భారత అణుజీవ శాస్త్ర పురోగామి, బయోటెక్ పితామహుడు - పద్మభూషణ్ డాక్టర్ పుష్ప మిత్రా భార్గవ

భారత దేశ అణు జీవ శాస్త్ర రంగ పురోగామి, అణు జీవ సాంకేతిక శాస్త్ర రూపకర్త, వైజ్ఞానికుడు, సి సి ఎం బీ వ్యవస్తాపక అధ్యక్షుడు - పద్మభూషణ్ - డాక్టర్ పుష్ప మిత్రా భార్గవ.

భారత దేశంలో అభినవ అణు జీవ రసాయన, అణు జీవ పరిజ్ఞానాభివృద్ధికి క్రియాశీలక మార్గాలు అమలు పరచి, శాయ శక్తులా కృషి చేసి ఈ రంగాలలో భారతావనికి ప్రముఖ స్థానాన్ని అపాదించి పెట్టిన శాస్త్ర ద్రష్ట, మేటి అణు జీవ సాంకేతిక శాస్త్ర విశారదుడు డాక్టర్ భార్గవ.

దేశ దీర్ఘకాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని భారత ప్రధాన మంత్రి పర్యవేక్షణలో అతిరధ మహారధులతో ఘటింపబడిన నేషనల్ నాలెడ్జ్ కమీషన్ - ఉపాధ్యక్షుడిగా; సి సి ఎం బీ - వ్యవస్థాపక అధిపతిగా; అభినవ జీవశాస్త్రం, జీవ శాంకేతిక శాస్త్రం (బయోటెక్) పితామహుడు డాక్టర్ భార్గవ. నందన్ నిలెకాని, డాక్టర్ దీపక్ నాయర్, దాక్టర్ అశోక్ గాంగూలీ, డాక్టర్ ఆండ్రే బెటీల్, డాక్టర్ జయతి ఘోష్, డాక్టర్ ప్రతాప్ భాను మెహ్తా సభ్యులుగా ఉన్న కమీషనులో ఈ రంగంలో భారత జాతీయ విధాన రూపకల్పన చేశారు.

భారత ప్రధానిచే గటించబడిన జాతీయ భద్రతా సలహా మండలి - " నేష్నల్ సెక్యురిటీ అడ్వైసరీ బోర్డ్ " లో సభ్యుడిగా దేశ భద్రత, ప్రయోజనాలకు దిశా మార్గం చూపిస్తున్న మేధావి డాక్టర్ భార్గవ. సి సి ఎం బీ, సంచాలకుడు, డాక్టర్ లాల్జి సింగ్ " డాక్టర్ భార్గవ భారత అధునాతన జీవశాస్త్ర పితామహుడు " అని అభివర్ణించారు.

బయోటెక్ రంగ విశిష్ట లాభాలను చూడ గలిగిన ద్రష్ట. దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం భారత దేశంలో ప్రపధమంగా " జెనిటిక్ ఇంజినీరింగ్ " అన్న పదాన్ని రూపొందించి, దాని పరమార్ధాన్ని కార్య రూపంలో సిద్ధింప చేసిన అనుభజ్ఞుడు. ఈ క్షేత్రాభివృద్ధికి సూత్రధారుడిగా నిలచి, నిర్మాణాత్మక కృషికి చేసి, ప్రపంచంలో భారత దేశానికి సమోన్నత స్థానాన్ని ఆపాదించి పెట్టిన డాక్టర్ భార్గవ, భారత దేశ " పద్మ భూషణ్ ", ఫ్రాన్స్ దేశ " లెజియన్ ది హొనెర్ " ఇత్యాది విశిష్ట పురస్కరాలు అందుకున్నారు.

