ఆత్మలో అమృతనాథుడు

మదిలో రస స్ఫూర్తి ఇనుమడించిన వేళ, ప్రపంచంలో తనకున్న శక్తియుక్తులన్నిటినీ కూడదీసుకుని కళాకారుల మనస్సు కళా సృష్టి చేస్తుంది. కొన్ని వందల భావాలు ఒకే చిత్రంతో చెప్పడానికి తన కుంచెను సర్వ రీతుల్లో ఆనందనర్తనమాడిస్తారు చిత్రకారులు. సరిగ్గా ఆ సంగతులను తెలుసుకుని ఆనందిచేదే రసజ్ఞ హృదయం. కుంచె కొసల నుండి జాలువారే వేలాది భావాలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నమే ఈ శీర్షిక. ప్రతి నెలా శ్రీ శేషగిరి రావు గారి చిత్రాలకు వెనుక కథ ఇందులో మీకోసం.....






వర్ణన:కె.వి.ఎస్.ఎస్.శాస్త్రి

ఈ కన్య
ఆముక్త మాల్యద గ్రంథనాయిక||
ఈమె తండ్రి విష్ణుచిత్తుడు నేరుగా విష్ణువును పూజించిన ధన్యుడు|
తన స్వామి లీలా మానుష రూపాన్ని పలు విధాలుగా
కూతురుకి వర్ణించి వివరించి చెప్పేవాడు

ఆమె
అప్పుడె కొత్తగా, కొత్తలోకాల్లోకి అడుగుపెడుతున్న కన్య ఆయె|
తండ్రి చెప్పిన- ఆ విష్ణురూపు రేఖావిలసాలను
మనుసులోనే ఊహించుకునేది||

ఏదో తెలియని భావం| ఎంత తరచిన అవ్యక్తం|
పూలకు-లతలకు తనమనో వెతలను తెలిపింది||
అన్నం రుచిరాదు కంటికి కునుకు రాదు|
ఎక్కడ చూసినా ఆ స్వామి రూపం||

చివరికి నిశ్చయించుకుంది|
ఆయనంటే తనకిష్టం అనుకుంది||
కాని ఏంలాభం | అప్పటికే ఆ విష్ణు హృదయంలో ఇరువురు భామలు||
అక్కడ తనకి చోటు లేదనుకుంది
అయితే యేం |
తన హౄదయం లో చోటిచ్చింది ||

ఆమె తండ్రిది, ఇహంలో ఉన్నా- ఎప్పుడూ "పరధ్యానమే" ||
కూతురిని,
పెరట్లో పూలన్నీ కోసి, మాలగా కట్టమని అడిగేవాడు
అన్యం పుణ్యం ఎరుగని అవ్యక్త లోక సంచారి||

ఆమెలో|
ప్రేమయితే అంకురించింది కాని, వయసుపరిపక్వతలేదు|
చిలిపితనం గంతులు వేసేది|
మాలలుగా కట్టిన సుమాల హారాన్ని,
తాను-తనమనసులోవున్న ఆ స్వామి అలంకరించుకొంటే
ఎలావుంటుందనే చిన్న కన్నెకోరిక||

అలంకరించుకొనేది|| అందరిముందుకువెళితే...
తనకు అపరాధం- తండ్రికి అపవాదం||

మరి!
ఆ ఆనందాన్ని పంచుకునేదెవరు?
ఏకాంతంలో - అరుణవర్ణాలు, మంచుబిందువులు
మౌనమె వహించాయి మరి||

అందుకే- ఆ కల్హార సహితరూపాన్ని
బావినీళ్ళలొ తన నీడ చూసుకొని మురిసిపోయేది||
పులకరించేది- తనువుమరిచేది, నిట్టూర్చేది ||
ఆస్వామి తనవాడనుకొనేది ||

రోజులాగానే ఆమె తండ్రి ఉషోదయపూజకు సిద్ధమయ్యాడు |
కేశవునికర్పించే పూలదండలో "కేశా"న్ని చూశాడు ||
ఆ బ్రాహ్మణునికి పై ప్రాణాలు పైకే పోయాయి ||

తన కర్మలో, నిష్ఠలో, భక్తిలో అజాగ్రత్తకు వగచాడు ||

ఆరాతీస్తే|
అమ్మాయి మనసు తెలిసింది| సత్యం దాగదుకదా||
చివరకు ఏంజరుగుతుంది చెప్పండి|
ఆ స్వామి కూడా ఆంతేకదా | మగువ మనసెరిగినవాడు
ఏ కన్యను కాదంటాడనుకొంటే - అపరిపక్వతయేకదా||
లొకకల్యణమే జరిగింది | అదే గోదాదేవి కళ్యాణం ||

" భగవంతుని సృష్ఠితెలుసుకోవచ్చు | కాని కన్నెమనసు
తెలుసుకోవడం సాధ్యమా చెప్పండి. అందులోనే సృష్ఠిదాగివుంది "
ఆమె ప్రకృతి - ఆతడు పురుషుడు.
వారి కల్యణం - కమనీయం , కర్ణరసామృతం ||


ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     అద్భుతం
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)