బామ్మగారి అమెరికా కబుర్లు
గురు స్మరణ: కవిత్వం చెప్పేముందు చదువు నేర్పిన గురువులను స్మరించడం మన భారతీయుల ఆనవాయితి.
చెంపలు వాయించి అపుడు చెప్పిన చదువే
పంపెను కదరా మనలను
గుంపులుగా చేరి ఇచట గోష్ఠులు చేయన్
అమ్మీ, ఇక్కడకు క్షేమంగా చేరి ఇంచుమించుగా నెల్లాళ్ళయింది. అమెరికా వచ్చిన తరువాత నీకు ఉత్తరం రాస్తానన్నాను కదా. ఇవిగో ఇక్కడి విశేషాలు.
చచ్చెడి తికమకగ ఉండు, చాలాకాలం
స్విచ్చి పనితీరు తెలియదు,
వచ్చు పగలు నిద్ర, రాత్రి వచ్చును జెట్లాగ్!!
కారులొ పయనించ పట్టు ఘడియల కొలుతుర్
ఊరుకి ఊరుకి దూరము
ఆరున్నర గంట లెటుల నడగకె భామా!!
గెక్కో అగునిచట బల్లి, గేసగు పెట్రోల్,
ట్రక్కనెదరు లారీ నిట,
చెక్కని బిల్లుని పిలుతురు, చెప్పెద వినుమా!!
దొండకాయ కూడ దొరకునికడ,
చక్కగ అవి ఉండ సాలడు పేరుతొ
ఆకులను తినెదరు మేక లాగ!!
చచ్చునులే తినగ ఇచటి చప్పటి కూరల్,
నచ్చదు వీరికి కారం,
వచ్చునె రుచి మిరప లేక వంటల కెపుడున్!!
పోకుండా ఉండలేరు, బుర్రకు బోరింగ్
కాకుండా హైకింగని
ఏ కొండో ఎక్కివత్తురిచ్చటి మనుజుల్!!
హౌకం నేనింతబరువు అయినా ననుచున్
వాకింగ్ చేసెదరాపై
బైకింగే పగలు రాత్రి, బరువది తగ్గన్!!
బామ్మ ఎప్పుడూ వంకలే ఎంచుతుందనుకోకు. ఇక్కడ కొన్ని బాగున్న విషయాలివిగో.
రువ్వెదరొక చిన్న నవ్వు, రూలది, ఏమీ
యవ్వారమనుచు తలపక
నవ్వగవలె నీవుకూడ, నాకది నచ్చెన్!!
వచ్చునులే వేడి నీళ్ళు పంపులొ ఎపుడున్
బొచ్చున్న కుక్కలధికము
మచ్చుకకు కాన రావు మశకము లిచటన్!!
చెప్పాలంటే ఇంకా చాలా విషయాలున్నాయి. మిగిలిన విశేషాలు తరువాత ఉత్తరంలో రాస్తాను.
దీవెనలతో,
నీ బామ్మ
























