కథా భారతి

సెకండ్ పెన్ష్జన్!

-కుంతి (కౌండిన్య తిలక్ )

సెల్ మ్రోగింది. “హలో! ఆనంద్ బిజీగా ఉన్నావా”
స్టేట్ బ్యాంక్ అశోక్ నగర్ లో పనిచేస్తున్న ముకుందరావు నుండి ఫోన్.
“లేదు చెప్పు” మారెడ్ పల్లి బ్రాంచ్ లో పని చేస్తున్నఆనందరావు ఫోన్ రిసీవ్ చేస్తూ అన్నాడు.
“ఒక న్యూస్.మన రామానుజము సార్ కు వారము రోకుల క్రిందట పెద్ద యాక్శిడెంట్ అయిందట్. సికింద్రాబాద్ లోని ఆత్మీయ హాస్పిటల్ లో ఉన్నాడట .సాయంత్రము ఆరు గంటలకు వెళదామనుకుంటున్నాను.నీవు వస్తావా?”
“అరెరె! ఎలా జరిగింది”
“ఒక వికలాంగుడినిరోడ్డుదాటించబోయాడట. ఇంతలో ఒక కార్ ర్యాష్ గా వచ్చి సారును బలంగా ఢీకొట్టిందట. ఆ వికలాంగుడికి పెద్దగా దెబ్బలు తగల్లేదట.కానీపాపము సార్ కే బాగా గాయాలయ్యాయట. చాలా రక్తము పోయిందట”
“తప్పకుండా వస్తాను” ,ఫోన్ పెట్టేసి,రామానుజముగారితో అతడికున్న అనుబంధము గుర్తుకు రాగా ,అతడికి వచ్చిన ఆపద తలుచుకొని మరింత బాధపడుతూ కూర్చుండిపోయాడు ఆనందరావు.

శ్రీ రామానుజము స్టేట్ బ్యాంక్ మారెడ్ పల్లిలో బ్రాంచ్ మేనేజర్ గా పని చేస్తుండేవాడు. అతడు చాలా పేదరికములో పుట్టి పెరిగి,కష్టపడి పైకివచ్చాడు.బ్యాంక్ లో ఆఫీసర్ స్థాయికి ఎదిగాడు. నీతీనిజాయితీలు గలవాడు. వృత్తినే దైవంగా భావించేవాడు. బ్యాంక్ అభివృద్ధికి ,ప్రజల సేవకు నిరంతరము కృషి చేసే వాడు. అతని హయాములో ఆ బ్రాంచ్ మంచి పేరు సంపాదించింది. అతను విధులలో నిజాయితీగా,నిక్కచ్చిగా ఉంటూ తన క్రింది ఉద్యోగులను అలాగే ఉండేలా చూసేవాడు. క్రమశిక్షణాయుతంగా,నిజాయితీగా,నియమబద్దంగా ,వృత్తికి అంకితమైపోయి జీవించడము ఒక గొప్ప విషయంగా కాక ,అది తన ధర్మముగా భావించేవాడు.అతడు తన తోటి ఉద్యోగులతో నిక్కచ్చిగా ఉంటూనే మరొక వైపు వారి కష్టనష్టాలలో మానవీయ దృక్పధాన్ని ప్రదర్శించేవాడు. అతడి ఉద్యోగులు అతడికి పని రాక్షసుడని పేరు పెట్టినా ,అతడి అంకితభావాన్ని చూసి గౌరవించేవారు. అతడి ఆదర్శాలను,దృక్పధాల్ను అనుసరించేవారు. యే కొందరో అతడి పని తీరుతో ఇముడలేని వారు వేరే బ్రాంచ్ లకు బదిలీ చేయించుకునేవారు. రామానుజముగారు ఇంకా రెండు సంవత్సరాలలో రిటైర్ అవుతారనగా ముకుందరావుకు,ఆనందరావుకు ఆ బ్యాంక్ లో పోస్టింగులు వచ్చాయి.వీరిద్దరిని సుశిక్షితులైన వృత్తి నిపుణులుగా తయారుచేసాడు రామానుజము.వారిద్దరికి కూడా రామానుజమంటే ఎంతో భక్తిగౌరవాలు. ఈ భక్తి గౌరవానికి కారణము కేవలము అతడిని వృత్తిపరమైన గురువుగా భావించినందువల్లనే కాక రామానుజములో ఉన్న మరొక విశిష్టమైన కోణము కూడా కావడము విశేషము. అదేమిటంటే రామానుజము గొప్ప ఆధ్యాత్మికచింతనపరుడు,భక్తి తత్పరుడు. దయాదానగుణశీలుడు. అతనికి తగినట్టిది అతడి ఇల్లాలు. అతడు జీతము ద్వారా వచ్చే ఆదాయమును పూజలకు,పునస్కారాలకు,గుళ్ళూగోపురాలనిర్మాణాలకు,వృద్ధులకు,అనాధలకు ఖర్చు పెడుతుండేవాడు. ఉద్యోగములో మంచి స్థాయికి చేరుకున్నా ,రిటైరవడానికి సిద్ధమైనా స్వంత యిల్లు,బ్యాంక్ బ్యాలన్స్ చేసుకోలేకపోయాడు. ఎవరైనా సన్నిహితులు, ” ఇట్లా అయితే ఎట్లా సార్!” అని అంటే, “మనము బ్రతకడానికి,అవసరాలకు కావలసినంత డబ్బు ఉంటే చాలు.అంతకంటే మించి అవసరము లేదు. మన దగ్గర అనవసరంగా ఉన్న డబ్బు చాలా మందికి కనీసావసరాలు తీర్చగలదు. పైగా మనము యేదీ తీసుకు రాలేదు .యేదీ తీసుకొనిపోము. .” అని సమాధానమిచ్చేవాడు.

“దాన ధర్మాలంటూ,పూజా పునస్కారాలంటూడబ్బంతా ఖర్చు పెట్టి చివరకు యేమీ లేకుండా మిగిలిపోయిన వారిని చాలా మందిని చూసాము.మీరూ అలా కాకూడదని మా అభిప్రాయము” అని యెవరైనా అంటే
“మంచీచెడులు చూసేవాడు భగవంతుడు.అతడి ప్రేమ ఉన్నంత కాలము నాకేమీ జరుగదు. ఒక వేళ కూడబెట్టుకోకపోవడము వల్ల దానధర్మాలకై ఖర్చు చేయడము వల్ల నేను ఇబ్బందులు పడవలసి వస్తే దానికీ సిద్ధమే” అనేవాడు.
అతడి భావజాలముతో,వృత్తి నిబద్దతతో ,విధులలో నైపుణ్యముతో సంబంధము లేకుండా రిజిస్టర్ ప్రకారము రిటైర్మెంట్ పీరియడ్ రావడముతో అతడు రిటైరయ్యాడు.
రిటైరైన రోజు అతడికి బ్యాంక్ ఇచ్చింది ఒక మంచి శాలువా ,ఒక సన్మాన పత్రము, పలు సందర్భాలలో వాడుకున్న డబ్బులు పోనూ ,ధార్మిక,సేవా సంస్థలకు తన జీవిత కాలము నెలనెలా వెళ్ళేట్లుగా ముందుగానే వ్రాసిచ్చిన విరాళాలు పోను పదివేలలోపు పెన్షన్ మాత్రమే.
అది అతడు రిటైరయ్యేనాటి పరిస్థితి.
రిటైరైన ఒక సంవత్సరము తరువాత ముకుందరావు వివాహములో ఆనందరావు రామానుజమును కలిశాడు. భోజనానంతరము పిచ్చాపాటిలో పడ్డాడు. “యెలాఉన్నారు సార్! రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చాయా?పెన్శన్ సక్రమంగా వస్తుందా? రిటైర్మెంట్ లైఫ్ యెలా ఉంది? అని రామానుజమును,అతని దగ్గర్ ఉన్న చనువు ఆధారంగా అడిగాడు ఆనందరావు..

