జరిగిన కథ:
వీరవాఘ రాజ్యంలో విరాట్ గొప్ప యోధుడు. అచంచల రాజభక్తి కలవాడు. అయితే రాజుగారి బావమరిది రాజ్యం మొత్తం ఆక్రమించాలన్న దురుద్దేశంతో వీరవాఘ సైనికుల్ని కొందర్ని లంచాలతో లోబర్చుకొని దండెత్తి వచ్చాడు. ఆ విపత్కర సమయంలో రాజుగారు విరాట్ ను సైన్యానికి నాయకత్వం వహించి శత్రువుని ఎదుర్కోమని కోరాడు. ఆనాటి రాత్రి జరిగిన సంగ్రామంలో విరాట్ తన శక్తియుక్తులతో శత్రువుల గుడారంపై దండెత్తి రాజవిద్రోహులను కడతేర్చాడు. మరుసటి రోజు ఉదయం విరాట్ చనిపోయిన విద్రోహులలో ఒకరిని తన అన్నగా గుర్తించాడు. తన చేతులతో స్వంత అన్ననే చపుకొన్న సంఘటన విరాట్ ని ఎంతగానో కలచివేసింది.
కొద్దిసేపటికి దగ్గరలో సైనికుల కేకలు వినిపించాయి. వాళ్ళ హృదయాల్లో ఆనందం ఉప్పొంగుతోంది. దోచుకున్న సంపదతో వాళ్ళు పక్షుల్లా ఎగిరి గంతులేస్తున్నారు. విద్రోహి, అతని అనుచరులు హతమై, రాజహంసలు క్షేమంగా లభించినందుకు ఆనందంతో విరాట్ దుస్తుల్ని ముద్దుపెట్టుకున్నారు. సంతోషంతో నృత్యం చేశారు. విరాట్ లాంటి యోధుడు లేడని, విరాధివీరుడని జయజయ ధ్వానాలు చేశారు.
సైనికులంతా తిరిగి రాగానే వాళ్ళు దోచుకున్న సంపదనంతటిని బళ్ళపై చేర్పించారు. ఆ బరువుకు బళ్ళ చక్రాలు నేలలోకి కుంగిపోయాయి. ఈ బళ్ళను లాగడానికి అదనంగా మరికొన్ని దున్నల్ని కట్టారు.
రాజుగారికి ఈ విజయవార్త అందజేయడానికి ఒక వార్తాహరుణ్ణీ ముందుగా పమపారు. మిగిలిన వాళ్ళంతావిజయోత్సాహంతో ఈ బళ్ళవెంట నడిచారు.
అందరూ ఆనందపరవశులై ఉంటే విరాట్ మాత్రం నిర్లిప్తంగా, కళ్ళముందు జరుగుతున్నదంతా స్వప్నంలా చూస్తూ కూర్చున్నాడు. సైనికులు శవాల దుస్తుల్ని తొలగించడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం పెదవి విప్పాడు. వద్దని వారించాడు. శవాలను దహనం చేయడానికి చితులు పేర్చవలసిందిగా కోరాడు. శత్రువుల శరీరాల్ని ముక్కలుముక్కలుగా నరికి కాకులకూ, గద్దలకూ వేయాల్సిందిపోయి, వాళ్ళపట్ల ఆయన దయ చూపిస్తున్నందుకు అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన చెప్పినట్లు చేశారు. విరాట్ స్వయంగా ఆ చితులకు అగ్నిసంస్కారం గావించాడు. చితులు పూర్తిగా మండి, నిప్పుకణికలు బూడిదై నేలమీద కలిసిపోయేదాకా తలవంచుకొని విరాట్ అక్కడే నిలబడిపోయాడు.
ఈలోగా విరాట్ సైనికులు, నిన్న శత్రుసైనికులు సగం నిర్మించిన వంతెనను పూర్తిచేశారు. మొదలు కొంతమంది యోధులు వంతెన దాటారు. తరువాత బానిసలు, ఆ తర్వాత ఆశ్వికదళ సర్దారులు వంతెన దాటారు. అంతకు ముందే విరాట్ చాలామంది సైనికుల్ని పంపేశాడు. వాళ్ళ కేకలకి, పాటలకి విరాట్ మానసిక స్థితికి పొత్తు కుదరలేదు. వంతెన మధ్య నిలబడి నదీప్రవాహాన్ని చాలాసేపు గమనించాడు. నదిని దాటినవాళ్ళూ, దాటుతున్నవాళ్ళు, దాటబోయేవాళ్ళూ అంతా విరాట్ వంక ఆశ్చర్యంగా చూశారు. స్వర్గాన్ని సవాల్ చేస్తున్నాడా అన్నట్లు ఖడ్గాన్ని పైకెత్తాడు. కాని చెయ్యి కిందికి దించుతున్నప్పుడు చేతివేళ్ళు పట్టుతప్పి ఖడ్గం నీళ్ళలో పడిపోయింది. పొరపాటున ఖడ్గం నీటీలో జారిపడిందని, దాన్ని తీసుకురావటానికి ఇరు తీరాలనుంచి ఇద్దరు సైనికులు నీటిలోకి దూకారు. దాన్ని వెదికే ప్రయత్నం చేస్తుండాగా విరాట్ వద్దని సైగ చేసి ముందుకు సాగాడు. చూస్తున్న వాళ్ళందరు ఆశ్చర్యపోయారు. ఇళ్ళకు వెళ్ళుతున్నామన్న ఆనందంలో అంతా తలమునకలవుతుంటే విరాట్ మాత్రం అంతులేని వ్యథతో ఎవ్వరితోను పెదవి విప్పి మాట్లాడలేదు.
వీరవాఘ సింహద్వారం ఇంకా చూపుకందని దూరంలో ఉండగానే తెల్లని ధూళిమేఘాలు ముందుకు తరలి రావడం కనిపించింది. రాను రాను ధూళిమేఘాలు తెరిపినబడ్డాయి. ముందు పరుగున వస్తున్న సైనికులు, అశ్వికదళం కనిపించింది.
సైన్యాన్ని చూడగానే వాళ్ళు ఆగారు. రహదారి మీద తివాచీలు పరిచారు. రాజుగారు దిగబొతున్నారు అనేదానికి ఇదో నిదర్శనం. జన్మించింది మొదలు మరణించేదాకా రాజుగారు మట్టిపై పాదం మోపకూడదు. అందుకే తివాచీలు పరిచారు. కొద్దిసేపటికి గజారూఢుడై రాజుగారు వేంచేశారు. సైన్యం ముందుకు వచ్చి ఆ గజరాజు వంగాడు. రాజుగారు ఏనుగు అంబారీ పైనుంచి దిగి తివాచీ మీద నిలబడ్డారు. రాజుగారికి ప్రణమిల్లే ఉద్దేశంతో విరాట్ ముందుకు రాగానే రాజుగారే ముందుకు వెళ్ళి విరాట్ ను ఆలింగనం చేసుకున్నారు. తక్కువ స్థాయి వాళ్ళెవరికీ ఇంతకుముందు ఇలాంటి గౌరవం ఎప్పుడూ జరగలేదు. విరాట్ రాజహంసల్ని మహారాజుగారి ముందుకు తెప్పించాడు. ఆ హంసలు తమ రెక్కల్ని విదిలించేసరికి ప్రజలు హర్షధ్వానాలు చేశారు. ఆ శబ్దాలకు గుర్రాలు బెదిరి వెనుక కాళ్ళమీద నిలబడ్డాయి. ఏనుగుల్ని అదుపులో ఉంచడం మావటి వాళ్ళకు కష్టమైంది. ఈ విజయోత్సాహం మధ్య రాజుగారు విరాట్ ను మరోసారి కౌగిలించుకున్నాడు.
తరువాత తమ పూర్వీకుల ఖడ్గాన్ని మోసుకువచ్చిన సైనికుణ్ణి పిలిచారు. అతని దగ్గర నుంచి రాజుగారు ఆ విలువైన ఖడ్గాన్ని అందుకున్నారు. అది తమ వంశ ప్రథమ రాజపుత్ర వీరుని ఖడ్గం. ఏడు వందల సంవత్సరాలనుంచి ఆ ఖడ్గాన్ని రాజుగారి ఖజానాలో భద్రంగా ఉంచారు. వజ్రాలతో పొదిగిన దాని పిడి మిరిమిట్లు గొల్పుతున్నది. దాని అంచున విజయసంకేత మంగళ వాక్యాలను సువర్ణాక్షరాలతో లిఖించారు. వాటిని సిద్ధులు, మహాపండితులు మాత్రమే చదువగలరు. అలాంటి విశిష్ట ఖడ్గాన్ని విరాట్ పట్ల కృతజ్ఙతా సూచకంగా, ఇకనుంచి తన సర్వ సైన్యాధ్యక్ష పదవిని అప్పగిస్తున్నదానికి గుర్తుగా విరాట్ కు బహుకరించబోయారు.
కాని విరాట్ వినయంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ "మహారాజా! తమరు అత్యంత దయామయులు. నేను మిమ్మల్ని ఒక కోరిక కోరవచ్చా?" అని అడిగాడు.
"ఆ కోరిక ఏమిటో చెప్పకముందే దాన్ని అనుగ్రహిస్తున్నాను. నువ్వు కోరుకుంటే నా అర్థరాజ్యం ఇవ్వడానికైనా సిద్ధమే" అన్నారు.
"అయితే మహారాజా! ఈ ఖడ్గాన్ని తిరిగి ఖజానాకు పంపండి. ఈ యుద్ధంలో నా సొంత అన్ననే చేజేతులా చంపుకున్నాను. మా తల్లికి మేమిద్దరమే బిడ్డలం. నాతో పాటే అతన్నీ పెంచింది మా అమ్మ. అతన్ని చంపేశాను. అతను నా అన్న అని తెలిశాక జీవితంలో ఇక ఎప్పుడూ కత్తి పట్టనని మనస్సాక్షిగా ప్రమాణం చేశాను " అని వినయంగా చప్పాడు విరాట్.
మహారాజుగారు ఆశ్చర్యంగా విరాట్ వైపు చూసి "అలాగే. నువ్వు యుద్ధం చేయనవసరం లేకుండానే నా సేనాధిపతిగా ఉండు. నువ్వు ఉన్నంత కాలం శత్రువులనుంచి నాకు ఎలాంటి భయమూ ఉండదు. నువ్వు కాబట్టే ఇంత తక్కువ సైన్యంతో నీ తెలివితేటలనుపయోగించి అంత బలమైన శత్రువుని జయించగలిగావు. నా ఆజ్ఙను మన్నించి ఈ ఖడ్గాన్ని తీసుకో. ఇది అధికారానికి చిహ్నం. నా గుర్రాన్ని కూడా నువ్వు తీసుకో. ఈ ఈటెను తీసుకో. దీని ద్వారా నువ్వు సర్దారులందరికీ సర్దారువనేది అర్థమవుతుంది" అన్నారు.
"మహారాజా! నా సోదరుణ్ణి చంపాక ఏదో అదృశ్యశక్తి నా హృదయంలో ఓ ఆలోచనను రేపింది. ఇకనుంచి ఎవరిని చంపబోయినా నా సోదరునిలాంటి వాణ్ణి చంపుతున్నాననే భావం నాలో కలుగుతుంది. ఇకనుంచి నేను యుద్ధాలు చేయలేను. ఖడ్గం బలానికి చిహ్నం. బలం సత్యానికి విరోధి. ఇతరులను భయపెట్టాలన్న కాంక్ష నాకు లేదు. ఇతరుల్ని భయపెట్టి విలాసంగా బతికేకన్నా భిక్షమెట్టుకొని బ్రతకడం మంచిదని నేను భావిస్తున్నాను. జీవితం చాలా చిన్నది. మిగిలిన ఈ శేష జీవితాన్ని చెడుకు దూరంగా గడపాలని కోరిక" అని ఎంతో వినయంగా విన్నవించుకొన్నాడు విరాట్.
అది విన్న మహారాజు ముఖం కళావిహీనమై చిన్నబోయింది. రాజుగారి మనసులో విజయోత్సాహం స్థానంలో తెలియని భీతి ఆవహించింది. తన పూర్వీకుల కాలమ్నుంచి ఇలా ఎప్పుడూ జరుగలేదు. ఏ యోధుడు యుద్ధాన్ని త్యజించలేదు. ఎవ్వరూ మహారాజు బహుమానాన్ని ఇలా తిరస్కరించలేదు. ఏం చెయ్యాలో మహారాజుగారికి పాలుపోలేదు.
శత్రువులనుండి విరాట్ కాపాడి తీసుకువచ్చిన రాజహంసల్ని చూశాడు. విజయ చిహ్నమైన వీటిని చూడగానే రాజుగారి ముఖంలో వెలుగొచ్చింది.
"శత్రువులతో పోరాడడంలో నువ్వు వీరాఢివీరుడవని గుర్తించాను. ఇకనుంచి యుద్ధానికి నీ సహాయ సహకారాలు లభించకపోయినా ఫరవా లేదు. నీవంటి నమ్మకస్తులైన ప్రభుభక్తులు రాజ్యంలో ఎవ్వరూ లేరు. నీ సేవలు నాకు కావాలి. నీవు ధర్మబద్దుడవు. చెడు జోలికి పోవు. చెడును గుర్తించగలవు. చెడును నిర్మూలించగలవు. కాబట్టి ఇకనుంచి నువ్వు న్యాయాధికారులందరిపై ప్రధాన న్యాయాధికారివై, నా రాజభవనంలోనే ఉండి న్యాయ నిర్ణయం చేస్తూ ఉండు. నీ నేతృత్వంలో నా రాజ్యంలో సత్యం వెలుగొందుతుంది. ప్రజలు న్యాయబద్దంగా నడచుకొంటారు" అని అన్నారు మహారాజు.
దానికి విరాట్ అంగీకార పూర్వకంగా భక్తితో శిరస్సు వంచాడు. రాజుగారు సంతోషించి విరాట్ ను రాచ ఏనుగునెక్కవలసిందిగా ఆదేశించారు. విరాట్ తో కలిసి రాజుగారు తన అరవై స్తంభాల నగరంలోకి ప్రవేశించాడు. అప్పుడు తుఫాను సమయాన సముద్రఘోషలా విజయ నినాదాలు, హర్షధ్వానాలు వినిపించాయి.
(సశేషం)

































