కవితా స్రవంతి

కొత్త సూర్యుళ్ళు మొలిచితీరాలి

– డా. రావి రంగారావు

అప్పుడే నాకు
మీసాలు మొలుస్తున్నాయి,
మిర్చి బజ్జీ మషాళా పొట్లం
నా గొంతు విప్పాను….

అప్పుడు దేశంలో
ఎక్కడ చూసినా కొత్త సూర్యుళ్ళే
కత్తు ల్లాంటి గొంతులతో పొడుచుకొచ్చేవాళ్ళు,
ఎండల మీసాలు తిప్పుకుంటూ
కిరణాల రోషాలు పెంచుకుంటూ…

స్థూల కాయం చీకటి తొక్కేసిన కాలాన్ని
ఇవతలకు లాగి కాపాడిన చంద్రుళ్ళు కూడా వచ్చి
సూర్యుళ్ళ ఎదురుగా వినయంగా కూర్చునేవాళ్ళు,
చంద్రుళ్ళలో చాలా మంది
సూర్యుళ్ళుగా మారిపోయేవాళ్ళు…

సూర్యుళ్ళను చూడటానికి
పొలాలు నడిచి వచ్చేవి
కలాలు కదిలి వచ్చేవి
కొడవళ్ళు పారలు వివిధ ఉపకరణాలు
ఎక్కడెక్కడినుంచో సైకిళ్ళమీద ఎడ్ల బండ్ల మీద
బస్సుల్లో రైళ్లల్లో సాగి వచ్చేవి
సూర్యుళ్ళ కిరణాలను గుండెల్లోకి తీసుకొని
అన్నీ సూర్యుళ్ళయ్యేవి…

జగ మంతా
సూర్య మయం అవుతుందని
నేనూ ఓ సూర్యుడినై
నిప్పులు తొక్కటం మొదలుపెట్టా…

కాలం మారిపోయింది,
ప్రవాహం ఆరిపోయింది…
క్రమంగా సూర్యుళ్ళు
చీలిపోవటం మొదలయింది
కొందరు రాలిపోవటం,
కొందరు జారిపోవటం జరిగిపోయింది…

ఇపుడు మళ్ళా
చీకటితో ఆడుకుంటూ
నక్షత్రాలతో పాడుకొనే చంద్రుళ్ళు పెరిగిపోతున్నారు,
ఇంకా అక్కడక్కడా మిగిలిన
ఆరిపోతున్న సూర్యుళ్ళు కూడా
సూర్య జపం మానేసి చంద్ర జపం చేస్తున్నారు…

ఇప్పుడు చీకటి
ఇదివరకటిలా మంచు గడ్డలా లేదు,
కిరణాలతో సూర్యుళ్ళు కరిగించటానికి…
ఇనుములా ఉక్కులా బలిసిపోయింది
పేల్చేసి పగలగొట్టే అధునాతన
మహా సూర్యుళ్ళు ఎపుడొస్తారా అని
నా ముసలి కళ్ళ ఎదురు చూపులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked