చంద్రశేఖర్ చరిత్ర

శకాంతం

చంద్రశేఖర్ జీవితంలో ఎడింగ్టన్, మిల్ని, జీన్స్, ఫౌలర్ ప్రభృతుల పాత్రలు ముగిసేయి. సా. శ. 1950 నాటికి పైన పేర్కొన్న నలుగురూ స్వర్గస్తులయారు, కాని వారి మధ్య చెలరేగిన భేదాభిప్రాయాల దుమారం వాతావరణాన్ని కలుషితం చెయ్యడం మానలేదు. ఆ శుక్రవారం, 11 జనవరి, 1935 నాడు లండన్ లోని పికడిల్లీ దగ్గర ఉన్న బర్లింగ్టన్ హవుస్ లో, రోయల్ ఎస్ట్రనామికల్ సోసైటీ వారి సమావేశం లో, జరిగిన పరాభవపు ప్రతిధ్వని చంద్రని జీవితాంతం వెంటాడింది!

జేమ్స్ జీన్స్ తన అరవైతొమ్మిదవ ఏట, అనగా 1946 లో, మరణించేడు. రోయల్ సోసైటీ వారి పత్రికలో ప్రచురణార్థం మృతి సంస్మరణ రాస్తున్నప్పుడు కూడా మిల్ని పాత భేదాభిప్రాయాలని మట్టుపెట్టి మరచిపోలేకపోయాడు. “ఎడింగ్టన్ ప్రాణప్రదంగా పోషించుకుంటూ వచ్చిన ప్రామాణిక నమూనాపై జీన్స్ లేవదీసిన అభ్యంతరానికి ఎడింగ్టన్ ఆమోదయోగ్యమైన సమాధానం చెప్పనేలేదు” అని జీన్స్ ని వెనకేసుకొస్తూన్నట్లు పైకి అనిపించినా ఆ రాతలో, ఆ సందర్భంలో మిల్ని తనని తానే సమర్ధించుకుంటున్నాడని అంతరంగికులకి తెలుసు. “జీన్స్ ప్రపంచాన్ని గణితశాస్త్రపు దృష్టితో చూసేవాడు” అని జీన్స్ ని స్మరిస్తూ కూడా, “గర్వం తోటీ, ఆత్మవిశ్వాసం తోటీ తొణికిసలాడుతున్న ఎడింగ్టన్ తన వాక్చాతుర్యంతో శ్రోతలని ప్రభావితం చేస్తూ ఉంటే మాలో చాలామంది ఆ సమ్మోహన శక్తికి వశమైపోయేవాళ్లం” అని ఎడింగ్టన్ ప్రస్తావన తీసుకు రాకుండా ఉండలేకపోయాడు. చంద్ర కూడా జీన్స్ కి స్మృత్యంజలి ఘటిస్తూ, ఎడింగ్టన్ ప్రస్తావన డొంకతిరుగుడుగా తీసుకురావడానికి, జి. ఎచ్. హార్డీ చెప్పిన చిన్న సంఘటనని మననం చేసుకున్నాడు. ఒక సారి హార్డీ అడిగేడుట, ఎడింగ్టన్ ని, “నువ్వు ఎప్పుడైనా గుర్రాల మీద పందెం ఒడ్డేవా?” అని. దానికి సమాధానంగా ఎడింగ్టన్ ఒక అపహాస్యకరమైన వదనంతో, “ఒకే సారి, జీన్స్ అనే గుర్రం మీద పందెం ఒడ్డేను,” అని అనగా, హార్డీ ఒక చిరునవ్వు నవ్వి, “మరైతే ఆ గుర్రం నెగ్గిందా?” అని అడిగేడుట. ఎడింగ్టన్ ఒక కొంటె నవ్వు నవ్వి, “లేదు” అని ఒక్క ముక్కలో సమాధానం చెప్పేడుట!

ఎడింగ్టన్, మిల్ని, జీన్స్ – ఈ ముగ్గురి మధ్య వచ్చిన ఈ త్రికోణ తగాదాలు, స్పర్ధలుతో ఒకరినొకరు నాశనం చేసేసుకున్నారు. చంద్ర అభిప్రాయం ప్రకారం మిల్ని యొక్క వృత్తి సంబంధిత జీవితాన్ని ఎడింగ్టన్ పూర్తిగా తగలబెట్టేశాడు. మిల్ని తనలో నిబిడీకృతమైన సహజమైన సృజనని ఎడింగ్టన్ లేవదీసిన వాదాలని వమ్ము చేసే దిశలోనే ఖర్చు పెట్టేసేడు. ఎడింగ్టన్అంటే మిల్ని కి అంత ద్వేషం. ఈ ద్వేషం రగిలి, రగిలి దిగులుగా మారి, మిల్నిని బాగా కుంగదీయడంతో, దాని ప్రభావం వల్ల అసలే మానసిక బలం లేని మిల్ని భార్య, మార్గరెట్, మానసిక మాంద్యతకి లోనయి 1938 లోఆత్మహత్య చేసుకుంది. మిల్ని ఎదుర్కొన్న ఇక్కట్లకి కారణం వ్యక్తిగత ఇబ్బందులే కానీ ఎడింగ్టన్ కాదని కొందరి అభిప్రాయం. కానీ చంద్ర దృష్టిలో వారి ఇరువురి ఇబ్బందులకి మూల కారణం ఎడింగ్టనే!.

చంద్ర, లలిత ఇబ్బందిలో ఉన్న మిల్నిని విలియమ్స్ బే కి ఆహ్వానించి ఇంట్లో అతిథిగా పెట్టుకున్నారు. మార్గరెట్ తో గడిపిన రోజులు గుర్తుకి వచ్చినప్పుడల్లా మిల్ని చిన్న పిల్లాడిలా వలవలా ఏడ్చేవాడని చంద్ర చెప్పేవారు. మిల్ని తిరిగి ఇంగ్లండు వెళ్లిన తరువాత యుద్ధం బాగా పుంజుకుంది. ఇంగ్లండులో రేషను కారణంగా తినడానికి తిండి దొరకని రోజులలో చంద్ర, లలిత తినుబండారాలు బంగీలు కట్టి మిల్ని కి పంపేవారు.

సెప్టెంబరు 1950లో డబ్లిన్ లో సమావేశానికి వెళుతూ, దారిలో గుండె ఆగిపోయి, తన ఏభయ్ నాలుగవ ఏట మిల్ని మరణించేడు. తను కేంబ్రిడ్జి వెళ్ళినప్పుడు మొట్టమొదటగా పరిచయం అయినది మిల్ని తోటే అని తలచుకుని చంద్ర తరచు కంట తడి పెట్టుకునేవారు.

ముగ్గురిలోను చివరకి మిగిలినది ఎడింగ్టన్! అతని గురించి చెప్పుకోవలసినది ఏమిటి? ఎడింగ్టన్ తో గొడవలు పడలేక సర్ జేమ్స్ జీన్స్ విశ్వవిద్యాలయాలలో అధ్యాపక వృత్తి నుండి పూర్తిగా విరమించుకున్నాడు. కానీ చంద్ర, మిల్ని ఈ “దుష్ట మేధావి” దంష్ట్రాలలో పడి చాల ఇడుములు పడ్డారు. ఎడింగ్టన్ 1928 లో శ్రీకారం చుట్టిన “ప్రామాణిక నమూనా” అనేది సాపేక్ష వాదాన్ని, గుళిక వాదాన్ని సమన్వయపరచడానికి చేసిన విఫల ప్రయత్నం. ఈ పస లేని ప్రామాణిక నమూనాని సమర్ధిస్తూ అయన అత్యద్భుతమైన వాగ్ధాటితో చేసే ప్రసంగాలు రోయల్ సోసైటీలోని సభ్యులని అబ్బురపరచేవి. ఆయన వాదం – పస ఉన్నా, లేకపోయినా – వినడానికి అద్భుతంగా ఉంటుందని జీన్స్ కూడా ఒప్పుకునేవాడు. చంద్ర మాత్రం తన అభిప్రాయాన్ని ఆచి తూచి ఇలా చెప్పేడు: ఎడింగ్టన్ కి ఆయన వాదం మీద గట్టి నమ్మకం ఉంది. సాపేక్ష శిధిలత్వం విషయంలో అయితేనేమి, కృష్ణబిలాల ప్రాదుర్భావం విషయంలో అయితేనేమి, ఆ మాటకొస్తే సాపేక్ష వాదాన్ని, గుళిక వాదాన్ని సమన్వయపరచవచ్చనే నమ్మకం ప్రగాఢంగా ఉండడంలో అయితేనేమి అయన శక్తి మీద ఆయనకి గట్టి నమ్మకం ఉంది.”

ఏ శాస్త్రీయ వాదంలోనైనా పస ఉందో లేదో తేల్చాలంటే ప్రయోగాత్మకమైన ఋజువు చూపించాలి. అనగా, ప్రయోగం చేసి చూస్తే ఫలితం ఎలా ఉంటుందో జోస్యం చెప్పగలగాలి. ఎటువంటి ప్రయోగాలు చేసి ఎటువంటి ఫలితాల కోసం ఎదురు చూడాలో ఎడింగ్టన్ “ప్రామాణిక నమూనా” చెప్పలేకపోయింది. కానీ 1937 లో భౌతిక శాస్త్రంలో ప్రాథమిక స్థిరాంకాల పాత్ర మీద ఒక వ్యాసం ప్రచురిస్తూ, దానికి ప్రేరణ కారణం “పునాది, నిర్దుష్టత లేని ఎడింగ్టన్ ఊహలు” అని డిరాక్ కితాబు ఇచ్చేడు. డిరాక్ ఇచ్చిన ఈ కితాబుని చూసి చంద్ర చకితుడయ్యాడు.

భౌతిక శాస్త్రంలో రెండు రకాల స్థిరాంకాలు తారసపడుతూ ఉంటాయి. ఒక జాతివి ప్రాథమిక లేక మౌలిక స్థిరాంకాలు (fundamental constants) అయితే, మరొక జాతివి అనువర్తన స్థిరాంకాలు (model constants). మౌలికమైన ప్రకృతి ధర్మాన్ని వర్ణించేవి మౌలిక స్థిరాంకాలు: ఉదాహరణకి, కాంతి వేగం, ఎలక్ట్రాను యొక్క విద్యుదావేశం, ప్లేంక్ స్థిరాంకం, గురుత్వాకర్షక స్థిరాంకం, వగైరాలు. నమూనాలని నిర్మించేటప్పుడు అవసరం వెంబడి మనం నిర్వచించుకునేవి అనువర్తన స్థిరాంకాలు: ఉదాహరణకి, ఆదర్శ వాయు సూత్రం PV = kT లో కనిపిస్తున్న k అనువర్తన స్థిరాంకం.

భౌతిక శాస్త్రంలో ప్రాథమిక స్థిరాంకాల పాత్ర మీద తనవైన అభిప్రాయాలు కొన్ని చంద్ర బుర్రలో కొన్నేళ్ళబట్టి ఒక మూలని పడి ఉన్నాయి. కానీ వాటిని ప్రచురించడమా వద్దా అన్ని ఇన్నాళ్లూ తటపటాయించేడు. ఇప్పుడు డిరాక్ ప్రచురించిన వ్యాసం చూసి తన అభిప్రాయాలకి అక్షరరూపం ఇచ్చేడు. ప్రకృతి లోని ప్రాథమిక స్థిరాంకాలు – అనగా, ఉదాహరణకి, ప్లేంక్ స్థిరాంకం, కాంతి వేగం, ప్రోటాను గరిమ, వగైరాలు – తో మొదలుపెట్టి, శ్వేత కుబ్జతారల గరిమకి ఒక అవధి ఉందంటూ మరొక సమాంతర ఋజువుని తయారు చేసి డిరాక్ పరిశీలనకి పంపేడు. (శ్వేత కుబ్జతారల మీద వ్యామోహం చంద్రని బంకనక్కిరికాయలా ఇంకా అంటిపెట్టుకునే ఉంది!) ఆ పత్రంలో రెండు, మూడు చిన్న సవరణలు చేసి ప్రచురణకి డిరాక్ సిఫార్సు చేసేడు. నోబెల్ బహుమానం అందుకున్న సమయంలో ప్రసంగం వరకు చంద్ర ఇక శ్వేత కుబ్జతారల ఊసు ఎత్తలేదు.

నోబెల్ బహుమానం 1983 లో అందుకున్న తరువాత చంద్ర ఇచ్చిన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించి అణువుల స్థిర నిశ్చలత (stability) ని వర్ణించడానికి ప్రాథమిక స్థిరాంకాలు ఎలా ఉపయోగపడతాయో, అదే విధంగా నక్షత్రాల స్థిర నిశ్చలతని వర్ణించడానికి కూడ ప్రాథమిక స్థిరాంకాలు ఉపయోగపడతాయి అని ఉద్ఘాటించేడు. ఎడింగ్టన్ రాసిన Internal Constitution of Stars అనే పుస్తకం కొత్త కూర్పు 1988 లో ప్రచురణ పొందే సందర్భంలో దానికి పీఠిక రాస్తూ, నక్షత్రాల స్థిర నిశ్చలత పై ఎడింగ్టన్ అభిప్రాయాలని చీల్చి చెండాడేడు చంద్ర! ఈ పీఠిక చదువుతూ ఉంటే దశాబ్దాలపాటు చంద్ర పడ్డ అంతర్మధనం వ్యక్తమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked