మూలం: స్టెఫాన్ త్సైక్

జరిగిన కథ:

వీరవాఘ రాజ్యంలో విరాట్ గొప్ప యోధుడు. అచంచల రాజభక్తి కలవాడు. అయితే రాజుగారి బావమరిది రాజ్యం మొత్తం ఆక్రమించాలన్న దురుద్దేశంతో వీరవాఘ సైనికుల్ని కొందర్ని లంచాలతో లోబర్చుకొని దండెత్తి వచ్చాడు. ఆ విపత్కర సమయంలో రాజుగారు విరాట్ ను సైన్యానికి నాయకత్వం వహించి శత్రువుని ఎదుర్కోమని కోరాడు. ఆనాటి రాత్రి జరిగిన సంగ్రామంలో విరాట్ తన శక్తియుక్తులతో శత్రువుల గుడారంపై దండెత్తి రాజవిద్రోహులను కడతేర్చాడు. మరుసటి రోజు ఉదయం విరాట్ చనిపోయిన విద్రోహులలో ఒకరిని తన అన్నగా గుర్తించాడు. తన చేతులతో స్వంత అన్ననే చంపుకొన్న సంఘటన విరాట్ ని ఎంతగానో కలచివేసింది. విజయకేతనంతో తిరిగి వచ్చిన విరాట్ కు రాజుగారు వజ్రాలతో పొదిగిన తమ పూర్వీకుల ఖడ్గాన్ని బహుకరిస్తూ సర్వ సైన్యాధ్యక్ష పదవిని అప్పగించబోయాడు. అయితే విరాట్, సొంత అన్ననే చేజేతులా చంపుకున్నానని, ఇక జీవితంలో ఖడ్గాన్ని ముట్టబోనని ప్రతిజ్ఞ చేశాడు. ఇలా చెడు జోలికి పోని, ధర్మబద్దుడైన విరాట్ కు రాజుగారు ప్రధాన న్యాయాధికారి పదవీ బాధ్యతలను అప్పగించాడు. ధర్మకాటాతో సమంగా తూచినట్లు విరాట్ ప్రతి నేరాన్ని లోతుగా పరిశీలించి మరణశిక్ష తప్ప వేరే తగిన శిక్షలను విధిస్తూ త్వరలోనే రాజ్యంలోని ప్రజల మెప్పును పొంది గొప్ప న్యాయాధికారిగా పేరొందాడు. అయితే ఒకరోజున కొందరు కొండ జాతీయులు ఒక యువకుణ్ణి పదకొండు మంది ప్రాణాలు అపహరించాడంటూ బంధించి తీసుకువచ్చారు. అయితే ఆ యువకుడు విరాట్ ను న్యాయాన్ని చెప్పడానికి నీకేం అధికారముందంటూ, ఇతరులు చెప్పేది విని నీవేం తీర్పు చెబుతావంటూ నిగ్గదీస్తాడు.

"నా తీర్పు న్యాయసమ్మతంగా ఉండేట్లు భగవంతుడు అనుగ్రహించు గాక!

పదకొండు మంది మనుషుల ప్రాణాలు తీసిన మహాపాపం ఈ ముద్దాయిని చుట్టుకుంది. సుమారు సంవత్సరం పాటు మానవ జీవితం తల్లి గర్భంలో పోషింపబడుతుంది. ఇతను పదకొండు మందిని చంపాడు. ఒక్కొక్కరి కోసం ఒక్క సంవత్సరం వంతున ఇతను పదకొండు సంవత్సరాలు భూగర్భపు అంధకారంలో ఉండాలి. పదకొండు మందిని హత్య చేశాడు గనుక ప్రతి సంవత్సరం పదకొండుసార్లు ప్రతిసారీ వంద కొరడాదెబ్బలు కొట్టవలసిందిగా శిక్ష విధిస్తున్నాను. దీని ద్వారా ఇతను తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోగలుగుతాడు. కాని, జీవించే హక్కును మాత్రం కోల్పోడు. జీవితం భగవంతుని అనుగ్రహం. దానిపై మానవుడికి అధికారం లేదు. ఇతని అపరాధానికి తగిన విధంగా నేను ప్రకటించిన ఈ తీర్పు న్యాయబద్ధం అయ్యేటట్లు భగవంతుడనుగ్రహించు గాక" అన్నాడు.

తీర్పు వినగానే గ్రామీణులు న్యాయపీఠం మెట్లను ముద్దు పెట్టుకున్నారు. ముద్దాయి మాత్రం మౌనం వహించాడు.

"చూడు. నీ మీద ఆరోపింపబడిన నేరాలకు నీ సంజాయిషీ ఇచ్చుకోవలసిందిగా కోరాను. నువ్వు పెదవి విప్పలేదు. నీ శిక్షను తగ్గించే అవకాశాన్ని నువ్వివ్వలేదు. ఒకవేళ నా తీర్పులో ఏదైనా లోపం ఉంటే, నీకు అన్యాయం జరిగితే పాపపుణ్యాలు విచారించే ఆ భగవంతుడి ముందు అది నా తప్పు కాదని, నీ మౌనం తాలూకు దోషమని చెప్పు. నీ పట్ల నేను కొంత దయ చూపించాను. అదే నాకు సంతోషం."

ముద్దాయి అప్పుడు నోరు విప్పాడు. "నీ దయ నాకు అక్కరలేదు. ఒక్క క్షణంలో నా నుంచి నా జీవితాన్ని నువ్వు హరిస్తున్న దానితో పోలిస్తే నువ్వు చూపగలిగే దయ ఏపాటిది?"

"నేను నీ జీవితాన్ని హరించడం లేదు."

"నిజంగానే నువ్వు నా జీవితాన్ని హరిస్తున్నావ్. అడవి మనుషులని పిలిచే మా జాతి వాళ్ళకన్నా నువ్వు నిర్దయగా ప్రవర్తిస్తున్నావ్. నేను వాళ్ళను చంపాను. నువ్వూ నన్ను చంపేయ్. కాని నువ్వు నన్ను ఒక్కసారిగా చంపవు. శవప్రాయంగా నన్ను అంధకార భూగృహంలో పాతిపెడతావు. ఏళ్ళకు ఏళ్ళు నెనక్కడ కుళ్ళిపోతూ ఉండాలి. ఎందుకలా చేస్తావు? నీ పిరికి హృదయం రక్తపాతాన్ని తట్టుకోలేదు. అందుకే ఇలాంటి తీర్పులు ఇస్తున్నావు. నీ తీర్పులకు ప్రజలు బలి అవుతున్నారు. నీ చట్టం కూడా మోసం. నేను హత్య చేశాను గనుక నువ్వు కూడా నన్ను హత్య చెయ్ " అన్నాడతను ఆవేశంగా.

"నేను నీకు సరైనా శిక్షే విధించాను."

"సరైనదా? దేని ప్రకారం సరైనది? ఓ న్యాయమూర్తి! ఏ ప్రమాణాలతో నువ్వు న్యాయాన్ని నిర్ణయిస్తున్నావో ఆ ప్రమాణాలకు ప్రమాణం ఏమిటి? కొలబద్ద ఏమిటి? కొరడా దెబ్బల్ని శిక్షగా విధించావు. కొరడా దెబ్బ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నువ్వెప్పుడన్నా కొరడా దెబ్బ తిన్నావా?

వెలుపల వెలుగులో, మారే ప్రపంచంలో మారుతున్న కాలంతో పాటు పదకొండు సంవత్సరాలని వేళ్ళపై లెక్కిస్తూ గడపగలిగినట్టు భూగృహపు చెరసాలలో అంధకారంలో, ఒంటరిగా, ప్రకృతికి, వెలుగుకి దూరంగా, కాలం తెలియకుండా జీవచ్చవంలా గడపగలవా? నా జీవితంలో ఎన్ని మధుర వసంతాల్ని హరిస్తున్నావో తెలియడానికి నీవెప్పుడైనా చెరసాల జీవితం గడిపావా? నీవు అజ్ఞానివి. దెబ్బ తిన్నవాడే దెబ్బ బాధ ఏమిటో తెలుసుకోగలడు. దెబ్బలు కొట్టేవాడికి దెబ్బలు తినేవాడి కష్టాలు తెలియవు. బాధలు పడ్డవాడికే బాధ విలువ తెలుస్తుంది.

అపరాధికి సరైన శిక్ష విధించానని నువ్వు గర్విస్తున్నావు. కాని అపరాధులందరికన్నా నువ్వే పెద్ద అపరాధివి. నేను ఆవేశంలో హత్యలు చేశాను. అప్పుడు నన్ను ఆవేశ పిశాచం ఆవరించి ఉంది. కాని నువ్వో! ప్రశాంతంగా ఉండి నా ప్రాణాల్ని హరిస్తున్నావు. దాని దుష్పలితాన్ని నువ్వెప్పుడూ అనుభవించలేదు. తలకిందులై పడిపోకముందే నువ్వు న్యాయపీఠం నుంచి దిగిపో! తెలిసిన దాన్నిబట్టి నిర్ణయాలు చేసేవాడు పరమనీచుడు. న్యాయమంటే ఏమిటో తనకు తెలుసనుకునే వ్యక్తి కూడా దుష్టుడే . ఓ అజ్ఞానీ! ఆ న్యాయపీఠం నుంచి దిగు. ఒక్కమాటతో జీవితాల్ని హరించే తీర్పులు చెప్పబోకు." దోషి కోపంతో కంపించి పోయాడు.

చుట్టూ ఉన్నవాళ్ళు కోపంతో దోషి మీద విరుచుకు పడపోయారు. విరాట్ వాళ్ళను శాతింపజేసి, దోషి వైపు నుంచి దృష్టి మళ్ళించి "ఇచ్చిన తీర్పును రద్దుచేసే హక్కు నాకు లేదు. నా నిర్ణయం సరైదేనని నేను నమ్ముతున్నాను" అని చెప్పి అక్కడినుండి లేచి వెళ్ళేందుకు నిలబడ్డాడు. వాళ్ళు ఖైదీని గట్టిగా పట్టుకున్నారు. బంధనాల్లోంచి అతను గుంజుకోసాగాడు.

విరాట్ కొద్ది అడుగులు ముందుకు నడిచి ఆగాడు. ఆగి అతని వైపు చూశాడు. అతడు క్రోధంతో విరాట్ వైపు చూస్తున్నాడు. ఆ చూపులకు విరాట్ చలించిపోయాడు. ఆ కళ్ళు సరిగ్గా తన సోదరుడి కళ్ళలాగే ఉన్నాయి. ద్రోహుల శిబిరంలో తనచేత చంపబడ్డ అన్న కళ్ళు ఎలా క్రోధంగా తనవైపు చూశాయో, అలాగే తనచేత శిక్షింపబడిన ఈ ఖైదీ కళ్ళు క్రోధంతో తనను చూస్తున్నాయి. విరాట్ మనసు వికలమైపోయింది.

ఆ రోజు సాయంత్రం ఎవరితో మాట్లాడలేదు. ఆ ఖైదీ చూపులు అగ్నిబాణాల్లాగా విరాట్ హృదయాన్ని దహించివేస్తూ ఉన్నాయి. రాత్రంతా ఆయన నిద్ర పోనేలేదు. తూర్పుదిక్కు ఎర్రబారే దాకా రాత్రంతా మేడ మీద ఆయన పచార్లు చేస్తూనే ఉన్నాడు. ఆయన పాదాల చప్పుడు రాత్రంతా వినిపిస్తూనే ఉంది.

సూర్యోదయం కాగానే, దేవాలయపు కోనేరులో విరాట్ నిత్యకర్మలు ముగించాడు. అనంతరం సూర్యుని వైపు తిరిగి ప్రార్థన చేసి ఇంటికి వచ్చాడు. ప్రత్యేక సందర్భలలో వేసుకునే పసుపుపచ్చని దుస్తులు ధరించాడు. కుటుంబ సభ్యులందరికి అభినందనాలు తెలియజేశాడు. ఈ కొత్త ఆచారాన్ని చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కాని ఏమిటిదని అడిగే సాహసం ఎవరికీ లేదు. తరువాత విరాట్ ఒంటరిగా రాజభవనానికి వెళ్ళాడు. రాత్రింబవళ్ళు ఎప్పుడైనా రాజభవనంలోకి ప్రవేశించడానికి ఆయనకు అనుమతి ఉంది.

రాజుగారి దగ్గరికు వెళ్ళగానే విరాట్ వినయంగా శిరస్సు వంచి రాజుగారి దుస్తుల్ని తాకాడు. ఆయనేదో కోరబోతున్నాడనడానికి అది గుర్తు. మహరాజుగారు ఆత్మీయంగా విరాట్వైపు చూసి "నీవేదో కోరడానికి నా దుస్తుల్ని తాకావు. నీవు అడగక ముందే నేను నీ కోరికను అంగీకరిస్తున్నాను " అన్నాడు.

విరాట్ తలవంచుకుని అలాగే నిలబడే ఉండి "న్యాయాధికారులపై ప్రధాన న్యాయాధికారిగా తమరు నన్ను నియమించారు. ఆరు సంవత్సరాలనుంచి తమరి పేరు మీద నేను న్యాయ నిర్ణయం చేస్తూ వచ్చాను. నేను సరైన న్యాయ నిర్ణయాలు చేశానో లేదో నాకు తెలియదు. సత్యమార్గాన్ని అన్వేషించేందుకు వీలుగా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేందుకుగాను నాకొక నెలరోజులు సెలవిప్పించండి. మీనుంచి, ఇతరులనుంచి నా సొంత అభిప్రాయాలు కాపాడుకునేందుకు అనుమతినివ్వండి. నేను అన్యాయరహితమైన పనులు చేయాలనుకుంటున్నాను. పాపానికి దూరంగా బతకాలనుకుంటున్నాను " అన్నాడు.

మహారాజు ఆశ్చర్యచకితుడైనాడు.

"ఈనాటి నుంచి నా రాజ్యం న్యాయం లేక అనాథ అవుతుంది. నువ్వు ఏ మార్గాన్ని అనుసరించదలుచుకున్నావు అని కూడా నిన్ను అడగను. ఆ మార్గంలో నీకు సత్యదర్శనం కావాలని మాత్రం కొరుకుంటాను " అన్నాడు.

విరాట్ కృతజ్ఞతతో రాజసింహాసనాన్ని ముద్దాడి తలవంచుకుని వినయంగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

(సశేషం)

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)