కథా భారతి

ట్రాఫిక్ టికెట్

-ఆర్. శర్మ దంతుర్తి

తీరుబడిగా వేసవి శెలవులకి ఓహైయో నుంచి న్యూయార్క్ న్యూజెర్సీ అన్నీ చూడ్డానికి బుధవారం సకుటుంబంగా బయల్దేరిన శంకర్రావుకి శనివారం వచ్చేసరికి ఒక్కసారి నీరసం ఆవహించింది, మళ్ళీ సోమవారం నుంచీ పనిలోకి వెళ్ళాలంటే. ఓ సారి తల తాకట్టు పెట్టాక ఎలాగా కుదరదు కనక శుక్రవారం రాత్రే హోటల్ ఖాళీ చేసి రాత్రి కొలంబస్ వెళ్ళిపోతే మరో రెండు రాత్రులు తీరిగ్గా పడుకుని సోమవారం పన్లోకి పోవచ్చు. ఇదీ సరిగ్గా వేసుకున్నప్లాను.
అయితే క్వీన్ విక్టోరియా, యువరాజా, రాణీల వారికి తండ్రి కున్నంత కంగారు లేదు అప్పుడే ఇంటికెళ్ళిపోవడానికి. వెకేషన్ లో వాళ్ళకి కావాల్సిన ఆనందం వాళ్ళు పిండుకున్నాక కారెక్కి బజ్జుంటారు. శంకర్రావుకు డ్రైవింగ్ ఎలాగా తప్పదు. అర్ధరాత్రీ, అపరాత్రీ ఏక్సిడెంట్ లేకుండా వెళ్ళాలంటే జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి నిద్రపోకుండా. పోనీ తనకి నిద్ర రాకుండా కబుర్లు చెప్తారా అంటే వాళ్ళందరూ బాగా అలిసిపోయి నిద్రలో ఉంటరాయె, ఎలా? అలా ఆయన పాట్లు ఆయన పడవల్సిందే. శంకర్రావుగారు ఎంత మొత్తుకున్నా ఈ రొటీన్ మారదు గాక మారదు. శంకర్రావు డ్రైవింగ్ లో గత పదిహేనేళ్ళుగా ఎప్పుడూ ఏ విధమైన ఏక్సిడెంట్లూ, ట్రాఫిక్ టికెట్లూ లేకపోవడం వల్ల, ఇంక ముందేమీ జరగదని వాళ్ల ధీమా. అయితే శంకరానికి ఎప్పుడు గుండె గుబగుబ లాడుతూనే ఉంటుంది ఎప్పుడు ఏది ఇటునుంచి అటు తిరుగుతుందో, ఖర్మ కాలి ఏ చిన్న ఏక్సిడెంట్ అయినా తన ఇన్స్యూరెన్స్ ఎలా పెరుగుతుందో అనిపిస్తూ.
అలా ఆ శనివారం సాయింత్రం ఇంటికి బయల్దేరుతూంటే క్వీన్ విక్టోరియా గారు ఉవాచ – యువరాజా వారికి ఆదివారం పొద్దుటే బేస్ బాల్ ప్రాక్టీస్ ఉంది. రాత్రి ఏ టైమ్ కి ఇంటికి జేరినా పొద్దున్నే లేచి వీణ్ణి తీసుకెళ్ళాలి అక్కడికి. ఎంత గింజుకున్నా బయల్దేరేసరికి రాత్రి తొమ్మిదైపోయింది. జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే ఎనిమిది గంటల్లో ఇంటికెళ్ళిపోవచ్చు. ఇంకాస్త స్పీడు పెంచితే – అంటే 70 మైళ్ళ స్పీడ్ లిమిట్ లో 80లో వెళ్తే – రాత్రి రెండూ మూడూల మధ్య వెళ్ళిపోలేం?
బండి హైవే మీద ఎక్కాక కుటుంబం అంతా నిద్రలోకి జారుకుంది. ఇంక అక్కడ్నుంచి అంతా శంకర్రావు కష్టమే. అదృష్టం ఏమిటంటే మార్చ్ రెండో శనివారం రాత్రి ఇది. చలికాలం వెళ్ళిపోతూంది. ట్రాఫిక్ కూడా అంతలేదు, నిద్ర రాకుండా కూడా తెచ్చుకున్న బబుల్ గం, మరో లవంగం, ఈ రెండూ పనిచేయకపోతే దారిలో ఆగి మెక్ డొనాల్డులో ఓ వేడి కాఫీ, అదీ చాలకపోతే నోట్లో పుల్లతో పళ్ళు గీక్కోవడం ఇవి పనిచేస్తాయి.
