సిలికానాంధ్ర, "సర్వధారి" యుగాది వేడుకలో భాగంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో ప్రస్తుతపఱచబడిన కవిత ఇది.



వింత మనిషి! హలో! హలో! డాక్టరుగారా?
అంతా కుశలమే అయితే మీకెందుకు శ్రమ కల్పిస్తాం
ఎలాగోలా నించున్న ఫళాన్నే మీరు రావాలండి
సంకరమైన రోగానికి మందివ్వాలండి
సిరికి చెప్పనట్టి, శంఖచక్రాలు ధరించనట్టి
గజేంద్రుని మొరలాంటి SOS కాల్ ఇదండి
డాక్టర్ గారు, మీరు త్వరగా యాక్ట్ చేయాలండి
క్షమించండి, తోటి మానవుణ్ణి రక్షించాలండి
మనవాణ్ణి మనమే కాపాడుకోవాలి కదా మీరే చెప్పండి

ఎదుగుతూ ముదురుతూ ఎదురుతిరిగింది కేసు
త్వరగా ఆదుకోకుంటే కోలటం కష్టం గామోసు
Symptoms అన్నీ చెప్పుతూ పోతే
వ్యాధుల చిట్టా పెద్దదవుతుందేమో మరి
టూకీగా కొన్ని చెపితే చిక్కు విడుతుందేమో చూడండి

మూతి బిగించాడు, మూగనోము పట్టాడు
మనిషి ఎదురైతేను ముఖం చాటేస్తాడు
పలకరించటానికి క్షణం తీరిక లేదంటాడు
రాకాసి బల్లి సెల్లు మాయలో పడ్డాడు
ప్రేమగా దాన్ని పదే పదే చూస్తాడు
అనుక్షణం దాన్ని అంటిపెట్టే ఉంటాడు

ఎప్పుడు రింగవుతుందోనన్న anxietyలో పడి
Vibrate అయ్యిందనుకొన్న fobiaతో కొట్టుమిట్టాడి
ఎవరూ కాల్ చెయ్యలేదన్న ఆవేదనతో
ఎవరో కాల్ చేస్తారన్న ఆశతో
చకోరంలా ఎదురు చూస్తుంటాడు, ఏకాంతంలో ఉంటాడు

డెవెలప్ మెంట్ అంటాడు, కంఫర్ట్ లంటాడు
ఫాస్ట్ లైఫ్ ను చాలా లైకింగ్ చేస్తాడు
మాట కదిపితె చాలు 'నాకేవిటంటా?' అంటాడు
లాభనష్టాల శాతాల్ని బేరీజు వేస్తాడు
భాగస్వామ్యాల గణితాన్ని డెసిమల్లో లెక్కిస్తాడు

ఆదరాబాదరాగుంటాడు, హైరానా చేస్తాడు
ఈ-మెయిలు, జీ-మెయిలు
అహో! యాహూ-మెయిలు, హాటు-మెయిలు
ఛాటింగు చేస్తాడు, టపటపా టైపింగు చేస్తాడు
ఇంటర్నెట్ ఊహాలోకాల్లో విహరిస్తు
ఒహో! జనారణ్యంలో ఏకాకి అయ్యాడు

మనిషి డిజిటల్ మెషీనుకు బానిసైతే
వాపును బలుపనుకున్న భ్రమ అవుతుందేమో
తోక కుక్కను గిరగిరా తిప్పినట్టుంటుందేమో
Confusion జీవితాన్ని control చేస్తుందేమో

కోతినుండి మనిషి పుట్టిన డార్విన్ సిద్ధాంతం నిజమైతే
అయ్యయ్యో, జరగబోతున్నది పెద్ద రాద్ధాంతం
మాటలు తక్కువైన మనిషికి నాలుకతో పనేంటి?
టైపింగ్ ఎక్కువైన మనిషికి టెన్ ఫింగర్స్ సరిపోవేమో!
ఏమో, ఉన్న నాలుక ఊడి, వంద వేళ్ళు పుట్టుకొస్తాయేమో!
గిగాబైట్ల టెరాబైట్ల మెమోరీలు
టన్నులు టన్నులై
మనవాని మెదడు కాస్తా Tiny అవుతుందేమో?
తలకాయ కాస్తా తాటికాయంత అవుతుందేమో?

ఏవిటీ! ఉన్న మందులు ఈ వింతరోగాలకు పనిచెయ్యవా?
బాబ్బాయి! అంతలేసి మాటలనకండి
సిగ్మండ్ ఫ్రాయిడ్ బుక్కులు తిరగేయండి
ఈ కొత్త మనస్తత్వానికి ఏదైనా నిర్వచనం చెప్పాడేమో?
ధన్వంతరీ ఆయుర్వేద గ్రంథాలు చదవండి
చికిత్సకు ఏదైనా చిట్కా దొరుకుతుందేమో?
సంజీవని ఉన్న మహోదయ పర్వతం మీద
మరేదైన మహౌషధి ఉందేమో?
దాన్ని పెరుక్కొచ్చిన హనుమంతుణ్ణి అడగండి
కొంగ్రొత్తగా అడుగిడుతున్న సర్వధారిని అడగండి
రుద్రానారాయణులు ఏదైనా మందిచ్చి పంపిస్తున్నారేమో?
ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     బాగుంది
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)