతి చరిత్ర పశ్చిమదేశాలవారన్నట్లుగా 4,5 వేల సంవత్సరాలకు మాత్రం పరిమితం కాదని తెలుస్తున్నది. ఇంతటి చరిత్ర కల్గిన మన సనాతన సాంప్రదాయ కాలమానం నిర్దేశించిన ఉగాది ఒక్క చిన్న సామాన్య పండుగ కాదు. ఇది మన సృష్టికే అతి ముఖ్యమైన రోజు. ఇది మతంతో, భాషతో సంబంధంలేకుండా అందరూ కలిసి పండుగ జరుపుకోవలసిన రోజు. అందుకే సిలికానాంధ్ర ఈ పండుగను ఎంతో వైభవోపేతంగా ఏప్రిల్ 6వ తారీఖున జరుపుకుంటోంది. అందరూ వచ్చి ఆనాటి కవి సమ్మేళనంలోనూ, పంచాంగశ్రవణంలోనూ, గళమురళీరవ విన్యాసంతోనూ, చక్కటి భోజనాలతోనూ, మనచిన్నారుల మనబడి స్నాతకోత్సవంతోనూ, ఆనందించి, ఆదరించి, ఆస్వాదించి, ఆశీర్వదిస్తారని తలుస్తూ
మీ
తల్లాప్రగడ
సుజనరంజని భిన్న అభిప్రాయాలకు వేదిక మాత్రమే. ఇందలి రచయిత(త్రు)ల అభిప్రాయాలను మనస్ఫూర్తిగా గౌరవిస్తాము.





























