ఒకే పద్యంలో విద్యా వ్యవస్థ
సృష్టిలో ప్రతి ప్రకృతి శక్తిని ఒక దేవతగా భావించటం భారతీయ సంప్రదాయంలో విశిష్టత.ఒక్క ప్రకృతి శక్తులనే కాదు మన జీవితంలో అత్యవసరమైన ధనం మన దృష్టిలో వట్టి రూపాయి కాదు, సాక్షాత్తూ లక్ష్మీదేవి.అలాగే జ్ఞానానిచ్చే విద్య కేవలం చదువు కాదు, సాక్షాత్తూ సరస్వతీదేవి. అటువంటి సరస్వతిని బమ్మెర పోతన తన భాగవతంలో విశేషంగా ప్రార్థించాడు.ఆ పద్యం భారతీయ విద్యావ్యవస్థను మొత్తం ప్రతిబింబిస్తుంది.
శ్రోణికి ఛంచరీక చయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికి, తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి, అక్షధామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్"
ఈ పద్యం చివరి పాదంలో సరస్వతీదేవి చేతుల్లో జపమాల (అక్షదామం), చిలుక (శుకం), పద్మం (వారిజం), పుస్తకం వున్నాయని వర్ణించాడు.మనం ఇప్పుడు చూస్తున్న సరస్వతి చేతుల్లో జపమాల, పుస్తకం వుండి, మరో రెండు చేతుల్తో వీణ వాయిస్తూ వుంటుంది. పోతన ఈ మూర్తినే వర్ణించివుంటే వీణ ఎందుకు వదిలేస్తాడు? పైగా చేతుల్లో లేని పద్మాన్ని, చిలకను చేతుల్లోనే ఉన్నట్లు "రమ్యపాణికిన్" అని ఎందుకు వర్ణిస్తాడు? అంటే మనం చూస్తున్న సరస్వతీమూర్తి, పోతన వర్ణించిన మూర్తి వేరని అర్తమవుతుంది కదా! అయితే వీణ లేకుండా, అక్షదామ శుక వారిజ పుస్తకాలు ధరించిన ఈ మూర్తి ఎవరు? ఇదే దృష్టితో వేదవిద్యలోను, సంస్కృత సాహిత్యంలోను నిష్ణాతులైన పెద్దలతో ఆలోచిస్తే వారు పోతన వర్ణించింది 'శారదామూర్తి ' అని, ఆవిడ వైదిక విద్యలకు అధిదేవత అని వారి అభిప్రాయం చెప్పారు.ఈ వాదానికి సమర్థన శృంగేరి శారదాపీఠంవారు ప్రకటించిన శారదామూర్తిని చూస్తే ఆవిడ చేతుల్లో ఈ నాలుగు ఉండటం, వీణ లేక పోవటం కనిపిస్తుంది.మొత్తమ్మీద పోతన ప్రార్థించిన 'వాణి ' లలితాదేవి యొక్క జ్ఞాన స్వరూపంగా భావించే శారదాదేవి అని బోధపడుతుంది. మొత్తమీద కొండను తవ్వి ఎలుకను కాదు, 'పలుకు చిలుకను ' పట్టగలిగాం.
ఇక - ఇప్పుడు అసలీ నాలుగు వస్తువులు శారదాదేవి చేతుల్లో ఎందుకు ఉంటాయి? వాటి పరమార్థం ఏమిటి?అని ఆలోచిస్తే భారతీయ జీవనవిధానంలో ఒక ప్రత్యేకత ఉంది.ఏ మనిషయినా, స్త్రీ, పురుషలలో ఎవరయినా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు వరుసగా సాధించడమే జీవిత లక్ష్యంగా భావిస్తారు.విద్య ద్వారా ఈ చతుర్విధ పురుషార్థాలు సాధించటమే లక్ష్యమని ఆ నాలుగు ప్రతీకలు సూచిస్తున్నాయి.అమ్మవారి చేతుల్లో వుండే పుస్తకం ధర్మానికి ప్రతీక.పుస్తకం ద్వారానే మనకు అన్ని ధర్మాలు తెలుస్తాయి.పద్మం అర్థానికి ప్రతీక.పద్మం నుండే లక్ష్మీదేవి జన్మించింది.పద్మం అంటే సంస్కృతంలో డబ్బు లెక్క పెట్టే ఒక సంఖ్య కూడాను.చిలుక కామపురుషార్థానికి ప్రతీక. మన్మధుని వాహనం చిలుకే గదా! జపమాల మోక్షానికి ప్రతీక.జపతపాల ద్వారానే కదా సిద్దిని పొందేది. విద్య ద్వారా ఈ నాలుగు పురుషార్థాలు సాధించాలనీ, అప్పుడే మనిషికి భవబంధాల నుండి విముక్తి అనీ తెలియజేయటం కోసమే విద్యాదేవత తన చేతుల్లో ఆ నాలుగు వస్తువులనీ ధరించిందని గ్రహించవచ్చు. 'సా విద్యా యా విముక్తయే ' అని గదా ఆర్యోక్తి.
మనిషి ధర్మంగా జీవించాలి.మంచి వృత్తులు చేపట్టాలి.ఆ ధర్మం ద్వారా అర్థం సంపాదించాలి. ఆ అర్థం ద్వారానే సముచితమైన కామనలు (కోరికలు) తీర్చుకోవాలి.ఆ కోరికల్లో పడి కొట్టుకుపోకుండా మోక్షం కోసం ప్రయత్నించాలి.ఇదే మానవ జీవిత లక్ష్యమని భారతీయ సంస్కృతి ప్రభోదిస్తుంది.అందుకే పోతన అమ్మవారి స్వరూపాన్ని ఆ విధంగా వర్ణించాడు.ఇదీ తెలుగు పద్యం పరమార్థం.
మనవాళ్ళు ఈ విషయం ఇంతటితో వదిలెయ్యలేదు.ఒకటో తరగతి తెలుగువాచకం మొదటి పుటలో అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే నాలుగు పదాలలో సరిగ్గా ధర్మార్థ కామ మోక్షాలనే సూచించారు.అమ్మ ధర్మానికి ప్రతీక.పుస్తకం కంటె ముందుగా అమ్మ నుండే మనం అన్ని ధర్మాలను తెలుసుకుంటాం. ఆవు అర్థానికి ప్రతీక. వెనుకటి రోజుల్లో 'పంచగవధనం' అని గోవులను క్రయవిక్రయాల్లో డబ్బుగా వాడేవారు. ఇల్లు కామ పురుషార్థానికి ప్రతీక.సమస్త కామనలకు మూలం సంసారం.ఆ సంసారానికి నిలయం ఇల్లు. ఇక ఈశ్వరుడు మోక్షానికి ప్రతీక అని వేరే చెప్పనక్కర్లేదుగదా! ఇప్పుడు లౌకికవాదం పుణ్యమా అని ఈశ్వరుణ్ణి తీసేసి 'ఈగ ' ని పెట్టారు.అందుకే విద్యార్థుల్లో ఈశ్వరారాధన బుద్ధి పోయి, ఈగలు తోలుకుంటూ కూర్చునే బుద్ధి బయలుదేరింది.
తెలుగు మాధ్యమంలో ఇంత సార్థకమైన విద్య సాగుతుంటే ఇంగ్లీషు మీడియంలో దీనికి పూర్తిగా భిన్నంగా వుంది
పరిస్థితి. ఏ ఫర్ ఆపిల్ అనేది మొదటి పదం.అంటే ముందు తిండి గురించి చెబుతున్నారన్నమాట. బి ఫర్ బ్యాట్ అంటే
క్రికెట్ ఆట చాలా ముఖ్యం అని చెబుతున్నాం.తరువాత సి ఫర్ క్యాట్. డి ఫర్ డాగ్ అని నేర్పుతున్నాం. అంటే పిల్లలు
కపటత్వాన్ని, కుక్కలా బానిసత్వాన్ని నేర్పుతున్నాం.పవిత్రంగా జీవిత లక్ష్యాన్ని చేర్చే పురుషార్థాలెక్కడ? సింహాలు,
పులుల వంటి వీరులుగా తయారవలసిన విద్యార్థులకి దీన హీన జంతువుల పరిచయంతో విద్యాభ్యాసం ప్రారంభిస్తే
భవిష్యద్భారతం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించండి! ఆపైన ఏ విద్య నేర్పాలో నిర్ణయించుకోండి.
స్వస్తి..

























