స్నేహితులు

యాహూ ఈ మెయిల్ యధాలాపంగా చూస్తున్నాడు మురళి. బేంక్ ఆఫ్ ఆఫ్రికా ఓగడూగూ నుంచి ఒక ముఫ్పై మిలియన్ డాలర్లు వైరు ట్రాన్స్ఫర్ చేస్తాము, నీ బేంక్ అకౌంట్ నంబరు ఇమ్మని ఒక ఈ మెయిల్, మైక్రోసాఫ్టు లాటరీలో పదిహేను మిలియన్ డాలర్ల విజేతవి నువ్వు, నీ సోషల్ సెక్యూరిటీ నంబరూ, బేంక్ అకౌంట్ నంబరూ ఇస్తే డబ్బు పంపుతామని లండన్ నుంచి ఇంకో ఈమెయిలూ. ఏంటో తనకు మిలియన్ల మీద మిలియన్లు డబ్బు ఇచ్చేయడానికి వీళ్ళందరికీ ఎంత ఉబలాటమో పాపం అనుకున్నాడు. ఆ తర్వాత ఈ మెయిలు - నేను మోడలింగ్ చేద్దామనుకుంటున్నాను ఫలానా వెబ్ సైటుకి వెళ్ళి నా ఫొటోలు చూసి ఏవి బాగున్నాయో చెప్పు అని లాస్ ఏంజెలస్ నుండి పంధొమ్మిదేళ్ళ మిషెల్ నుంచి ఒక ఈమెయిలు. ప్రిస్క్రిప్ షన్ లేకుండా సగం ధరకే వయాగ్రా అమ్ముతామని ఇంకొక ఈ మెయిల్ .. ఇలాంటి దిక్కు మాలిన ఈమెయిళ్ళ మధ్యన వున్న ఓ రెండు ఈ మెయిళ్ళు మురళి దృష్టిని ఆకట్టుకున్నాయి.

"హాయ్ ఫ్రం రంగనాధ్" అని ఒకటి, "పరదేశమేగిన ప్రియ మితృడికి .." అని ఇంగ్లీష్ లో ఇంకొకటి.

ఆ రెండోది ఎవరి దగ్గరనుండి వచ్చిందా అని పేరు చూశాడు. ఈమని ఈశ్వర ప్రసాద్. చాలా ఆశ్చర్యం వేసింది. ఎన్నాళ్ళకి మళ్ళీ ఆ పేరు విన్నాడు! ఎప్పుడో చిన్నప్పుడు, వీళ్ళద్దరూ కూడా ఇంటర్మీడియట్ లో పరిచయం, కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత తనూ, రంగనాధ్ బీఎస్సీ చేశారు. ఈశ్వరప్రసాద్ మెడిసిన్ లో జాయిన్ అయ్యాడు. హబ్బ ఎన్నాళ్ళ తర్వాత చిన్ననాటి సహాధ్యాయుల కబురు అందింది అని ఆతృతతో ముందర రంగనాధ్ మెయిల్ తెరిచి చూశాడు.


"హాయ్ మురళీ,

This is RanganAdh. Hope you remember me. బీఎస్సీలో కాలేజ్ జెనరల్ సెక్రటరీ. Writing to you after many years. After our B.Sc I went into Management and joined Mahindra & Mahindra as a manager. Now I am the Regional General Manager, 2nd in line after our Preident and CEO. Got married in 86 and have two children. Son is Engineer and Daughter is MCA. Both are heading to your USA.

Keep in touch.

R.Ranganadh
Regional General Manager, Mahindra & Mahindra Ltd."

రంగనాధ్, ఇంచుమించు ఈ ముప్పై ఏళ్ళలోనూ ఒకసారెప్పుడో తారసపడ్డం జరిగింది. ముప్పై సంవత్సరాల తర్వాత వ్రాసిన వుత్తరం చదివితే ఎందుకో ఏ స్పందనా కలగలేదు. ఇన్నాళ్ల తర్వాత వ్రాసిన వుత్తరంలో "ఎలా వున్నారు నువ్వూ, నీ కుటుంబమూ" అన్న ఒక్క మాట కనిపించనందుకో, లేక అయిదు సంవత్సరాలు కలిసి చదువుకుని, అందులోనూ రాత్రీ పగలు కంబైండు స్టడీస్ కూడా చేసిన స్నేహితుడికి - నేను "కాలేజ్ సెక్రెటరీ" అన్న వాక్యంతో పునః పరిచయం చేసుకున్నందుకో .. ఏమో!

ఈశ్వర ప్రసాద్ వుత్తరం తెరిచి చూశాడు. తెలుగు లిపి లో వుంది వుత్తరం.


"ప్రవాసమై పయనమైన ప్రియమితృడు, మురళికి,

ఏమని చెప్పాలి? నమస్కారం అనాలా, పెద్దతనం ఆపాదించేసుకుని ఆశీస్సులనాలా, లేక అభినందనలు అనాలా? ప్రస్థుతానికి శుభాకాంక్షలుతో మొదలు పెడతాను.

ఇన్నాళ్ళకి గుర్తుకొచ్చానా అని అనుకుంటున్నావా? నిన్ను మరిచిపోతే కదా గుర్తు పెట్టుకునే ప్రశక్తి వస్తుంది? ఏమిటో దైనందిన జీవితంలో పడి .... అయినా స్నేహితుడికి ఇన్నాళ్ళకి వుత్తరం వ్రాస్తున్నందుకి సంజాయిషీలూ, కారణాలు చెప్పను. నువ్వు చిన్నప్పుడు కర్ణ సుయోధనుల స్నేహం గురించి గొప్ప వ్యాసం వ్రాసావు "మహారధి కర్ణ" అని. నీకు ఙాపకం వుండే వుంటుంది, మన పరిచయం దానితోనే ప్రారంభం అయ్యింది. నేను దుర్యోధనుడంతటి రారాజుని కాకపోయినా నువ్వు మాత్రం కర్ణుడంతటి ఉత్తమ గుణాలున్న వాడివి. స్నేహం అంటే వాళ్ళిద్దరిలాగ వుండాలి అని ఆ వ్యాసంలో అన్నావు. దానితోనే ఇలాంటి మితృడొకడుంటే ఎంత బాగుణ్ణు అనిపించేలా చేశావు. ఏమిటో ముప్పై ఏళ్ళ నాటి మాటలు చెప్పి బోర్ కొడుతున్నానా?

నువ్వెలా వున్నావు? ఈ పాటికి నువ్వు జీవితంలో చాలా అనుభూతులూ, అనుభవాలూ కూడబెట్టుకుని వుంటావు. నీ అభిరుచులకి తగ్గ భార్య, నీ ఆదర్శాలకి తగ్గ పిల్లలూ వుండి వుంటారు అనే నా విశ్వాసం.

'జోనాధన్ లివింగ్ స్టన్ సీ గల్ పుస్తకం చదివితే నువ్వు మనసులో మెదులుతావు, అయన్ ర్యాండ్ 'అట్లస్ ష్రగ్డ్' లో జాన్ గాల్ట్ పేరు వింటే నువ్వు తలపుల్లోకి వస్తావు, తిలక్ 'అమృతం కురిసిన రాత్రి చదివితే, లత 'మోహన వంశి చదివితే, బాపిరాజు 'గోన గన్నారెడ్డి చదివితే నువ్వు గుర్తుకొస్తావు .. ఎందుకో తెలుసా? వీటన్నిటి గురించీ నువ్వు ఎంతో తాదాత్మ్యతతో మాటలాడేవాడివి కాలేజిలో వున్నప్పుడు. నీ రచనలు మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తాయేమోనని ఎదురు చూసాను. అలాగయినా నీ చిరునామా పట్టుకోవచ్చునని. నీ రచనా వ్యాసాంగానికి అడ్డుకట్ట పడలేదనే నా ఆకాంక్ష. ఏ కారణాల చేతనయినా ఆటంకం కలిగితే .. దానిని మాత్రం అశ్రద్ధ చేయకు. నీ వైవిధ్యమయిన వ్యక్తిత్వంలో అదొక అత్యుత్తమ ప్రతిభ.

నీ వీలు చూసుకుని నీ సంగతులు, విశేషాలూ బోల్డన్ని వ్రాయి. నీ దగ్గర నుండి విద్యుల్లేఖ వస్తే .. గతించిన మూడు దశాబ్దాలూ మూడు క్షణాలుగా కుదించికు పోతాయి. ఙాపకాల వీధి చివర వరకూ .. పశ్చిమం నుంచి వుత్తరం కొరకు ఎదురు చూస్తూ,

ఈశ్వర ప్రసాద్"

చదువుతుంటే కళ్ళు చెమరించాయి మురళికి. ఎన్ని సార్లు చదివాడో ఆ వుత్తరాన్ని. ఎంత స్పందించేలా వ్రాశాడు? తనని పొగిడినందుకు కాదు, ప్రతీ వాక్యంలో నిష్కల్మషం కనిపించినందుకు, ఎదుటి వ్యక్తి మీద ఎంతో గౌరవం చూపించి నందుకు.

రంగనాధ్ ఉత్తరానికీ ఈశ్వర ప్రసాద్ ఉత్తరానికీ ఎంత తారతమ్యం? ఇద్దరూ చిన్ననాటి స్నేహితులే. నిజానికి చెప్పాలంటే రంగనాధ్ తోనే ఎక్కువ కాలం పరిచయం. ఇంటెర్మీడియట్ లో పరిచయం అయినప్పటి నుండీ బీ.ఎస్సీ వరకూ కలిసి, ఎన్నో రాత్రుళ్ళు మిగిలిన స్నేహితులతో కలిసి కంబైండు స్టడీస్ అంటూ కలిసి చదువుకునే వారు.

రంగనాధ్ నిజానికి తనకంటే బాగానే చదివే వాడు. వాళ్ళ నాన్నగారు తమ ఇద్దరికీ ఇంటెర్మీడియట్ లో లెక్కలూ, కెమిస్ట్రీ చెప్పేవారు కూడానూ. ఎందుకో కాలేజీలో లెక్చరర్స్ బొత్తిగా రిజర్వేషన్ కేండిడేట్లు. వాళ్ళకే సబ్జెక్టు వచ్చి చావదు. ఇంక స్టూడెంట్స్ కి అర్ధం అయ్యేలా ఎలాగ చెప్ప గలరు? కెమిస్ట్రీ అయితే ఇంకా అధ్వాన్నం. లేబ్ లో పనిచేసే అసిస్టెంటుకి ఇంకా చాలా బాగా వచ్చును. ఏమిటో ఆ లెక్చరర్స్ మీద కోపం వచ్చేది. ఏది ఏమయినా పరీక్షల్లో మార్కులు సరిగ్గా రాకపోతే పాడయ్యేవి తమ జీవితాలే. అందుకని ఎలాగో అలాగ కష్ట పడేవారు. అందుకని రంగనాధ్ వాళ్ళ నాన్న గారు వివరించి చెబుతారేమోనని ఆయన దగ్గరకి వెళ్ళే వాడు మురళి. రంగనాధ్ అంతకు ముందే వాళ్ళ నాన్నగారి దగ్గర చెప్పించేసుకునే వాడు. ఆ తరవాత మురళితో పాటుగా కూర్చున్నప్పుడు మురళికి అర్ధం కాకపోతే .. "నీకు అర్ధం కావటంలేదు కదా పాపం.." అని ఓ పక్క సింపతీ చూపిస్తున్నట్టుగానూ అనేవారు. మురళి కి అది సింపతీలాగ అనిపించేది కాదు. "నీకు రాక పోతే మా రంగాని అడుగు, చెబుతాడు" అనే వారు. మనసు చిన్న బుచ్చుకున్నా భరించేసే వాడు. ప్రైవేటు పెట్టించే స్థోమతు లేదు, ఇంట్లో తనకు చెప్పే వాళ్ళెవరూ లేరు.

"అయినా నువ్వు ఎనిమిదో తరగతి 'స్కిప్' చేసి తొమ్మిదిలోకి వచ్చావు కదా, నీకు ఫౌండేషన్ సరిగ్గా లేదు. ఆ పని చెయ్యకుండా వుండవలసింది" అనే వారు.

మురళికి 7వ తరగతిలో మంచి మార్కులు వచ్చాయని, డబుల్ ప్రమోషన్ ఇచ్చి తొమ్మిదో తరగతిలో వేశారు. పాపం ఆ సమయంలో మురళి కి తన సెల్ఫ్ ఎస్టీంకి అదొక్కటే గొప్ప అచీవ్ మెంట్ గా అనిపించేది. ఆ డబుల్ ప్రమోషన్ ని 'స్కిప్' అని చులకనగా మాట్లాడి ఎందుకు ఆ చిన్న సంతోషాన్ని కూడా కొల్ల గొడతారో మనుషులు. తానెంతగా నొచ్చుకున్నాడంటే ఇన్నాళ్ళ తరవాత కూడా తనకి గుర్తుంది.

ఇలాంటి వ్యక్తులకి స్నేహం అంటే ఏమని అర్ధం అవుతుంది?

మరి ఈశ్వర ప్రసాద్ లాంటి వ్యక్తులతో ఆ స్నేహం ఒక మదురమైన అనుభూతి.

"ఏమిటీ దీర్ఘాలోచనల్లో పడిపోయావు?" అన్న భార్య శ్రీదేవి మాటలకి ఆలోచనల్లోంచి బయటకు వచ్చాడు మురళి.

"నా చిన్ననాటి స్నేహితులు, ఇద్దరి దగ్గరనుంచి ఒకే సారి రెండు ఈ మెయిల్స్ వచ్చాయి" అన్నాడు.

"అబ్బో, అయితే చాల గొప్ప విశేషమే. అయితే నీకు చాలా ఆనందంగా వుండి వుంటుంది. ఇద్దరికీ సమాధానం వ్రాశావా మరి?" అంది.

ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు మురళి - " ఇద్దరికీ కాదు. ఒక్కరికే వ్రాద్దామనుకొంటున్నాను."

"అదేంటి? ఇంత కాలంకి తిరిగి కలిసిన చిన్న నాటి స్నేహితులకి సమాధానం వ్రాయవూ?"

"అన్ని దీర్ఘ పరిచయాలూ స్నేహాలు కావు. సరైన స్నేహ భావన వుండాలంటే ఎక్కువ కాలం పరిచయం వుండనక్కర లేదు" - భార్యతో అన్నాడు మురళి.

భర్త సున్నితత్వం తెలిసిన శ్రీదేవి, అతని భుజం మీద చెయ్యి వేసి .. "అర్ధం అయ్యింది. నీకు ఎలా చెయ్యాలని అనిపిస్తే అలాగే చెయ్యి. మొహమాటం పడనక్కరలేదు."

మురళి లేఖిని వెబ్ సైటు కి వెళ్ళి తెలుగులో టైపు చెయ్య సాగాడు -

"ప్రియమితృడు ఈశ్వర ప్రసాద్ కి .."

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     అద్భుతం
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)