దాదాపు రాత్రి ఒంటిగంటకి బండి పిట్స్ బర్గ్ చేరింది. సాధారణంగా అయితే పెన్ హిల్స్ మీద ఉన్న వెంకటేశ్వరుడి గుళ్ళోకి వెళ్ళేవారే అందరూను. కాని ఇప్పుడు అర్ధరాత్రి. దారిలో ఓ వేడి కాఫీ కొని కాసేపు అటూ ఇటూ నడిచి ఒళ్ళు విరుచుకుని మళ్ళీ సీట్లో కూచున్నాడు శంకర్రావు. మహా అయితే మరో రెండు గంటల్లో ఇంటికిపోయి హాయిగా పడుకోవచ్చు. అయితే విధాత తలుపు మరో విధంగా ఉంది.
హైవే నెంబర్ 70 మీద ఏదో చిన్న రోడ్లు పని పెట్టారు లాగుంది ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంది. మెల్లిగా మరో గంట, దాదాపు పది మైళ్ళు నత్త నడక నడిచాక అప్పటికి ట్రాఫిక్ సర్దుకునేసరికి టైమ్ అప్పుడే ఆదివారం పొద్దున 2 గంటలు చూపిస్తోంది. ఎప్పటిలాగానే కుటుంబం హాయిగా కలల్లో తేలుతున్నారు పడుకుని. హతోస్మి, ఈ లేటు వల్ల ఒక గంట క్షవరం తనకి; లేకపోతే ఈ పాటికి ఇంటికెళ్ళి ఉండేవాడే. బండి ముందుకు పోనిస్తూ వేగం పెంచాడు శంకర్రావు. ఎనభై, ఎనభై అయుదూల మధ్య పోనిస్తూంటే ఆదివారం పొద్దుటే బృహస్పతి గడి మారినట్టున్నాడు వెనకనే నీలం లైట్లు వెలుగుతూ పోలీస్ కారు. శంకర రావుకు గుండెలు గుబగుబలాడేయి. ఇన్నాళ్ళూ తాను స్పీడింగ్ టికెట్ లేకుండా లాక్కొచ్చాడు బండి. ఇప్పుడేమౌతుందో? బండి పక్కకి తీసి ఆపి అలాగే కూర్చుని పోలీసాయన రావడం కోసం చూస్తూ టైమ్ చూసుకున్నాడు. తెల్లవారుఝామున రెండు దాటి ఇరవై నిముషాలు చూపిస్తోంది వాచ్.
ఆ తర్వాత అరగంటలో జరగాల్సినవి మామూలుగా జరిగిపోయాయి. పోలీసు వారు తాను 90 మైళ్ళ స్పీడులో వెళ్తున్నట్టూ, కానీ హైవే మీద 70 దాటకూడదు కనక టికెట్ ఇచ్చేరు. శంకర్రావు ఎంత వాదించినా కుదర్లేదు. మహా అయితే ఫలానా రోజున కోర్టుకొచ్చి సమాధానం చెప్పుకోండోహో అని టికెట్ చేతిలో పెట్టి, అసలే రాత్రి బండి నడుపుతున్నావు, కుటుంబం అంతా కార్లోనే ఉంది కనక జాగ్రత్త అని చెప్పి పెద్దాయన వెళ్ళిపోయేడు. ఈ సరికి క్వీన్, యువరాణీ లేచి శంకర్రావుని బుద్ధిలేని వెధవలా తిట్టడం మొదలు పెట్టారు – అసలు అంత స్పీడింగ్ ఎందుకూ అంటూ. శంకర్రావు వాళ్ళ మీద అరుద్దామనుకున్నాడు కానీ, అది దేనికి దారి తీస్తుందో పెళ్ళైన ఇరవై ఏళ్ళ జీవితంలో బాగా తెలుసు కనక నోరు మూసుకుని, చేతిలో పోలీస్ పెట్టిన టికెట్ క్వీన్ కి అందించాడు. అది ఆవిడ చూసి అంది నోరు తెరుస్తూ – ఇది 360 డాలర్ల ఫైన్!

దాదాపు మూడున్నరకి ఇంటికొచ్చిన శంకర్రావు ఇంక తట్టుకోలేని నిస్త్రాణతో మంచంమీద వాలిపోయేడు. ఆ పడుకోవడం ఎలా అంటే మర్నాడు పొద్దున్న తొమ్మిదింటికి కూతురు లేపేదాకా ఒళ్ళు తెలియలేదు. తొమ్మిదిన్నరకి బేస్ బాల్ ప్రాక్టీస్! కుర్రాణ్ణి కంగారుగా మైదానానికి తీసుకెళ్ళాక అప్పుడు తెలిసింది అసలు విషయం, తానో గంట లేటుగా వచ్చేడు. మిగిలిన పావుగంటో అరగంటో కుర్రాణ్ణి అక్కడ ఆడనిచ్చి ఇంటికొచ్చాడు. ఆ రోజు పోలీస్ ఇచ్చిన స్పీడింగ్ టికెట్ మరోసారి చూసాడు. ఆదివారం తెల్లవారుఝామున రెండున్నరకి అని రాసిన దాంట్లో ఫైన్ 360 కట్టేయడం కానీ, మరో మూడు వారాల్లో కోర్టుకొచ్చి సమాధానం చెప్పుకోవడం కానీ చేయవచ్చు.
కాసేపు ఆలోచించేడు శంకర్రావు ఏం చేయాలో పెళ్ళాంతో కలిసి. ఆవిడ చెప్పడం ప్రకారం తప్పు తనదే కనక ఆ డబ్బులు కట్టేయడమే మంచిది. కానీ 360 అంటే అంత చిన్న మొత్తం కాదు కనక శంకర్రావు చెప్పేడు ఆవిడతో, “రేపు ఆఫీసులో తెలుసున్నవాళ్లని అడుగుదాం. అప్పుడు వాళ్ళేమంటారో చూసి పైవారం ఏ సంగతీ చూడొచ్చు.” ఇంకారోజుకి నిద్రే.
మర్నాడు శంకరం దీని గురించి ఆఫీసులో తెలుసున్నవాళ్లతో చర్చించేడు. కొంతమంది వెంఠనే కట్టేయమంటే కొంతమంది లాయర్ సలహా తీసుకోమనీ, మరి కొంతమంది తానే కోర్టుకెళ్ళి వాదించమనీ తలో సలహా పారేసారు. ఒకాయన మాత్రం, “పోలీస్ వాడిన స్పీడ్ డిటెక్టరు ఎప్పుడు చివరిసారి సరి చేసాడో తెలుస్తే జడ్జ్ దగ్గిర వాదించి టికెట్ కేన్సిల్ చేయించడం సులభం” అన్నాడు.
ఈ విషయాలు పట్టుకుని గూగిల్ మీద పడ్డాడు శంకర్రావు. మరో రెండు రోజులు అన్ని విషయాలు తెలుసుకున్నాక మరో సారి టికెట్ కేసి చూసేడు. మార్చ్ రెండో శనివారం, ఆదివారాల మధ్య – నిజానికి ఆదివారం పొద్దున్న రెండున్నరకి – ఇచ్చాడు టికెట్. కేలండర్ చూసేడు శంకరం. మెల్లిగా మొదలైన చిరునవ్వు ఆ చెవినుంచి ఏ చెవిదాకా విచ్చుకుంటూంటే క్వీన్ విక్టోరియాని పిలిచి చెప్పేడు, “ఈ టికెట్ ని నేను కోర్టులో వాదిస్తున్నాను, డబ్బులు కట్టే ప్రసక్తే లేదు.” డబ్బులు కట్టేది ఆవిడ కాదు కనక, ఇదెలా పోయినా నాకెందుకన్నట్టు కళ్ళెగరేసి లోపలకి వెళ్ళిపోయింది క్వీన్ విక్టోరియా.

పోలీసు కోర్టుకి రమ్మన్న రోజు శంకర్రావు ఆఫీసుకి శెలవు పెట్టి టికెట్ చేత్తో పట్టుకుని బయల్దేరేడు. టికెట్ ఇచిన కౌంటీ కొలంబస్ కి ఓ గంట ప్రయాణం. ఓ జేబులో చెక్ బుక్ ఉంది. ఏదైనా అడ్డం తిరిగితే డబ్బులు ఎలాగా కట్టాలి కనక. వెళ్ళేసరికి జడ్జ్ దగ్గిర పనిచేసే అమ్మాయి, పోలీసూ ఇద్దరూ సిద్ధంగా ఉన్నారు. శంకర్రావు పేరు పిల్చేక ఏం చేయదల్చుకున్నాడో అడిగితే చెప్పేడు, “నేను స్పీడింగ్ చేయలేదు, వాదిస్తాను. డబ్బులు కట్టను.” మరోగంటకి జడ్జ్ దగ్గిర వాదించడం మొదలైంది.
జడ్జ్ స్పీడింగ్ టికెట్ చూసి అడిగేడు పోలీసుని, “ఇది మీరు రాసినది, అన్నీ సరిగ్గా ఉన్నట్టేనా?”
“అవును, తప్పకుండా, ఈ ఇండియన్ ఆయన నాకు బాగా గుర్తు కూడా. నేను బండి ఆపేసరికి వాళ్ళ కుటుంబం అంతా ఉన్నారు లోపల. 90 మైళ్ల మీద వెళ్తుంటే వాళ్ళందరికీ ప్రమాదం కాదా? అందుకే అలా టికెట్ ఇచ్చాను. ఒక్కరే అయితే కాస్త తగ్గించవచ్చేమో కానీ బండిలో నలుగురున్నారు.”
“ఏమి సమాధానం చెప్తారు దీనికి?” జడ్జ్ అడిగేడు శంకర్రావును.
“పోలీస్ స్పీడ్ డిటెక్టర్ ఎప్పుడు కాలిబ్రేట్ చేసారో తెలుసుకోవచ్చా?” శంకర్రావు అడిగేడు.
పోలీస్ కి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టైంది. బయటకెళ్ళి తన కార్లో ఉన్న రికార్డులన్నీ పట్టుకొచ్చి చూపించేడు, ఆఖరుసారి తన స్పీడ్ గన్ కాలిబ్రేట్ చేసినది దాదాపు రెండేళ్ల క్రితం.
అది చూసిన శంకర్రావు విజృంభించేడు, “యువరానర్, రెండేళ్ళ క్రితం కాలిబ్రేట్ చేసిన గన్ ఇప్పుడు ఎలా పనిచేస్తుందో మీకు తెలిసిన విషయమే. ఈ స్పీడ్ 90 అని రాసినది శుద్ధ తప్పు. నేనెప్పుడూ 75 దాటలేదు. అదీకాక మరో పనికిరాని విషయం ఉంది టికెట్ లో.”
“ఏమిటది?”
“టికెట్ మార్చ్ రెండో ఆదివారం తెల్లవారుఝమున 230 కి అని రాసారు కదా? అసలా టైమే లేదు ఆ రోజున.”
“ఏవిటీ?” పోలీసూ, జడ్జీ శంకర్రావుని పిచ్చివాడిలా చూస్తూ అడిగేరు.
“ప్రతీ మార్చ్ రెండో ఆదివారం లో తెల్లవారుఝామున 2 గంటలకి డే లైట్ సేవింగ్స్ టైమ్ వల్ల రెండు ని మూడుగా మారుస్తారు. అందువల్ల అసలు 230 అనే టైమే లేదు ఆ రోజున. ఈ రెండింటి వల్లా అసలు నన్ను ఈయన ఎలా పట్టుకున్నాడూ ఆ టైమ్ కి, పట్టుకున్నప్పుడు ఆయన మనఃస్థితి విచారించాలి.”
జడ్జ్ కళ్ళు విప్పార్చి పోలీస్ కేసి చూసేడు. చెప్పడానికేమీ లేదన్నట్టూ మూతి విరిచేడు పోలీసు. తాను చేసిన తప్పు తెలియగానే. మొదటిది తన స్పీడ్ గన్ కాలిబ్రేట్ చేసుకోకపోవడం. రెండోది దౌర్భాగ్యపు తప్పు. సరిగ్గా రెండింటికి తన వాచ్ దిద్దికోకుండా అది చూపించిన 230 అని టికెట్ మీద రాయడం. ఈ ఇండియన్ తననో ఆట ఆడించాడు ఇవి పట్టుకుని. ఇప్పుడేమైనా అంటే జడ్జ్ తనమీద అరుస్తాడు.
“అసలు గత పదిహేనేళ్ళుగా నాకు ఎప్పుడూ టికెట్ రాలేదండి. కావాలిస్తే మా ఇన్స్యూరెన్స్ ఇచ్చిన కాయితం నా రికార్డులూ చూడండి. ఇవన్నీ సంపాదించి పట్టుకొచ్చాను. ఇప్పుడు ఈయన నన్ను కావాలని ఆపి, ఏదో కసి వల్ల నాకు టికెట్ ఇచ్చాడని నాకనిపిస్తోంది. మీరు జడ్జ్ లు. ఈ పోలీస్ ఆఫీసర్ మనఃస్థితి చూసి ఈ టికెట్ కేన్సిల్ చేయాలి యువరానర్,” ఆఖరి బాణం వదిలేడు శంకర్రావు.
శంకర్రావు ఇచ్చిన కాయితాలు చూసి జడ్జ్ టికెట్ డిస్మిస్ చేసాక శంకర్రావు దర్జాగా బయటకెళ్ళిపోయేడు. వెనకనే వెళ్ళబోయే పోలీస్ ని పిల్చి చెప్పేడు జడ్జ్, “బుద్ధి ఉందా అసలు, ప్రతీ ఏడాదీ రెండుసార్లు జరిగే డే లైట్ సేవింగ్స్ కూడా గుర్తు లేదా? అయినా ఏం చేస్తున్నారయ్యా మీ పోలీసులు, మీరు వాడే స్పీడ్ డిటెక్టర్ లు సరిగా కాలిబ్రేట్ చేసుకోవద్దూ ఎప్పటికప్పుడు?”
ఏం చెప్పాలో తెలియక ఓ వెర్రినవ్వు నవ్వి బయటకి నడిచేడు పోలీసు.

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked