అది సముద్ర తీరంలో ఉన్న ఒక పట్నం. ప్రతి రోజూ, బడి విడిచిపెట్టగానే, ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలంతా సముద్రపుటొడ్డుకి చేరి అక్కడి ఇసుకలో రకరకాల ఆటలు ఆడుకుంటూ సాయంకాలాల్ని సరదాగా గడుపుతూంటారు. శెలవు వస్తే చాలు, ఉదయం కూడా బీచ్ లో చేరి తడిగా ఉన్న ఇసుకలో పిచుకగూళ్ళు కట్టీ, కోటలు, గుళ్ళూ వగైరా ఎన్నెన్నో రకాలు తయారుచేసి వినోదిస్తూంటారు. కొంచెం పెద్దపిల్లలైతే, వాటిని ఎవరు బాగా అందంగా కట్టగలరు అన్నదానిమీద చిన్న చిన్న పందేలుకూడా కాస్తూంటారు. అలా పందేలు కాసేవారిలో గోపీ ఒకడు.

గోపీకి "శాండ్ కాజిల్స్" కట్టడంలో పందెం కాసి గెలవడం అంటే చాలా ఇష్టం. ఎత్తైన నిర్మాణాలు ఎంతో నేర్పుతో అందంగా తయారుచేసి సాధారణంగా, పందేల్లో గోపీయేగెలుస్తుంటాడు. వాడు గెలుచుకున్న గోళీలు, పెన్సిల్ ముక్కలు, చాక్ పీసులు వగైరా అమూల్య వస్తువులు వాళ్ళ ఇంట్లో బుట్టనిండా ఉన్నాయి. ప్రయిజు ఎలాంటిదైనా గెలుపు గెలుపే కదా!

గోపీ అమ్మా, నాన్నాబ్యాంక్ ఆఫీసర్లు కావడంతో, ఇంట్లోనే ఉండి గోపీని చూసుకునేందుకు, ఇంటిపనులు చక్కబెట్టీ తంతతోనే ఉండేలా గోపీ పుట్టినప్పటినుండే ఒక ఆయాని కుదుర్చుకున్నారు గోపీ అమ్మానాన్నా. ఆ ఆయాకీ గోపీ అంటే చాలా ఇష్టం. వాడిని తన ప్రాణ సమానంగా చూసుకునేది ఆమె. గోపీ అల్లరి చేసి విసిగించినా, ఆట పట్టించినా ఆమె వాడిని గారం చేసేది.

గోపీ అమ్మ సరిత ఆయా మీద విసుక్కునేది, "అతి గారాబం చేసి వాడిని నువ్వే చెడగొడుతున్నావు" అంటూ. ఆయమ్మ నవ్వేది. "పిల్లలు కాకపోతే అల్లరి మనం చేస్తామా! ఇక గారాబమంటావా - అది కన్న తల్లివి నువ్వూ కాకా, పెంచిన తల్లిని నేనూ కాక ఇంకెవరు చేస్తారుట?" అని సరిత మాటల్ని పట్టించుకునేది కాదు.

ఒకరోజు బడి నుంచి వస్తూ గోపీ ఒక పిల్లి పిల్లను తన వెంట తీసుకువచ్చాడు. గోపీకి పాలుకలిపి ఇస్తూ దానికీ పాలు పోసింది ఆయమ్మ. బంగారు రంగుతో ఎంతో ముద్దుగా ఉన్న ఆ పిల్లి పిల్లని "పెంచుకుంటాన"ని చెప్పాడూ ఆయాతో.

సరిత ఆఫీసునుండీ ఇంటికి వచ్చేసరికి వీధి గుమ్మంలోనే కాళ్ళకు అడ్డం పడి "మ్యావ్"మంటూ ఆమెను పలుకరించింది పిల్లి పిల్ల.

"చీ చీ! హూట్ హూట్ " అంటూ దాన్ని కసిరికొట్టింది సరిత.

గోపీ ఆయమ్మ వైపు జాలిగా చూశాడు.. సరితకు కోపం వచ్చింది.

"పిల్లి ఎంగిలి తిన్నా, దాని బొచ్చు కడుపులోకి వెళ్ళినా భయంకరమైన రోగాలొస్తాయి తెలుసా? దీన్ని దూరంగా తరిమెయ్యి." అంటూ ఆజ్ఞాపించింది.

వెంటనే ఆయా దాన్ని తరమడం మొదలుపెట్టింది. గోపీ బిక్క మొహం పెట్టాడు. ఆయా కన్ను గలిపి సైగ చేసింది, "నేనున్నా కదా, పరవాలేదు" అన్నట్లు. మొత్తానికి ఆయా దాన్ని తరిమి తరిమి ఔట్ హౌస్ కి మార్చింది. అంతే! బడినుండి వచ్చీ రాగానే గోపీ వెళ్ళి దానితో ఆడుకునేవాడు. అది గోపీకి బాగా మచ్చిక అయింది. వాడు ఎక్కడకు వెళ్ళినా వెంట వెడతానని మారం చేసేది. దాన్ని అప్పుడప్పుడూ బీచికి తీసుకెళ్ళేవాడు. అది గోపీని తగులుతూ పక్కనే కూర్చుని, వాడు కట్టే కాజిల్స్ ని గమనిస్తూండేది. అప్పుడప్పుడూ అనుకోనంత ఎత్తుకి లేచి, విసురుగా వచ్చి పిల్లలు అందంగా కట్టిన ఇసుక భవనాల్ని కూలదోసి వెళ్ళే అలలను చూసి కోపంతో "గుఱ్ఱు" మనేది ఆ పిల్లిపిల్ల.

