కవితా స్రవంతి

మనిషినే ప్రేమిస్తాను

కవితా స్రవంతి
- శిష్ట్లా. వి.యల్.యన్.శర్మ మనిషి జీవితానికి ప్రయాణం కావాలి కాలమనే వాహనం కావాలి చైతన్యమనే స్పందన కావాలి మజిలీలలో అనుభవాలు దాచుకొనే మనస్సు కావాలి..... ఈ ప్రయాణం నీ ఒక్కడిది కాదు నీ ఒక్కడికోసం కాదు కాలవాహినిలో నీవు కలసిపోయేవరకు...... నీ తోటి జీవి కొరకు.... ప్రక్కవానితో కలిసి బంధాల్ని ఆస్వాదిస్తూ మనిషిగా చరిత్రవౌతూ... మనసు సంద్రంలో భావాల అలలతో తీరాలు చేరాలనే తపనతో బడబాగ్నులు దాచుకుంటూ తుఫానులను తట్టుకుంటూ.... మనుషుల్ని కలపాలని మనిషిగా నిలపాలని నీ ప్రయాణం మనీషిగా సాగాలని.... జీవనదులన్నీ సముద్రంలో కలిసినట్లు మనసు జీవజల ప్రవాహం కాల సముద్రంలో కలిసి మనిషిని అందించాలని...... అందుకే మనిషి ప్రయాణమంటే నాకిష్టం.....అందుకే మనిషినే ప్రేమిస్తాను మనిషినై ప్రేమిస్తాను!

అమ్మ

కవితా స్రవంతి
- తమిరిశ జానకి ప్రపంచ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో ముత్యాలు చుట్టి వేశాను అమ్మ మెడలో ! మంచి ముత్యాలు అక్షరముత్యాలవి ఆమె నా తెలుగుతల్లి ! తొలి దైవం అమ్మ తొలి పలుకు తెలుగు పలుకు అది ఎంతో ముద్దులొలుకు ! తొలి అడుగు తడబడినా తల్లికి అది మురిపమే ! తొలి ప్రణామం అమ్మకి అది విధాయకం నాకు ! ఉన్నఊరు కన్నతల్లి మాతృభాష మరువతగని వరాలు అవి మదిని నింపు సంతసాలు !

కృష్ణ పలుకు

కవితా స్రవంతి
- కృష్ణ అక్కులు ఆ.వె||వంట చేయు వరకు మంట కావలయును ఇంటిని మసి చేయు మంట వలదు కోపమధిక మయిన కొంపలు ముంచును కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు ఆ.వె||పేసు బుక్కు లోన పెరిగిన స్నేహము వాట్స అప్పు లోన పలుకు తీరు నాటి ఉత్తరముకు దీటుగా వచ్చునె కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు ఆ.వె||నల్ల ధనము నేడు చెల్లదనుట సరి వలదు హాని బీదవాని కెపుడు కలుపు తీయు నపుడు తులసి పోరాదు కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు ఆ.వె||ముద్దు చేయ రాదు మొద్దుబారు నటుల చురుకు కలిగి పనికి ఉరుకు నటుల పెంచినపుడె బిడ్డ మంచిగ బ్రతుకును కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు ఆ.వె||కలసి బ్రతుకునపుడు కలహాములవి వచ్చు కాని అందులోనె కలదు సుఖము పెద్దలెపుడు మనకు బుద్ది భోధించరె కృష్ణ పలుకు వినగ గెలుపు ఆ.వె||పెద్ద నోట్లు రద్దు పేదవాడికి పాట్లు కొత్త నోట్ల కొరత కొంప ముంచె మోడి మాపైనేల మోపితివి బరువు కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు ఆ.వె