కలువకొలను లచ్చి
అందులో...ఓరోజు ఆ ఆదిదంపతులు, స్థితి సంపద కారకులిరువురు, ఈ లోకాన్ని గూర్చి, కుమారుని సృష్ఠి మర్మాలను గూర్చి చర్చించుకుంటున్న సమయంలో మానవలోకం - అందులోను పల్లెసీమల ముచ్చట వచ్చింది. చూసి వద్దామా గుమ్మడీ అన్నాడు ఆ సుందరుడు. ఆహా! మీరు వద్దు. ముందునే వెడతా. తదుపరి మీరు రండి అంది సముద్ర రాజ తనయ!
సరే పయనం ఆరంభమయింది. ఒక్కతే వస్తే మరి రాచమర్యాదయేముంది చెప్పండి.
చెలికత్తెలు - చంపకాలయ్యారు. అమరులు - అరవిందాలయ్యారు. సంపదలు -
సంపెంగలయ్యాయి. మరి ఆది లక్ష్మికి ఆలోచన కలిగింది. అందరూ సుమమార్గాలనే ఎంచుకొంటే, తనకేం దారి అనుకొంది!
అనుకొంటూ ఆలోచిస్తుండగా అల్లంత దూరంలో ఓ కొలనూ, ఆ కొలనులో సద్దులేని జలరాసులు కనబడేసరికి-తన తల్లి గుర్తుకొచ్చింది.తల్లి ఒడిలో సేదతీరుదామనుకొనేసరికి, మదిలో ప్రశ్నకు జవాబు దొరికింది. తాను కూడ ఒక సుమమైతే తన నాధుని ప్రవర్తన చూడాలనుకొంది. ఆత్మభవుని ఆనందంగా తలుచుకొంది
అంతే...
ఆ కొలనులో కలువై నిలిచింది.
ఆ విష్ణువు తన తన్మయ దృష్టిలొ చూసి, భ్రమరమై ఆమెతోనే ఉండిపోయాడు.
పరమేశ్వరుని సృష్టి - సర్వం జగదమృతం.
సర్వభూతహితం - లోకకల్యాణం.
ఆమె సౌందర్యలహరి - అతడు సూత్రధారి.
రచయిత : శ్రీ కె. ఎస్. ఎస్. శాస్త్రి





























