ధారావాహికలు

ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం 2019

“అనుభూతి కవిత్వం ప్రధానంగా జీవచైతన్య ప్రవృత్తికి సంబంధించింది. మిగిలిన నాలుగు ప్రవృత్తులను సాధ్యమైనంత వరకు జీవచైతన్య ప్రవృత్తిలో సంగమింప చేసుకోవడమో, దానికి పోషకంగా నిలుపుకోవడమో చేస్తారు అనుభూతి కవులు. దీని వల్ల ఆయా కవుల యొక్క అభివ్యక్తి వైవిధ్యాన్ని బట్టి – వాస్తవ చైతన్యాన్ని, జీవచైతన్యానికి పోషకంగా నిలిపే కవులని, కాల్పనిక చైతన్యాన్ని జీవచైతన్యానికి పోషకంగా నిలిపే కవులని, జ్ఞాన ప్రవృత్తిని జీవచైతన్య ప్రవృత్తిని పోషకంగా నిలిపే కవులని, నాలుగు విధాలుగా అనుభూతి కవులను నింగడించ వచ్చు.

ఈ రకంగా పరిశీలిస్తే అనుభూతివాద కవులు ఐదు రకాలుగా కన్పిస్తారు.

జీవచైతన్య ప్రవృత్తిని వాస్తవచైతన్యంతో పోషించిన కవులు.
జీవచైతన్య ప్రవృత్తిని కాల్పనిక మార్మిక చైతన్యాలతో పోషించిన కవులు.
జీవచైతన్య ప్రవృత్తిని కాల్పనిక చైతన్యాలతో పోషించిన కవులు.
జీవచైతన్య ప్రవృత్తిని వైజ్ఞానిక, తాత్విక చైతన్యాలతో పోషించిన కవులు.
జీవచైతన్య ప్రవృత్తిని ఆధ్యాత్మిక, తాత్విక చైతన్యాలతో పోషించిన కవులు.

అనుభూతివాదం మొదట తిలక్ ప్రతిపాదించాడని విమర్శకులంటారు. కానీ తిలక్ మావాడే, మహా గట్టివాడని అభ్యుదయ కవితావాదులు, మానవతావాదులు, అనుభూతి కవితావాదులు చెప్పుకున్నారు. కాదు పచ్చి భావకవితావాది అన్నవారూ లేకపోలేదు. అందరి వాదనలూ విన్న తర్వాత తిలక్ లో ఈ లక్షణాలన్నీ అంతో ఇంతో ఉన్నవని అంగీకరింపక తప్పదు. ఒకే మామిడికాయ పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా, పండినప్పుడు తియ్యగా ఎలా ఉంటుందో, బాలగంగాధర తిలక్ లో రచనా విధానం కూడా అలాగే మారిందని ఆయన రచనా క్రమ పరిణామాన్ని బట్టి చెప్పవచ్చు. ఇరవయ్యో శతాబ్దంలోని ఏడవ దశకంలో ఖండకావ్యాలను ఆశ్రయించుకొని బాలగంగాధర తిలక్ కవిత్వంలోనే తొలిసారిగా అనుభూతి కవితా రచన ద్యోతకమౌతుంది. అంతేకాక, తాను అనుభూతి ప్రధానమైన కవిత్వం చెప్తున్నానని తిలక్ చెప్పుకుంటాడు. ఆధునిక కవితలో రాదగిన ఒక బ్రహ్మాండమైన పరిణామం అనుభూతివాదమని తిలక్ కి తెలుసు. ఒక ఉపన్యాసంలో “ఛందస్సు, కవి సమయాలూ మొదలైన సంకెళ్ళ నుండి తప్పుకొనిన కవిత ఎలాగా అచ్చమైన రూపం సవరించుకుంటున్నదో, అలాగే కథా సంవిధానం అనే అనవసరపు తొడుగుని విప్పుకుని ప్రధాన అనుభూతుల ఆకృతితో దర్శనమిస్తుంది” అభ్యుదయ కవిత్వానంతర దోరణుల్లో అనుభూతివాదం ముఖ్యమైన కవితా ధోరణి కాగలదని తిలక్ గాఢంగానే భావించినట్లు ఆ రంగంలో అతడు కృషి చేసి కృతకృత్యుడైనట్లు అద్దేపల్లివారు పేర్కొన్నారు.
“ఒక్క నిరుపేద ఉన్నంత వరకు నాకు శాంతి కలుగదింక నేస్తం” అన్న తిలక్,
అభ్యుదయవాది కాకుండా ఎలా పోతాడు? వ్యక్తిగతమైన అనుభూతికి, సాంఘిక చైతన్యానికి మధ్య సామరస్యం సాధించిన కవులే మంచి కవిత్వం రాయగలిగారు. సామాజిక ప్రయోజనానికీ కవిత్వపు విలువలకీ మధ్య సరైన తూకం నిలవాలి. అభ్యుదయ కవిత్వంలో ఉన్న సామాజిక స్పృహ తిలక్ హృదయానికి హత్తుకుంది. కానీ వారి నిబద్ధత, భాష నచ్చలేదు. కవిత్వం హృదయాన్ని స్పందింప చేయాలి గానీ, ఉద్రేకపరచకూడదు అనేది తిలక్ తత్త్వం అనవచ్చు. కవి స్వేచ్చాజీవి అని మనసారా నమ్మినవాడు. అలా ఉండాలని కోరుకున్న వాడు. ఈయన రచనల్లో సామాజిక స్పృహ, అంతర్జాతీయ భావం, వ్యక్తి స్వేచ్చ, సుకుమార పద భంగిమలు ముఖ్యాంశాలుగా భావించాడు.

చుట్టూ ఉన్న వాతావరణమంతా మరో ప్రపంచం వైపు పరుగులు తీస్తున్నది. తిలక్ కొత్త జెండా ఎగురవేశాడు. అందరూ విస్తుపోయి చూశారు. దరిద్రులు, మధ్యతరగతి బతుకులు, అంతర్జాతీయ భావన ఉన్న రచన చూసి దగ్గర కావాలనుకున్న వారిలో కొందరు ఆయన రచనల్లోని వ్యక్తి స్వేచ్చ, కాల్పనిక ప్రభావం చూసి తప్పుకోవాలనుకున్నారు. కానీ తిలక్ కు ఇవేమీ పట్టలేదు. తిలక్ వసంతావిర్భావంలో హాయిగా పాడుకునే కోకిలవంటి వాడు. 1941లోనే “నా కవిత్వం” అనే ఖండికలో తిలక్ తన స్వతంత్ర మార్గాన్ని ఢంకా బజాయించి చెప్పాడు.
“నా కవిత్వం కాదొక తత్వం
మరికాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం”
అంటూ అభ్యుదయ కవిత్వాన్ని, ప్రాచీన సంప్రదాయాన్ని నిరసించాడు. కానీ ‘ నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు’ అన్నప్పుడు ఒక వర్గం ‘నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్నప్పుడు మరొక వర్గం వారు తలలెగరేశారు. 1942లో రాసిన ‘మేగ్నకార్టా’లో ‘మాటమాటకు దూకే సింహంలాగ’ అంటాడు. కానీ ‘మాకు దాస్యం లేదు మాకు శాస్త్రం లేదు’ అని తన స్వతంత్ర బాపుటాని ఎగురవేశాడు. 1955 నాటికి తిలక్ తన ‘కవివాక్కు’లో బైటపడ్డాడు. అభ్యుదయ రచయితల సంఘం చీలిపోయింది. శ్రీశ్రీ సినిమారంగం ప్రవేశించాడు. పార్టీకి అనుకూలంగా సాగించే అస్వతంత్ర రచన కొనసాగదని తేలిపోయింది. ‘పులి చంపిన నెత్తురు పులుముకోలేను’, తత్వాల పేర, విప్లవాల పేర, ఒకరినొకరం హతమార్చుకోలేము’ అని ధ్వజమెత్తాడు. ‘శాంతి కోసం యుద్ధాన్ని ప్రజ్వలింపజేస్తారు’ అని వెక్కిరించాడు.
1960 నుంచీ తిలక్ రచనల్లో రెండవ దశను గమనింపవచ్చు. “నేను సైతం ….” అన్న గీతానికి ధీటుగా 1962లో ‘వసుదైకగీతం’ రాశాడు. ఇంతింతై వటుడింతై బ్రహ్మాండమంతా ఆక్రమించిన త్రివిక్రముడు తిలక్. అందుకునే ధైర్యంగా ‘ఈవేళ నన్నానవాలు పట్టలేవు నువ్వు’ అని కవితా లోకాన్ని హెచ్చరించాడు. “సంకుచితమైన జాతిమతాల సరిహద్దుల్ని చెరిపి వేస్తున్నాను చూడు, ….. కవి వచస్సవితృ కాంతి పూరమిది స్వేచ్చగా జలకమాడండి” అని అంటాడు.

 

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked