నేనొక పూలమొక్కకడ నిల్చితి పూలనుకోయునంతలో
మానసమందు తోచెగద మమ్ములనివ్విధి బాధపెట్టగా
మానుమటంచు పూలు బ్రతిమాలుచు, చూచు విధంబుగా, సరే
ఏనిక మిమ్ముకోయనని యింటికి బోవగ నెంచునంతలో

నన్ను ఎవరొ పట్టినట్లవ ఒకపరి
తిరిగి చూచినాను తెల్లబోయి
వకగులాబికొమ్మ వంగి తగులగాను
పలికె నన్ను జూచి బాధతోడ

చూడుమీ వనమంత సోయగమొలికించు
ప్రకృతి సౌందర్యమింపారనెరపె
మల్లెలు జాజులు మందార చామంతి
విరివిగా వికసించి పరిమళించె
పూవులన్నియు నొక్క పూసలదండగా
పరికింప కన్నుల పండుగయ్యె
ఇది మధుమాసమా ఏమని భ్రమకల్గ
చేసెడి రీతిగా సీమ వెలసె

కాని నేల రాలుకద మరుదినమందు
జన్మ వృధ మరియు విషాధ భరిత
మగునుకాద! అట్టి మమ్ముల వీడుట
న్యాయమగున మాకు సాయపడక
పుట్టిన ప్రాణి గిట్టుటయు పుట్టుటయున్ సహజంబు పుట్టినన్
వట్టిన రాలిపోవుటది పాడియ? ఏమి ఫలంబిది? తోచెనొక్కటిన్
గుట్టుగ తాప్రమోదమొనగూర్చిన, మెచ్చిన చాలు తృప్తియౌ
పుట్టుక సార్ధకంబగును పుష్పమలంకృతమంచెరుంగవే

మాగతి కానకుండ అటుమళ్ళెదవేల దయానిధీ త్వదీ
యాగమనంబుచూచితిమి హర్షిత భావపులంకితంబుగన్
స్వాగతమయ్య నీకు, మనసారగ తోచిన పూవులన్నియున్
వేగమె సజ్జనిండుగను పేర్మిని నింపుము వెంటగైకొనన్
త్యాగము కాదు నిక్కువము దైవపదంబుల చేరు భాగ్యమున్
ఈగతి దక్కనిమ్ము తడవెందుకు? సందియమేల రమ్మికన్

పొలతులసిగలోన పూల చెండ్లుగమమ్ము
ముడిచిన మాకది మోదమవదె?
గొబ్బెమపై మమ్ముకూర్చి కన్నియలట
పాడుచు తిరిగిన భాగ్యమవదె?
పెండ్లిలో దంపతుల్ పేర్మితలంబ్రాల్గ
పోసుకొనుట మాకు పుణ్యమవదె?
పూలమాలలుగట్టి పురుషోత్తముని మెడ
చేరగా మాకింక చింత గలదె?


ఇట్టి విధముగా సేవల నింపు మీర
సల్పు భాగ్యము కల్గదె సన్నుతింప
మమ్ము గొనిపొమ్ము, దయచూపుమయ్య నీవు
ఇటనె వున్న ప్రయోజనమేమి గలదు?
ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)