“చాలా సంతోషంగా ఉన్నాను.తృప్తిగా , ఆనందముగా,ప్రశాంతముగా ఉన్నాను. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటూ నాకు పెద్దగా యేమీ లేవు..ఉన్నవన్నీ ముందేవాడేసుకున్నాను.కాస్తోకూస్తో వచ్చిన డబ్బులు సేవా సంస్థలకు వ్రాసేసాను.వస్తున్న పెన్షన్ తో అద్దెయింట్లో,నేనూ నా భార్యా కాలక్షేపము చేస్తున్నాను.మా పిల్లలను నేను బాగా చదిచించాను. ఆస్తి రూపేణా యేమీ ఇవ్వలేదు. దానితో వాళ్ళు అలిగి మాకు దూరంగా ఉంటున్నారు”
“అంత తక్కువ పెన్షన్ తో అద్దె యింట్లో ,ధరలు మండిపోతున్న యీ రోజుల్లో ఎలా నెట్టుకొస్తున్నారు” అశ్చర్యంగా అడిగాడు.
“అతడు పెద్దగా నవ్వి, “అదేమిటయ్యా అలా అంటావు,నాకు సెకండ్ పెన్షన్ వస్తుంది కదా” అన్నాడు.
“సెకండ్ పెన్షనా/ అదేమిటి సార్! మీరు బ్యాంక్ లో పని చేసే కంటేముందు మరెక్కడైనా పనిచేసారా? దాని తాలూకు పెన్షనా?”అన్న్నాడు.
“నేను నా సంపూర్ణమైన వృత్తి జీవితాన్ని దైవంగా భావిస్తూ, నీతీనిజాయితీతో ఒక్క రిమార్క్ లేకుండా నిర్వహించాను.నియమబద్దమైన,క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడిపాను.మితాహారము,మితభాషణము పాటించాను. నా కష్టార్జితాన్ని నలుగురికి పంచాను.నలుగురి కష్టాలను నేను పంచుకున్నాను. చాలా మందికి నా చిన్న చేతులతో ఉడత సాయము చేసాను.యే హంగులూ యే ఆర్భాటాలులేవు. యే కోరికలూ లేవు. నా జీవితకాలమంతా పెరగడానికి కాక ఎదగడానికి ప్రయత్నించాను. దాని వల్ల శారీరకంగా ఆరోగ్యంగా,మానసికంగా ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా, వెరసి ఆనందంగా , చాలా సంతృప్తిగా ఉన్నాను. ఇట్లా ఉన్నప్పటికీ , లౌకిక జీవితములో యేవైనా ఇబ్బందులు ఎదురైతే ఆత్మవిశ్వాసముతో ఎదుర్కొనే ప్రయత్నము చేస్తున్నాను. నేను నావృత్తి పట్ల చూపిన నిబద్దతకు,చిత్తశుద్ధికి కాబోలు భగవంతుడు యీ సెకండ్ పెన్షన్ గ్రాంట్ చేసాడు. ఈ పెన్షన్ ఉంటే ఇంకా యే పెన్షన్ అవసరము లేదు”అని చెప్పాడు.
ఈ సెకండ్ పెన్షన్ గూర్చి విన్న ఆనంద రావుకు ఆశ్చర్యముతో పాటు “జీవితము తాలూకు అన్ని సవాళ్ళకు , ముఖ్యంగా ఆధునిక యుగములో డబ్బూ,అవసరాలు మనిషికి పెట్టే అనేక పరీక్షలలో సెకండ్ పెన్షన్ ఉపయోగపడుతుందా” అన్న సందేహాలు తలెత్తాయి. అతడితో ఆ విషయాలను ముచ్చటించక అక్కడే వదిలివేసాడు. ఆ సంఘటన జరిగి దాదాపు ఇక సంవత్సరమైనది.

మళ్ళీఫోన్ మ్రోగడముతో ఆలోచనలోంచి తేరుకొన్న ఆనందరావు తన పనులు ముగించుకొని,ఏటీఎమ్ కు వెళ్ళి తన దగ్గర ఉన్న పదివేలు విత్ డ్రా చేసుకొని, బయలుదేరాడు.
“వచ్చావా ! నీ కోసమే ఎదురుచూస్తున్నాను, పద మూడవ అంతస్థులో ఉన్నాడట” అంటూ హాస్పిటల్ ఆవరణలో తచ్చాడుతున్న ముకుంద రావు,అపుడే హాస్పిటల్ ప్రాంగణములోకి అడుగు పెట్టిన ఆనంద రావుతోఅన్నాడు.
ఇద్దరూ రూమ్ లోకి అడుగు పెట్టారు. రామానుజము బెడ్డు పైన నిదురపోతున్నాడు. తలనిండా,ఒంటి నిండా కట్లున్నాయి. రామానుజము భార్య ఆప్యాయంగా పలుకరించింది. ” ఎలాజరిగింది” అడిగాడు ఆనందరావు. తాను విన్నదే ఆవిడ చెప్పింది.
అతడి గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాత అడగాలో,వద్దో అని మీమాంస పడుతునే,వారి పరిస్థితులను క్షుణ్ణంగా తెలిసిన వాడు
కావడముతో ,ఆవిడతో కూడా మంచి చనువు ఉండడముతో “మరేమనుకోకండి.ఇంత పెద్ద హాస్పిటల్ కు తెచ్చారు.దాదాపు వారము రోజులయింది అంటున్నారు.బాగానే డబ్బు ఖర్చు అయి ఉంటుంది ఇదంతాఎలా మేనేజ్ చేసారు” అని అడిగాడు.

“యాక్సిడెంట్ అవ్వగానేఎవరో పుణ్యాత్ములు ఈ హాస్పిటల్ లో చేర్చారు. నాకు ఫోన్ చేసారు. నా దగ్గర చిల్లు గవ్వకూడా లేదు. మా అబ్బాయి తన కుటుంబ సభ్యులతో పాటు ఢిల్లీ వెళ్ళాడు.. మా అమ్మాయి ముంబాయిలో ఉంది. నాకు చాలా భయము వేసింది. హాస్పిటల్ కు వచ్చేసాను. అతడికి ట్రీట్ మెంట్ ప్రారంభించారు. నన్నుకూడా మర్యాదగా చూస్తూ, ,అతడిని కంటికి రెప్పలా చూసుకోవడము ప్రారంభించారు. ఒకవైపు ఆయనకు అలా చికిత్స జరుగుతుంటే సంతోషంగానూ,మరొక వైపు భయంగానూ ఉండసాగింది. సాధారణంగా హాస్పిటల్ లో జాయిన్ అయిన మరుక్షణమే డబ్బులు కట్టించుకుంటారు. కాని ఎవ్వరూ ఒక్క రూపాయి అడిగిన పాపాన పోలేదు. నేనే మరునాడు వెళ్ళి ఆయనకు ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్ గారితో, “సార్! మా దగ్గర పెద్దగా డబ్బులు లేవు. ఇంతవరకు ఎంత అయిందో చెప్పండి. యేదోలా కట్టేస్తాము. మా ఆయనను ప్రభుత్వాసుపత్రికి తరిలించండి” అని అడిగాను. అంతలో ఆసుపత్రి ఎమ్ డీ గారు మాగదికి వచ్చారు. వచ్చీ రాగానే ,నా కాళ్ళకు దండము పెట్టాడు. నాకు ఆశ్చర్యము వేసింది.

” సార్ కు యే ప్రమాదము లేదు.నేను చూసుకుంటున్నాను.మీరు నిశ్చింతగా ఉండండి. యాక్సిడెంట్ అవ్వగానే ఎవరో హాస్పిటల్ కు సమయానికి తీసుకు వచ్చారు. దాని వల్ల ప్రాణాపాయము తప్పింది. అలాగే నాకు వారి కష్టాలలో సహాయము చేయగలిగే అవకాశము కలిగింది.”అంటూ చెప్పసాగాడు. మళ్ళీ అతడే నా సంభ్రమాశ్చర్యాలను చూసి, నేను మెడిసిన్ చేస్తుండగా ,ఒకసారి పరీక్షకు ఫీజు కట్టలేని పరిస్థితి యేర్పడింది. సారు నుండి సహాయము పొందిన కొందరు విద్యార్దులు ,నాకు అతడి దయాగుణము గురించి చెప్పగా విని,నేనూ అప్రోచ్ అయ్యాను. . నేనేవరో,నేనేమిటో తెలుసుకోకుండానే తన దగ్గర అప్పుడు డబ్బులు లేకున్నా ,వెంటనే నన్ను దగ్గరలో ఉన్న మార్వాడీ కోట్టుకు తీసుకు వెళ్ళాడు. తన చేతికున్న ఉంగరాన్ని తీసి తాకట్టు పెట్టి,నాకు డబ్బులిచ్చాడు. అంతే కాక నా మెడిసిన్ అయ్యేంత వరకు నెలనెలా కొంత డబ్బును కూడా పంపించాడు. అతడి డబ్బుతో,చూపిన ప్రేమతో నేను ఈ రోజు ఇంతవాడినయ్యాను. అతడిని సేవించడమంటే నా దృష్టిలో భగవంతుడిని సేవించడమే” అంటూ చెప్పుకొచ్చాడు. అదిగో అలా జరగడముతో మా వారు మంచి ట్రీట్ మెంట్ పొందుతున్నారు. ఒక వారములో డిశ్చార్జ్ కూడా చేస్తారట” అని చెప్పుకొచ్చింది. ఆ తరువాత కాసేపు ఉండి , ఆవిడకు మరింత ధైర్యము చెప్పి,వద్దంటున్నా తాను తెచ్చిన పదివేలు ఆమె చేతిలో పెట్టాడు ఆనందరావు.

“లేపమంటారా?” అని ఆవిడ అంటే ,”లేపకండి.పడుకోనివ్వండి.లేచిన తరువాత మేము వచ్చామని చెప్పండి.మళ్ళీ వస్తాము. యేదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి.యే క్షణమైనా వస్తాము” అని చెప్పి అతడి వంకే చూస్తూ ఇద్దరూ బయలుదేరారు.
రామానుజము రెండు చేతుల నిండా కట్లు కట్టి ఉన్నాయి. కుడి చేతి రెండు వేళ్ళు మాత్రము కట్లలో నుండి చొచ్చుకొని వచ్చి బయటకు కనబడుతున్నాయి. ఆ రెండు వేళ్ళు ” నేను సెకండ్ పెన్షన్ అనుభవిస్తున్నాయన్నట్లుగా ఉన్నాయి కదా ” , రామానుజము సెకండ్ పెన్ఢన్ ఫిలాసఫీ తెలిసిన ముకుందరావు అన్నాడు ఆనంద రావుతో. నాకెందుకో ,రామానుజము గారు వృత్తిలో చూపిన చిత్తశుద్ధికి,నిబద్దతకు మరియు వ్యక్తిగత జీవితములో పాటించిన ఆదర్షాలకు భగవంతుడు అతడికి సెకండ్ పెన్శన్ తో పాటుగా శాశ్వతమైన మెడికల్ ఫెసిలిటీస్ కూడా కల్పించాడేమో అన్నట్లుగా తోస్తుంది అన్నాడు ఆనందరావు తృప్తిగా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked