యంత్ర శక్తి - ఎంత శక్తి?!

కొంత కాలం కిందట ఆంధ్ర దేశంలో ఒక చిన్న వూరు, 'అమరావతి ' ప్రపంచ ప్రఖ్యాత దలాఇ లామాకి ఆతిధ్యానిచ్చింది. లక్షలమంది యోగులు, బౌద్ధ సన్యాసులూ ఇంకా అనేక మంది ప్రజలు అందరూ అమరావతికి తరలి వెళ్ళారు. అందుకు మూలం కాల చక్ర పర్వదినం! ఈనాటికి అనంతం, అనూహ్యమై క్వాంటం థియరీకి కూడా అంతు పట్టని కాలంకన్న గొప్ప రహస్యమేముంది? సృష్టి మూలమైన ఆ కాలాన్ని, ఊహాతీత మహాశక్తిని యంత్రంగా నిర్మించి దాన్ని ఆరాధించే ప్రత్యేక కార్యక్రమం - కాలచక్ర పర్వదినం. ఇది ఒక పండగ మాత్రమే కాదు సాధన కూడా అని ఆ మార్గంలో గురువులు చెపుతారు, విశ్వశాంతికి ఈ కార్యక్రమాన్ని జరుపుతారు. కింది చిత్రంలో కాలచక్రం ఇవ్వబడింది. ఈ యంత్రాన్ని 'మండలం ' అని కూడా అంటారు.

అత్యంత శక్తివంతమైన కలియుగ ప్రత్యక్షదైవము కోట్లాది మందికి ఇష్ట దైవము ఐన శ్రీ వెంకటేశ్వరుల సన్నిధిలో వున్న శ్రీ చక్రం అత్యంత శక్తివంతమైనదని, అది ప్రతిష్టించినది ఆది శంకరాచార్యులేనని, దానికున్న ఆకర్షణ శక్తివల్లనే అనేకులు తిరుపతి సందర్శిస్తున్నారని చాలా మంది నమ్ముతారు. ఎంతో పురాతనకాలం నుండి అర్చించబడుతున్న శ్రీ చక్రం ఉపాసనా రంగంలో యంత్రాలలో అత్యున్నత స్థానాన్ని పొంది వుంది. పంచదశీ మంత్రంతో శ్రీచక్రాన్ని పూజించి దేవతానుగ్రన్ని పొందుతారుట. 2-డైమెన్షనల్ గా వుంటే అది శ్రీచక్రం అంటారు. 3-డైమెన్షనల్ గా వుంటే దాన్ని శ్రీచక్రం మేరువు అని పిలుస్తారు. ఈ రెండు రకాల శ్రీ చక్రాలు కింద చూపించ బడ్డాయి.

చాలకాలం క్రితం అమలాపురంలో ఒక ప్రసిద్ధ ఉపాసకులుండేవారట. వారివద్దకు ప్రశ్నలు చెప్పించుకునేందుకు అనేకమంది వచ్చేవారుట. ఒక సారి ఎవరో 'అయ్యా! మా ఆవు ఎటువెల్లిందో చెప్పండి ' అంటే, ఒక కొబ్బరికాయ తెప్పించి అక్కడ పెట్టించారట. అప్పుడు ఆయన ఒక కాగితం మీద ఏదో చిత్రీకరిస్తే వెంటనే ఆ కొబ్బరికాయ గుండ్రంగా తిరగడం మొదలు పెట్టిందిట, దానంతట అదే! అది ఒక వైపు ఆగగానే ఆయన చెప్పారుట, 'ఆ దిశగా వెళ్ళండి మీ ఆవు దొరుకుతుంది ' అని. ఇదంతా చూసి ఆశ్చర్య పోయిన అక్కడి ఒక పండితులు వారిని అడిగారు, 'ఏమిటి ఈ విచిత్ర విద్య? ' అని. అప్పుడు ఆయన చెప్పారు. ఇది ఎంతో లుప్తమవుతున్న విచిత్ర యంత్ర విద్య. కేవలం సంఖ్యలని ఒక ప్రత్యేక వరసలో ఈ గళ్ళలో వేస్తే వొక ప్రత్యేక శక్తి వుద్భవిస్తుంది. ఒక్కో సంఖ్యని బట్టి, వరుసని, వాటి సంపుటిని బట్టి ఒక్కో యంత్రం తయారవుతుంది అని. ఇలా రకరకాల అవసరాలకి రక రకాల యంత్రాలు వాడ వచ్చు, వీటికి మంత్రం, పూజ ఏమి అక్కర్లేదు అని చెప్పరుట. ఈ యంత్రాలని, 'కచ్చపుట యంత్రాలు ' అంటారు. కచ్చపుటము అంటే తాబేలు డిప్ప. ఇవి గళ్ళతో తాబేలు దిప్పలా వుంటాయి, సంఖ్యలతో! ఈనాటికి అక్కడక్కడ ఇవి మనకి కనిపిస్తున్న, వీటిని సిధ్ధింప చేసుకున్న మహానుభావులెవరూ దొరకడంలేదు ఈ అదృష్ట యంత్రాలకి ఒక వుదాహరణ ఇక్కడుంది. బాలారిష్టాలకి, ఆరోగ్యానికి వుపయోగించే యంత్రాలున్న వ్రాతపతి మాత్రం దొరికింది. నమ్మకమో, దైవానుగ్రహమో తెలియదు కాని అనేకమందికి ఇవి పనిచేస్తున్నాయట.

సన్స్కృతాన్ని 'దేవనాగరి ' అని అంటున్నాం. దేవనాగరి లిపిని కూడా విరివిగా వాడుతున్నాం - హిందీతో సహా. మరి ఈ దేవనాగరి అనే పదం ఎలా వచ్చింది అని అన్ వేషిస్తే తాడేపల్లిగూడెంలో ఒక అధ్యాపకులు చెప్పారు, "దేవనగరం అంటే శ్రీ చక్ర యంత్రం. అలాంటి మహా యంత్రంలో వాడబడిన భాష కనుక అది దేవనాగరి అయింది". యంత్రానికున్న పవిత్రత, ప్రాముఖ్యత అశ్చర్యం కలిగించాయి. ఇంకా ఆశ్చర్యమేమంటే ప్రపంచ వ్యాప్తంగా అనేకులు యంత్ర శక్తిని నమ్ముతారు. ఉదాహరణకి ఈ క్రింది థాయ్ భాషలో యంత్రాన్ని చూడండి.

మంత్రం సబ్ద తరంగంలా శక్తివంతంగా పనిచేస్తుంది. యంత్రం మంత్రం యొక్క శక్తిని నిక్షిప్తం చేసుకుని పనిచేస్తుంది. మంత్రం ఎవరు చేస్తే వారికి వారి అనుయాయులకు ఉపయోగపడుతుంది. యంత్రం "పవర్ ఆఫ్ అటార్నీ " ఇస్తూ ఎవరి వద్ద వుంటే వారికి ఉపయోగ పడుతుంది. యంత్రాలు బంగారు రేకుల మీద, వెండి మీద, రాగి మీద, అరతి ఆకుమీద, ఇంకా కాగితం మీద కూడా గీస్తారు. యంత్రం అవసరం ఉపయోగాన్ని బట్టి దేనిమీద గీయాలో మంత్ర మహోదధి లాంటి గ్రంధాలు తెలుపుతున్నాయి. వ్యాపారస్తులు 'జనాకర్షణ యంత్రం ' పెట్టుకుంటారు. దాని వల్ల వ్యాపారం మరింత ప్రజలు రావతం వల్ల వృద్ధి చెందుతుందని నమ్ముతారు. ఇలాంటి యంత్రం ఇళ్ళలో వుంటే కష్టమే! చుట్టాలు పక్కాలు విపరీతంగా వస్తే వాళ్ళందరి ఆదరించేసరికి పేరుతొ బాటు నీరసం వస్తుంది.

కొందరు కుబేర యంత్రాన్ని, లక్ష్మి యంత్రాన్ని పూజించి దాన్ని దేవుని వద్ద వుంచుతారు. అది ధనాన్ని వృద్ధి చెందుస్తుందని నమ్మకం. సకల వాస్తు దోషాలు పోగొట్టుకోవాలంటే గోడలు పగలగొట్టుకుని, ఇల్లు మళ్ళి కట్టుకోనక్కర్లేదుట, మత్స్య యంత్రం ఒకటి పూజించి ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషాలు నివారించ బడతాయిట. కూర్మ యంత్రం స్థిరత్వానికి చిహ్నం. నరఘోష యంత్రం కొంత దృష్టిదోషాన్ని నిర్మూలిస్తుందని కొందరు నమ్ముతారు. ప్రతి యంత్రంలోను రాయబడిన బీజక్షరాలు, త్రికోణ, వర్తుల, చతురస్ర నిర్మాణాలు ఆయా శక్తులని, దిక్పాలకులని, విశ్వంలో ఆ మూల ప్రకృతికి చెందిన ఆది శక్తిని ప్రేరేపించి మంచి ఆలొచనలని, ఆనందకరమైన వాతావరణాన్ని కలగ చేస్తాయి. కొన్ని యంత్రాలని ధరిస్తారు కూడా. మరీ ఫొటో ఫ్రేం అంత కాకుండా, చిన్న తాయెత్తుల్లో యంత్రాలని ధరించ వచ్చు. దీర్ఘకాల వ్యాధులకి ఇవి బాగా పనిచేస్తాయి. మంత్ర జపాలు చేయలేని వారు యంత్రాల ద్వారా కార్యాన్ని సాధించ వచ్చు. మంచి యంత్రాన్ని అర్చించి శక్తివంతం చేసుకుని ఫలితాన్ని పొందవచ్చునని మేరుతంత్రం లాంటి గ్రంధాలు తెలుపుతున్నాయి.

జాతకంలో దోషాన్ని బట్టి దాని తాలుకు మంత్రాన్ని జపించడం కాని, లేక నవగ్రహ యంత్రాన్ని పూజించడం కాని చేయవచ్చు. కాలసర్ప దోషం వున్నవారు కాలసర్ప యంత్రన్ని సద్గురువుల దీక్షతో ఉపాసించ వచ్చునట. కుజ దోషం వుంటే బెంగ పెట్టుకోనక్కర్లేదు, సుబ్రహ్మణ్య యంత్రాన్ని మంగళవారం నాడు ప్రారంభించి మండలం పాటు అర్చించి పాలు నైవేద్యం పెడితే మంచి శుభాలు కలుగుతాయని కర్మ విపాక గ్రంధాలలో చెపుతున్నారు.

మంత్రాలు చేస్తే,యంత్రాలని పూజిస్తే వచ్చే అనుభూతులేంటి? అవి మన వూహ కాదు నిజమైన అనుగ్రహమేనని ఎలా తెలుస్తుంది? ఈ ఆధునిక యుగంలో, ఎలెక్ట్రానిక్ యంత్ర యుగంలో, యంత్రాన్ని కొలవడం ఎలా? ఇవన్నీ కాదు నాకు మంచి ధ్యానమే అవసరం. అదెలా సాధ్యం? ఇవన్నీ వచ్చే సంచికలలో చూద్దాం.

శ్రీ గురుభ్యో నమః

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)