డాక్టర్ భార్గవ బయోటెక్ రంగంలో అతి విశిష్ట శాస్త్రజ్ఞుడు - ప్రపంచంలో 60 దేశాలకు పైగా వెళ్ళారు, 125 పైగా అంతర్జాతీయ సంస్థలలో, 250 " ఇన్వైటెడ్ ఉపన్యాసాలు " ఇచ్చారు. 100 కు పైగా అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు, దాదాపు 1600 పైగా " ఇన్వైటెడ్ లెక్చర్స్ " ఇచ్చారు. డాక్టర్ భార్గవ ప్రజ్ఞా పాటవాలు ఏ కోవ చెందినవో ఈ విషయాలు విదితం చేస్తున్నాయి. 125 కు పైగా జాతీయ, అంతర్జాతీయ కార్యవర్గాలలో (స్టాండింగ్ కమిటీల) లో సభ్యుడిగా ఉండి బయోటెక్, మాలికులార్ బయాలజీ శాస్త్రాలలో వచ్చే మార్పులకు కీలక పాత్ర వహిస్తున్నారు. ఇక్కడ ఓ మాట చెప్పుకు తీరాలి. ఇన్ని సంస్థలను సందర్శించి, వాటిని ఉద్దేశించి మాట్లాడిన డాక్టర్ భార్గవ, ఈ సంస్థల నిమంత్రణలు అంగీకరించి వెళ్ళిందే కాని ప్రభుత్వ ఖర్చుల మీధ కాదు!; కేవలం తన పాండిత్య ప్రకర్షల ఆధారంగా విశిష్టతను సంపాదించిన వ్యక్తి.

డాక్టర్ భార్గవ మంచి పరిపాలనా దక్షుడు. సి సి ఎం బీ - అధిపతిగా రెండు దశాబ్దాలకు పైగా పని చేసారు. ప్రపంచంలో ఈ క్షేత్ర సంభంధ సంస్థలలో అగ్రగణ్య సంస్థగా తీర్చి దిద్ధేరు. " నేను యవర్ని ? " నేను ఓ జెనిటిస్ట్ నా? ఓ బయోకెమిస్ట్ నా? అణు జీవ శాస్త్రవేత్తనా, జీవ శాస్త్రవేత్తనా? మరేదైనానా? ఈ విచార ధారణలో - నేను యేది అనుకుంటే నాలో నేను నవ్వు కుంటాను. ఈ విభజనలు నాకు కిట్టవు కనక; ఇంకేదైననా అని ప్రశ్నించుకున్నప్పుడు వచ్చే సమాదానం? ఇవేవి కాదు. " నేను మానవతా వాదిని " అని డాక్టర్ భార్గవ చెప్పిన వైనం ఆయన దృక్పధం తెలియజెపుతుంది.

ఉత్తర ప్రదేశ్ లోని వారణాశి, లక్నవ్ లో తన విద్యాభ్యాసం ముగించి, పట్టాలు సంపాయించారు డాక్టర్ భార్గవ గారు. తన 21 సంవత్సరంలో లక్నవ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా సాధించారు.

చేపట్టిన బాధ్యతలు, నిర్వహించిన పదవులు

డాక్టర్ భార్గవ చేపట్టిన బాధ్యతలు, నిర్వహించిన పదవులు, పాల్గొన్న, పాల్గొంటున్న సంఘ సభ్యత్వాలు: - సి సి ఎం బీ, హైద్రాబాద్ - వ్యవస్థాపక, సంచాలకుడిగా వ్యవహరించారు - నేష్నల్ నాలెడ్జ్ కమీషన్, ఉపాధ్యక్షుడిగా ఉన్నారు - భారత జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు - సి ఎస్ ఐ ఆర్ - విశిష్ట శాస్త్రవేత్త - అన్వేష్ణా కన్సల్టన్సీ సర్వీసెస్, సంచాలకుడిగా ఉన్నారు - సంభావ్నా ట్రస్ట్ క్లినిక్ బోర్డ్ సభ్యుడిగా ఉన్నారు - 125 కు పైగా జాతీయ, అంతర్జాతీయ కమిటీలలో సభ్యుడిగా, అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు - ఫెల్లో, నేష్నల్ అకాడమి ఆఫ్ మెడికల్ సైన్సెస్ - ఫెల్లో, వాల్డ్ అకాడమి ఆఫ్ సైన్సెస్ - బయోలాజికల్ కెమిస్ట్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ అకాడమి ఆఫ్ సోషల్ సైన్సస్, సొసైటీ ఫర్ సైంటిఫిక్ వాల్యూస్ కి అధ్యక్షుడిగా ఉన్నారు - ఇంటర్నేష్నల్ యునియన్ ఫర్ సైన్స్ కమ్మునికేటర్స్ మిషన్ - కొశాధికారిగా వ్యవహరించారు - నేష్నల్ సెంటర్ ఫర్ సైన్స్ కమ్మ్యునికేటర్స్, సభ్యుడు - ఇండియన్ ఫార్మకోలాగికల్ సొసైటీ, కార్యనిర్వాహక సభ్యుడిగా ఉన్నారు - ఇంటర్నేష్నల్ కాంగ్రెస్ ఆన్ బయో-ప్రాససీస్ ఇన్ ఫూడ్ ఇండస్ట్రీస్ సభ్యుడిగా ఉన్నారు

ఇవే కాక బ్రెడ్ సొసైటీ - అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ - పేద, ప్రతిభావంతులైన విద్యార్ధుల ఉన్నత శిక్షణకు స్కాలర్షిప్పులు అందిస్తున్నారు. కొసమెరుపు - ఈ సంస్థ ఆశయాలు సిద్ధించేదుకు తోడ్పడుతూ ఓ దాత - 1.25 కోట్లు, "స్కాలర్షిప్పుల " కోసం విరాళంగా ఇచ్చారు.

మానవ చరిత్రలో అత్యంత అద్బుత వ్యక్తులలో ఒకరైన - డాక్టర్ యెల్లాప్రగడ సుబ్బారావు గారు, డాక్టర్ భార్గవ గారికి ఆదర్శ పురుషులు; చాణుక్యుడు మరొక ఆదర్శమూర్తి.

డాక్టర్ భార్గవ - డాక్టర్ యెల్లాప్రగడ సుబ్బారావు మీద రాసిన - " హిస్టరి ఆఫ్ మెడిసిన్ - డాక్టర్ యెల్లాప్రగడ సుబ్బారావు " - అన్న వ్యాసం ప్రకటిస్తూ, " వైజ్ఞానిక రంగంలో పరిణాత్మక మైన మార్పులు తెచ్చి - జీవన సరళిని ప్రభావితం చేసిన మహనీయుడు " అని శ్లాఘించారు. సుజనరంజనిలో ఇదే శీర్షికలో ఈ మధ్యనే డాక్టర్ యెల్లాప్రగడ గారి విశిష్టతను మనం చర్చించడం జరిగింది. ఎన్నో మహాద్బుతాలు మనవాళికి అందించిన యెల్లాప్రగడ గారి మేదస్సు యెంత గొప్పదో అని ముక్తాయించారు డాక్టర్ భార్గవ. డాక్టర్ భార్గవ గారికి డాక్టర్ యెల్లాప్రగద సుబ్బారావు గారి పట్ల యెందుకంత విధేయత, అభిమానం ఉన్నాయో వెరే చెప్పనక్కర లేదు.

రచనలు, ప్రచురణలు

డాక్టర్ భార్గవ - విభిన్న జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో 400 పైగా వ్యాసాలు రాసారు. 125 వైజ్ఞానిక ప్రచురణలు చేశారు.

డాక్టర్ చందనా చక్రబర్తితో కలసి రాసిన పుస్తకం " ది సాగా ఆఫ్ ఇండియన్ సైన్సెస్ సిన్స్ ఇండిపెండెన్స్ - ఇన్ ఏ నట్‌షల్" పుస్తకంలో ఈ విషయాలు ఉదాహరించారు డాక్టర్ భార్గవ.

తన అనుభవాలు, జ్ఞాపకాలునూ క్రోడీకరిస్తూ, డాక్టర్ భార్గవ - తాను ఢిల్లిలో బడానాయకులను యెలా ఏదుర్కోవాల్సి వచ్చింది, జాతీయ విధానాల, ప్రణాళికల ఆవస్యకత గూర్చి యెలా ఉద్బోదించాల్సి వచ్చింది, వైజ్ఞానిక, పరిజ్ఞానిక క్షేత్రాలలో అవినీతి, పాలుమాలిక నివారణకు తనవంతు కృషి గురించి వివరించారు. కొన్ని స్థాయి పరమైన నిర్ణయాల అవగాహన లేకపోవడం పట్ల తన కటువు అనుభవాలు కూడా వ్యక్తం చేసారు.

డాక్టర్ భార్గవ: - 4 పుస్తకాలు - 125 కి పైగా శాస్త్ర ప్రచురణలు చేసారు - 400 శాస్త్ర క్షేత్ర సంభంధ వ్యసాలు రాసారు

అందుకున్న గౌరవ పురస్కారాలు

విభిన్న జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుండి - వందకు పైగా గౌరవ పురస్కరాలు అందుకున్నారు డాక్టర్ పుష్ప మిత్రా భార్గవ. వీటిలో కొన్ని ముఖ్యమైనవి: - 1986 లో భారత ప్రభుత్వం నుండి పద్మభుషణ్ అందుకున్నారు - 1998 లో వైజ్ఞానిక, సాంఘిక ఉద్దరణకు కారకులుగా, ఫ్రాన్స్ దేశ - అత్యున్నత గౌరవం " లెజియన్ ది హొనెర్ " అందుకున్నారు - నేష్నల్ సిటిజన్స్ అవార్డు (ఇండియా) - విజ్ఞాన, పరిజ్ఞాన రంగాల విశేహాభివృద్ధికి తోడ్పడినందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ - " రోల్ ఆఫ్ హానర్ " ఇచ్చి గౌరవించింది - బయోటెక్ క్షేత్రాభ్యున్నతికి మార్గదర్శం వహించి విశిష్ట కృషి చేసి నందుకు గాను " బయో స్పెక్ట్రం లైఫ్ టైం అవార్డు " అందుకున్నారు

ఇటీవలే డాక్టర్ భార్గవ యెనబై వసంతాలు పూర్తి చేసారు. " ఉన్నత ప్రమణాలు, విలువలతో సంస్థలను నెలకొల్పేరు " అని డాక్టర్ భార్గవ చిరకాల మిత్రుడు, ప్రముఖ శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్ చెప్పేరు.

భావి దేశ పరిజ్ఞాన భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని - దాక్టర్ భార్గవ తొమ్మిది కీలక క్షేత్రాలను - అధునాతన జీవశాస్త్రం, బయోటెక్, అంతరిక్ష క్షేత్రం, కొత్త ఇంధనాలు, పధార్ధ శాస్త్రం (మెటీరియల్ సైన్స్), మైక్రో-ఎలెక్ట్రానిక్స్, యంత్రీయరణ (ఆటోమేషన్), రొబోటిక్స్, ఐ టీ క్షేత్రాలు - వాటి సమన్వయ ప్రభావాలను అంచనా వేసి, ఉమ్మడి ప్రణాళికలు రూపొందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

భారత అణు, జీవ శాస్త్ర రంగాల అభివృద్దికి విశిష్ట కృషి చేసి, ప్రపంచంలో అణు జీవశాస్త్ర క్షేత్రంలో తలమానికంగా పరిగణింపబడే సి సి ఎం బీ ప్రస్థాపించి, నిర్ణాయక విధానాల రూపకల్పనలో, నాణ్యమైన ఫలితాలకు అనుగుణంగా, స్వతంత్ర ప్రతిపత్తితో, అగ్రపధంలోకి తీసుకు వెళ్ళిన మహనీయుడు - ఆదర్శ పురుషుడు, విశిష్ట అణు జీవ శాస్త్రజ్ఞుడు, మానవతావాది, ఈ అభినవ భారత "పుష్పా మిత్ర భార్గవుడు".

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     బాగుంది
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)