గోపీ పిల్లిపిల్లను "నామీ" నని పిలిచేవాడు. నామీ, దాని చేష్టలతో గోపీని మురిపిస్తూండేది. గోపీతోనే ఎల్లవేళలా ఉంటూ ఆయమ్మ పెట్టిన తిండి తింటూ బంతిలా తయారయింది.

నామీ వచ్చాక ఇంట్లో ఎలుకలు, బొద్దింకలు చేసే గందరగోళం తగ్గడంతో క్రమంగా సరిత కూడా మనసు సరిపెట్టుకుని, నామీ ఇంట్లో తిరగడానికి ఒప్పుకుంది. కానీ ఆయాకి గట్టిగా చెప్పింది, "దానిని పరిశుభ్రంగా ఉంచాలి. లేకపోతే గోపీ ఆరోగ్యం పాడవుతుంది" అంది హెచ్చరికగా. ఆయా కూడా ఆయా కూడా అన్ని జాగ్రత్తలూ తీసుకునేది.

క్రిస్మస్ శెలవులు వచ్చాయి పిల్లలకు. పిల్లలకు ఆటవిడుపు దొరికింది ఒక వారం రోజులపాటు. శెలవ నాడు విందులతో, మిత్రులతో కలిసి కాలక్షెపాలతో చాలా రాత్రి వరకూ మెలకువగా ఉండటంతో మరునాడు సరితకు తొందరగా మెలకువ రాలేదు. ఆమె గదిలోంచి బయటకు రాగానే,నామీ ఆమెకు ఎదురుగా వచ్చి కాళ్ళకు రాసుకుంటూ "మ్యావ్"మంటూ పలకరించింది.

"చీ! వెధవ పిల్లి! లేస్తూనే దీని ముఖం చూశాను. ఏం రాసుందో" అనుకుంటూ సరిత దాన్ని కాలితో దూరంగా తన్నేసింది. దెబ్బ తగలడంతో పిలి ఔట్ హౌస్ లోకి పారిపోయింది.

గొపీ కూడా ఆలస్యంగా లేచాడు. పళ్ళుతోముకుంటునే అమ్మా నాన్నలకి బై చెప్పేసి బీచ్ కి బయలుదేరాడు, నామీని వెంట తీసుకుని.

అప్పతికే బీచ్ లో చాలా మంది ఆడుకుంటున్నారు. ఎండ నెమ్మదిగా వేడెకుతోంది. అలల మీద చల్లని గాల్ వల్ల ఏ మాత్రం ఎండ బాధ లేకుండా ఉంది. పక్కింటివాళ్ళ రాజూ ఆల్సేషన్ కుక్కను వాకింగ్ కి తీసుకువచ్చాడు. అక్కడకు.దానిని చూసి భయపడిన నామీ గోపీ చాటుకు చేరింది.

గాలి ప్రశాంతంగా వీస్తోంది. అలలు లయబధ్ధంగా శబ్దం చేస్తూ ఒడ్డు మీదకి విరిగిపడుతున్నాయి. నామీ ఎప్పటిలాగే గోపీని అంటిపెట్టుకు కూర్చున్నది. అంతలో ఎవరో తరిమినట్లు, సముద్రం మీద ఎగురుతూ చేపల్ని వేటాడుతున్న నీటి పక్షులు "కువకువ"లాడుతూ మూకుమ్మడిగా ఒడ్డువైపుకి ఎగిరి రావడం మొదలుపెట్టాయి. నామీ "భయపడినదానిలా "గుఱ్ఱు"మని శబ్దం చేస్తూండడం గమనించి వెనక్కి తిరిగి నామీ వైపు చూశాడు. దానిలో వచ్చిన మర్పు అతణ్ణి దిగ్భ్రాంతుడిని చేసింది. కంగారుగా లేచాడు గోపీ.

నామీ ఒళ్ళు కంపిస్తోంది. దాని రోమాలన్నీ నిక్కబొడుచుకున్నాయి. దాని శక్తినంతా కూడదీసుకుని గట్టిగా అరచి పరిగెత్తడం మొదలుపెట్టింది. ఏమయ్యుంటుందా అని నాలుగు వైపులూ పరికించి చూశాడు గోపీ. కొద్ది దూరంలో ఆడుతున్న రాజు చేతిలోని గొలుసు ఊడలాక్కుని ఆల్సేషియన్ కూడా తన వైపే రావటం చూశాక అర్ధమయింది. నామీ వెంట పడుతున్న కుక్కనుండి దాన్ని ఎలా అయినా రక్షించాలి అని ఒక్క ఉదుటన పరుగు లంకించుకున్నాడు గోపీ. కుక్క, దాని వెంట రాజు కూడా పరిగెత్తుకువస్తున్నారు.

కుక్క నామీని సమీపించింది. కానీ, ఆగి, దానిని కొరకాలని కాక ఇంకా ముదుకి పరిగెత్తడం చూసి ఆశ్చర్యపోయాడు గోపీ. దానిని తరుముతున్న దానిలా వెంటే పరిగెత్తింది నామీ. పిల్లి కుక్కని తరుముతూ వెళ్ళే ఆ విడ్డూరాన్ని చూడటానికి వాటి వెనకాలే ఇంకొంతమందీ పరిగెత్తారు. వాటి వెంటే దగ్గరలోని గుట్టనెక్కారు.

కుక్కా, పిల్లీ పరుగున వచ్చి గుట్టపైకంతా ఎక్కి, ఒకదాని పక్కన ఒకటి నిలబడి సముద్రం వైపుగా చూడసాగాయి. అప్పటికే అక్కడ సముద్రం వారన నివసించే జంతువులెన్నో చేరి ఉన్నాయి. చోద్యం ఏమిటో చూద్దామని వచ్చిన జనంతో గుట్ట నిందిపోయింది. అన్ని జంతువులూ తమ వైషమ్యాలను మఱచిపోయాయి. ఇంతలో సముద్రం వైపు చూస్తున్న జనంలో హాహాకారాలు మొదలయ్యాయి. దిగంతరేఖ దగ్గర ఒక పెద్ద అల కనిపించి, వేగంగా భూమి వైపు దూసుకు వస్తోంది. ఆ అల దగ్గరౌతున్న కొద్దీ దాని వేగానికి పుట్టిన "హుం"కార ధ్వని గాలంతా నిండి ప్రకంపనాలు పుట్టిస్తోంది. జనం భయంతో ఒణికారు.

బీచ్ మీద జనం ఆ అలను గుర్తించే సరికి సమయం మించిపోయింది. అల బారి నుండి తప్పించుకుని సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలన్న తపనతో బీచ్ మీది జనం వెర్రికేకలు పెడుతూ కకావికలుగాపరిగెత్తారు. కానీ పెను అల వారిని చుట్టుముట్టి, లోనికి లాక్కునిపోయింది. ఒడ్డున మిగిలి ఉన్నవారు "ఘొల్లు"మన్నారు. తమ ఎదుటే జరిగిన దుర్ఘటన చూసి కొండ మీద జనం నిలువునా మ్రాన్పడిపోయారు.

జరిగినది తెలుసుకుని కొంతసేపటికి తేరుకుని, నామీ ని పట్టుకుని భోరున ఏద్చాడు గోపీ. అకస్మాత్తుగా ఒడ్డుపైకి విరుచుకుపడిన సునామీని గురించిన వార్త క్షణాల మీద ప్రచారమైపోయింది.

ఒక్కసారిగా వెల్లువలా జనం పోటెత్తారు సహాయం చేయడానికని. సముద్ర ఘోషను మించిపోయింది జనఘోష. పరోపకార పరాయణులతో ఆ ప్రాంతం నిండిపోయింది.

సునామీ వార్త తెలియగానే ఆఫీసులు మానేసి అందరూ ఇళ్ళకు పరుగు పరుగున వచ్చి చేరుకున్నారు. సరిత-మోహన్ లు ఇల్లు చేరుకునేలోగా ఆయమ్మ గుండెలు బాదుకుంటూ గోపీని వెతకడం కోసం ఒడ్డుకు పరిగెత్తింది. సరిత-మోహన్లు కూడా పరిగెత్తారు గుండెలవిసిపోతుండగా. అంతా భీభత్సంగా భయానకంగా ఉన్నాదా వాతావరణం. మీడియా కెమేరాలు, గొల గోలలు, ఆర్త నాదాలు మధ్య చాలాసేపటికి తల్లిదండ్రులను వెతికి పట్టుకున్నాడు గోపీ. నామీని ఎత్తుకుని తమకు ఎదురుగా కనిపించిన కొడుకుని చూసి ఆనంద భాష్పాలతో ఉబ్బితబ్బిబ్బయ్యారు తల్లిదండ్రులు.

నామీ చేసినదంతా గర్వంగా అమ్మా నాన్నలకు వివరించాడు గోపీ. పొద్దున్నే లేచిన వేళా విశేషం పెద్ద గండం తప్పింది అనుకున్నారు సరిత మోహన్ లు. పశ్చాత్తాపంతో నామీని దగ్గరకు తీసుకుని ముద్దాడింది సరిత, నీరు నిండిన కళ్ళతో. నామీ లేకుంటే ఏమయి ఉండేదో అన్న భావం కుదిపేసింది సరితను. "ప్రకృతిలో వచ్చే ఉత్పాతాలను మనుషులకన్నా ముందుగా జంతువులు కనిపెట్టగలవు. ఒక్క గోపీనే కాక ఎంతమందిని ఇవేళ కాపాడిందో మన నామీ. 'హాట్స్ ఆఫ్ టు యూ నామీ!'" అన్నది సరిత గర్వంగా!

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)