అమెరికా శునకశాస్త్రం - కథా కమామీషు?

శుక్రవారం సాయంత్రం. పని వదిలి ఇంటికి బయలుదేరుతుంటే మిత్రుడి నుంచి ఫోను - బే ఏరియాలో కొత్త రెస్టారెంటు తెరిచారు. దాని పేరు 'ఖానా పీనా'. రేపు మధ్యహ్నాం లంచ్ కు వెళదామా అని. చెప్పొద్దు కాని ఆ రెస్టారెంట్ పేరు వినగానే నేనెందుకో అసౌకర్యంగా ఫీలయ్యాను. 'ఖానా పీనా'ను తెలుగులోకి తర్జుమా చేస్తే 'తినడం తాగడం'. నా చిన్నప్పుడు మా ఇంట్లో పెద్దవాళ్ళు పనిచెయ్యకుండా తిరిగే వాళ్ళను చూసి 'వాడో జులాయి. తినడం తిరగడం తప్ప వేరే పనిలేదు ' అని, అలాగే ఇదే విభాగంలో ఇంకో మెట్టు పైకి ఎక్కిన మందు బాబులను చూసి 'వాడికెప్పుడు తినడం తాగడం తప్ప వేరే పనిలేదు ' అని అంటుడేవాళ్ళు. మరి అలాటి పేరు పెట్టుకున్న రెస్టారెంట్ కు వెళ్ళి భోంచెయ్యాలని ఎందుకో మనసు ఒప్పుకోలేదు. 'నేను శనివారం ఉదయం హైకింగ్ కు వెడుతున్నాను. వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో. మీరెళ్ళండి ' అంటూ సారీ చెప్పాను.

ఈ మధ్యలో ఆరోగ్యం గురించి శ్రద్ధ (లేక బెంగనా?) ఎక్కువై వ్యాయామానికి సంబంధిన రకరకాల చేష్టలు చేస్తున్నాను. ఆ క్రమంలోనే 'హైకింగ్ ' అనేది ఇంకో వైవిధ్యమైన చేష్ట. హైకింగ్ అంటే చెట్లు పుట్టలు పట్టుకొని తిరగడం, కొండలు గుట్టలు ఎక్కడం లాంటివి అన్న మాట.

కొండలు గుట్టలు ఎక్కడం అంటే గుర్తుకు వస్తుంది. నా చిన్నతనంలో ప్రతీ యేడు శ్రీరామనవమి పండగకు ఊరికి దూరంగానున్న కొండపై తిరునాళ్ళు జరిగేవి. ఆ గుట్ట పైకి పోవటానికి సరైన దారి ఉండేదికాదు. పెద్దవాళ్ళు నెమ్మదిగా కొండ ఎక్కుతుంటే పిల్లవాళ్ళం బరబరా పైకి పరిగెత్తేవాళ్ళం. పైకెళ్ళి కోనేరు అనబడే నీటిగుంతలో మునకేసి, సీతారామకళ్యాణం తిలకించి, కొండగుహల్లో పెద్దలు వండిన తిండి తిని, రంగు కళ్ళద్దాలు, రంగురంగుల మిఠాయిలు, పిల్లనగ్రోవులు కొనుక్కునే వాళ్ళం. పిల్లలూదున్న పిల్లనగ్రోవుల, హార్మోనికాల రణగొణ ధ్వనులతో కొండకొండంతా మారుమ్రోగిపోయాది. అప్పుడు ఇలా కొండ ఎక్కడం హైకింగ్ అంటారని నాకు తెలియదు.

శనివారం ఉదయం ఆరింటికే లేచాను. కాలకృత్యాలు తీర్చుకొని, హైకింగ్ షూ వేసుకొని, ఓ వాటర్ బాటిల్ తీసుకొని, బ్యాగులాంటి దాన్ని నడుము చుట్టూ బిగించి (శంఖంలో పోస్తేనే తీర్థమైనట్టు, అమెరికా ఏ చిన్నపని చెయ్యాలన్నా ఓ పద్ధti ప్రకారం చెయ్యాలి కదా!) హైకింగ్ చేసే కొండవద్దకు ఏడింటికల్లా చేరుకొన్నాను.

హైకింగ్ చేస్తుంటే రకరకాల మనుషులు తారసపడ్డారు. పిల్లలు, పెద్దలు, ఒంటరిగాళ్ళు, జంటలు, గుంపులు ఎదురయ్యారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒకతను నన్ను దాటేసుకుంటూ వేగంగా వెళ్ళాడు. అతని ముందు రెండు కుక్కలు జోడు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి. వాటి పగ్గాలు (శాస్త్రప్రకారం కుక్కల పగ్గాల్ని ఇంగ్లీషులో లీష్ అనాలి) అతని చేతిలో ఉన్నాయి కాబట్టి అతను కూడా వేగంగా పరిగెడుతున్నాడు. అతను త్వరగా హైకింగ్ చేయటానికి కుక్కలు దోహదం చేస్తున్నాయన్నమాట. అలా చూస్తుండగానే అతను కొండమలుపుల్లో కనుమరుగయ్యాడు.

ఇంకొద్ది దూరం వెళ్ళేసరుకి ఓ అమెరికన్ వృద్ధుడు తారసపడ్డాడు. అతని వెంట కూడా ఓ కుక్క ఉంది. కాని అతని చేతిలో పగ్గాలు లేవు. అతను నెమ్మదిగా అడుగులో అడుగేస్తూ నడుస్తున్నాడు. అతని వెనక ముప్ఫై అడుగుల దూరంలో అతని కుక్క అతనికంటే నెమ్మదిగా నడుస్తోంది.

నేను ఆ వృద్ధునితో మాటామంతీ ప్రారంభించాను. అతనికి డెబ్భైఅయిదేళ్ళట. గత ముప్ఫ ఏళ్ళుగా ఇదే కొండపై హైకింగ్ చేస్తున్నాడట. తన ఎనభైవ పుట్టినరోజు తనలా హైకింగ్ చేసే మిత్రులతో కొండ శిఖరంపైన జరుపుకోవాలాని ఆశిస్తున్నాడు. అలా మాట్లాడుతూ మధ్యమధ్యలో నెమ్మదిగా నడుస్తున్న కుక్కను త్వరగా నడవమని గట్టిగా చెబుతున్నాడు. ఇంతకు ముందు పరుగులు తీసిన జోడు కుక్కలకంటే ఈ కుక్క భిన్నగా ఉంది.

తిరిగి అతనే మాట్లాడుతూ 'నా హిప్పోకు ఆర్థరైటిస్ వచ్చింది. అందుకే కొండ ఎక్కటానికి కష్టపడుతున్నది ' అన్నాడు. చెప్పొద్దూ కాని, కుక్కలకు కూడా కీళ్ళ కలకల జబ్బు(అంటే ఇంగ్లీషులో ఆర్థరైటిస్) వస్తుందని తెలిసి ఆశ్చర్యపోయాను.

మా ఆఫీసులో ఓ అమెరికన్ కొలీగ్ కు ఒక కుక్క ఉంది. దాని పేరు పికిల్స్. అది ఈ మధ్యలో ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ మూత్రం చేస్తుంటే, దాహం వేసి ఎక్కువ నీళ్ళు తాగుతుంటే వెటరినరి డాక్టర్ (అంటే తెలుగు పరిభాషలో పశువుల డాక్టర్) దగ్గరికి తీసుకెళ్ళాడట. అతను పరీక్షలన్నీ చేసి ఆ కుక్కకు డయాబిటీస్ అని తేల్చేశాడట. బిల్లు కూడా బాగానే పేల్చేశాడట. కుక్కకు డయాబిటీస్ వచ్చినందుకు చాలా బాధపడ్డాదు. డాక్టర్ బిల్లు వాచిపోయినందుకు ఇంకా చాలా బాధపడుతూ ఇంటర్నెట్లో కుక్కల హెల్త్ ఇన్సూరెన్స్ వేట మొదలెట్టాడు.

మనుషులకు వచ్చే జబ్బులు కుక్కలకు కూడా చేస్తాయని, వాటికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుందని తెలిసి ఆశ్చర్యబోయాను..

నా చిన్నప్పుడు మావూళ్ళో పెంపుడు కుక్కలంటూ అస్సలే ఉండేవికావు. అన్నీ ఊర కుక్కలే. మరీ మా ఇంటి దరిదాపుల్లో కుక్క అనే జంతువు ఉండేది కాదు. అలాంటి వాతావరణలో మావూరి స్కూల్లో పనిచేసే సైన్స్ టీచర్ పట్టణం నుండి ఓ సీమకుక్కను తీసుకొచ్చి పెంచటం ప్రారంబించాడు. అది మావూరి కుక్కలకంటే లావుగా, బలిష్ఠంగా, ఎత్తుగా ఉండేది. అది ఆ మాష్టారు చెప్పిన మాటలు వినేది. ఆజ్ఞలు పాటించేది. అది చేసే వింత చేష్టలను మేము దూరం నుండి చూస్తూ ఆనందించేవాళ్ళం.

ఆ మాష్టారు ఆ కుక్కను ఊరి బయటనున్న చెరువుకు తీసుకెళ్ళి ఈదులాడించేవాడు. బంతిని నీటిలోకి దూరంగా విసిరితే అది ఈదుకుంటూ వెళ్ళి బంతిని నోటకరిచి తీసుకొస్తుంటే పిల్లలం మేము నోరు తెరచి అలా చూస్తుండే వాళ్ళం. అదే నాకు తెలిసిన అప్పటి శునకశాస్త్రం.

అన్నట్టు ఆ సామాన్యశాస్త్ర (అదేనండి, ఇంగ్లీషులో సైన్స్ అంటారు) మేష్టారు ఆ కుక్కను ముద్దుగా 'రామూ' అని పిలిచేవాడు. అప్పట్లో నాకు తెలిసిన్న కుక్కల పెర్లు ముచ్చటగా మూడే మూడు... అచ్చ తెలుగు పేరైతే రామూ, ఇంగ్లీషు పేర్లయితే పప్పీ లేదా టామీ. ముఖ్యంగా ఈ పేర్లు సినిమాల్లో కుక్కలకు ఉపయోగించేవాళ్ళు.

మరి అమెరికా వచ్చిన తర్వాతనేమో, ఎన్నోకుక్కల పేర్లు వింటున్నాను, హిప్పో, పికిల్స్ వగైరాలు.

ఈ మధ్య న్యూస్ పేపర్లో 'డియర్ ఆబ్బీ'లో ఒకావిడ చాలా ఆసక్తికరమైఅన ప్రశ్న అడిగింది. ఆ సదరు ఆవిడకి వెతగ్గా వెతగ్గా నమ్మకస్తుడైన బాయ్ ఫ్రెండ్ దొరికాడు. అతనిపై పీకలవరకు ప్రేమ పెంచుకొంది. కాని ఒక చిక్కు మాత్రం వచ్చింది. అ సదరు బాయ్ ఫ్రెండ్ కు ఓ పెంపుడు కుక్క ఉంది. ఈ సదరు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ సొఫాలో కూర్చుని టీవీ చ్స్తూంటే ఆ సదరు కుక్క ఇంకో సొఫాలో కూర్చుని అది కూడా టీవీ చూస్తుందట. అంత వరకు ఫర్వాలేదు. కానీ, ఈ సదరు జంటకు మూడొచ్చి పెదవి పెదవి కలిపి ముద్దులాడుకోబోతుంటే ఆ సదరు కుక్క గుర్రుగా చూస్తూ 'భౌ, భౌ' మంటూ అరుస్తుందట. వీళ్ళ ముద్దులాట దానికి చిర్రుబుర్రు తెప్పింస్తుందట. ఆ కొద్దిసేపు కుక్కను గరాజ్ లోకో, బ్యాక్ యార్డ్ లోకో పంపించమని అమ్మాయి అడిగితే, దానికా అబ్బాయి 'అది చిన్నప్పటినుండి నా దగ్గర పెరిగింది. అది నన్ను వదిలి ఉండలేదు. మన క్షణికమైన ముద్దు కొరకు దాన్ని బయటకు పంపడం నాక్కూడా ఇష్టం లేదు ' అన్నాడాట. 'ఇప్పుడెం చెయ్యాలి అబ్బీ?' అంటూ ఆవిడ ప్రశ్న. 'నీకు నేనంటే ప్రేమనా? నీ కుక్కంటే ఇష్టమా? కుక్క కావాలో, నేను కావాలో తేల్చుకో' అంటూ తాడోపేడో తేల్చుకోమని సలహా ఇచ్చింది 'డియర్ అబ్బీ'. కుక్కలక్కూడా మానవ జీవితాల్లొ ఇంతటి ముఖ్యస్థానం ఉందని అమెరికా వచ్చిన తర్వాతే తెలుసుకున్నాను.

****************

అయినా అనొద్దు గానీ, ఈ ప్రశ్నను పత్రికాముఖంగా చాటింపేసినట్టు 'డియర్ అబ్బీ'ని అడగాలా. ఆ మాత్రం ఇంగితజ్ఞానంతో ఆ అమ్మాయి అబ్బాయిని నిలదీసి అడిగెయ్యలేదు? సరే ఆ విషయం పక్క పెట్టేద్దాం.

అవును మర్చిపోయాను. పైన చెప్పిన ఆ అమ్మాయి శత్రువు ముద్దుల మధ్యలో 'భౌ, భౌ' అని అరుస్తుందని రాసాను. కాని, అమెరికాలో కుక్కలు 'రఫ్, రఫ్' అని అరుస్తాయట. నాకు తెలిసిన సాహితీ మిత్రుడు, ఇక్కడ అమెరికాలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న అతను, జంతువుల అరుపుల గురించి రచన చేస్తూ, ఇండియాలో కుక్కలు 'భౌ, భౌ' మంటే, అమెరికాలో 'రఫ్, రఫ్' అని, చెకొస్లెవేకీయాలో 'హాఫ్, హాఫ్' అని, డెన్మార్క్ లో 'ఊఫ్, ఊఫ్' అని వాటివాటి నివసించే దేశాల్ని బట్టి అరుస్తాయని 'ఇవేమి కూతలు?' అనే రచనలో ఉటంకించాడు. ఇలా కోళ్ళ కూతలు, గుర్రాలా సకిలింపుల మీద కూడా చాలానే రాసాడు.

ఆ మధ్య ఓ మాల్ కు వెళ్ళాను. అక్కడ ఆరుబయట వేసున్న కుర్చీల్లో ఒక అమెరికన్ వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. అతని ఒళ్ళో ఒక చిన్నకుక్క ఉంది. చూడటానికి చాలా ముద్దొస్తుంది. అదికూడా తల తిప్పుతూ వచ్చిపోయే వాళ్ళని గమనిస్తుంది. నేను ఆగి 'నీ కుక్కపిల్ల చాలా ముద్దొస్తుంది ' అన్నాను. దానికతను 'ఇది కుక్కపిల్ల కాదు. నాలాగే ఇది కూడ వృద్ధదశకు చేరుకుంది. చూడు, దీని తెల్లవెంట్రుకలు ' అంటూ తలపైన ఉన్న రెండు తెల్లవెంట్రుకలను చూపెట్టాడు. ఎవరూలేని తనకు ఇదే తోడు అనీ ఇంకా ఏవేమో చెప్పుకొచ్చాడు.

అలాగే నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు కొంతమంది విద్యార్థులం ఓ రోజు మొదటిసారిగా 'హోస్ట్ ఫామిలీ' ఇంటికెళ్ళాం. కాలింగ్ బెళ్ళు నొక్కాం. తలుపు తెరిచి తెరవగానే ఓ కుక్క 'భౌ, భౌ' మంటూ (అప్పటికి నేనింకా నా సాహితీ మిత్రుని రచన చదువలేదు. కాబ ట్టి నాకు అప్పుడు ఆ అరుపు 'భౌ, భౌ' గానే వినిపించింది.) మా మీదకు వచ్చింది. నేను హడలిపోయాను. ఆ కుక్క నామీదకు ఎగబాకుతుంటే నేను దాదాపు అరిచినంత పని చేసాను. అందుకేమో ఆ ఫామిలీ 'ఫర్వాలేదు. అది నిన్ను వాసన చూస్తుంది. నీ వాసన పసిగట్టి అలవాటైన తర్వాత నీతో స్నేహితంగా ఉంటుంది ' అన్నారు. 'ఇదెక్కడి గొడవరా బాబూ' అనుకుంటూ ఆ కుక్కను నా కాళ్ళు, చేతులు, చెంపలు వాసన చూడనిచ్చాను

ఆఫీసునుండి అమెరికన్ కొలీగ్స్ తో లంచ్ బయటికి వెళ్ళితే ఒక్కొకప్పుడు పెద్ద చిక్కుల్లో పడిపోతాను నేను. వాళ్ళంతా ఉన్నట్టుండి వాళ్ళ పెంపుడు జంతువుల గురించి (కుక్కల, పిల్లు గురుంచి) మాట్లాడటం మొదలెడతారు. శునకశాస్త్రంలో ఓనమాలు రాని ఆ సంభాషణలొ పాలుపంచుకోవాలో తెలియక అన్నం కెలుక్కుంటూ గమ్మున కూర్చుంటాను.

ఇదంతా ఎందువల్లా అని అప్పుడప్పుడు ఆలోచిస్తుంటే కొద్దిగా సమాధానాలు దొరుకుతున్నట్టనిపిస్తాయి. అసలు విషయం మన సంస్కృతిలో ఉందేమో అనిపిస్తుంది. రామాయణంలో చెప్పినట్టు 'రాజర్షి ' పదవితో సంతృప్తి పడక 'బ్రహ్మ ర్షి ' పదవికోసం చేసే తపోదీక్షలో విశ్వామిత్రుడు వశిష్టకుమారులను శునకమాంస భక్షకులు కమ్మని శపిస్తాడు. అంటే కుక్క అంతటి అధస్థానాన్ని ఇచ్చారన్న మాట. అలాగే చిన్నప్పుడు స్కూల్లో 'కనకపు సిం హాసనపు మీద శునకం కూర్చుండబెట్టి...' అంటూ సుమతీ నీతిశతక పద్యాన్ని కూడా నేర్పించారు కదా. అలాగే పిల్లలు కోపం వచ్చి తిట్టుకునేటప్పుడూ ఒకరినొకరు 'కుక్క ' అని సంబోధించుకుంటారు కూడా.

అందుకేనేమో శునకాల్ని అంత సులభంగా దగ్గరకు చేర్చుకోలేకబోతున్నాను. మరి, ఈ ఫీలింగ్ పోవాలంటే పైన చెప్పుకోబడ్డ సదర గర్ల్ ఫ్రెండ్ అడిగినట్టు నేను కూడా 'డియర్ అబ్బీ'ని ఆశ్రయించాలా? ఎమో?

శునకపు ఆలోచనల్లోంచి బయటపడి చూస్తే దాదాపు కొండ శిఖరానికి చేరుకొన్నాను. ఫర్వాలేదు, ఇంతకు ముందతనేమో కుక్క పగ్గాలు పట్టుకుని వడిగా పైకెళితే నేనేమో ఆ జంతువూల ఆలోచనలతో నొప్పి తెలియకుండా హైకింగ్ పూర్తి చేసాను.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     అద్భుతం
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)