ధారావాహికలు

విశ్వామిత్ర 2015 – నవల ( 15వ భాగము )

– యస్. యస్. వి రమణారావు

సిబిఐ గెస్ట్ హౌస్ లో ఎడంచేయికి, కాలుకి కట్లతో అభిషేక్ సోఫాలో, కుడిచేతికి చిన్న ప్లాస్టర్ వేసుకుని రాజు అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్నారు. జగదీష్ అభిషేక్ ఎదురుగుండా ఉన్న సింగిల్ సీట్ సోఫాలో కూర్చుని ఉన్నాడు. అభిషేక్ మొహం చాలా సీరియస్ గా ఉంది.
అభిషేక్ అడిగాడు “జగదీష్ మీకు, నాకు రాజు, రవిబాబుకి తప్ప ఇంకెవరికీ కేసుకు సంబంధించినవాళ్ళు దాబాలో పార్టీ చేసుకుంటున్నట్టు తెలియదు.మీరెవరికైనా చెప్పారా?రాజు,రవిబాబుల దగ్గర నేను కన్ఫర్మ్ చేసుకున్నాను.వాళ్ళెవ్వరితోనూ మాట్లాడలేదు.”
జగదీష్ ఒక నిముషం తటపటాయించాడు.”ఇంకొక్కమాట.మీరు సమాధానం చెప్పబోయేముందు చంపబడ్డ ఆ నలుగురు వ్యక్తులని గుర్తుపెట్టుకోండి”జగదీష్ మొహం ఎర్రగా మారింది. “నేను హోమ్ మినిష్టర్ గారితో మాట్లాడాను”

“థాంక్యూ. అన్నట్టు, జగదీష్, నిన్న మన కస్టడీలోకి తీసుకున్నఆ గ్రాండియోర్ హోటల్ కేప్టెన్, అదే దాబా ఓనర్ రవిబాబుని పంపించండి. మీరు రానవసరం లేదు. ఎవరినైనా కానిస్టేబుల్ ని ఇచ్చి పంపించండి. చాలు”
జగదీష్ మొహం మరింత ఎర్రగా మారింది. కొంచెం కోపంగా, విసురుగా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళినవైపే కొంతసేపు చూసి”రాజుగారూ, మీరు మంచి కామెడీ చేస్తారని విన్నాను. మంచి జోక్స్ గాని, మీకు తెలిసిన, మీజీవితంలో ఎదురైన మంచి హాస్య సన్నివేశాలు గాని కొన్ని చెప్పండి. కొంచెం రిలీఫ్ గా ఉంటుంది.”
రాజు ఫ్రిడ్జ్ లోంచి డ్రింక్స్ తీసుకొచ్చాడు.”కూర్చుంటాను సార్”
“తప్పకుండా. ఫీల్ ఫ్రీ. చెప్పండి”డ్రింక్ సిప్ చేశాడు అభిషేక్
“కొన్ని విషయాలు మీతో చెప్పాలి.మీరు నాప్రాణాలను కాపాడిన దేవుళ్ళు కాబట్టి మీదగ్గర ఇంకీ విషయం దాస్తే పాపం అవుతుంది సార్”
“కామెడీ విషయాలు చెప్పమంటే సీరియస్ విషయాలు మాట్లాడతానంటున్నారే! ఏమిటంత సీరియస్ విషయం? కేసుకి సంబంధించినదేనా?”

” నేను చెప్పబోయేది మీ క్లోజ్ పర్సన్స్ కు సంబంధించినది సార్,అంటే మీ పర్సనల్ అన్నమాట. కానీ కేసుకు సంబంధం ఉందేమో అని కొంచెం కలవరపడుతున్నాను సార్”
అభిషేక్ మొహం చిట్లించాడు
“ఎవరిగురించి మాట్లాడుతున్నారు?తొందరగా విషయంలోకి రండి”
“విషయం అది.. మీ గర్ల్ ఫ్రెండ్ శివహైమ గురించి సార్”
“శివహైమ మీకెలా తెలుసు?”షార్ప్ గా అడిగాడు అభిషేక్
వెంటనే గ్లాసు పైకెత్తి ఒక పెగ్గు గడగడ తాగేశాడు

“అదే సార్ నాఖర్మ”అనేసి నాలిక్కరుచుకున్నాడు”సారీ సార్.మీరు నా ప్రాణాలు కాపాడారు సార్.మీదగ్గర నిజం నేను దాచలేను సార్”
అభిషేక్ కూడా తన గ్లాసులోంచి కొంత చప్పరించాడు”మీరు చెప్పబోయేముందు నేనుకూడా మీకు ఒక విషయం చెప్పాలి”
రాజు ఉలిక్కిపడ్డాడు “ఏంటి సార్?”అభిషేక్ అప్పుడు శివహైమ ఇంటిదగ్గర రాజు ప్రవర్తన చూసి తను అనుమానపడడమూ, రాజుమీద స్పైయింగ్ చేయడమూ చెప్పి వీడియో చూపించాడు

“నేను మీకు ఈవీడియో చూపించకపోయేవాడ్ని.కాని మీ ట్రాక్ రికార్డ్ చూశాను.ఒక్క బ్లాక్ మార్క్ లేదు. అలాంటి మీదగ్గర ఈవిషయం కూడా దాచడం తప్పనిపించింది. అందుకునే చూపించాను. ఇక దీనితో అవసరం అయిపోయింది”ఆ వీడియో ఫైల్ మొత్తం డిలీట్ చేసేశాడు”ఎనీవే సారీ. ఇక మీకు తెలిసిన విషయాలు చెప్పండి”

రాజు మళ్ళీ గ్లాసు నింపుకున్నాడు
“నోసారీ సార్.మీరు నాబరువు దించేసారు. ఇప్పుడు నేను మీకు మొత్తం అంతా చెప్పేస్తాను” రాజు చెప్పడం ప్రారంభించాడు. అభిషేక్ కళ్ళముందు ఆ దృశ్యాలు కదలడం ప్రారంభించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked