కథా భారతి

గాలిపటం

-G.S.S. కళ్యాణి

సంక్రాంతి పండుగ అనగానే సాధారణంగా అందరికీ రంగవల్లులు తీర్చిదిద్దిన లోగిళ్ళు, గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, కొలువుదీరిన బొమ్మల కొలువులు, చేతికందిన వరి పంటలూ గుర్తుకొస్తాయి. కానీ, మనస్వినికి మాత్రం సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ‘గాలిపటం’!

మనస్విని రెండవ తరగతి చదువుతున్నప్పుడు, వాళ్ళ బడిలోని పిల్లలందరికీ పాఠశాలవారు భగవద్గీత శ్లోకాల పోటీని నిర్వహిస్తే, అందులో మనస్వినికి ప్రథమ బహుమతి వచ్చింది. ఆ ఏడు పాఠశాలవారు తమ వార్షికోత్సవాన్ని ఎప్పటికన్నా ఘనంగా నిర్వహించి, ఆ కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల సమక్షంలో మనస్వినికి ‘గాలిపటం’ అన్న పుస్తకాన్ని బహుమతిగా అందజేశారు. మనస్విని స్టేజీపై అందుకున్న మొట్టమొదటి బహుమతి అది! ఆ రోజు మనస్విని ఆనందంతో ఆ పుస్తకాన్ని ఇంటికి తీసుకెళ్లి ఎంతో ఇష్టంగా చదువుకుంది. అలా ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. లెక్కలేనన్నిసార్లు ఆ ‘గాలిపటం’ పుస్తకాన్ని చదివి, దాన్ని ఎంతో మురిపెంగా తన గూట్లో దాచుకుంది.

మనస్వినికి పదకొండేళ్ల వయసున్నప్పుడు, ఒక భోగి పండుగ రోజు తమ ఇంటి డాబాపై ఆడుకుంటూ ఉండగా తనకు గాల్లో ఎగురుతున్న రంగు రంగుల గాలిపటాలు కనపడ్డాయి. వాటిని ఎగరేస్తున్న పిల్లలవంక ఆశ్చర్యంగా చూసింది మనస్విని. ఆ క్షణం మనస్వినికి తను కూడా వారిలాగా గాలిపటాన్ని ఎగరవేయాలన్న కోరిక పుట్టింది. మనస్విని గబగబా డాబా దిగి తన తల్లి ఉమ దగ్గరకు వెళ్లి తన కోరికను చెప్పింది.

“మీ నాన్నగారికి గాలిపటం ఎగరెయ్యడం చాలా బాగా వచ్చు! చిన్నప్పుడు ఆయనే స్వయంగా గాలిపటం తయారుచేసి ఎగరేసేవారు. వెళ్లి నాన్ననడుగు!”, అంది ఉమ.

మనస్విని తన తండ్రి శంకరం దగ్గరకు వెళ్లి గాలిపటం కావాలని అడిగింది.

“గాలిపటం తయారు చెయ్యడం కంటే బయట కొనటం మేలు. నీకు నచ్చిన గాలిపటాన్ని ఎంపిక చేసుకుని కొనుక్కోవచ్చు!”, అంటూ అప్పటికప్పుడు గాలిపటాలను అమ్మే దుకాణానికి మనస్విని తీసుకెళ్లి ఒక పెద్ద గాలిపటం, దానిని ఎగరెయ్యడానికి కావలసిన దారం కొనిపెట్టాడు శంకరం.

ఇంటికి చేరుతూనే మనస్విని శంకరం చేత గాలిపటానికి దారాన్ని కట్టించుకుని, డాబాపైకి వెళ్లి దాన్ని ఎగరేసే ప్రయత్నం చేసింది. ఎంత ప్రయత్నించినా గాలిపటం గాల్లోకి ఎగరలేదు. ఎన్ని గంటలైనా పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉంది మనస్విని. మనస్వినికి చేతులు నొప్పులు పెట్టి తను పట్టుకున్న పెద్ద దారపు బంతి బరువుగా తోచింది.

‘దారం చిన్నదిగా ఉంటే గాలిపటాన్ని తేలిగ్గా ఎగరెయ్యచ్చు!’, అని అనుకున్న మనస్విని, దారాన్ని చిన్న ముక్కగా తెంపింది.

చిత్రం! రివ్వున గాలి వీచడంతో గాలిపటం గాల్లోకి ఎగిరింది!! మనస్విని ఆనందాశ్చర్యాలతో ఆ గాలిపటంవంక చూస్తూ దారాన్ని కొద్దికొద్దిగా వదలటం ప్రారంభించింది. గాలిపటం ఆకాశంలో పైపైకి ఎగురుతూ ఉంటే దానివంక ఆశ్చర్యంగా చూస్తున్న మనస్విని, తన చేతిలోని దారం అయిపోయిందన్న విషయాన్ని గమనించలేదు! దాంతో గాలిపటం మనస్విని చేజారిపోయి గాలితో పాటూ ఎగురుతూ చాలా దూరానికి వెళ్ళిపోయింది! మనస్విని గాలిపటానికున్న దారాన్ని అందుకునే ప్రయత్నం చేసింది కానీ అది సాధ్యపడలేదు. గాలిపటం వెడుతున్న వైపుకు తదేకంగా చూస్తున్న మనస్వినికి ఆ గాలిపటం తమ ఇంటికి కొద్దిదూరంలో ఉన్న చెట్ల చిటారు కొమ్మల్లో చిక్కుకుని చిరిగి పోవడం కనపడింది. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న గాలిపటం అలా చిరిగిపోయేసరికి మనస్వినికి చాలా బాధ కలిగింది. నిరాశతో డాబా మెట్లు దిగి ఇంట్లోకి వచ్చి విషయం ఉమకు చెప్పింది మనస్విని.

అప్పుడు ఉమ, “పోనీలే! అయినా గాలిపటం అబ్బాయిలు ఎగరేస్తారు. వాళ్ళైతే దాని వెంట పరిగెత్తగలరు. నువ్వు పట్టు పరికిణీ వేసుకుని పరిగెడుతూ కింద పడితే కష్టం కదా! ఇప్పుడే రమ అత్తయ్య ఫోన్ చేసి భోగీ పళ్ళ పేరంటానికి పిలిచింది. మనమిప్పుడు అక్కడికి వెడుతున్నాం!”, అంది.

మనస్విని తన తల్లిదండ్రులతో కలిసి రమ ఇంటికి చేరుకుంది. రమకు ఒక్కడే కొడుకు చందు. చందు మనస్విని కన్నా నాలుగేళ్లు చిన్నవాడు. దిగులుగా ఉన్న మనస్విని మొహం చూసి కారణమడిగింది రమ. ఉమ గాలిపటం గురించి చెప్పింది. రమ ఒడిలో కూర్చుని ఉమ చెప్తున్నది ఆసక్తిగా విన్న చందు, తన గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి చింకిచాటంత మొహంతో రెండు పెద్ద పెద్ద గాలిపటాలనూ, ఒక పెద్ద దారపు బంతినీ తీసుకొచ్చి మనస్వినికి ఇచ్చాడు. మనస్విని ఆనందానికి అవధులు లేవు. శంకరం ఆ గాలిపటాలకు దారాలు కట్టి ఇచ్చాడు. మనస్విని, చందులిద్దరూ గాలిపటాలు ఎగరెయ్యడానికి ఉత్సాహంగా ఇంటి బయటకు పరిగెత్తారు.

గాలి తక్కువగా ఉండటంతో ఆ గాలిపటాన్ని ఎగరెయ్యడానికి మనస్విని, చందులు నానాతిప్పలూ పడాల్సి వచ్చింది. ఎట్టకేలకు, భోగిపళ్ళ పేరంటం మొదలయ్యే సమయానికన్నా కొద్దిగా ముందు, ఇద్దరి గాలిపటాలూ గాల్లోకి ఎగిరాయి! మనస్విని, చందు కళ్ళు ఆనందంతో మెరిశాయి!

కొన్నేళ్లు గడిచాయి. మనస్విని చదువు పూర్తయి పెళ్లి చేసుకుని, జీవితంలో స్థిరపడింది. ఒక నాటి సాయంత్రం వేళ, తమ అపార్ట్మెంట్ కిటికీ పక్కన కూర్చుని వేడి వేడి కాఫీని ఆస్వాదిస్తున్న మనస్వినికి, దూరంగా ఉన్న మైదానంలో ఎంతో ఉత్సాహంగా గాలిపటాలను ఎగరేస్తున్న కొందరు పిల్లలు కనపడ్డారు. ఆ గాలిపటాలవంక చూసిన మనస్వినికి, తన బాల్యం గుర్తుకు వచ్చింది. గాలిపటంతో తనకున్న తీపి జ్ఞాపకాలు మనస్విని పెదవులపై చిరునవ్వులను వికసింపజేశాయి!

అది గమనించిన మనస్విని భర్త మహేశ్వర్, “ఏమిటీ? ఆ గాలిపటాలు నీ చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చాయా?”, అని అడిగాడు.

“అవునండీ ! అంతేకాదు! ఆ గాలిపటాన్ని చూస్తూ ఉంటే నాకు మరొక విషయం కూడా తోస్తోంది. యుక్త వయసులో ఉన్న పిల్లల మనసు కూడా ఈ గాలిపటంలాంటిదే! దానికి క్రమశిక్షణ అన్న దారం కట్టి, ఆ దారాన్ని పెద్దలు గట్టిగా పట్టుకుని, ఆ గాలిపటం ఎటుపడితే అటు పోకుండా జాగ్రత్త పడాలి. అప్పుడు ఆ పిల్లల జీవితం ఆనందమయం అవుతుంది! వారు ప్రగతి పథంలో ఎంతో ఎత్తుకు దూసుకువెళ్లి, జీవితంలో ఉన్నతమైన స్థానాలను చేరుకోగలుగుతారు! అలాకాకుండా ‘స్వేచ్ఛ’ అన్న పేరుతో ఆ దారాన్ని కొద్దికొద్దిగా వదిలి పిల్లలకు మితిమీరిన స్వతంత్రాన్నిచ్చామా! వారు చిన్నప్పటి నా గాలిపటంలా మన చేతికందనంత దూరానికి వెళ్లిపోయి తమ భవిష్యత్తును పాడుచేసుకునే ప్రమాదముంది!”, అంది మానసిక వైద్య నిపుణురాలైన మనస్విని.

నిజమేనంటూ తన భార్య అభిప్రాయంతో ఏకీభవించాడు మహేశ్వర్.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked