ధారావాహికలు

అమెరికా ఉద్యోగ విజయాలు – 5

సత్యం మందపాటి చెబుతున్న

‘జయమ్ము నిశ్చయమ్మురా..’

ఆరోజు కృష్ణ ఇంట్లో భోజనాలు అయాక, కృష్ణ అర్జనుడితో అన్నాడు, “వసంత ఋతువు వచ్చేసిందిగా.. అలా లేక్ ఆస్టిన్ ఒడ్డున కూర్చుని మాట్లాడుకుందాం పద” అన్నాడు.
“మీరిద్దరూ వెళ్ళండి. నిర్మల వస్తానంది, మా ఇద్దరికీ వేరే పనుంది” అంది రుక్మిణి.
“అయితే ఎక్కడో సేల్ వుంది, మేం వేరే వెడతాం అని అర్ధం అన్నమాట. సరే వెళ్ళండి. మేము ఒక గంటా, రెండు గంటల్లో వస్తాం” అన్నాడు కృష్ణ.

ఆదివారం అవటం వల్ల లేక్ ఒడ్డున చాలమంది జనం వున్నారు. ఇద్దరూ దూరంగా ఒక చెట్టు దగ్గర కూర్చున్నాక , అర్జున్ అన్నాడు. “బావా, తాము చేసే ప్రతి పనిలోనే కాక, వారి జీవితంలో కూడా అడుగడుగునా విజయం సాధించాలని ప్రతివారికీ వుంటుంది. కానీ ఆ విజయ పథంలో విహరించటం ఎలా?”
కృష్ణ అన్నాడు, “ముందుగా అసలు విజయం అనే మాటకి అర్ధమేమిటో తెలుసుకోవటం అవసరం. ఎన్నో తెలుగు, హిందీ సినిమాల్లోనూ, కొన్ని ఇంగ్లీషు సినిమాల్లోనూ చూస్తుంటాం. పెద్ద కళ్ళజోడు పెట్టుకుని, తెల్లకోటు వేసుకున్న ఒక లావుపాటి పిల్లి గడ్డం ఆయన, ఒక టెస్ట్ ట్యూబులోని నీళ్ళల్లో కాస్త పసుపు వేసి, దాన్ని కలిపి, ఆ పసుపురంగు నీళ్ళని మనకి చూపిస్తూ, “సక్సెస్, గ్రాండ్ సక్సెస్” అంటాడు. తెలుగులో ‘విజయం’, ‘ఘన విజయం’ అని అంటున్నాడని మనం అనుకోవాలన్నమాట. ఈలోగా ఆయన్ని సినిమా విలన్ ఒక తుపాకీతో కాల్చేసి, ఆ పసుపు నీళ్ళు కాస్తా తీసుకుపోతారనుకోండి. అది వేరే విషయం. మనమిక్కడ చెప్పుకునేది ఇలాటి సినిమా విజయాలు కాదు”
“మరేమిటి?” అడిగాడు అర్జున్.

“ఒలెంపిక్సులో వంద మీటర్ల రన్నింగ్ రేస్ జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలమంది ఎన్నో ఏళ్ళు తమ శక్తినంతా ఉపయోగించి గట్టిగా సాధన చేస్తున్నారు. వారిలో కొన్ని వందలమంది మాత్రమే ఒలెంపిక్స్ ఆటల్లో పాల్గొనటానికి అర్హులైనారు. కానీ క్వాలిఫైయింగ్ రౌండులో ఎనభైమంది మాత్రమే ఎన్నుకోబడ్డారు. వారిలో ఇరవై నాలుగుమంది మాత్రమే సెమీ ఫైనల్సులో పాల్గొన్నారు. చివరికి ఫైనల్సులో ముగ్గురికి మాత్రమే మెడల్స్ వచ్చాయి. 2016లో జరిగిన ఒలెంపిక్స్ ఆటల్లో, జమైకాకి చెందిన ఉసైన్ బోల్ట్ 9.81 సెకండ్లలో మొదటి స్థానంలో నిలిచాడు. రెండవ స్థానంలో అమెరికా అతను 9.89 సెకండ్లు, మూడవ స్థానంలో కెనడా అతను 9.91 సెకండ్లు, నాలుగు జమైకా 9.93 సెకండ్లు, ఐదు సౌత్ ఆఫ్రికా 9.94 సెకండ్లలో వచ్చారు. దీనిలో విజేతలెవరు? మొదటి స్థానానికీ, మిగతా స్థానాలకీ తేడా ఎంతో చూశావా? కనురెప్పపాటు కన్నా కూడా తక్కువ”
“అవును. ఈ ఐదు స్థానాలవారూ ఒకరికొకరు చాల దగ్గరగా వున్నారు” అన్నాడు అర్జున్.
“మొదటి స్థానంలో వచ్చిన అతనికి బంగారు పతకం వస్తే, మిగతావారికి రజిత, కాంస్య పతకాలు వచ్చాయి. మిగతా ఇద్దరికీ పతకాలే లేవు. అసలు ఒలెంపిక్సుకి అర్హులుగా రావటమే గొప్ప విజయం. ఒలెంపిక్స్ ఆటలకి అర్హులు కాకపోయినా, అక్కడిదాకా వచ్చినవారు ప్రపంచంలో ఎంతోమంది ఆటగాళ్ళ కన్నా కూడా ఘనులే. మొదటిసారిగా విజయం సాధించలేనివారు, తదుపరి ఒలెంపిక్సుతో సహా, మిగతా పోటీల్లో కూడా విజయం సాధించటం చూస్తూనే వున్నాం. ఇవాళ విజయం నీది. రేపు నాది. అంతకన్నా ఏమీ లేదు. పట్టుదల, సాధన వుంటే విజయం అదే వస్తుంది. క్రింద పడినవాడికే లేవటం తెలుస్తుంది.. “ అన్నాడు కృష్ణ.
“బావా, కొంతమంది అంటారు. విజయం సాధించాలంటే అదృష్టం వుండాలి అని. మరి వాళ్ళకి ఆ అదృష్టం లేదేమో..” అన్నాడు అర్జున్.

కృష్ణ అన్నాడు. “నేను అదృష్టం, దురదృష్టం అనే వాటి మీద నమ్మకాలు లేనివాడిని. కృషితో నాస్తి దుర్భిక్షం అని నమ్మేవాడిని. అది ఎలాగో చెబుతాను. ఎక్కడ ఏ అవకాశం కనిపించినా దాన్ని వెంటనే గుర్తించి, ఎంత శ్రమ అయినా లెఖ్క చేయక ఆ అవకాశాన్ని చేజిక్కించుకుని, దాన్ని సద్వినియోగం చేసుకునేవారు కొందరు. ఎన్నో గొప్ప అవకాశాలు వారి కళ్ళ ముందు నాట్యమాడుతున్నా వాటిని గుర్తించలేక, ఒకవేళ గుర్తించినా వాటిని సమయానికి ఉపయోగించుకోలేనివారు ఇంకొందరు. మొదట చెప్పినవారిని అదృష్టవంతులనీ, రెండవ వారిని దురదృష్టవంతులనీ అనుకోవటం సాధారణంగా జరిగేదే! బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, మైకేల్ డెల్, పాల గెట్టీ, వారన్ బఫ్ఫెట్, నారాయణమూర్తి, ప్రేంజీ మొదలైనవారు అదృష్టం దానంతట అది అలవోకగా వరించి వచ్చినవారు కాదు. అవకాశాలని గుర్తించి, కష్టాలనీ నష్టాలనీ భరించి, అవకాశాలని అంది పుచ్చుకుని, జీవితంలో ఆ ఆశయ ఫలితం కోసం ఎన్నో త్యాగాలు చేసి, దాన్ని చక్కగా ఉపయోగించుకుని విజయం సాధించినవారు. అలాటివే ఎన్నో రకాల అవకాశాలు ఇంటికి వచ్చి తలుపు తట్టినా, వదులుకున్న వాళ్ళు ఇంకా అలానే చతికిలపడి వున్నారు”

“అవును, వారి విజయాలు కొన్ని చదివాను. కానీ అది టెక్నాలజీ. మిగతా రంగాల్లో అది సాధ్యమేనా?”
కృష్ణ నవ్వాడు. “అందరూ ఒకే రంగంలో విజయం సాధించాలని నేను చెప్పటం లేదు. అవకాశాలని గుర్తించి, పట్టుదలతో విజయం సాధించటానికి ఏ రంగం అయినా ఒక్కటే. ఒక కళాకారుడు, ఒక సైంటిష్టు, ఒక ఇంజనీరు, ఒక క్రీడాకారుడు.. ఏదైనా సరే, ఎవరైనా సరే. జీన్ పాల్ గెట్టీ పేరు వినే వుంటావ్. చమురు వ్యాపారంలో ఎంతో విజయం సాధించిన గొప్ప పారిశ్రామిక వేత్త. ఆయన అమెరికాలోని మిలియానాపొలీస్ అనే వూరిలో పుట్టి, కేవలం తన శక్తి సామర్ధ్యాలని నమ్ముకుని అమెరికాలో బిలియనీర్ అయిన వ్యక్తి. ఆయన్ని ఎవరో అడిగారుట, “మీరు జీవితంలో ఇంత విజయవంతం అవటానికి ఏం చేశారు, ఎలా చేశారు” అని.
దానికి ఆయన చెప్పిన సమాధానం, ఆయనలాగానే చాల సాదా సీదాగా వుంది.
“నా విజయాలకి నాలుగే నాలుగు సూత్రాలు ఆధారం. వాటిని మనసా వాచా పాటించాను. అలా చేస్తే నేనే కాదు, ఎవరైనా విజాయాలని సాధించవచ్చు అన్నాడు” ఒక్క నిమిషం చెప్పటం ఆపాడు కృష్ణ.
“ఏమిటా నాలుగు సూత్రాలు?” అడిగాడు అర్జున్.

“వసున్నా.. వస్తున్నా.. మొట్టమొదటగా నువ్వు సాధించదలుచుకున్న రంగంలో, విషయంలో ఒక లక్ష్యం (అంటే గోల్) పెట్టుకోవటం అవసరం. ఇది కూడా నాకేదో ఉద్యోగం, జీతం వస్తే చాలు అని కాకుండా, నీ కలలు పండేటంత గొప్పగా ఆ లక్ష్యం వుండటం అవసరం. కాకపోతే మీ సామర్ధ్య పరిధులకి దగ్గరగా, తగ్గట్టుగా వుండాలి. ‘నేను అందరిలా కంప్యూటర్లని తయారు చేయదలుచుకోలేదు. ప్రపంచంలోనే పెద్దదయిన ఒక కంప్యూటర్ కంపెనీ తయారుచేస్తాను’ మొదటినించీ అదే అనేవాడు మైకెల్ డెల్. దానికోసమే అహోరాత్రాలు కష్టపడ్డాడు. పది, పదిహేనేళ్ళల్లో డెల్ కంప్యూటర్ కార్పొరేషన్ ప్రపంచంలోనే పెద్ద కంప్యూటర్ కంపెనీ అయింది.
రెండవది ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఒక ప్లాన్ తయారు చేసుకోమంటాడు గెట్టీ. మీ కలలని నిజం చేసేది ఇదే కనుక, కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఈ ప్లాన్ తయారుచేసుకోమంటాడు. ఈ విషయంలో ఇతరుల నుండి అవసరమైన సహాయం తీసుకోవటం కూడా మీ ప్లానులో భాగమేనంటాడు.
మూడవది, ఏ పని చేయాలనుకున్నా ఎంతో కొంత త్యాగం చేయాల్సి వస్తుంది. కనుక వాటి లిస్ట్ కూడా వ్రాసుకుని, వాటిని వదులుకోవటానికి సిద్ధమవమంటాడు. అంటే రోజుకి పధ్నాలుగు గంటలు పనిచేయాల్సి రావచ్చు. కుటుంబంతో అవసరమైనంత సమయం గడపలేకపోవచ్చు. కొంత ఆదాయం వచ్చేదాకా, ఆర్ధికంగా ఇబ్బందులు రావచ్చు. ఇలాటివేమైనా సరే, ఎదుర్కొనటానికి సిద్ధమవమంటాడు. బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, పాల్ ఆలెన్ మొదలైన వారు, మొదట్లో అపార్త్మెంట్ అద్దెకి తీసుకుని, రాత్రింబవళ్ళూ అక్కడే పడుకుని, సరిగ్గా నిద్ర కూడా పోకుండా, అక్కడే ఏదో దొరికింది తింటూ ఎంతో కష్టపడి పనిచేసి, ఈరోజు ప్రపంచ సాంకేతికరంగం చరిత్రనే మార్చేశారు.
ఇక నాలుగవది, అన్నిటిలోకి ముఖ్యమైన సూత్రం అంటాడు జీన్ పాల్ గెట్టీ. మీకు ఒక గట్టి లక్ష్యం వుంది. అక్కడికి చేరుకోవటానికి ఒక చక్కటి ప్లాన్ వుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి, ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ముందుకే పోవటానికి సిద్ధపడ్డారు. మరి మిగిలిందేంటి? అనుకున్నది చేసి చూపించటం. నైకీ కంపెనీ వాళ్ళ ప్రకటనలా, ‘జస్ట్ డూ ఇట్’. ఇక్కడే చాలమంది కొంచెం పట్టుదల సడలించేది. అలా కాకుండా చేయటమే లక్ష్య సాధకుల లక్షణం. కార్య సాధకులకీ ఇతరులకీ తేడా కనపడేది ఇక్కడే”
“అవును. చాలమంది అది చేస్తాం, ఇది చేస్తాం అని కబుర్లు చెబుతుంటారు కానీ, ఏమీ చేయరు” అన్నాడు అర్జున్.
“నేనొక ఇంగ్లీషు పుస్తకం చదివాను. దానిపేరు “Knowing vs. Actually Doing it!” అంటే ఎలా చేయాలో తెలియటానికీ, తెలిసింది నిజంగా చేయటానికీ వున్న తేడా. నీ బుర్ర ఎంత గొప్పదయినా, నీకు ఎన్నో తెలిసినా, అవి ఉపయోగించనప్పుడు ఏమిటి లాభం? చిన్న ఉదాహరణ ఇస్తాను. యాదగిరిగారు తనకి వంటలు చేయటం బ్రహ్మాండంగా తెలుసు అంటారు. వంకాయ కూరని ఎన్ని రకాలుగా చేయవచ్చో అవలీలగా చెప్పగలడు. ఉల్లిపాయలు మాత్రమే వేసి చేయటం, అల్లం పచ్చి మిరపకాయలూ నూరి ఇంకోరకంగా చేయటం, బాగా కొత్తిమీర దట్టించి ఉల్లిపాయలు లేకుండా చేయటం, గుత్తి వంకాయ కూర చేయటం, ఇలా ఎన్నో ఎన్నెన్నో అనర్గళంగా చెప్పగలడు. అవన్నీ కలిపి ఆయన వాటి మీద ఒక థీసిస్ వ్రాస్తే పీ హెచ్ డీ రావటం గ్యారంటీ. కాకపోతే యాదగిరిగారి భార్య యాదమ్మగారిని అడిగితే చెబుతుంది. ఈయన వాళ్ళకి పెళ్ళయిన నలభై ఏళ్ళల్లో కనీసం ఒక్కసారి కూడా కిచెన్లోకి రాలేదని. రాలేదంటే రాలేదని కాదు. వంట చేయటానికి రాలేదని. అంగట్లో అన్నీ వుంటే ఏమిటి లాభం, అల్లుడి నోటికి ఏదీ అందనప్పుడు. అందుకనే అనేది జస్ట్ డూ ఇట్ అని!” కృష్ణ అన్నాడు.

“కానీ.. మొదటి సూత్రమే ఒక లక్ష్యం పెట్టుకోవటం అన్నావు కదా. అది ఒక పగటి కలలా కాకుండా, సాధించ తగ్గదిగా వుండాలి కదా..”
“సాధించ తగ్గవిగా వుండాలి నిజమే. అప్పుడు నువ్వు అందరిలో ఒకడివి అవుతావు. పరుగెత్తేవాడు ‘ఇవాళ గెలిస్తే చాలు, మా సుబ్బలక్ష్మి నన్ను పెళ్ళి చేసుకుంటుంది’ అనే లక్ష్యం పెట్టుకోవచ్చు లేదా ఒలెంపిక్సులో పరుగెత్తాలనుకునే లక్ష్యం పెట్టుకోవచ్చు. ఆ రెండిటికీ తేడా లేదూ? ఇందాక చెప్పినట్టు ఒలెంపిక్సుకి వచ్చేవాళ్ళు అందరూ అలాటి లక్ష్యంతో మొదలు పెట్టినవాళ్ళే. పగటి కలలు కనటం మంచిది కాదని మన భారత సంస్కృతిలో ఒక అభిప్రాయం వుంది. పశ్చిమదేశాల్లోనే కాకుండా, జపాన్, చైనా, సింగపూర్, కొరియాలాటి దేశాల్లో అలా పగటి కలలు కనటంలో ఏమీ తప్పు లేదనీ, అంతేకాక అది పురోగమనానికి అడ్డం అనే అభిప్రాయం కూడా వుంది. ఎందుకంటే, ఎగిరే పక్షుల్ని చూసే తనూ అలా ఎగరాలని కలలు కన్నాడు మనిషి. ఎగరలేక చతికిలపడ్డాడు. లేచి మళ్ళీ క్రింద పడ్డాడు. తిరోగమనవాదులు నవ్వుతున్నా ఖాతర చేయలేదు. అలా పడినవాడు, తన కలలు నిజం చేసుకోవటానికి, పడిన ప్రతిసారీ, రెట్టించిన ఉత్సాహంతో లేచి పట్టు విడవకుండా మళ్ళీ మళ్ళీ ఎగరటానికి ప్రయత్నంచేశాడు. పక్షులకన్నా వేగంగా, ఇంకా ఎంతో ఎత్తుగా ఎగిరే విమానాలను కనిపెట్టి, ప్రప్రంచంలోని దేశాలన్నిటినీ దగ్గర చేశాడు. ఆకాశంలోనే కాకుండా, అంతరిక్షానికి వెళ్ళాడు. చంద్రమండలం మీద సంచారం చేశాడు. తను కన్న కలలని నిజం చేసుకున్నాడు. అలాగే మార్టిన్ లూథర్ కింగ్ చేసిన “I have a dream” అనే ఉపన్యాసం, ఈనాటికీ మనం మరువలేం” అన్నాడు కృష్ణ.

“అందరికీ అలాటి ఆసక్తీ, ఆ శక్తి వుండవు కదా” అడిగాడు అర్జున్.
పెద్దగా నవ్వాడు కృష్ణ. “మనలో సగంమందికి పైగా తమని తామే తక్కువగా అంచనా వేసుకుంటారని గణాంకాలు చెబుతున్నాయి. ఆరోజుల్లో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయంగారు కూడా, అందరూ చుట్టూజేరి నువ్వంతటివాడివి, ఇంతటివాడివి అని గుర్తు చేస్తే తప్ప, తన శక్తి తను తెలుసుకోలేకపోయాడని గుడివాడ గుడిలో చెప్పేవారు. మరి మానవమాత్రులం మనమెంత. అందుకని మన శక్తి ఎంతో మనమే గుర్తించి దాన్ని వాడుకోవటం చాల అవసరం. ఇంకొక విషయం. మనం విజయం సాధించాలంటే, విజయ సారధుల వెంటే తిరగటం అవసరం. “If you want to be successful, align with successful people” అని ఆంగ్ల భాషలో ఒక సామెత కూడా వుంది. అలాటి విజయసారధులే మనకి హీరోలు. అక్కడి నించే మనకి స్పందన వచ్చేది”
అర్జున్ ముఖం చూస్తుంటే ఏదో దీర్ఘాలోచనలో వున్నాడని తెలుస్తూనే వుంది.
కృష్ణ అన్నాడు. “ఇక్కడ జాగ్రత్తగా వుండవలసిన విషయం ఏమిటంటే, మనం పరుగెడుతుంటే చప్పట్లు కొట్టి గెలవమనే వాళ్ళతో పాటూ,

మన మెడ చుట్టూ డోలు కట్టి మన పరుగు వేగాన్ని తగ్గించేవాళ్ళు, కొండొకచో ఆపేవాళ్ళు కూడా ఎక్కువగానే వుంటారు. వాళ్ళని దూరంగా వుంచటం కూడా అవసరమే! ఏది ఏమైనా, మన మీద మనకి నమ్మకం వుంటే, మన శక్తి మనం తెలుసుకోగలిగితే, మనం అనుకున్నది ఆచరణలో పెట్టగలిగితే… తప్పకుండా జయం మనదే! అదే విజయ రహస్యం!”
అర్జున్ ముఖంలో ఏదో మెరుపు కనపడింది కృష్ణకి.
“జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా. జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా, సాగిపొమ్మురా” అనే పాట ఈలవేసి పాడుతున్నాడు అర్జున్.

౦ ౦ ౦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked