చంద్రశేఖర్ చరిత్ర

ఎడింగ్టన్

“పద్యానికి వర్గమూలం ఎలా తియ్యలేమో అలాగే మానవుల వ్యక్తిత్వాలని సంకేతాలతో కొలవలేము.” – సర్ ఆర్థర్ స్టేన్లీ ఎడింగ్టన్

ఛాయాచిత్రం చూస్తే కను,ముక్కు తీరు ఎలా ఉందో తెలుస్తుంది, బుద్ధులు తెలియవు కదా? ఎడింగ్టన్ ఫోటో చూసినప్పుడు బింకంగా ఉన్న అతని ముఖ భంగిమ, గంభీరమైన కళ్ళు, సన్నటి పొడుగాటి ముక్కు, చిరునవ్వుకు నోచుకోని సన్నని పెదవులు కనిపిస్తాయి. చూడగానే పిదప కాలపు నూటన్ ఇతనేనేమో అనిపించేలా ఉంటాడు.

ఎదుటివారి స్థానాన్ని బట్టి, స్థితిని బట్టి విలువనిచ్చేవారు ఎక్కువ, కానీ ఎదుటివారి శీలాన్ని, వ్యక్తిత్వాన్ని చూసి విలువనిచ్చేవారు తక్కువ. గుడిలో శివలింగం మీదకి పాము వస్తే దానికి దండం పెట్టి పూజ చేస్తారు – అది విషసర్పం అని తెలిసినా, మరొక సందర్భంలో కాటేస్తుందని తెలిసినా.

ఎడింగ్టన్ శీలాన్ని, వ్యక్తిత్వాన్నీ అంచనా వెయ్యడానికి ఎక్కువ శ్రమ పడక్కరలేదు. ఎడింగ్టన్ ని మొదటిసారి చూసినప్పుడు చంద్రశేఖర్ మనస్సులో మెదిలిన ఆలోచన స్రవంతి ఈ విధంగా ప్రవహించింది: “ఎడ్వర్డ్ చక్రవర్తి పాలనలో బ్రిటిష్ సంఘంలో ఒక ‘వర్ణాశ్రమ ధర్మం’ అమలులో ఉండేది. ఆ ధర్మం ప్రకారం బ్రిటిష్ సంఘంలో ప్రతి వ్యక్తికీ ఒక స్థానం ఉంది. ఎవరి హద్దులలో వారు ఉన్నంత సేపు సంఘం సజావుగా నడిచి పోతూ ఉంటుంది. ఈ నేపథ్యపు దృష్టితో చూస్తే ఎడింగ్టన్ ప్రవర్తనలో ఎత్తి చూపవలసిన లోపం కనిపించదు.”

ఎడింగ్టన్ ని మొదటిసారి కలిసినప్పుడు చంద్రశేఖర్ ఇలా స్పందించేరు: “అతను ఘనుడు. మీరు అతని ఎదుట నిలబడి మాట్లాడితే ఎంతో ఘనతకెక్కిన వ్యక్తితో మాట్లాడుతున్నట్లు మీకు అనిపిస్తుంది. బ్రిటిష్ వాళ్ళు సహానుభూతి, సంయమనం ప్రదర్శించగల సమర్థులు. కాదనను. కానీ వాళ్ళ ప్రవర్తనని నిశితంగా పరిశీలించి చూస్తే ‘మేము మరొక కోవకి చెందిన మనుష్యులం, మరొక అంతస్తులో ఉండవలసిన మనుష్యులం’ అనే ఒక రకమైన నైసర్గిక లక్షణం వారిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీనిని వారు తమ జాతి శీలంగా భావించినా అది ‘చులకన చేసే నైజం’ అని ఎదుట వారికి అనిపిస్తుంది.”

విద్యార్థుల అభిప్రాయం ప్రకారం, “ఎడింగ్టన్ ఎప్పుడూ అధికార దర్పంతో కనిపిస్తాడు. ఆయన దరికి చేరి చనువుగా మాట్లాడడమే కష్టం. విద్యార్థులు ఎప్పుడూ భయభక్తులు ప్రదర్శిస్తూ ఉండాలి. అయన పాఠం వింటూ ఉంటే నిద్ర వస్తుంది.”

చిత్రం ఏమిటంటే తన సహాధ్యాయులతో అధ్యక్ష పీఠం దగ్గర ఆసీనుడై విందు ఆరగించే సమయంలో ఎడింగ్టన్ లేకపోతే సమావేశానికి కళ వచ్చేది కాదు. అయన హాస్యోక్తులు, చతురోక్తులు, ఛలోక్తులతో సందడిగా ఉంటారు. ఒక పార్టీలో, పంటికొనల మధ్య వేళ్ళాడుతున్న పొగాకు గొట్టాన్ని, తీసి చేత్తో పట్టుకుని, సింహంలా మెడ ఝాడించి, ఆడవారు ధరించే దుస్తులకి ఉండే జిప్పర్లు ఊడిపోయి, బట్ట దిగజారిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో వర్ణిస్తూ ఉంటే పిల్లికి చెలగాటంలా బాగానే ఉందేమోకాని, వింటూ ఉన్న ‘ఎలకలు’ నిశ్చేష్టులై పోయారుట.

అమెరికా ఖగోళ శాస్త్రవేత్త హార్లో షేప్లి (Harlow Shapley) ఒక సారి తన సహాధ్యాయులకి ఒక ప్రశ్నావళి పంపేరుట – తమకి తెలిసిన ఖగోళ, నక్షత్రభౌతిక శాస్త్రవేత్తలలో ఉన్నత స్థానం అధిష్టించడానికి అర్హులైన పదిమంది వ్యక్తుల పేర్లు అవరోహణ క్రమంలో రాసి పంపమని అర్థిస్తూ. ఆ సహాధ్యాయులు పంపిన సమాధానాలు అన్నిటిలోను అగ్రస్థానం ఎడింగ్టన్ ఆక్రమించడాన్ని బట్టి ఆ రోజులలో ఎడింగ్టన్ పరపతి ఎలాగుండేదో అర్థం అవుతుంది.

ఆ రోజుల్లో ఎడింగ్టన్ ప్రపంచం లోని ఖగోళ, నక్షత్రభౌతిక శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడనడంలో సందేహం లేదు. నక్షత్రభౌతిక శాస్త్రం అనే భవంతిని అయన ఒంటి చేత్తో లేవనెత్తేడు. ఆయన పరపతితో పాటు ఆయనకున్న పలుకుబడి ప్రపంచవ్యాప్తం. అమెరికాలో ప్రిన్స్^టన్ విశ్వవిద్యాలయంలో ఉన్న ఖగోళభౌతిక శాస్త్రవేత్త హెన్రి నోరిస్ రస్సెల్ (Henry Norris Russell) ఈయన భక్తుడు; ఈయన సిఫార్స్ లేకపోతే అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాలు దొరకేవి కావుట.

“ఎడింగ్టన్ ఉత్తమ శ్రేణి మేధావంతుడు. ఆయన వాదం మొదట్లో కుతర్కంలా అనిపించినా, పర్యవసానం చూసిన తరువాత, ఆయన తర్కంలో తప్పులు ఎంచడానికి ఎవ్వరికీ దమ్ములు ఉండేవి కాదు” అన్నాడు ఎడింగ్టన్ ని బాగా అధ్యయనం చేసిన మిల్నీ విద్యార్ధి, థామస్ కౌలింగ్. ఎడింగ్టన్ చేసిన పనిని కానీ, ఆయన “భక్తి బృందం” లో మరెవ్వరి పనినైనా కానీ కేవలం అర్థం చేసుకుందుకి – విమర్శించే దృష్టితో కాదు – ప్రశ్న వేస్తే వారికి పుట్టగతులు ఉండేవి కాదుట.

స్టేన్లీ ఎడింగ్టన్ (డిసెంబరు 20, 1882 – నవంబరు 22, 1944) ఇంగ్లండ్ లో కెండల్ అనే ఉళ్ళో ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో రెండవ సంతానంగా పుట్టేడు. ఎడింగ్టన్ ఇంకా రెండేళ్ల పిల్లవాడిగా ఉన్న రోజుల్లో అతని తండ్రి సన్నిపాత జ్వరం వచ్చి చచ్చిపోయేడు. అప్పుడు తల్లి పిల్లలిద్దరినీ తీసుకుని బ్రిస్టల్ నగరం దగ్గర ఒక చిన్న పల్లెటూరికి వెళ్లి, అక్కడ పెంచింది. ఎడింగ్టన్ చిన్నతనంలోనే పరిమళించేడు. ఒక నాడు పని నుండి ఇంటికొచ్చిన తల్లి “ఇంటి దగ్గర ఏమి చేస్తున్నావు?” అని అడిగితే, “బైబిల్ లో ఎన్ని మాటలు ఉన్నాయో లెక్కపెడుతున్నాను” అని సమాధానం చెప్పేడుట. రాత్రిళ్ళు ఆకాశంలో నక్షత్రాలని లెక్కపెట్టేవాడుట.

స్టేన్లీ పేద విద్యార్ధి. ఎక్కువ సమయం విద్యార్థి వేతనాల కోసం తిరగడానికి ఖర్చు అయేదిట. హాస్టల్ ఖర్చులు భరించే తాహతు లేక ఇంటి దగ్గరే ఉండి పాఠశాలకు సైకిలు మీద వెళ్ళేవాడు. గణితం అభిమాన పఠనాంశం. ఆంగ్ల వాగ్మయం అంటే ఆసక్తి. అర్థవంతమైన మాటలు ఉపయోగించి, వ్యాకరణ బద్ధమైన “అర్థం పర్థం లేని” వాక్యాలు నిర్మించి వాటితో ఆటలు ఆడడం అతని వ్యావృత్తి. ఈ అధ్యాయం మొదట్లో ఉదహరించిన వాక్యం ఈ కోవకి చెందినదే! పందొమ్మిదేళ్లకి, 1902 లో, ఆనర్స్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయేడు. విద్యార్ధి వేతనంతో ట్రినిటీ కాలేజీలో చేరి, గణితంలో జరిగిన ఒక ప్రతిష్టాత్మకమైన పోటీలో ప్రప్రధముడిగా నిలిచి ప్రశంసలు అందుకున్నాడు.

గ్రీన్విచ్ లో ఉన్న రోయల్ అబ్జర్వేటరీ లో, 1906 లో, సహాయకుడుగా చిన్న ఉద్యోగం వస్తే అందులో చేరిన తరువాత నక్షత్రాల గురించి మనకి తెలిసినది చాల తక్కువ అని అతనికి అర్థం అయింది. ఏవి చిల్లర మల్లర ఊహలు? ఏవి బందోబస్తు వాదాలు? నక్షత్రాలు ఎలా తయారయేయి? ఏ సామాగ్రితో తయారయ్యాయి? అవి ఎప్పుడు పుట్టేయి? పుట్టుట గిట్టుట కొరకే అంటారు కనుక నక్షత్రాలకి చావు ఉందా? అవి కనబడుతూన్న చోట అలా నిశ్చలంగా ఉంటాయా? లేక, వాటికి కదలిక ఉందా? ఇటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఎవ్వరూ సరిగ్గా చెప్పలేకపోయారు. వెంటనే పనికి పూనుకుని పరిశోధనలు మొదలు పెట్టి 1913 కల్లా కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ప్లుమియన్ ప్రొఫెసర్ పదవిని అలంకరించేడు. మరుసటి సంవత్సరం కేంబ్రిడ్జి వేధశాలకి అధినేత అయ్యాడు!

స్టేన్లీ రోయల్ అబ్జర్వేటరీ లో 1906 లో చేరిన తరుణంలో నక్షత్రభౌతిక శాస్త్రం శైశవ దశలో ఉంది. ఆ రోజుల్లో నక్షత్రాలు – మన సూర్యుడు తో పాటు – అనేవి అణువులు (atoms) తో నిండిన పెద్ద వాయు గోళాలు అనే ఊహ ప్రాచుర్యంలో ఉండేది. నీల్స్ బోర్ 1913 లో గుళిక వాదం (quantum theory) లేవదీసిన తరువాత ఈ అవగాహనలో మార్పు వచ్చింది. అణువుకి ఒక కేంద్రము, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసే ఎలక్ట్రానులు అనే నమూనా వాడుకలోకి వచ్చింది. ఈ నమూనాలో ఎలక్ట్రానులు ఋణ విద్యుదావేశం కలిగి ఉంటాయి, దానితో సరితూగే ధన విద్యుదావేశం కేంద్రంలో ఉండి అణువుకి నికరంగా ఏ అవేశము లేకుండా తటస్థంగా ఉంటుంది. అన్నిటిలోకి చిన్నది, తేలిక అయినది ఉదజని (Hydrogen) అణువు; దాని కేంద్రం చుట్టూ ఒకే ఒక ఎలక్ట్రాను తిరుగుతూ ఉంటుంది. మరి కొంచెం పెద్ద అణువు రవిజని (Helium); దాని కేంద్రం చుట్టూ రెండు ఎలక్ట్రానులు ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. ఇలా అణు సంఖ్య పెరిగే కొద్దీ ప్రదక్షిణం చేసే ఎలక్ట్రానుల సంఖ్య కూడా పెరుగుతుంది.

నక్షత్ర గర్భంలో వేడి మిలియను డిగ్రీలని మించి ఉంటుంది. (ఇక్కడ వేడిని కొలవడానికి కెల్విన్ కొలమానం ఉపయోగిస్తున్నాను. మనం నిత్యం వాడే సెల్సియస్ కొలమానానికి 273 కలిపితే కెల్విన్ కొలమానం వస్తుంది.) ఇంత అత్యధికమైన వేడిలో ఎలక్ట్రానులు కేంద్రం గుప్పిట నుండి తప్పించుకుని విశృంఖలంగా తిరుగుతూ ఉంటాయి. కనుక నక్షత్ర గర్భంలో ఎలక్ట్రానులు – తేలిక అయినవి కనుక – జోరుగా ఉరవళ్ళు తొక్కుతూ, పరుగులు తీస్తూ ఉంటే బరువైన కేంద్రాలు, నెమ్మదిగా, కాళ్లు ఈడ్చుకుంటూ ప్రయాణం చేస్తున్నట్లు మనం ఉహించుకోవచ్చు. ఆ రోజుల్లో కేంద్రంలో ఏముందో తెలియలేదు కనుక, నక్షత్రం అంటే ఎలక్ట్రానులుతో నిండిన వాయు గోళాలు (spheres of electron gas) అనే అనుకుని నమూనాలు నిర్మించుకునేవారు.

నక్షత్రాలలో ఉండే ఎలక్ట్రాను వాయువు ఆదర్శ వాయువు (ideal gas or perfect gas) లక్షణాలని కలిగి ఉంటుందని అనుకోవడం సంప్రదాయం. ఒక వాయువు ఏదయినా (అది ఆమ్లజని కావచ్చు, ఉదజని కావచ్చు, ఎలక్ట్రానుల వాయువు కావచ్చు), దాని పీడనం (pressure, P), ఉరుము (volume, V), తాపోగ్రత (temperature, T) – ఈ మూడు – PV = kT అనే సమీకరణాన్ని సంతృప్తి పరుస్తూ ఉంటే అది ఆదర్శ వాయువు అవుతుంది. అనగా, PV ని T చేత భాగించగా వచ్చిన లబ్దం k అనే ఒక స్థిరాంకం. అనగా తాపోగ్రత (T) ని పెంచితే పీడనం (P) అయినా పెరగాలి, ఉరుము (V) అయినా పెరగాలి. ఉదాహరణకి, ఒక గిన్నెని వాయువుతో నింపి, మూత పెట్టి వేడి చేస్తే దాని తాపోగ్రత (T) పెరుగుతుంది, మూత ఉంది కనుక ఉరుము (V) స్థిరంగా ఉంటుంది, కనుక పీడనం (P) పెరగాలి. లేదా, ప్రెషర్ కుక్కర్ లో పెట్టి వేడి చేస్తే తాపోగ్రత (T) పెరుగుతుంది, పీడనం (P) స్థిరంగా ఉంటుంది కనుక లోపల ఉన్న వాయువు ఉరుముతుంది (V పెరుగుతుంది). ఈ PV = kT ని ఆదర్శ వాయు సూత్రం (ideal gas law) అంటారు. నక్షత్ర శాస్త్రం అధ్యయనం చేసేటప్పుడు ఈ చిన్న సమీకరణం అవసరం తరచు వస్తుంది.

నక్షత్రాల మీద పరిశోధన మొదలు పెట్టిన కొత్త రోజులలో ఎడింగ్టన్ కి అమెరికాలో ప్రిన్స్^టన్ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న హేన్రి నోరిస్ రస్సెల్ (Henry Norris Russell) తో పరిచయం అయింది. ఆచార్య రస్సెల్ పని చేస్తున్న చోటే ఈయన కిచ్చే జీతం కంటే ఎక్కువ జీతం ఇచ్చి సర్ జేమ్స్ జీన్స్ ని నియమించడం జరిగిన దగ్గర నుండి రస్సెల్ కి జీన్స్ అంటే అసూయ పెరిగి చివరికి ద్వేషంగా మారింది. ఎడింగ్టన్ కి కూడ, వేరొక కారణం వల్ల, జీన్స్ అంటే కిట్టేది కాదు. జీన్స్ పేరు చెబితే చాలు ఎడింగ్టన్ ఒంటికాలి మీద లేచిపోయేవాడు. శత్రువు యొక్క శత్రువు ఆత్మబంధువు అవుతాడు కనుక రస్సెల్ కి ఎడింగ్టన్ మధ్య స్నేహం పెరగడానికి అదొక కారణం అయింది. వీరిద్దరివి సంకుచిత బుద్ధులు; అయినా, ఎవరికి వారుగా నక్షత్ర భౌతిక శాస్త్రంలో ప్రవీణులు.

ఆ రోజుల్లో రస్సెల్ నక్షత్రాల జీవిత చక్రాల మీద – అనగా, అవి ఎలా పుడతాయి, ఎలా పెరుగుతాయి, ఎలా మరణిస్తాయి, వగైరా – పరిశోధనలు చేస్తున్నాడు. ఈ సందర్భంలో అయన ‘సెఫియడ్ చలన తారలు’ (Cepheid variable stars) అనే ఒక జాతి నక్షత్రాలని అధ్యయనం చేస్తున్నాడు. వీటి ప్రత్యేకత ఏమిటంటే వీటి దృష్ట ప్రకాశత్వం (apparent brightness, అనగా మన కంటికి కనిపించే దీప్తి) స్థిరంగా ఉండకుండా, క్రమంగా పెరిగి ఒక తార స్థాయి చేరుకొని, క్రమంగా తరిగి ఒక నీచ స్థాయి చేరుకొని, అలా ఒక క్రమమైన బాణీలో పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది. ఈ పెరుగు, తరుగుల ఆవర్తన కాలం కొద్ధి గంటల నుండి కొద్ధి రోజుల వరకు ఉండొచ్చు. ఆ నాటికి, అనగా 1908 నాటికి, దరిదాపు 1700 వరకు ఈ రకం ‘సెఫియడ్ చలన తారల’ ఉనికిని నిర్ధారించేరు. అంతే కాదు. రస్సెల్ ఈ తారల ఆవర్తన కాలానికి, స్వయం ప్రకాశత్వం (real brightness = luminosity, అనగా నక్షత్రం ఉపరితలం దగ్గర కనిపించే దీప్తి) కి మధ్య ఒక గణిత బాంధవ్యం కనుక్కున్నాడు. (నక్షత్రాలకి సహజంగా ఒక తేజస్సు ఉంటుంది. కానీ చూసే కంటి దూరం ఎక్కువ అవుతున్న కొద్దీ కంటి దగ్గర నమోదు అయే కాంతి తరుగుతుంది. ఇలా “కంటికి కనిపించే” దీప్తిని మనం “దృష్ట ప్రకాశత్వం” అనిన్నీ, తారకి స్వతహాగా ఉండే దీప్తిని “స్వయం ప్రకాశత్వం” అనిన్నీ పిలుద్దాం.
(Apparent brightness tells how bright the star appears to a detector here on Earth. The luminosity of a star, on the other hand, is the amount of light it emits from its surface. The difference between luminosity and apparent brightness depends on distance.) దృష్ట ప్రకాశత్వంని కొలవడానికి ఇంగ్లీషులో magnitude అనే మాటని వాడతారు. ఆ వివరాలని ప్రస్తుతానికి వెనక పెడదాం.

ఇవే ప్రశ్నలు ఎడింగ్టన్ రోయల్ అబ్జర్వేటరీ లో చేరిన కొత్తలో అడిగేవాడు. రస్సెల్ కుస్తీ పడుతున్న సిఫియడ్ తారల ఆవర్తన కాలానికి, నక్షత్రంలో ఉన్న పదార్థం యొక్క సాంద్రతకి మధ్య గణిత బాంధవ్యం – ప్రయోగాత్మకంగా కాకుండా – సిద్దాంతపరంగా కనుక్కున్నాడు. అప్పుడు ఎడింగ్టన్ కి వచ్చిన అనుమానం ఏమిటంటే, తారలు అన్నీ సిఫియడ్ దశ గుండా జీవనయానం కొనసాగిస్తాయా? సిఫియడ్ తారలలో శక్తి సన్నగిల్లిపోయిన తరువాత వాటి దీప్తిలో ఉచ్చ, నీచలుతో కూడిన డోలనం ఉంటుందా? ఈ సందర్భంలో అమెరికా నుండి ఇంగ్లండు వచ్చి రస్సెల్ ఇచ్చిన ప్రసంగం ఎడింగ్టన్ వినడం తటస్థ పడింది. ఈ ప్రసంగంలో రస్సెల్ ఒక బొమ్మ చూపించేడు. ఆ బొమ్మలో నక్షత్రాల జాతకాలు కాలంతో పాటు ఎలా మారతాయో చిత్రించేడు అయన! ఆ చిత్రణ ఎడింగ్టన్ ని ఆకట్టుకుంది. తరువాయి కథనం చదివి ఆనందించాలంటే కాసింత నేపథ్యం అవసరం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked