అమెరికా ఉద్యోగ విజయాలు – 9
సత్యం మందపాటి చెబుతున్న
గణాధిపత్యం!
“మన ఈనాటి ప్రహసనం, ఒక జోకుతో మొదలుపెడతాను. ఇది నువ్వు వినే వుంటావు. జోకంటే నా జోకు కాదు. తెలుగు హాస్య ప్రియునందరికీ గురువుగారు ముళ్ళపూడి వెంకటరమణ గారిది” అన్నాడు కృష్ణ.
అర్జున్ సర్దుకు కూర్చుని, “చెప్పు బావా, నాకు ముళ్ళపూడిగారి జోకులంటే ప్రాణం” అన్నాడు.
“ఒక పల్లెలో రెడ్డిగారి పార్టీకీ, నాయుడుగారి పార్టీకీ పెద్ద పోట్లాట జరుగుతున్నదిట. పోట్లాట అంటే నోటి దురద తీర్చుకునే నోట్లాట కాదు. రెండు పార్టీల వాళ్ళూ ఆవకాయ పెట్టుకునే కత్తులతో, చకచకా ఒకళ్ళనొకళ్ళు నరికేసుకుంటుంటే, వాళ్ళ తలకాయలు నరికిన పుచ్చకాయ ముక్కల్లాగా ఎగిరి పడుతున్నాయిట. ఆడవాళ్ళూ, పిల్లలూ భయంతో ఇంట్లోనించీ బయటికి రావటం లేదు. కానీ అక్కడ రచ్చబండ దగ్గర ఒకాయన మాత్రం, తాపీగా చుట్ట త్రాగుతూ, ఆకాశంలోకి చూస్తూ, కాలు మీద కాలు వేసుకుని పడుకుని వున్నాడుట. వాళ్ళు ఎంత కొట్టుకుంటున్నా, ఆయన దగ్గరికి వచ్చేసరికీ