పదకవిత్వం - వ్యక్తిత్వవికాసం

కావ్యకవులకంటే శతకకవులు, పదకవులు మానవ వ్యక్తిత్వాలను భూతద్దంలో చూపించారు. మానవ స్వభావాలను కాచి వడబోశారు. తద్వారా మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో వెల్లడించారు. అంటే మానవజీవితాల్ని "లోనారసి" ప్రదర్శించారు. ఈ కవులు చెప్పిన సత్యాలు ఒక దేశపు, ఒక జాతి మానవుడు కాదు - 'విశ్వనరుడు ' స్వభావాలే! అందరికీ చెందే సత్యాలే!

పదం, సంకీర్తనం, కృతి అనేవి (కొంచెం భెదం ఉన్నా) ఇంచుమించు సమానార్థకాలే! పదకవిత్వం సంగీతసాహిత్యాల సమ్మేళనం. 'ఏ వాఙ్మయమునందైనను ఈ పదకవిత్వము పద్యకవిత్వముకంటే ముందు పుట్టి పెరుగుననుట బహు జనాంగీకృతమైన సిద్ధాంతము ' అని ఆచార్య పింగళి లక్ష్మికాంతం, శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వంటి విమర్శకులు నిర్ధారించారు. అన్నమయ్య 32వేల కీర్తనలు, త్యాగయ్య 24వేల కీర్తనలు రాశారంటే భక్తి తన్మయత్వంతోపాటు లోకపరిశీలన, మనస్తత్వ పరిశీలన ఎంత ఉందోనని ఆశ్చర్యమేస్తుంది. వీరిద్దరూ నిలువెల్లా భక్తులే. భక్తులైనంత మాత్రాన మడి కట్టుకు కూర్చుంటారనీ, లోకజ్ఙత ఉండదనీ అనుకోవటం అసంగతమని ఈ కవులు చెప్పారు. అన్నమయ్య, త్యాగయ్యవంటి పదకవులు తమ కీర్తనల ద్వారా వ్యక్తిత్వవికాస పాఠాలు బోధించారు.

చేతులార చేసేటి చేకొన్న కర్మానకు ఘాతలకర్త గానంటే కట్టువడడు (అన్నమయ్య)

- మానవుడు తను దుర్మార్గాలు, అవాంఛనీయ కార్యాలు చేస్తూ భగవంతుడే కారణమంటాడు. చేతులార చేసుకొని దేవుడ్ని 'ఘాతలకర్త 'గా ప్రకటిస్తాడు. ఘాతము అంటే దెబ్బ, బాణము అని అర్థాలు. 'దేవుడి దెబ్బ ఇది ' అని దెప్పిపొడుస్తాడు. 'చేసుకొన్న వాదికి చేసుకొన్నంత ' అనే నానుడి ఉండనే ఉంది. అన్నమయ్య 'నువ్వు చేతులారా చేసుకొని దేవుడ్ని అంటే దేవుడు పడతాడా?' అని నిలదీస్తాడు. విశేషం ఏమిటంటే అంతా సవ్యంగా సాగితే మన ప్రతిభే! లేకపోతే దేవుడే కారకుడు - అనటం!!

'పొలతులు జీవులే పురుషులు జీవులే
తలప భావభేదములేకాని '
అన్నాడు అన్నమయ్య.

15వ శతాబ్దంలోనే స్త్రీ పురుషులిద్దరూ జీవులే - భావంలోనే భేదాలు - ఇద్దరూ ఒకటే అని ప్రకటించాడు. పొలతి అంటే స్త్రీ. 'హీనాధికములు ' అనే భావన సరికాదని అనాడే చెప్పాడంటే ఏమనుకోవాలి?

అందరికీ తెలిసిన అన్నమయ్య కీర్తన 'పరబ్రహ్మం'. దేవునిముందు అందరూ సమానమే అన్నాడు. చండాలుడూ, బ్రాహ్మణుడూ ఒకటే... అందరూ ఆ దేవుని బిడ్డలే అని హితవు పలికాడు. సృష్టిలో లేని భేదభావాలు మనుషుడే పెంచి పోషిస్తున్నాడు గదా! వెంకటేశ్వరుని కీర్తిస్తూ ఎంత ఎక్కువైనా అందరిపట్ల సమానంగా, మంచిగా ఉంటాడని చెప్పాడు. దేవుని పరంగా చెప్పినా మానవుడికే వర్తిస్తుంది. ఆధిపత్యభావం లేదా అహంభావం (ఈగో, సూపర్ ఈగోలు) పనికిరావని తాత్పర్యం!

భారమైన వేపమాను పాలుపోసి పెంచినాను
తీరని చేదేగాక తియ్యనుండేనా
పాయదీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి
బాయకెంత గట్టినాను చక్కనుండేనా
- ఈ పోలికలు అహంభావి గురించి. ఆత్మపరిశీలన చేసుకొనేవాడి గురించి. మొండిపట్టు వీడని మనిషి గురించి. 'తాపట్టిన కుందేటికి మూడే కాళ్ళు ' అనే సామెత లేదూ? భర్తృ హరి కూడా 'మూర్ఖుని మనము రంజింపరాదు ' అన్నాడు. దీనినే అన్నమయ్య పై విధంగా సృష్టీకరించాడు.

అన్నమయ్య కీర్తనలలో గల సామెతలు, సూక్తులు వ్యక్తిత్వవికాసానికి దోహదం చేస్తాయి.

'విత్తొకటి పెట్టితేను వేరొకటి మొలచునో'
'జలధిలో వాన లు ' (సముద్రంలో వాన వ్యర్థమని నిరుపయోగం)
'ఎంగిలి బూరె కడుగనేల?' (వ్యర్థం)

మనం మిత్రులకి, బంధువులకి లేదా ఇతరులకి చనువు ఇస్తాం. దాంతో అవతలివారు వేళాకోళం ఆడటం, ఏడిపించటం, ఒక్కొక్కసారి అవమానించి తక్కువగా చూడటం అనుభవం లోనిదే. అంటే అతిచనువు పనికి రాదు. కానీ చనువు ఇచ్చి మళ్ళీ బాధపడటం ఎందుకు? అనే బావంతో అన్నమయ్య -

'చనువులిచ్చిన చోట సాధించ పనిలేదు ' అనే సూక్తి చెప్పాడు. 'టెన్షన్ 'తో, అశాంతితో, దినదిన గండంతో జీవిస్తూ సరైన ఆహారం తీసుకోలేని సంపన్నుడి కంటే - తృప్తితో గంజి తాగినా చాలు! 'చిత్తశాంతి ' ముఖ్యం అంటూ అన్నమయ్య 'చింతలేని యంబలొక్క చేరెడే చాలు ' అనే సందేశం ఇచ్చాడు. మానవుడు వాచాలుడు కాకూడదు. 'ఎప్పటికెయ్యది ప్రస్తుతమో' తెలుసుకొని మాట్లాడాలి. 'అతి పనికిరాదు '. పైగా అతిగా మాట్లాడితే, అనవరసంగా మాట్లాడితే తప్పులే కాదు - అసమంజస ప్రయోగాలు వెలువడుతాయి. దీనిని గుర్తు చేస్తూ అన్నమయ్య - 'తరచు మాట్లాడితే తప్పులెన్నైనా దొరలు ' అంటాడు.

త్యాగయ్య రామభక్తుడు. 'ఈ మేను కల్గినందుకు సీతారామ నామమే పల్కవలెను ' అని రాముడ్ని సర్వస్వంగా భావించినవాడు. అంతమాత్రాన వ్యక్తిత్వవికాస నిపుణుడు, మనస్తత్వ శాస్త్రవేత్త కాకుండా పోలేదు. మానవ స్వభావాల్ని 'స్కానింగ్ ' చేశాడనిపిస్తుంది.

'మేను చూసి మోసపోకువే మనసా...' అంటూ శారీరక వ్యామోహాన్ని నిరసించాడు.

'అనురాగము లేని మనసున జ్ఙానము రాదు' అనటం గమనార్హం. మనం ఏ పని చేసినా, ఏమి చదివినా 'అనురాగం' అనవసరం. 'మక్కువ ' ఉండాలి. లేకపోతే ఏమీ అంటకపోగా శిరోభారం అవుతుంది కూడా. అనురాగం లేకపోతే 'బాటనీ బోరుగా ఉంటుంది, హిస్టరీ రొస్టు ' అనిపిస్తుంది. జ్ఙాన సముపార్జనకి అనురాగమే అతి ముఖ్యాంశం. త్యాగరాజు మరొక సామెత చెప్పాడు - 'ఎద్దునకేమి తెలియు అటుకుల రుచి' అని! దీనికి సమానంగా 'గొడ్రాలికేమి తెలుసు ప్రసవ వేదన?' అనే నానుడి ఉంది. ఒక రంగం వారికి వేరొక రంగం వారి కృషి తెలవదు. తెలిసినా ఆమోదించలేడు. ఈసడిస్తాడు. ఎవరి కృషి వారిది అనుకోవాలి. తనకి తెలియనప్పుడు ఊరుకోవాలిగానీ అధిక్షేపిస్తే అతని జ్ఙానమే బయటపడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. త్యాగయ్య చెప్పిన ఈ సార్వకాలిక సత్యం ఒక్కటే ఎత్తు -

ఎంత నేర్చిన ఎమత జూచిన
ఎమతవారలైన కాంతదాసులే


ఇది అక్షరాక్షర సత్యం గదా! రాజకీయనాయకులు, అధికారులూ మాత్రమే కాదు కవులు కూడా కాంతదాసులై 'స్త్రీలోలుడు ' అనిపించుకోవటం తెలిసిందే. తన స్థాయి, తన ప్రతిష్ఠ... అన్నీ పక్కన పెట్టడం అనే బుద్ధి తగదని త్యాగయ్య బోధించాడు. మనోనిగ్రహం అవసరం.

మానవుడు ఈర్ష్యాళువు. అసూయతో పాటే పుట్టివుంటాడు. 'తన స్వార్థమే తనకు రక్ష' అని భావిస్తాడు. తను బాగుపడక పోయినా ఫర్వాలేదు గానీ మరొకడు బాగుపడకూడదని వ్రతాలు చేస్తాడు కూడా! అందుకే త్యాగయ్య - 'ఎదుటి పచ్చ జూచి తాళలేక' అన్నాడు. ఈ బుద్ధి కవులలో, కళాకారులలో మరీ ఎక్కువ. 'శాంతము లేక సౌఖ్యము లేదు', 'చక్కని రాజమార్గములుండగా సందులు దూరనేల' వంటివి మనకు ఎన్నో గుణపాఠాలు బోధిస్తాయి. వీటీని చదివి, వంట పట్టించుకుంటే మన వ్యక్తిత్వాన్ని ఆదర్శవంతంగా మలచుకోలేమూ? సమాజం వికాసవంతం కాదూ?

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)