నాట్య ముద్రలు - యోగ ముద్రలు

సిలికానాంధ్ర నిర్వహిస్తున్న 'అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం' దగ్గరలో వున్నది. ఆ సాంప్రదాయంలోని అతిరధ మహారధులు, జీవితాన్నే నృత్యంగా, నృత్యం జీవితంగా సిద్ధులై, ప్రసిద్ధులైన చరితార్ధులు, సమర్ధులు అందరూ సన్నద్ధులవుతున్నారు.

సిద్ధేంద్ర యోగి - కూచిపూడి నాట్య కళకు మూలపురుషులు అని ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనవసరంలేదు. అయితే కళతో అంతగా పరిచయంలేని సామాన్యులకి కూడా అర్ధమవుతుంది - ఆయన పేరులోనే - సిద్ధి ఇంకా యోగము వున్నాయని. కళనికూడా యోగంగా తపస్సుగా భావించి, సాధనగా చేసిన వారెందరో వున్నారు. సంగీతాన్ని, గానాన్ని తపస్సుగా నాదయోగంతో అక్షరాలకి జీవాన్ని పోసి ధన్యులయ్యారు, భగవంతుని చేరువయ్యారు, యోగులయ్యారు త్యాగయ్య, అన్నమయ్య, మీరాబాయి,రామదాసు ఇలా ఎందరో. మంత్రంతోనే కాదు ప్రతి కళలోను ప్రకృతి ప్రసాదించిన అతీంద్రయ శక్తిని అనుభూతి చెంది, అందులో లయమయినపుడు కూడా సిద్ధులు లభిస్తాయి అనిపిస్తుంది.

తాన్ సేన్ దీపక రాగం ఆలపిస్తే దీపాలు వాటంతట అవే వెలిగాయిట. అంటే అక్షరాలు రాగంతో కూడినపుడు జనించే శబ్ద తరంగాలకి అంత శక్తి వుందన్నమాట. మరి మేఘమల్ హార్ తో మేఘాలు వర్షించాయిట! ఇప్పడికి అనిపిస్తుంది గాయత్రి మంత్రాన్ని ఏదైన ప్రత్యేక రాగంలో ఆలపించాలేమో అని. ఎందుకంటే, గాయత్రీ మంత్ర నిర్వచనం, "గాయంతాం త్రాయతే ఇతి గాయత్రీ" అని. అంటే గానం చేసే వారిని రక్షించేది గాయత్రి అని అర్ధం. ఎలా గానం చెయ్యాలో ఎవరూ చెప్పటంలేదు. వేద మంత్రాలకి మాత్రం స్వరాలుండటం చేత స్వరయుక్తంగా వాటిని చదవగలుగుతున్నాం. గాయత్రీ మంత్రానికి అధర్వణ వేదంలో ఇంకో చరణం వుందని చెప్పడం జరుగుతోంది (పరోరజసి సావదోం). అంతే కాక దేవతలుపాసించే గాయత్రీ మంత్రం వేరే వుందని మహాత్ములు చెపుతున్నారు. గయ అనే పుణ్య క్షేత్రం గురించి అందరూ వినే వుంటారు. అలాంటి, శరీరంలోని గయలను, అంటే శక్తి క్షేత్రాలను నియంత్రించే శక్తి కనుక ఆ శక్తిని గాయత్రీ అన్నారు అని నరసాపురంలో ఒక గురువులు తెలియజేసారు.

ఇక నాట్యరంగంలోకి వస్తే 'ముద్రలు ' ఎంతో ప్రాముఖ్యతను కలిగివున్నాయి. యోగ శాస్త్రంలో కూడా ముద్రలు విశిష్టతను కలిగి వున్నాయి. ఒక్కొక్క మంత్రాన్ని జపించే ముందు ఒక్కొక్క ముద్రను ప్రదర్శించి మంత్ర జపం చేస్తే ఆ దేవత త్వరగా అనుగ్రహించడం జరుగుతుందని, ఏకాగ్రత, శీఘ్ర సిద్ధి కలుగుతాయి అని చెపుతున్నారు. గాయత్రి జపం ముందు చేతులతో సుముఖం వంటి ముద్రలు చేయటం, హోమం చేసే ముందు జ్వాలినీ ముద్రను చూపటం, శ్రీచక్రార్చనలో యోనిముద్రను చూపటం సిద్ధిప్రదం అని మంత్రశాస్త్రం చెపుతొంది.

పలు నాట్య రీతులలోనూ, దేవతా మూర్తుల విగ్రహాలలోనూ కనిపించే ఈ ముద్రని కొందరు అభయ ముద్రగా కొందరు జ్ఞాన ముద్రగా పిలుస్తారు. ఈ ముద్ర బౌద్ధ మతంలోనూ ఖ్యాతి చెందింది, అయితే వేరు వేరు పేర్లతో పిలవబడుతొంది. ఏ పేరు ఎలావున్నా ఈ ముద్రలకి ఒక అర్ధం, పరమార్ధం వున్నట్టు ఆయా రంగాలలో నిష్ణాతులు అంగీకరిస్తారు.

నాట్యాన్ని వేదంగా 'నాట్య వేదం ' పిలుస్తారు. వేదాలు అపౌరుషేయాలు. అంటే ఏ మహాతపస్వికో దర్శనమై మనకి లభించిన జ్ఞాన సంపద. అంటే అవి ఏ విధంగా చూసినా అర్ధవంతంగాను అద్భుతంగాను వుండాలి, భగవద్దత్తం కనుక. ఉదాహరణకి నాట్య, యోగ శాస్త్రాలోంచి అభయ ముద్రని తీసుకుని సాముద్రిక శాస్త్ర పరంగా అర్ధం చేసుకుంటే కూడా అది అర్ధవంతం కావాలి కదా? ఈ ముద్రలో బొటన వేలి మీద చూపుడువేలుని వుంచడం కనిపిస్తుంది. ఈ వేళ్ళ ప్రత్యేకత ఏమిటి అని హస్త సాముద్రిక శాస్త్రవేత్తలని ప్రశ్నిస్తే చెపుతారు: బొటన వేలు వ్యక్తిని గురించి చెపుతుంది. చాల ముఖ్య మైనది. శూర్పణఖ శాస్త్రం, ప్రహ్లాద సాముద్రికం, రావణ సం హిత అనే అతి ప్రాచీన హస్త సాముద్రిక గ్రంధాలలో చెప్పారు, కేవలం బొటనవేలిని చూసి మొత్తం మనిషి జీవితాన్ని గురించి చెప్పవచ్చునట! ఆధునిక యుగంలో మనమూ అంగీకరిస్తాం బొటనవేలి ముద్ర చాల విశిష్టమైనది, ఏ ఇద్దరి వేలి ముద్రలు కలవవు అని. బయోమెట్రిక్ విజ్ఞాననికి అదేకదా మూలం. అంటే బొటన వేలు వ్యక్తి యొక్క ఐడెంటిటి ని చెపుతుంది. చూపుడు వేలుని ఏదైన చూపించడానికి వాడతాం (చూపుడు=చూపించడం కదా). ఆంగ్లంలో కూడా ఇండెక్స్ ఫింగర్ అంటున్నాం. అంటే దారి చూపేదన్న మాట. ఈపాటికి ఊహించే వుంటారు 'అభయ ముద్ర ' అంటే నీకు నేను దారి చూపిస్తాను అని అర్ధం. ఇంకో విశేషమేమిటంటే చూపుడు వేలికి గురుడు అధిపతి - హస్త సాముద్రికంలో. అంటే నీకు పైన నేను గురువుగా దారిచూపేందుకు వున్నాను అని అర్ధంట. అందుకేనన్న మాట ఈ ముద్రని రకరకాల మతాల, సాంప్రదాయాల వారు వాడుతున్నారు.

అందరికి తెలిసిన నమస్కారానికి కూడా హస్త సాముద్రికంలో అర్ధం వుంది. ఎడమ చేతి ఫలితాలు భగవంతుడు మనకేమిచ్చాడో చెపుతుందిట, కుడిచేతి రేఖలు మనం వాటిని ఎలా వినియోగించుకుంటున్నామో చెపుతుందిట. ఈ రెంటిని జతచేసి భగవంతునికి నమస్కరించడం నువ్వు ఇచ్చినదాన్ని, అంటే ఈ జీవితాన్ని వినియోగిస్తున్నా నా శక్తితో అని చెప్పడంట. అలాగే సాష్టాంగ నమస్కారం కూడా నేను నీకన్న తక్కువ స్థాయి కుండలిని స్థితిలో వున్నాను (అంటే మూలాధారంలా) నన్ననుగ్రహించు అని అర్ధంట. గుంటూరులో ఒక యోగి చెప్పారు, దేవాలయమే ఒక కుండలిని నిర్మితం. ధ్వజస్థంభం వెన్నెముక. గంట అనాహత చక్రం. దేవతా విగ్రహం వున్నది సహస్రారం అని. మనస్సు మణిపూరకంలో లగ్నమైతే హుండీ మీద, ప్రసాదాలమీద మనసు ఎక్కువ పోతుంది అని మరొక మహాత్ములు చలోక్తిగా చెప్పారు.

నాట్యంలో ముద్రలు, భంగిమలు అనంత సృష్టిలో అంతర్లీన శక్తులుగా, యోగ ముద్రలుగా భగత్చైతన్యాన్ని దర్శకులలోకి, ప్రదర్శకులలోకి ప్రవహింపచేసి తద్వారా ఉన్నత కుండలిని స్థాయిని, తద్వారా మరింత ఉన్నతికి కలుగుతుందని యొగశాస్త్రవేత్తలు అంటున్నారు.

అందుకే ఆ నటరాజు కూడా నాట్యం చేస్తాడుట. ఆ పరమేశ్వరానుగ్రహం కలుగుతుందని ఆసిద్దాం.

శ్రీ గురుభ్యో నమః

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)