కవితా స్రవంతి

ఓటుకు అమ్ముడు పోవద్దురా

– శైలజామిత్ర, హైదరాబాద్

ఓటుకు అమ్ముడు పోవద్దురా
నిన్ను నువ్వే అమ్ముకోవద్దురా
ఓటుని బేరానికి పెట్టావంటే
నీ ఉనికే ఉండదురా
రేపు నీ ఊసే ఉండదురా !!ఓటు !!

ముందుకు బానిస కావద్దురా
మందు సీసగా మారద్దురా
గద్దెనెక్కేటోళ్ల వెతుకులాటంతా
నీ బోటి వాళ్లెరా
ఒక్క అవకాశమిస్తే పొడుచుకు తింటారురా
గద్దలై పొడుచుకు తింటారురా !!ఓటు !!

అన్నమంటూ పరుగులు తీయద్దురా
బిరియాని పొట్లాంగా మారద్దురా
ఒక్కపూట నువ్వు కక్కుర్తి పడితే
మిగిలేది ఐదేళ్ల ఆకలిరా
నీకు మిగిలేది ఆకలి చావేరా !!ఓటు !!

డబ్బుకు తన్నుకు లాడద్దురా
ఐదేళ్ల కాలం ఐసై కరిగిపోతాదిరా
ఒక్క నోటుకోసం ఎంబడ బడితే
బతుకంతా బూడిదేరా
నీ బతుకంతా బూడిదేరా !!ఓటు !!

విద్య లేని బతుకు పశువుకన్నా హీనంరా
వైద్యం లేని ఊరు కంటే స్మశానం నయంరా
ఈ విషయాలన్నీ పెడచెవిల పెడితే
నీకు విషమే మిగిలెను రా
తిననీకి విషమే మిగిలెను రా !!ఓటు !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked