జరిగిన కథ:
వీరవాఘ రాజ్యంలో విరాట్ గొప్ప యోధుడు. అచంచల రాజభక్తి కలవాడు. అయితే రాజుగారి బావమరిది రాజ్యం మొత్తం ఆక్రమించాలన్న దురుద్దేశంతో వీరవాఘ సైనికుల్ని కొందర్ని లంచాలతో లోబర్చుకొని దండెత్తి వచ్చాడు. ఆ విపత్కర సమయంలో రాజుగారు విరాట్ ను సైన్యానికి నాయకత్వం వహించి శత్రువుని ఎదుర్కోమని కోరాడు. ఆనాటి రాత్రి జరిగిన సంగ్రామంలో విరాట్ తన శక్తియుక్తులతో శత్రువుల గుడారంపై దండెత్తి రాజవిద్రోహులను కడతేర్చాడు. మరుసటి రోజు ఉదయం విరాట్ చనిపోయిన విద్రోహులలో ఒకరిని తన అన్నగా గుర్తించాడు. తన చేతులతో స్వంత అన్ననే చంపుకొన్న సంఘటన విరాట్ ని ఎంతగానో కలచివేసింది. విజయకేతనంతో తిరిగి వచ్చిన విరాట్ కు రాజుగారు వజ్రాలతో పొదిగిన తమ పూర్వీకుల ఖడ్గాన్ని బహుకరిస్తూ సర్వ సైన్యాధ్యక్ష పదవిని అప్పగించబోయాడు. అయితే విరాట్, సొంత అన్ననే చేజేతులా చంపుకున్నానని, ఇక జీవితంలో ఖడ్గాన్ని ముట్టబోనని ప్రతిజ్ఞ చేశాడు. ఇలా చెడు జోలికి పోని, ధర్మబద్దుడైన విరాట్ కు రాజుగారు ప్రధాన న్యాయాధికారి పదవీ బాధ్యతలను అప్పగించాడు. ధర్మకాటాతో సమంగా తూచినట్లు విరాట్ ప్రతి నేరాన్ని లోతుగా పరిశీలించి మరణశిక్ష తప్ప వేరే తగిన శిక్షలను విధిస్తూ త్వరలోనే రాజ్యంలోని ప్రజల మెప్పును పొంది గొప్ప న్యాయాధికారిగా పేరొందాడు. అయితే ఒకరోజున కొందరు కొండ జాతీయులు ఒక యువకుణ్ణి పదకొండు మంది ప్రాణాలు అపహరించాడంటూ బంధించి తీసుకువచ్చారు. అయితే ఆ యువకుడు విరాట్ ను న్యాయాన్ని చెప్పడానికి నీకేం అధికారముందంటూ, ఇతరులు చెప్పేది విని నీవేం తీర్పు చెబుతావంటూ నిగ్గదీస్తాడు. పదకొండుమందిని చంపిన ఆ కొండజాతీయ యువకుణ్ణి పదకొండు సంవత్సరాల పాటు భూగర్భంలోని చీకటి గదిలో నిర్భందించి ప్రతీ సవత్సరం పదకొండు కొరడా దెబ్బలు తినేలే తీర్పు ఇస్తాడు విరాట్. తీర్పు విన్న ఆ ఖైదీ 'నేను ఆవేశ పిశాచం ఆవహించి ఆ క్షణంలో హత్యలు చేస్తే నీవేమో ప్రశాంతంగా నీ తీర్పుతో నా జీవితాన్ను హరిస్తున్నావు ' అంటూ విరాట్ ను నిందిస్తాడు. ఆ యువకుని కన్నుల్లో తనచే చంపబడ్డ అన్న కన్నులు చూచాడు విరాట్. ఆ మాటలకు చలించి సత్యమార్గాన్ని అన్వేషించటానికి ఒక నెలరోజులు సెలవు తీసుకొంటాడు. నల్లని దుస్తులు ధరించి అట్టడుగున గాఢాంధాకారంలో నున్న చెరసాలకు చేరుకుంటాడు. తను తీర్పు ఇచ్చే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో అనుభవం ద్వారా నేర్చుకుంటానని, ఆ అనుభవం ముందు ముందు సరైన తీర్పులు ఇవ్వటానికి దోహదపడతాయని కొండజాతి యువకునితో చెబుతాడు. అందుగ్గాను విరాట్ ఖైదీ దుస్తులు ఆ యువకుణ్ణి ఎవరికి తెలియకుండా ఓ నెలరోజులు బయటికి పంపిస్తాడు.
మరునాటి ఉదయం బహిరంగంగా విరాట్ ను వంద కొరడాదెబ్బలు కొట్టారు. ఆయననెవరూ గుర్తించలేదు. ఆచ్ఛాదనలేని వీపుమీద మొదటి కొరడాదెబ్బ పడినప్పుడు మాత్రం బాధతో అరిచాడు. తరువాతి దెబ్బల్ని పళ్ళ బిగువున భరించాడు. డెబ్బైయవ కొరడాదెబ్బ పడే సమయానికి స్పృహ తప్పి పడిపోయాడు. వంద దెబ్బలు ముగిశాకా చచ్చిన జంతువును ఈడ్చుకుపోయినట్టు విరాట్ ను అక్కడినుంచి తీసుకువెళ్ళి అతని గదిలో పడేశారు.
విరాట్ కి స్పృహ వచ్చేసరికి తన చెరసాల గదిలో పడుకునివున్నాడు. ఎర్రటి నిప్పుకణికలపై పడుకున్నట్టుగా అనిపించిందతనికి. ఫాలభాగం చల్లగా ఉంది. మూలికల వాసన వచ్చింది. కళ్ళు కొంచెం తెరిచి చూశాడు. చెరసాల అధికారి భార్య అతని పక్కన ఉంది. ముఖం మీద నీళ్ళు చిలకరిస్తోంది. ఆమె కళ్ళలో తొణికిసలాడుతున్న జాలిని, దయను గమనించాడు. శారీరకంగా బాధను అనుభవిస్తున్న ఆ క్షణంలో కూడా ఎదుటి మనిషిలో కరుణను కలిగించడంలోనే కష్టానికి సాఫల్యం ఉందని విరాట్ గమనించాడు. ఆమెవైపు చూసి చిరునవ్వు నవ్వాడు. తనబాధ మర్చిపోయాడు.
రెండవరోజుకి తనంతట తాను లేవగలిగి, నడవగలిగిన ఓపిక వచ్చింది. ఒక్కో అడుగువేస్తుంటే ప్రతిఆడుగు కింద ఒక నూతన ప్రపంచ నిర్మాణం జరుగుతున్నట్లుగా అనిపించింది. మూడవ రోజుకి గాయాలు కొద్దిగా నొప్పి తగ్గాయి. శారీరకంగానూ, మానసికంగానూ కొద్దిగా పుంజుకున్నాడు.
తరువాత తరువాత పెద్దగా కదలకుండా మౌనంగా కూర్చునేవాడు. రాతి పైకప్పునుంచి పడే నీటిబొట్ల ఆధారంగా గడుస్తున్న కాలాన్ని లెక్కించేవాడు.
ఒక మహానిశ్శబ్దం అసంఖ్యాక క్షణాలుగా, లిప్తలుగా విడిపోతుంది. అవన్నీ కలిసి రాత్రిపగలుగా అవతరిస్తాయి. మనిషి జీవితమూ అంతే! వేలాది రాత్రీపగళ్ళతో జీవితం గడిచిపోతుంది. వృద్ధాప్యం వచ్చేస్తుంది.
విరాట్ తో మాట్లాడటానికి ఎవరూ రాలేదు. చుట్టూవున్న గాఢాందాకారం ఆత్మను మూడా ఆవరించినట్లయింది. అయినా ఆయనలో అనేక జ్ఞాపకాల సెలయేళ్ళు ప్రవహించడం మొదలయింది. ఆ సెలయాళ్ళ నిర్మలజలంతో నిండిన గతస్మృతుల సరోవరంలో అతని జీవితం అంతా ప్రతిబింబించింది. జీవితసారం అవగతమైంది. అప్పుడు శకలాలు శకలాలుగా అనుభవంలోకి వచ్చిన జీవితసత్యాలు అన్నీ ఏకమై ఒక్కసారిగా సాక్షాత్కరించినట్లయింది. ఈ గాఢాంధాకారంలో, ఒంటరిగా అలౌకికమైన స్థితిలో రాగద్వేషాలు, మమతానురాగాలు, 'నా' అనే భావనకు దూరంగా సమాజాన్ని గురించి ఆలోచించనప్పుడు ఎప్పుడు లేనంతగా నిర్మలమైపోయింది విరాట్ మనసు.
రోజురోజుకూ జీవితంపట్ల ఆయన దృక్పథం స్పష్టం కాజొచ్చింది. ఆ అంధకారంలోనే అనేక విషయాలు స్పష్టమైన రూపు తొడగసాగాయి. ఆయన ఆత్మదృష్టి ముందు వాటి అసలు రుపాలు ఆవిష్కృతమవసాగాయి. ఆత్మావలోకనంలో ఆయనకు చాలా ఆనందం కలిగించింది.
ఆ అంధకారంలో, ఏకాంతంలో తనను తాను మరిచిపోయి, వివిధరూపాల్లో విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ విశ్వరూపాన్ని లోతుగా అర్థం చేసుకోసాగాడు.
రోజురోజుకూ విరాట్ దృష్టి మరింత స్పష్టమవుతున్నడి. ఆ అంధకారంలోనే అన్ని విషయాలు వాటంతట అవే కొత్త రూపాలు ధరించి విరాట్ జ్ఞానదృష్టికి దర్శనమిస్తున్నాయి. ఆయన అంతరంగంలోని అన్ని విషయాలు మరింత స్పష్టం కాజొచ్చాయి. ఆత్మావలోకనంలో ఆయనకు చాలా అనందం కలిగింది. చీకటిలో, తన స్వభావానికి తెలియని ఒంటరితనంలో మానవసంబంధాలకు దూరంగా ఉండండంతో ఆయన అనంతరూపాలు కలిగిన దివ్యత్వం శక్తి ఏమిటో మరింత బాగా తెలుసుకోగలిగారు. ఊహాకల్పిత నిర్మాణాల మధ్య ఆయన స్వేచ్చగా, స్వతంత్రంగా విహరించగలుగుతున్నారు. అయితే కొత్త చిగుళ్ళు వేయలేని మోడులాగా గంటలకు గంటలు తాను గాఢాంధాకారంలోకి, భూగర్భంలోని నల్లటి రాతిపొరల్లోకి కూరుకుపోతున్నట్టు ఆయనకు అనిపించింది.
విరాట్ ఇలా పద్దెనిమిది రోజులు తన ఇచ్చా ప్రపంచమ్నుంచి విడివడి, ఆత్మావలోకనపు అలౌకికానందంలో మునకలు వేశాడు. తన తప్పిదాలకు ప్రాయశ్చిత్తంగా తాను చేపట్టిన ఖైదీజీవితం ఆయనకు ఆనందదాయకంగా అనిపించింది. దివ్యజ్ఞానికి సంబంధించిన శాశ్వత చైతన్యం ముందు పాపాలు, పరిహారాలు, ఊహాకల్పితాలు మరియు స్వాప్నికదృశ్యాలుగా అనిపించింది.
కాని పందొమ్మిదవరోజున రాత్రి వచ్చిన ఒక ఆలోచన అంకుశంపోటుతో విలవిలలాడుతూ నిద్రనుంచి మేల్కొన్నాడు. ఆతని దేహం భయంతో వణికిపోయింది. వాయుప్రభంజనంలో కొట్టుకునే ఆకుల్లాగా ఆయన చేతివేళ్ళు వణికిపోయాయి. ఆయనను అంతగా కదిలించిన ఆలోచన ఏమంటే - ఒకవేళ ఆ ఖైదీ తనను మోసంచేసి నెల తరువాత తిరిగి రాకపోతే? ప్రమాణాలకు కట్టుబడకపోతే? అసలు తనను మర్చిపోతే? సంవత్సరాల తరబడి తన శరీరంలో రక్తమాంసాలు ఉడిగిపోయే వరకు, తన నాలుక పిడిచగట్టుకుపోయేవరకు ఇక్కడే, ఈ కారాగారంలోనే ఉండిపోవాల్సివస్తుందేమో!
ఈ ఆలోచన కలగడంతో ఆయనలో బతకాలన్న కోరిక నాగుపామువలె పడగవిప్పి, అప్పటిదాకా తనను కమ్మిన పొరల్లన్నింటీని బద్దలు చేసుకొని బయటకు వచ్చింది. కాలానికి సంబంధించిన చైతన్యప్రవాహం ఆయన ఆత్మలో ప్రవేశించడం ప్రారంభమయింది. దానిటొ పాటే భయాలు, ఆశలు, ఐహికప్రపంచానికి సంబంధించిన అన్ని ఈతిబాధలు ఆయన ఆత్మను ఆవహించుకోసాగాయి. అనంతరూపాల్లొ వ్యాప్తమై ఉన్న భగవంతునిపై కూడా దృష్టిని నిలపలేక పోతున్నాడు. తన గురించి మాత్రమే ఆలోచించగలుగుతున్నాడు. ఆయన కళ్ళు వెలుగుకోసం, సూర్యోదయంకోసం తపించిపోతున్నాయి. ఆ చీకటిగుహలో ఇంతవరకు కుంచించుకుఫొయిఉన్న ఆయన శరీరానికి ఇప్పుడు పరిగెత్తాలాని, గంతులు వేయాలని అనిపిస్తోంది. తన భార్యాపిల్లలు, ఇల్లూఆస్తులు, ప్రాపంచిక ఆకర్షణలకు సంబంధించిన ఆలోచనలతో ఆయన మనసు నిండిపోయింది.
నిశ్చలంగా ఉన్న చెరువు నీటిలోకి మురికినీళ్ళు ప్రవేశించినట్టు, జీవితాతం చెరసాలలోనే మగ్గాల్సి వస్తుందేమో అన్న ఆలోచన ప్రశాంతంగా గడిచిపోతున్న కాలాన్ని క్షణమొక యుగంలా గడిచేలా చేసింది. చెరసాల పైకప్పు నుంచి పడుతున్న నీటిబిందువులు ఇప్పుడు చాలా ఆలస్యంగా, భారంగా పడుతున్నట్టు అనిపించసాగాయి.
ఆయన ఆ గుహలో ధైర్యంగా ఉండలేకపోతున్నడు. ఆ కొండజాతి మనిషి తనను మర్చిపోయి, తను శాశ్వతంగా ఇక్కడే, ఈ నిశ్శబ్దంలోనే ఉండిపోవలసి వస్తుందేమోనన్న ఆలోచన ఆయనలో అశాంతిని రేపింది. పంజరంలో పక్షిలాగా ఆ చిన్నగదిలో అటూఇటూ వెర్రిగా తిరిగేవాడు. ఆ గుహగోడల్ని తిట్టేవాడు. శపించేవాడు. తనను తాను తిట్టుకునేవాడు. దేవుళ్ళని, మహారాజుని దూషించేవాడు. రక్తం కారుతున్న వేళ్ళతో బండరాళ్ళను బద్దలుకొట్టే ప్రయత్నం చేసేవాడు. తలవంచి పరుగున వెళ్ళి చెరసాల ద్వారానికి తలతో ఢీకొట్టేవాడు. స్పృహ కోల్పోయేంతవరకు అలా మోదుతూనే ఉండేవాడు. స్పృహ రాగానే మళ్ళీ అదే పని చేసేవాడు.
పద్దెనిమిదోరోజు నుంచి పౌర్ణమి వచ్చేదాకా విరాట్ జీవితం భయంకరంగా గడిచింది. ఆహారాపానీయాలను సరిగ్గా తీసుకోలేకపోయాడు. ఆయన దేహం ఉద్వేగంతో దహించుకుపోయింది. నీటిబిందువు జారిపడినప్పుడల్లా కాలాన్ని లెక్కించేవాడు. ఆయన దృష్టంతా ఒకరోజు గడిచి మరోరోజు రావడం మీదనే. ఈ ధ్యాసలో పడి కనుబొమ్మలపై వెంట్రుకలు తెల్లబడడంలాంటి విషయాల్ని ఆయన గమనించలేదు.
(సశేషం)

























